Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 45

   
    "ఇదిగోరా నీ పెళ్ళి లగ్నపత్రిక! ఈనెల ముప్పైకి లగ్నం పెట్టారు శాస్త్రిగారు!" అంటూ, పసుపు అంటించిన కాగితం అరుణ్ చేతికిచ్చింది జానకమ్మ.

    "నాకు తెలియకుండా ముహూర్తం పెట్టించావా?" అరుణ్ నిర్విణ్ణుడైనట్టుగా తల్లివంక చూడసాగాడు.

    "నీ ముక్కుకి తాడుపడితే తప్ప నువ్వు నాచేతిలో ఉండవని ధైర్యం చేసి పెట్టించారా ముహూర్తం!"

      "నేను ప్రతిమని చేసుకోనంటే?"

    "చెప్పాను కదా, నా శవమే చూస్తావని!"

    "పిల్లల మనసు తెలుసుకోకుండా వాళ్ళనిలా బంధించటం పెద్ద వాళ్ళు చేయాల్సినపనేనా, అమ్మా?"

    "నిన్న మొన్నటిదాకా ప్రతిమ అంటే ఇష్టంగానే తిరిగావుగా? ఇప్పుడింత ఎకాఎకీ ఇష్టంలేకుండా ఎలా పోయింది?" ఆవిడ ఎత్తి పొడుపుగా అంది.

                       *        *        *

    వెడ్డింగ్ కార్డ్స్ అచ్చైవచ్చాయి.

    మొదటి కార్డు సంధ్యకే ఇవ్వాలని వచ్చాడు అరుణ్.

    చక్రపాణి ఊళ్ళో లేడు.

    ఒక నిమిషం కార్డు చదవడం పూర్తిచేసి తలెత్తింది సంధ్య.

    ముఖంలో కదిలే భావాలకోసం ఆమె వంకే చూస్తున్నాడు అరుణ్. ఆమె ముఖం నిర్వికారంగా ఉంది.

    "సంధ్యా, నీకోసం నేనేమీ చేయలేకపోయాను! తీసుకువచ్చి అర్ధాంతరంగా వదిలేశాను!" వ్యధగా అన్నాడు.

    "ఇప్పుడు నాకేం లోటు జరిగిందని నువ్వుబెంగ పడుతున్నావ్, అరుణ్? చక్రపాణిగారు నాకు అయిదువందలు జీతం ఇస్తానన్నారు. చాలదంటే ఇంకా ఎక్కువే ఇస్తానన్నారు! ప్రతిఫలంగా, తల్లిలేని ఆ పిల్లలు సంతోషంగా ఉండేట్టు చూడాలి! అంతే! పిల్లలని తీసుకొని షికార్లు, సినిమాలు..... నాకేం తక్కువైందని?"

    "అంతేనా? బాధంతా నా ఒక్కడికేనా?"

    "బాధా? నీకేమిటి బాధ?" ఆశ్చర్యంగా అడిగింది.

    "నిజమే! నువ్వింత నిశ్చింతగా ఉండగలిగినప్పుడు నేను మాత్రం ఎందుకుండకూడదు? నేనే ఒట్టి సెంటిమెంటల్ ఫూల్ ని ఉన్నట్టున్నాను!" కావాలని కంఠంలో నిర్లక్ష్యం తెచ్చి పెట్టుకొని లేచాడు. "పెళ్ళికి వస్తావా?"

    "పెళ్ళికి వస్తావా అని అడుగుతారా ఎవరైనా? పెళ్ళికి రావాలి అని పిలుస్తారుగాని!" నిష్ఠూరంగా అంది.

                                               *        *        *

    పదిహేనురోజుల బిజినెస్ టూర్ తరువాత ఆరోజు ఇంటిదగ్గరున్నాడు చక్రపాణి.

    "రేపు ప్రేమ పుట్టినరోజట. ఈ ఇంట్లో ఎవరి పుట్టినరోజైనా గొప్పగా చేసే అలవాటుందని విన్నాను!" సంధ్య గుమ్మం దగ్గరికి వచ్చి అంది.

    "ప్రేమ పుట్టినరోజా? నాకు జ్ఞాపకమే లేదు!" నొచ్చుకొన్నాడు చక్రపాణి.  "వాళ్ళమ్మ ఉంటే అన్నీ చూచుకొనేది! అందరినీ ఇల్లిల్లూ తిరిగి పిలిచేది! నేను ఆ రోజు ఇంటి పట్టునుండడం, ఆమెతో పిల్లలతో గుడికి వెళ్ళడం - ఇంతే నా డ్యూటీ."
    "రేపు ఏం చేయాలంటారు?"

    "తలంటి క్రొత్తబట్టలు వేసి గుడికి తీసికెళ్ళు! చాలు! వేరే ఆర్భాటం చేయవద్దు!"

    "అయితే క్రొత్తఫ్రాకు తీసుకురండి!"

    "అలాగే! సాయంత్రం వెళ్ళి తెస్తాను!"

    సాయంత్రం వెళ్ళడానికి తయారై, "ఫ్రాకు ఏరంగులో తీసుకురావాలి?" అనడిగాడు చక్రపాణి.

    "మీకు తెలీదా?"

    "నాకేం తెలుసు? పిల్లలకి ఏం బట్టలు కావాలన్నా ఏం కావాలన్నా సరళే తెచ్చేది!"

    "ఇప్పుడామె లేదుగా? మీకు నచ్చింది తీసుకురండి!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS