"ఎప్పుడొచ్చారు? " అంటూ వచ్చి కూర్చొన్నాడు అరుణ్.
"ఇప్పుడే."
"మీ పెళ్ళికి ముహూర్తం పెట్టుకొందామంటున్నాడురా మామయ్య."
"అప్పుడే ఏం తొందర?"
"ప్రతిమకూ నీకూ పెళ్ళి అనుకొని అప్పుడే రెండు మూడేళ్ళయింది, ఇంకా ఏం తొందరంటావా?" కొంచెం కోపంగా అడిగింది జానకమ్మ.
"ఏం తొందరంటే ఇప్పుడే వద్దనికదా అర్ధం? ఇప్పుడే వద్దనా, ఎప్పటికీ వద్దనా? నీ మనసులో మాటేమిటో స్పష్టంగా చెప్పు." శ్రీపతి అడిగాడు.
"యధాలాపంగా అన్నమాటకు అంత అపార్ధమా?" నివ్వెరపోయినట్టుగా అడిగాడు అరుణ్.
"పెళ్ళికి నువ్వు ఏదో అడ్డు చెబుతావనే అనుకొన్నాను. అనుకొన్నట్టే అయింది."
"మీ మనసులో ఉన్నమాటేమిటో స్పష్టంగా చెప్పాలి మీరు."
"రాజానగరం వెళ్ళి పెళ్లి పీటలమీది నుండి ఆ అమ్మాయిని లేపుకొచ్చావుగా? ఆ అమ్మాయి ఉండగా నువ్వు ప్రతిమను ఏ అభ్యంతరం లేకుండా చేసుకొంటావనుకోలేదు."
"ఎందుకు నింద అనవసరంగా ఆ అమ్మాయిమీద వేస్తారు? లేనిపోని అపవాదులు లేవదీస్తారు?" అన్నాడేగాని, ప్రతిమని చేసుకోడానికి నాకేమీ అభ్యంతరం లేదని చెప్పలేకపోయాడు అరుణ్.
"ఆ అమ్మాయి ప్రసక్తి తెచ్చానని ఏమనుకోకు, అరుణ్. ఆడపిల్లనిచ్చుకొంటున్నప్పుడు దారి అంతా సురక్షితంగా ఉందా లేదా అని చూచుకోవడంలో తప్పేం లేదనుకొంటాను."
"అంతా సురక్షితం అనిపించినప్పుడే మీ అమ్మాయిని నాకివ్వండి." అనేసి పైకి వచ్చాడు అరుణ్.
ఆయాగా చేయడం తనకి బాగానే ఉందని చెప్పినా అతడి మనసు సంధ్య గురించే ఆలోచిస్తూంది అనుక్షణం. పెళ్ళిపీటల మీదినుండి లేవగొట్టి తీసుకువచ్చాడు ఆమెను. ఆమె జీవితానికి ఒక దరి చూపకుండా మధ్యలోనే చేతులు దులిపేసుకొన్నట్టుగా అయింది.
చిన్నప్పుడు సంధ్యతో ఆడిన మొగుడు పెళ్ళాల ఆటలు, రుక్మిణి పరాచికాలు జ్ఞాపకమొస్తున్నాయి.
"బడికి టైం అయింది. ఫలహారం చేశావా నాకు?"
"అబ్బ! కట్టెలు మండక నేను చస్తూంటే!" మూడు రాళ్ళు పెట్టి దానిమీద, ఒక కర్ర పావుంచి, ఎండుపుల్లలు నాలుగు ఆ రాళ్ళ మధ్య ఉంచి ఉఫ్ ఉఫ్ మని ఊదితెగ ఆయాస పడిపోతూంది సంధ్య. దాంట్లో నిప్పుంటేగా మండేది?
"ఆకలేస్తూంటే! ఆకలేస్తూంటే పిల్లలకి పాఠాలు ఎలా చెప్పాలి?" దీనంగా ముఖం పెట్టాడు తను, పొట్ట చేత్తో పట్టుకొని.
"బొరుగులున్నాయి. తినేసి వెడతారా?"
"ఏవో పెట్టు"
పావులన్నీ వెదికి నాలుగంటే నాలుగు బొరుగులు తీసి తన ముందు ఓ మూతలోపోసి వుంచింది సంధ్య.
"బడినుండి వచ్చేసరికి అన్నమైనా చేస్తావా, లేదా?"
"పచ్చికట్టెలు నా మొహాన పారేసి వండమంటే ఎలా చచ్చేది?"
ఫక్కున నవ్వులు వినిపించి బిత్తరపోయి చూశారు తామిద్దరూ. పొట్ట చేత్తో పట్టుకొని నవ్వుతున్నారు అమ్మా, రుక్మిణత్తా.
"మీ ఆయనకి నాలుగు బొరుగు గింజలతో ఆకలి ఎలా తీరుతుందనుకొన్నావే?" రుక్మిణత్త అడిగింది నవ్వు ఆపుకొంటూ. సిగ్గుపడి తల్లిచీర కుచ్చిళ్ళలో ముఖం దాచేసుకొంది సంధ్య.
"బొరుగులూ, పేలాలూ పెట్టి మీ ఆయన ఆకలి తీరుస్తావేమిటే!" అమ్మ సంధ్యనెత్తిన ఓ మొట్టికాయవేసింది నవ్వుతూ.
చిన్నప్పటి ఆటలు ఆటలుగానే మాసిపోయాయి.
ప్రతిమతో స్నేహం పెంచుకొంటున్నప్పుడైనా ఈ జ్ఞాపకాలు మరుగున పడకపోతే ఎంత బాగుండును? మరుగున పడితే పడ్డాయి! తను సంధ్యని చూడాలని రాజానగరం ఎందుకు వెళ్ళాడు? ఆ జ్ఞాపకాలు తిరుగదోడినట్టుగా అయ్యి తననెంత బాధపెడుతున్నాయి?
* * *
