"ఉద్యోగమా?" అన్నాడు సుందరం.
"అవును: ఫోర్తుఫారందాకా అందరూ ఒకటే చదువు చదువుతారు. ఫిఫ్తుఫారంలోకివెళ్ళి ఏదో సబ్జక్టు సెలక్టు చేసుకుంటున్నావంటే దానిమీద నువ్వు ముందుముందు చెయ్యబోయే ఉద్యోగం ఆధారపడివుంటుంది." అన్నాడు శ్రీనివాసరావు.
ఇది సుందరానికి తెలియదు. లెక్కలూ, సైన్సుతీసుకోవాలా, హిస్టరీ తీసుకోవాలా అన్నది కేవలం పిల్లల తెలివితేటలపైనే ఆధారపడి ఉంటుందని వాడి అభిప్రాయం.
"నాకు లెక్కలు బాగా వచ్చుగా? నేను లెక్కలు తీసుకోకపోతే ఎట్లా?" అన్నాడు సుందరం.
"నువ్వనుకునేది మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళంతా లెక్కలు తీసుకునేవాళ్ళనా? చాలా పొరపాటు. మాటవరసకి ప్లీడర్లను తీసుకో. ప్లీడరీ స్వతంత్రమైన ఉద్యోగం. తెలివితేటలుంటే బోలెడంత సంపాదించవచ్చు. ఇప్పుడు కాంగ్రెసునాయకుల్లో ఎంతమంది ప్లీడర్లున్నారో చూడు. మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్, విఠల్ భాయ్ పటేల్, రాజేంద్రప్రసాద్ మాలవ్యా_ అందరూ ప్లీడర్లే, వీళ్ళకి నీ ఆల్జీబ్రా, ఫిజిక్సూ రాకపోయినా ఇంత గొప్పవాళ్ళయేవాళ్ళే. వైద్యుడు కాదలిస్తే సైన్సూ, లెక్కలూ, చదువు. కాని ఆలోచించుకో, రెండేళ్ళు కాలేజీచదువూ, అయిదేళ్ళు వైద్యమూ నేర్చుకుంటేగాని డాక్టరువు కాలేవు. అన్నేళ్ళ చదువుకు నీ దగ్గర డబ్బుందా? నిజంగా అంతడబ్బేఉంటే మందులషాపు పెట్టుకుని చాలమంది డాక్టర్లకన్న ఎక్కువే సంపాదిస్తున్నారు తెలుసా?... నీ దగ్గర అంత డబ్బులేదని నాకు తెలుసు. ఇక ఎందుకీ లెక్కలూ? బియ్యే పాసయి ట్రెయినింగయి పంతులుపనిచేయవచ్చు.ఎమ్మే పాసయి అదృష్టంవుంటే లెక్చరరు పనిచేయవచ్చు. కాని ఏం జీతమిస్తారు? ఆ ఉద్యోగాలుమాత్రం అన్నప్పుడల్లా దొరుకుతాయా? కాలేజీలో ఏనాలుగేళ్ళో, ఆరేళ్ళో చదవాలంటేమాత్రం, డబ్బు కవద్దుటోయ్. స్కూలు ఫైనలు కాగానే ఏదో ఉద్యోగం సంపాదిస్తే ఈ నాలుగేళ్ళలోగా ప్రమోషన్లురావూ?"
శ్రీనివాసరావు ఏం చెబుతున్నాడో తెలుస్తూనే ఉందిగాని ఎందుకు చెబుతున్నాడో సుందరానికి తెలియలేదు.
"నన్ను హిస్టరీ తీసుకోమంటారా?" అన్నాడు సుందరం.
"అదిమాత్రం ఎందుకూ? ప్లీడరు అవుదామనా? దానికీ డబ్బుండాలి. దానికి ఆరేళ్ళు కాలేజీలో చదవాలి. అదీగాక ప్లీడర్లందరికీ ప్రాక్టీసున్నదా ?"
"మరేం తీసుకోమన్నారు?" అన్నాడు సుందరంపూర్తిగా ఖంగారుపడి.
"నేనేదో నిన్ను చెయ్యమంటున్నా ననుకోకు. నువ్వు తమ్ముడులాటివాడవు గనక నీ మంచికోరి నీకు సలహా ఇస్తున్నానంతే. చదువుగురించి ఆలోచించేటప్పుడు ఖర్చూ, ఉద్యోగమూ ఆలోచించకపోవడం చాలా పొరపాటు. అసలే ఈ చదువులో వృత్తివిద్య చాలాతక్కువ. కనీసం స్కూలుఫైనలన్నా పాసు కాకపోతే ప్రపంచజ్ఞానమే ఉండదుమరి. అందుచేత స్కూలు ఫైనలుతో నిలిపేస్తూ వ్రుత్తివిద్య సంపాదించే దారి ఆలోచించాలి. కాలేజీ క్లాసుల్లో మరింత ఇంగ్లీషూ, మరింత ఇతర సబ్జక్టులూ చెబుతారు. అవి మన లోకజ్ఞానాన్నా పెంచవు వృత్తికా పనికీరావు. అందుచేత స్కూలుఫైనలుతో చదువు సరిపేట్టి పెందలాడి ఉద్యోగంలో ప్రవేశిస్తే సంసారం మీదపడి పిల్లలు పుట్టుకొచ్చే నాటికి నాలుగురాళ్ళు తెచ్చుకుంటూ ఉండొచ్చు, అవునా? నేను ఇంటరు పాసయాను. కాని అది నా కెందుకూ ఉపకరించ లేదు. స్కూలు ఫైనలు వాడికి దొరికే ఉద్యోగమే దొరికింది. అదైనా చిన్నతనంలోనే సంపాదించాను గనుక నెల తిరిగేసరికి 50రూపాయలు కళ్ళ జూస్తున్నా. నాకు సలహా చెప్పేవాళ్ళుంటే షార్టుహాండు, టైఫ్ రైటింగ్ తీసుకుని స్కూలు ఫైనలుతో పూర్తిచేసి ఈపాటికి ఎనభయ్యో, తొంభయ్యో సంపాదించుకుని ఉందును. నా స్నేహితుడొకడు బొంబాయిలో తొంభై సంపాదిస్తున్నాడు. మా నాగుక్కూడా అదే సలహా ఇస్తున్నాను."
శ్రీనివాసరావు సలహా సుందరానికి కొంచెం కూడా రుచించలేదు. చదువు సాంతం చదువుకోవటానికిగాను డబ్బు లెక్క చూడట మేమిటి? ఇప్పటినుంచీ ఉద్యోగం సంగతి ఆలోచించట మేమిటి? వెనుకటిరోజుల్లో చదువుకోసం కాశీ, నవద్వీపం వెళ్ళేవాళ్ళు. వాళ్ళు కష్టాలూ, ఉద్యోగాలూ చూశారా?
అయితే నాగేశ్వరావు షార్టుహాండూ, టైప్ రైటింగ్ తీసుకుంటాడన్నది రూఢి అయింది. నాగేశ్వరావు స్కూలు ఫైనల్ తో ఆపేస్తే తను బియ్యేదాక చదవటం చాలా అన్యాయమనిపించింది.
కాని సుందరం సమస్య ఇంకోవిధంగా పరిష్కారమయింది. వాడికి ఫోర్త్ ఫారం ఆఖరు పరీక్షలో లెక్కల్లో మొదటిమార్కు వచ్చింది. స్కూలు తెరచి ఫిప్తుఫారం క్లాసులో కూచున్న తరవాత ఒకపూట సైన్సు మాష్టరూ, లెక్కలమాష్టరూ వచ్చి, ఒక్కొక్క పిల్లవాణ్ణీ నిలబెట్టీ, వాడి పేరడిగి, వాడికి లెక్కల్లోనూ సైన్సులోనూ ఎన్నేసి మార్కులు వచ్చాయో చూసి, బాగా మార్కులు వచ్చినవాళ్ళు లెక్కలు తీసుకోవడానికి ఒప్పుకుంటూ, రానివాళ్ళను నిరుత్సాపరుస్తున్నారు. తన వంతురాగానే సుందరంకూడా లేచి నిలబడ్డాడు.
"నీ పేరు?" అన్నాడు సైన్సుమాష్టరు.
"కే.సుందరం, సార్."
"కూర్చో!" అన్నాడు లెక్కలమేష్టరు సుందరంకేసి ఒక్కక్షణం చూసి.
తన చేతిలో ఉన్నపట్టీలో సుందరం పేరుకోసం వెతుకుతున్న సైన్సుమేష్టరు, ఏం సబ్జెక్టు తీసుకుంటావ్!" అన్నాడు.
"లెక్కలు తీసుకుంటాడు.... నెక్ స్ట్!" అన్నాడు లెక్కలమేష్టరు.
సైన్సు మేష్టరుకు సుందరంపేరు పట్టీలో కనిపించకపూర్వమే ఇంకో విద్యార్ది లేచి నిలబడ్డాడు.
సుందరం తన నోటిమీదిగా, లెక్కలు తీసుకుంటాను" అనలేదు. లెక్కల మేష్టరు ధర్మాన వాడి సబ్జక్టు ఖాయమయింది. కాని సుందరం తన నోటిమీదిగా, "నేను లెక్కలు తీసుకొకో. షార్ట్ హాండ్ , టైప్ రైటింగ్ తీసుకుంటాను" అనీ అనలేదు....
౧౬
జానకికి పదోఏడు. సీతమ్మగారు పిల్లపెళ్ళికి తొందర పడుతున్నది.
"ఎవరుచూశారు బాబూ. కొంపతీసి మా పిన్నిపోలిక వస్తే పదివెళ్ళకుండానే ఈడేరి కూర్చుంటుంది. దిక్కులేని ఆడచచ్చినదాన్ని దీనికెట్లా సంబంధం తెస్తానో, కట్నా లెక్కణ్ణుంచి తెచ్చిపోస్తానో, పెళ్ళి ఎట్లాచేస్తానో నాకే తెలీకుండా ఉంది." అని ఆమె ఎరిగినవాళ్ళదగ్గరా, బంధువులదగ్గరా వాపోసాగింది.
