Previous Page Next Page 
త్రీ ఇన్ వన్ పేజి 43

    అప్పటికి స్కూలు పిల్లందరూ వచ్చేశారు. ప్రార్థన మొదలయింది.

    'వాళ్ళ దేవుడి' ప్రార్థన పిల్లలందరి చేతా చేయించారు. సహజమే కదా?.... ఎవరి దేవుడికి వారు పబ్లిసిటీ చేయుట మానవుని ప్రథమ కర్తవ్యము.

    పబ్లిసిటిలేని వస్తువులు ఎలా అమ్ముడు కావో పబ్లిసిటి లేని దేవుడుకూడా అలానే పూజలకు నోచుకోడు.

    ప్రార్థన తరువాత సెయింట్ డన్స్ స్కూల్ ప్రిన్సిపాల్ అయిన ఫిలిప్స్ తన గదిలోకి వెళ్ళాడు.

    అతని వెనుకే నేను లోపలికి వెళ్ళాను.

    కుర్చీలో కూర్చున్న ప్రిన్సిపాల్ కి ఎదురుగా నేను కనబడగానే కళ్ళు పెద్దవిచేసి చూశాడు.

    "మీరెలా వచ్చారు?"

    "నడిచే వచ్చానండీ... మా ఇల్లు ఇక్కడికి దగ్గిరే" అన్నాను.

    నేనడిగింది అదికాదు" ఉరిమాడు ఫిలిప్స్
   
    టేబులుమీద బెల్లుని దడదడ కొట్టాడు.

    ప్యూను పరుగెత్తుకు వచ్చాడు.

    "ఈయన్ని లోపలికి ఎవరు రానిచ్చారు?"

    "సార్... మీరు లోపలకి రాకూడదండీ" అన్నాడు ప్యూను.

    "నేను ఈ స్కూల్లో అడ్మిషన్ కోసం వచ్చాను సార్"

    "ఇది వయోజన విద్యాకేంద్రం  కాదు" ఆయన పళ్ళు బిగబట్టి అన్నాడు.

    "హబ్బ...హబ్బ...మీరు భలేగా జోక్ చేస్తారు సార్.సీటు కావాల్సింది నాకుకాదు.... ఓ అబ్బాయికి.... అయినా మీకున్న సెన్సాఫ్ హ్యూమర్ కి..." కాకా పడదామని అనుకుంటుండగా మధ్యలోనే అరిచాడు ఫిలిప్స్.

    "ఇంటర్వ్యూ టైం ఇది కాదు... మధ్యాహ్నం రెండున్నర నుండి అయిదున్నర మధ్యలోనే... అప్పుడు రండి"
                                             
   

     "నేను ఉద్యోగస్తుడిని... ఆ టైంలో ఎలా రాగలనండీ?" ప్రాధేయపడుతూ అన్నాను.

    "మీ అబ్బాయిని వేరే స్కూల్లో చేర్పించుకోండి" అలా అనేసి తనముందున్న కాగితాల్లో తలదూర్చేశాడు ఫిలిప్స్.

    నేను మనసులోనే అతన్ని కసిదీరా దీవించి బయటికి వచ్చేశాను.

    ఆఫీసులో అఫీసరుకి జరిగిన విషయం చెప్పాను.

    "దానికి ఆలోచన దేనికీ? రేపు సెలవు పెట్టి వెళ్ళు" అన్నాడు తన సెలవేదో నాకు యిస్తున్నట్టు.

    మర్నాడు ఆఫీసుకి సెలవు పెట్టి మధ్యాహ్నందాకా గదిలో బచ్చలికూర భ్రమరాంబవ్రాసిన" ప్రేమికుల నిలయంలో జీవన వలయం" అనే నవల చదివి మత్రేసుకుని డబుల్ స్ట్రాంగ్ కాఫీ త్రాగేసి సెయింట్ డన్స్ స్కూలుకి బయలుదేరాను. సమయం రెండున్నర గంటలు...

    ప్రిన్సిపాల్ ఫిలిప్స్ గదిలోనికి అడుగుపెట్టాను.

    "కూర్చోండి" అన్నాడు ఫిలిప్స్.

    "లోయర్ కె.జి.లో సీటు కావాలి!" అన్నాను అతని ఎదురుగా కూర్చుంటూ.

    "వెడ్డింగ్ కార్డేది?" అన్నాడు కళ్ళు ఎగరేస్తూ.

    "వెడ్డింగ్ కార్డా!..."

    "మీ పిల్లలకి సీటు కావాలంటే మీరు మీ వెడ్డింగ్ కార్డు ఇక్కడ రిజిష్టర్ చేయించాలి...తరువాత మీకు పిల్లలు పుడ్తే ఆ కార్డుమీద మీకు సీటు ఇస్తాం... అదీకూడా సీనియారిటీ ప్రకారమే"

    కిరసనాయిలుకీ, చక్కరకీ కాకుండా పిల్లల సీట్లక్కూడా కార్డులు వచ్చేశాయా?!!

    "సీటు మా అబ్బాయికి కాదండీ.... మా ఆఫీసరుగారి అబ్బాయికి....ఈ ఎండాకాలం సెలవుల తరువాత జూస్ లో స్కూలు తెరుస్తారు కదండీ, అప్పుడు ఇక్కడ లోయర్ కె.జి.లో చేర్చాలని అనుకుంటున్నారు."

    "అంతా వాళ్ళిష్టమేనా?... చేర్చాలని అనుకుంటే మేము చేర్చుకోవద్దూ?... ఇంతకీ వాళ్ళు వారి పెళ్ళి శుభలేఖ ఇక్కడ రిజిష్టరు చేయించారా లేదా?"

    "లేదండీ..."

    "మరి సీటు ఎలా వస్తుందనుకున్నారు?" పళ్ళు బిగబట్టి అన్నాడు.

    "మీకు డొనేషన్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారండీ"
                                        

      బ్రహ్మాండమైన అస్త్రం ప్రయోగించా నని అనుకుని మురిసిపోయాను.

    "వాహ్ ట్?... డొనేషన్?!!. డబ్బు పేరు చెప్పగానే సీటు ఇస్తామని అనుకున్నారా? అసలు ఈ స్కూలంటే ఏమిటను కున్నారు? సెయింట్ డన్స్ స్కూలు!ఇక్కడి ప్రొసీజరు తెలుసా?పెళ్ళయిన వెంటనే ఆ పెళ్ళికార్డు రిజిస్టరు చేయించాలి. మేము వారికీ రిజిస్ట్రేషను నెంబరు ఇస్తాం, వారికి పిల్లలు పుట్టగానే మాకు తెలియజెయ్యాలి. తరువాత మూడేళ్లకు ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకు రావాలి. ఆ పిల్లవాడు వారి పిల్లవాడేనని గెజిటెడ్ ఆఫీసరు ఎవరయినా సర్టిఫై చేయాలి. అంతేకాదు, పిల్లవాడి తల్లిదండ్రులు ఇద్దరూ పోస్టు గ్రాడ్యుయేట్స్  అయిఉండాలి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS