"అమ్మకి మొదటి భర్త పోయాడట! నాన్నని ప్రేమించి పెళ్ళి చేసుకొంది! అమ్మ రెండో వివాహం చేసుకొందని, అమ్మ పుట్టింటి వాళ్ళు ఆమె బ్రతికుండగానే చచ్చినదాని క్రింద జమ కట్టారట. ఇహ నాన్నని ఆయన వితంతువుని వివాహం చేసుకొన్నాడని ఆయన్ని బంధువులు వదిలేశారట. అమ్మా నాన్నా ఇద్దరూపోయినా అమ్మ తరపునకాని, నాన్నతరపున కాని నన్నుచూడటానికి ఎవరూ రాలేదు!"
"ప్చ్! అయితే అమ్మా నాన్న పోయి ఎన్ని సంవత్సరాలైంది?"
"మూడు సంవత్సరాలవుతూంది నాన్నపోయి. నాన్నపోయిన ఏడాదికి అమ్మపోయింది"
"మరి ఇన్ని రోజులూ?"
"మా ఇంటి దగ్గర వెంకట నర్సమ్మగారని ఒకామె ఉంది." టూకీగా తన కథ చెప్పింది సంధ్య.
"అరుణ్ అడ్వంచర్ బాగానే చేసినట్టున్నాడు గాని, మధ్యలోనే చేతులు దులుపుకొన్నట్టున్నాడే! పెళ్ళి పీటలమీదినుండి నిన్ను లేవగొట్టి తీసుకు వచ్చేవరకే అతడి ఆవేశం పనిచేసి నట్టుంది!"
అరుణ్ కి తన విషయంలో ఏదో చేయాలన్న తపన ఉంది! కాని, తల్లి ముందు తలవంచిన కొడుకు. తల్లి ఆస్తి అంతస్థులమీదే దృష్టి నిలిపిన మనిషి. ఆవిడ ఈ పేద అనాధ పిల్లను ఇంట్లో ఉంచుకొని, కొడుకు ఉజ్వల భవితవ్యానికి గ్రహణంగా తయారయ్యే ప్రమాదం తెచ్చుకోలేదు!
చక్రపాణి మళ్ళీ మాట్లాడాడు. "ఒకరి దురదృష్టం మరొకరి పాలిట అదృష్టమౌతుందేమో! నీ దురదృష్టం నిన్ను ఏకాకిని, బీదదాన్ని చేసి తరిమితే అది నా పాలిట అదృష్టమైంది. డబ్బు పారేస్తే ఆయాలు దొరకరని కాదు! ముఖ్యంగా నమ్మకస్తురాలు కావాలి. చేసేపని యాంత్రికంగా కాక మనస్పూర్తిగా ఉండాలి! నీ పనిపట్ల నాకు పరిపూర్ణమైన నమ్మకం ఏర్పడింజి! పిల్లలు నీ చేతుల్లో చాలా హాపీగా పెరుగుతారు!"
"మీరు ఇంటి పట్టున నిలకడగా ఉన్నది ఈరోజు మాత్రమే! నేను పిల్లల్ని ఎలా చూస్తానో మీకెలా తెలుసు?"
"ఒక్క చూపులో అంతా తెలుసుకోగల దివ్యదృష్టి ఉంది నాకు!" నవ్వుతూ అన్నాడు.
సంధ్య లేచి దూరంగా ఆడుకొంటున్న పిల్లలదగ్గరికి వెళ్ళిపోయింది.
"ఆంటీ! ఛుక్ ఛుక్ రైలు" ప్రేమ అడిగింది.
"ఆడదాం! శ్రీకాంత్, నువ్వు నన్ను పట్టుకో! ప్రేమా, నువ్వు అన్నయ్యనే పట్టుకో!" అంది సంధ్య. వాళ్ళు చెప్పినట్టుగా పట్టుకొన్న తరువాత, "ఛుక్ ఛుక్ రైలు వస్తూంది, ప్రక్కకు ప్రక్కకు జరుగండి, ఆగినాక ఎక్కండి" అని పాడుతూ అడుగులు వేయసాగింది.
చక్రపాణి లేచివచ్చి ప్రేమ ఫ్రాకు పట్టుకు నడుస్తూ సంధ్య గొంతుతో శ్రుతికలిపాడు. పిల్లలు రెట్టించిన సంతోషంతో "ఛుక్ ఛుక్ రైలు" అంటూ పాడసాగారు.
* * *
ఎండలు వచ్చేశాయి!
ఎక్కడ చూసినా పెళ్ళి బాజాలు మ్రోగుతున్నాయి.
శ్రీపతిరావు ఒకరోజు జానకమ్మ దగ్గరికి వచ్చి, "ఈ వేసవిలో మా ప్రతిమను నీ ఇంటి కోడల్ని చేసేయాలనుకొంటున్నాను, అక్కయ్యా!" అన్నాడు.
"నేనూ అదే అనుకొంటున్నాను! ఇద్దరికీ పెళ్ళి అని ఎప్పుడో అనుకొన్నాం. ఇద్దరూ కలిసి తిరుగుతూంటే స్వేచ్ఛగా వదిలి పెట్టేసి ఉన్నాం. వయసొచ్చిన పిల్లల్ని అలా వదిలేయడం మంచిది కాదని నేను ఎన్నిసార్లో అనుకొన్నాను! ఆ మూడు ముళ్లు పడిపోతే ఎవరికి ఆ ప్రదిష్ట ఉండదు కదా! రేపే లగ్నం అన్నా నా అభ్యంతరం ఏం ఉండదు."
"మగపిల్లవాడి తల్లివి కాబట్టి అలా అంటున్నావు! రేపే అంటే నాకెలా కుదురుతుంది? నాకున్నది ఒక్కపిల్ల. ఎంతో గ్రాండ్ గా చేయాలనుకొంటున్నాను. నెలరోజులు ముందుగా మొదలుపెట్టాలి పెళ్ళి పనులు. రేపు శాస్త్రిగారిని తీసుకువచ్చి లగ్నపత్రిక పెట్టుకొందామా?"
"అలాగే!"
"అరుణ్ ఏమంటాడో మరి! అతడిని అడగాలిగా?"
"వాడు మాత్రం ఏమంటాడు? అదిగో, మాటలోనే వచ్చాడు అరుణ్."
