Previous Page Next Page 
విశిష్ట పేజి 43

    "కేసులూ, విచారణలూ - ఆ గొడవంతా లేకుండా కావాలంటే ఆ పిల్లను మన గుప్పిట్లోకి తెచ్చుకోవాలి. ఇదంతా పెద్ద రాజకీయం. కోర్టులో వాడి నేరం రుజువైతే వాడి జన్మ జైల్లో మ్రగ్గిపోవాల్సిందే. అది నువ్వు భరిస్తావా?"

    "కొడుకు జైల్ పాలవుతాడంటే ఏ తల్లి భరిస్తుందండీ?"

    "సహించలేవు కదా! అందుకే నాతో సహకరించు. ఇందులో ఆ పిల్లకు జరిగే అన్యాయం ఏం లేదు. మానభంగానికి తలపెట్టినవాడితో తాళి కట్టించుకొని ఉత్తమ పతివ్రతలనిపించుకొన్న కథలెన్ని లేవు"

    "అణువణువునా ద్వేషించే మగాడినే భర్తగా అంగీకరించడానికి ఏ ఆడపిల్లా అంగీకరించదండీ! మీరు మాత్రం ఆ పిల్లను ఒప్పించలేరు"

    నయాన వినకపోతే భయాన ఒప్పిస్తాను. నువ్వు మాత్రం నీ కొడుకును ఈ పెళ్ళికి ఒప్పించు."

                                                               *    *    *

    "మిమ్మల్ని మాధవరావుగారు రమ్మంటున్నారండీ."

    ఇంటిముందు కారాపి వచ్చిన డ్రైవరు చెప్పాడు రామకృష్ణతో.

    "ఆయన్ని కలుసుకోవాల్సిన అవసరం నాకులేదు. ఆయనకి నాతో పని వుంటే ఆయన్నే రమ్మను!" విసురుగా జవాబిచ్చాడు రామకృష్ణ

    డ్రైవర్ అదేమాట వెళ్లి చెప్పాడు. మండిపడ్డాడు మాధవరావు.
 
    "బతకలేని బడిపంతులు! అంత గర్వం ఏం చూచుకొని? ఆ గర్వాన్ని అనచకపోతే నా పేరుతీసి మారుపేరు పెట్టుకుంటాను."

    ఆగ్రహంతో మండిపడ్డా ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం తనది కనుక తనే బయల్దేరాడు.

                                             *    *    *

    "నమస్కారం రామకృష్ణగారూ!" ఓట్లకోసం ఒంగి దండాలు పెట్టడం మామూలైపోయిన మాధవరావు అదే పద్దతిలో తేలిగ్గా ఓ నమస్కారం పారేశాడు.

    అక్కడ కూర్చోడానికి కుర్చీలున్నా కూర్చోమని కూడా చెప్పలేదు రామకృష్ణ.

    "మీరొచ్చిన పని చెప్పండి." అన్నాడు నిర్లక్ష్యంగా.

    కుర్చీ తనే ముందుకు లాక్కుని కూర్చుంటూ అన్నాడు మాధవరావు.  "మీ అమ్మాయి వుంటే పిలవండి. ఇద్దరితో ఒకేసారి మాట్లాడితే బాగుంటుంది"

    "మా అమ్మాయి లేదు ఇంట్లో. విషయమేమిటో నాతో చెప్పండి!"

    మాధవరావు గొంతు సవరించుకొని అన్నాడు "కోర్టుల్లో న్యాయవిచారణ అన్నది సంవత్సరాలు పడుతుంది. ఆ సంగతి మీకు తెలీంది కాదనుకుంటాను. మీరొక సదవగాహనతో రాజీకి వస్తే ఉభయులకూ లాభముంటుంది రామకృష్ణగారూ! చెప్పండి. మీరు రాజీ పడదామంటే ఎలాంటి ఒప్పందానికైనా నేను రెడీ. డబ్బు కావాలంటే డబ్బు.....ఇంకేది కావాలన్నా....."

    "మన మధ్య ఒప్పందాలు, రాజీలు అంటూ వుండవు. కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది. మీరొచ్చింది అందుకే అయితే ఇక వెళ్ళవచ్చు" పుల్ల విరిచినట్టుగా చెప్పాడు.

    "పోలీసులనూ, కోర్టులనూ మరీ అంత గ్రుడ్డిగా నమ్మడం మంచిది కాదు, మాస్టారూ! ప్రత్యక్ష సాక్ష్యాలను సైతం తలక్రిందులు చేసే లాయర్లున్నారు నాకు. అప్పుడు రెంటికీ చెడతారు."

    "బెదిరించడానికి వచ్చారా?"

    "నేను మీతో కయ్యాన్ని అభిలషించేవాడినైతే నా తాహతును ప్రక్కకు పెట్టి మీ ఇంటి గడప తొక్కేవాడిని కాదు. నేను మీ మంచిని కోరుతున్నాను. మీ అమ్మాయి పట్ల నాకు పూర్తి సానుభూతి వుంది. అందుకే మీతో వియ్యమందుగోరుతున్నాను. కేసు విత్ డ్రా చేసుకుని మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా పంపండి. సమస్యలన్నీ సద్దుమణుగుతాయి." శాంతంగా చెప్పాడు.

    విస్తుపోయాడు రామకృష్ణ. "పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేచోట కళ్యాణం సంభవమా?"

    "పరిస్థితిని నేను చెప్పిన కోణంలో ఆలోచించండి. సంభవమేనని పిస్తుంది."

    "ఏమిటా కోణం?"

    "నా కొడుకు మీ అమ్మాయిపట్ల చేసినదాన్ని నేను సమర్ధిస్తాననుకోవద్దు. వాడు చేసింది చాలా నీచమైన పనే. కాని, దేనికైనా కొన్ని కారణాలుంటాయి. మయసభలో దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వకపోతే నిండు కొరవ సభలో వలవలూడదీసే పరాభవం ఆమెకు ఎదురయ్యేదికాదు. మీ అమ్మాయి కరుణ విషయంలో వీరఝాన్సీ లెవెల్లో వాడితో తలపడి వాడిని రెచ్చకొట్టకపోతే మీ అమ్మాయి విషయంలో వాడు పంతానికి పోయే అవసరమే వాడికి వుండేది కాదు.

    వయసులో వున్న మగపిల్లలకు కొన్ని బలహీనతలుండడం సహజమే. దురదృష్టవశాత్తూ అది వికృతరూపం దాల్చిన మాట వాస్తవం! దానికి వాడు సరైన ప్రాయశ్చిత్తమే అనుభవించాడు కదా? చేసిన దానికి పశ్చాత్తాపపడుతున్నాడు. పాపపరిహారానికి పశ్చాత్తాపాన్ని మించింది లేదంటారు.

    జరిగిందేదో జరిగింది. దాన్ని పట్టి పట్టి సాగదీయకుండా జరగాల్సింది ఆలోచించండి. ఇంతకుముందు కూడా మీ అమ్మాయితో పెళ్ళి ప్రస్తావన వచ్చింది మీరు అప్పుడే ఒప్పుకొని వుంటే ఈ సంఘటన జరిగేందుకు ఆస్కారం. వుండేదికాదు. మీ అమ్మాయి సాహచర్యంలో వాడొక మంచి మనిషిగా తయారయ్యేవాడు. ఇప్పటికైనా మా వాడికి మీ అమ్మాయి తోడు లభించేలా చూడమని అభ్యర్ధిస్తున్నాను!" మరో సారి చేతులు జోడించాడు మాధవరావు.

    "అందితే జుట్టు! అందకుంటే కాళ్ళు, మీ రాజకీయ నాయకుల సంగతి నాకు తెలీదా ఏం? దొంగ వినయాలు కట్టిపెట్టి వచ్చినదారిన నడవండి. ఇదివరకు నా పిల్లనిమ్మని అడిగినప్పుడు నేనిచ్చిన జవాబు గుర్తుండే వుంటుంది. ఇప్పుడూ అదే జవాబు చూస్తూ చూస్తూ ఒక కీచకుడికి నా పిల్లనివ్వను. నా కంఠంలో ప్రాణముండగా అది జరగదు. అధర్మంమీద ధర్మం తప్పక గెలుస్తుందని నమ్మినవాడిని. నన్ను మీరు బెదిరించి లాభంలేదు."

    "నేనింకా నిన్ను బెదిరించందే!" అతడి ముఖంలో తెచ్చి పెట్టుకున్న మంచితనం పొగమంచులా కొద్దికొద్దిగా కరిగిపోతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS