'' నువ్వే నా భర్తవు మూర్తీ? ఇక నిన్ను వదలలేను.'' నేనేమి మాట్లాడగలను?
'' మూర్తీ! ఈ రోజు నేను తల్లినయ్యే సన్నాహంలోనూ ఉన్నాను. నీకు భార్యనయ్యే మధుర సంసిద్దతలోనూ ఉన్నాను. నేను సర్వదేవతలను దేవీమూర్తులను ప్రార్ధించా! నువ్వు ఈ వాళ నా భర్త కావాలని, నేను గవ్వ లక్కకు మొక్కుకున్నా కూడా! నా కోర్కె ఫలించింది. నువ్వు నాకు బంగారు పాపాయిని యిస్తావు.''
నా గుండె గుభేలుమని ఆగిపోయింది. నేను యెంత పని చేశాను! ఈమెకు ఈ దొంగరకమైన భర్తనయ్యాను. నా శకుంతలను రెండవసారి చంపుకున్నాను. సుశీల తన తుచ్ఛవాంఛను (కాదేమో) తీర్చుకోవడానికి దేవతల్ని ప్రార్ధించి నెగ్గింది. నా దేవిని నేను బ్రతికించుకోలేకపోయాను. నా ఒళ్ళు గజగజ వణికింది. సుశీల నామీద చెయ్యివేసి, '' అమ్మో! నీ వళ్ళు ఈలా కాలిపోతుందేమిటి! రా లోపలి రా''అని నా చేయిపట్టి, నా చుట్టు చేయి వేసి నన్ను తనకు గాఢముగా అదుముకొని క్రిందకు తీసుకువెళ్ళింది.
ఎల్లా వెళ్ళానో! నాకేమీ తెలియదు. మెదడు వేడెక్కింది. ఒళ్ళు తిరుగుతోంది. కళ్ళు మూతపడిపోయినాయి. ఆమె నాకు కాశ్మీర శాలువలు కప్పింది. మెత్తటి ఉన్ని పచ్చడము కప్పింది. శీతాకాలములో వాడుకొనే రగ్గు కప్పింది. నా ఒణుకు తగ్గలేదు.
నాకు 107 డిగ్రీల జ్వరం వచ్చిందట. మా అమ్మకు కబురు వెళ్లిందట. మా అమ్మ దాక్టరుకోసం గంగాధరుణ్ణి కబురు పంపిందట. ఆయన కారుమీద ఆ ఇంటికివచ్చి నాకు మెదడుమలేరియా అని నిశ్చయించేశాడట. ఆ ఇంట్లో చావు బ్రతుకుల మధ్య ఇరవై రోజులున్నానట. మా అమ్మ మా మేనమామకు టెలిగ్రాం ఇచ్చిందట.
మా మేనమామ పరుగెత్తుకొని కాశీ వచ్చాడట. ఆ ఊళ్ళో ఉన్న ఇద్దరి పెద్దడాక్టర్లను, అలహాబాదులో వున్న పెద్దడాక్టర్ని పిలిపించారట. మా మేనమామ నా కోసం ఆ రోజుల్లో వేలు ఖర్చు చేశాడట. వైద్యమే నన్నారోజుల్లో బ్రతికించింది. ఆయుర్వేదం నన్ను మనుష్యుణ్ణి చేసింది. సుశీల ఆ రోజుల్లో తిన్నగా తిండి తినలేదట. మా అమ్మతోపాటే నాకు సపర్య చేస్తూ ఉండేదట. నాకు జ్వరం నెమ్మదించడం సుశీల పిచ్చిదానిలా చేసిన, ఒక పిచ్చిపని వల్లనేనట.
24
సుశీల ఇంటిలో నేనలా జ్వరంవచ్చి పడి ఉండడంవల్ల, సుశీలకు మతి పూర్తిగాపోయి, గవ్వలక్కకు మొక్కుకొని, అన్నపూర్నకూ, డుంఠి వినాయకునకూ అనేక పూజలు చేయించింది, ఏడ్చింది, దొర్లింది.
ఒకరోజు రహస్యంగా ఒక హిమాలయ వాసి సన్యాసి ఒకాయన దగ్గరకు పోయిందట. ఆయన మన్ను నలపిస్తే అదేమందన్న ప్రతీతి ఆ మహానగరమంతా వ్యాపించి వుంది. ఆయనకు సుశీల తనింటికి వచ్చిన ఓ తీర్థవాసికి చాలా జబ్బుగా ఉందనీ, అతడొక్కడే బిడ్డననీ, తల్లీ కొడుకూ కలిసి వచ్చారనీ, ఆ బాలకుణ్ని రక్షిస్తే వాళ్లదారిని వాళ్ళు పోతారని చెప్పిందట. పైటకొంగున ముడిగట్టిన పాతిక రూపాయలా సన్యాసి చేతిలో పెట్టిందట.
ఆ సన్యాసి తన సంచిలోనుండి ఒక మందు తీసి, అది కొంచెం మాత్రచేసి తనవంటి బూడిదతీసి పూసి, '' ఇది యియ్యి బ్రతుకుతాడు. ఈ రాత్రి ఇంకో పాతిక రూపాయలు పట్టుకురా'' అన్నాడట. ఆ మాత్ర ఎవ్వరూ చూడకూండా నాచేత మింగించిందట. నాకు స్పృహేలేదట. ఆ సన్యాసికి పాతిక రూపాయలు పంపించిందట. ఇది రాత్రి జరిగిన పని. ఆ తెల్లవారగట్ల, నాకా జ్వర తీవ్రతతో కడివెడు విరేచనమై, కాళ్ళు చేతులు చల్లబడి వాతం కమ్మింది. ఇంగ్లీషు వైద్యులు వచ్చి గ్లూకోజు మొదలైన వేమేమో ఇంజక్షను లిచ్చారట. లాభంలేదని చక్కా బోయారట. అప్పుడు జగత్ రాం పండాను సుశీల పోరుపెట్టి, కవిరాజ్ వైద్యరాజు పండిత బోలానాథ్ ను రప్పించిందట. మా అమ్మ నేను చచ్చిపోయాననే మూర్ఛపోయింది. మా మామయ్య మాత్రం విపరీత ధైర్యంతో మా అమ్మకు ఉపచారం చేయిస్తున్నాడు. నేను బ్రతుకుతానన్న ఆశ అతనికీ పోయిందట.
బోలానాథ్ వచ్చి నాచేయి నాడిచూచి, ''అయ్యో మనిషిని అక్రమంగా చంపా''రని వాతరాష్ట్రం, వాతగజకేసరి, వాతజ్వరాంకుశం, సూతికాభరణం, సన్నిపాతం, కస్తూరి, మహాపాశుపతం, గరళం, నవరత్న చింతామణి, అన్నీ కలిపి నూరి, బొడ్డుకు పట్టు, మాడుపై చిన్న గాయం చేసి అందుపై పట్టు, గుండెలకు పట్టు వేయించి, ఒళ్ళంతా వెల్లుల్లిపాయి పసుపూ తేనే నూరించి రాయించి, అరగంట అరగంటకు పై మహాపాశు పతాదుల మందే నాలుకకు రాయించినాడట.
93 డిగ్రీల వాతం! ఇరవై నాలుగు గంటలయిన తర్వాత నెమ్మదిగా వేడి అందుకొంది. ఇంకో ఇరవైనాల్గు గంటలకు నాకు వేడి 97 డిగ్రీలకు వచ్చి, నాడి కొంచెం బాగుపడిందట. మా అమ్మకూ ఆయనే వైద్యం చేసాడు.
వైద్యుడు అంతా అయిన తర్వాత నిజం తెలుసుకొని సుశీలను బాగా చీవాట్లు పెట్టి, తర్వాత ఆ మందే ఆ మహాజ్వరాన్ని మళ్ళించలిగిందని మెచ్చుకున్నారట్ట. ఆ సన్యాసికోసం నాకు మహావాతం చేయగానే పరుగెత్తితే అతడక్కడ లేడట.
ఆ జబ్బు నెమ్మదించగానే ఒక రాత్రివేళ నాకు మెలకువ వచ్చింది. సుశీల నా మంచం ప్రక్కనే కుర్చీలో కూర్చుండి, నిద్రవచ్చి,నా నా మంచం మీద తలవాల్చి గాఢనిద్రపోతున్నది. ఆ గదిలో వేరొకచోట చాపపైన మా అమ్మ నిద్రపోతున్నది. గుమ్మం అవతల చావడిలో మా మేనమామ మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు.
శకుంతల వచ్చి నన్ను లేపినట్లు కల వచ్చి '' అయ్యో, బ్రతికి వచ్చిందా?'' అనుకుంటూ చెమటలుపట్టి, శకుంతలా అంటూ లేచాను. నా మాట ముద్దమాటలా వచ్చింది.
అందరూ ఒక్కసారి లేచారు. మా అమ్మ నా దగ్గ్గరకు పరుగిడి వచ్చి ''నాయనా బతికావురా!''అని కంటనీరు కారిపోతూ ఉండగా, వెక్కి వెక్కి ఏడ్చి నన్ను కౌగలించుకుంది. మా మేనమామ ''అక్కా, ఊరుకోవే!'' వాడు బతికాడు. అదే పదివేలు. కొంచెం కులాసా చిక్కగానే మా ఊరు మనం అంతా వెళ్ళవచ్చును'' అంటూ కళ్ళనీళ్ళు వరదలు కట్టించాడు. సుశీల కంటనీరు జడివానగా, ''విశ్వేశ్వరా తండ్రీ! నీ దయే ఇదంతా!'' అంటూ వణికిపోయింది.
