ఫోస్టులో వచ్చిన ఉత్తరాలను చూసి ఖంగారుపడిపోయింది శారద. ఒకటా, రెండా - ఎన్నో ఉత్తరాలు - అన్నీ నరసాపురం నుంచే - దినేష్ గురించే - షేర్స్ గురించే - తనకేం తెలుసు - ఎవరికి ఏ సమాధానం రాస్తుందీ - ఆలోచన చేసిన మీదట శారదకి కాస్త మనస్థిమితం దొరికింది. ఊళ్ళో ఇంటి పక్కనుండే వీరసామిగారికి ఒక ఉత్తరం రాసి, అందరికీ చెప్పమని దానిలో రాయాలి - దినేష్ తల్లిచాలా సుస్థిగా వుంది. వారం రోజుల్లో వస్తాడు - నరసాపురం వచ్చి మిమ్మల్నందరినీ కలుస్తాడు. మీరేంఖంగారు పడకండి - మీ డబ్బు కంపెనీలో క్షేమంగానే వుంది' - ఈ ఉత్తరం వెంటనే పోస్టు చేసింది శారద. 'హమ్మయ్య ఇంక గొడవలేదు' - ఒప్పిరి తీసుకుని, ఒక్కసారి హిమాయత్ నగర్ లో ఇంటికెళ్ళొస్తే ఏదైనా విశేషాలు తెలియచ్చు - తను ఇక అక్కడ కెళ్ళినపుడు నీరజ దినేష్ అనకుండా దీప్తి, రాజు అంటేసరి - వాళ్ళకి ఆ పేర్లే పరిచయం - అసలు తనే పొరబాటుపడుతోంది - దీప్తీ నీరజ, దినేష్ రాజు అయివుంటాయి వాళ్ళిద్దరిపేర్లూ -
శారద ఆ ఇంట్లో కెడుతుంటేనే కుక్కలు మొరగటం మొదలు పెట్టాయి. ఇంట్లో ముసలమ్మ బయటకొచ్చింది. ఇంట్లోవున్నా పధ్నాలుగేళ్ళ పిల్ల బయటకొచ్చింది.
'దీప్తి ఉత్తరం ఏమైనా రాసిందా' శారద ఖంగారుగా అడిగింది ఆ పిల్లని. నాకు తెలియదు' లోపల కెళ్ళిపోయింది. 'డాడీ అమ్మాయి మళ్ళీ వచ్చింది నెమ్మదిగా అంది తండ్రితో తండ్రి బయటకొచ్చాడు - శారద, తలవంచుకునిలబడింది - ఈ అమ్మాయికి వీళ్ళకి ఏం సంబంధం వాళ్ళు వెళ్ళిపోయారంటే వినదేమిటీ - కోపంగా చూసాడు శారదకేసి - ఏమిటి మనకీ న్యూసెన్సు - అసలు ఈ అమ్మాయి ఎవరు - ఏ వ్యాపారానికి సంబంధించింది ఈ అమ్మాయి - కుక్కలు అరుస్తున్నాయి" గెట్ అవుట్ - ఫో మా యింట్లో నీకు కావలసినవాళ్ళెవరూ లేరు - ఫో - ఇంకోసారి వచ్చావా కాళ్ళువిరక్కొడతా - నీరజట, దినేష్ అట - మళ్ళీ దీప్తి అంటుంది. రాజు అంటుంది - అంతా బోగస్ మనిషిలావుంది -
"గెట్ అవుట్ - పోతావా - కుక్కల్ని వదలమంటావా" -
గేటు బయటకి తోసి, గేటువేసేశాడు ఆయన. శారద ఆగేటు పక్కన కూలబడిపోయింది - ఏమిటిది - ఎందుకిలా ఏడిపిస్తున్నావు - నేనేం పాపం చేశానూ - నిన్ను నమ్మాను, అంతేనా - శారదకి తన్నెవరు చూస్తున్నారో అనే భయం వేసింది - అటు ఇటు చూసింది. గబగబాలేచి ఒళ్ళుదులుపుకుంది. గుండెలు మండే ఆవేదన అడుగుపడటంలేదు. కన్నీళ్ళు స్పృహతప్ప పడిపోయింది. అంతలో ఆటో ఆగింది. 'ఎక్కు' శారద ఏమీ మాట్లాడకుండా ఆటోలోకూచుంది. ఓ క్షణం ఏం జరుగుతోందో తెలియటం లేదు.
ఆటో ఇంటిముందు ఆగాక చూసింది ఎవరుతనని ఆటోలో ఎక్కించింది - ఎవరూ - శారద కొయ్యబారిపోయింది - అటునించి వస్తున్నాను. గేటులోంచి నిన్ను తోసేయటం కనబడింది - నీ నిస్సహాయస్థితి అర్ధమయింది - అందుకే ఆటోలో ఇంట్లోదించాను - వస్తాను' - అది పరోపకారం మాత్రమే - రామం అదే ఆటోలో వెళ్ళిపోయాడు. శారద ఆమెట్లమీద కూలబడిపోయింది - ఇతను నిజంగా మనిషే !! - అప్పటికి ఇంచుమించుగా మూడువారాలుదాటింది.
దినేష్ ను చూసి, ఫోనులో అతనిగొంతువిని అసలే మనసు బాగాలేని శారదకి ఉత్తరాలగోల ఒకటి ఎక్కువైంది. అయినా తనకే రాఫ్ అడ్రసుతో ఎందుకొస్తున్నాయి దినేష్ తన యింటి ఎడ్రసు ఇవ్వకుండా ఇలా చేశాడెందుకో - ఆరోజు పోస్టులోనలభై ఎనిమిదికార్డులు వచ్చాయి. అవి చూస్తుంటే పిచ్చిపుడుతోంది తనకి - ఆ ఉత్తరాల మధ్యలో ఒక కవరు - శారద తీసింది రాజారావు రాశాడు.
'తల్లీ శారదమ్మా - ఈ తండ్రిపైన దయచూడు - పిన్ని కొడుకు టిక్కట్టు పంపాడు. అమెరికా వెళ్ళిపోయింది. నేను ఒక్కడినీ ఇక్కడ వుండలేక పోతున్నాను - పంతులుగారు భార్య వాళ్ళ పెద్దబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయారు - అన్నయ్యల సంగతి నీకు తెలుసుకదా - నేనెవరి దగ్గరుండనూ - పైగా నువ్వూవంటరి మనిషిని - భగవంతుడునాకు ఆ యుర్దాయమిచ్చినంతవరకు నీ దగ్గరేవుంటాను. ఆ రోజు కోపంతో నువ్వువెళ్ళగొట్టినా పిల్లల మీద నాకేం కోపం లేదు. నీళ్ళుపైనుంచీ కిందికి వస్తాయి. కానీ కిందినుంచి పైకి రావుకదా. పైగా నా డబ్బు నీ దగ్గరవుంచాను. దాంతో ఒక చిన్నఫ్లాటుకొనమన్నాను - ఏం చేశావు - ఫ్లాటు కొన్నాక త్వరగారాయి. నేను బయలుదేరి వచ్చేస్తాను" - శారదకి గుండెపట్టింది. ఆ డబ్బు ఏదీ - షేర్స్ కొనటానికి దినేష్ కి ఇచ్చేసిందిగా....ఇప్పుడా దినేష్ కనుమరుగయ్యాడు - ఇంక ఆ డబ్బు సంగతేమిటీ - పైగా ఈ మనుష్యులందరి దగ్గరా షేర్స్ కొనిపించాడు - వాళ్ళు తనని అడుగుతున్నారు దినేష్ గురించి -ఏం చెప్తుందీ శారద ఆ ఉత్తరాలన్నీ చూస్తోంది - అందులోంచి ఒక ఇకలెండు ఫామ్ వెంటనే ఆ ఉత్తరాన్ని తీసి ముద్దుపెట్టుకుంది - దినేష్ - గుండెలకి హత్తుకుంది ఆ ఉత్తరాన్ని.
'డియర్ శారదా. నేనెక్కడికెళ్ళిపోయానో నిన్ను వదిలి అని ఎంతో దుఃఖపడిపోతున్నావుకదూ. మా అమ్మచాలా సీరియస్ గా వుంది హాస్పిటల్ లో చేర్పింఛా -నేను ఒకవారం రోజులలో వస్తా నిన్ను అనుకున్న ప్రకారం బొంబాయి తీసుకెళతా. నాకోసం ఎవరు ఉత్తరాలు రాసినా, నిన్ను అడిగినా ఒక వారం రోజులలో వస్తాడని అందరికి చెప్పేయి - ధైర్యంగా వుండు - "శారద ఆ ఉత్తరాన్ని అటు ఇటు తిప్పి చూసింది. ఎడ్రసు ఎక్కడాలేదు - తనేమీ సమాధానం రాస్తుందీ - ఎప్పుడురాసాడో తేదీకూడా లేదే - పోన్లే - ఉత్తరం రాసాడు చాలు - వస్తాడు, వారం కాకపోతే పదిరోజులు - శారదకి ధైర్యమొచ్చింది మళ్ళీ నాన్నగారికి హాయిగా ఉత్తరం రాయచ్చు. మీ డబ్బుగురించి ఖంగారు పడకండి - మీ మూడు లక్షలు ముఫ్ఫయిలక్షలు చేసి యిస్తాడు దినేష్ అని చెప్పచ్చు - అబ్బ, ప్రాణం ఎంత హాయిగా వుందో - దినేష్ నమ్మక ద్రోహం చేయడు....ఎప్పటికీ చేయడు! శారద ఉత్సాహంగా భోజనం చేసింది.
రామం పెళ్ళికబుర్లు చెప్పటానికొచ్చింది లలిత. అయితే రామం పెళ్ళి కబుర్లుకాక తనపెళ్ళి కబుర్లే చెప్పటం మొదలుపెట్టింది. ఏమిటీ - పెళ్ళి చేసుకోవాలని అంత ఉత్సాహం నీకు - అంది శారద.
అవునే - పెళ్ళిలేకుండా ఎలా బతకటం - నాకూ భర్త, పిల్లలు వద్దా - నా సంసారం అనేది ఒకటి ఉండద్దూ - నేనూ వృద్దురాలినావుతానుగా - నన్ను చూసుకునేందుకు నావాళ్ళు అనేవాళ్ళువుండద్దా" - శారద తలూపింది.
'నా కడుపున ఒక ఆడపిల్ల పుట్టి, అది అమ్మా అమ్మా అంటూ వెంట తిరుగుతుంటే ఎంత ఆనందమే. మా అమ్మెప్పుడూ నాపైనే ఆధారపడేది. అనేది కూడా మగపిల్లల మీద నాకేమీ నమ్మకంలేదే అమ్మా - నీమీదే నమ్మకం" అని తల్లికెప్పుడు ఆడపిల్లసాయమే - తల్లికేమిటీ తండ్రికీ ఆడపిల్లలే దిక్కు. మీ నాన్నని చూడు, మానాన్నని చూడు - కొడుకులేమైనా చూస్తున్నారా - ఎన్నయినా చెప్పు ఆడపిల్ల ఆడపిల్లే అంది ఎంతో ఉత్సాహంగా లలిత. శారద మొఖం వెలతెలపోయింది - ఆడపిల్లవద్దనేగా ఆనాడతను రామం అభిప్రాయానికి వ్యతిరేకంగా అబార్షన్ చేయించుకుంది.
రామం ఇంట్లోకి రాగానే వెంకట్రామయ్య ఇటురా, ఇటురా అనిపిలిచాడు. 'భోజనం చేసి వస్తాను' అన్నాడు, 'భోజనం తరువాత చేయచ్చులే -ఈమాట విను' అన్నాడు. రామం వెంకట్రామయ్య మాట ప్రకారం అక్కడ కుర్చీలో కూర్చున్నాడు.
'ఆ సంబంధమే చూద్దామనుకుంటున్నాము' అన్నాడు కళ్ళజోడు సరిచేసుకుంటూ.
'ఏ సంబంధం - ఎవరికీ' -
'అదే మా చిన్నబ్బాయి రాయలేదూ - ఇద్దరు పిల్లల తండ్రి - భార్య పోయిందీ - అదే' -
