Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 43

    "తనకూ అలాంటి వారసుడు సృస్టించబడాలి" మనసులో అనుకున్నాడు శరత్.

    అలాంటి పాపకోసమే....తన యావదాస్థి పోయినా సరే అనుకున్నాడు.

    "సుగాత్రి గర్భం దాలిస్తే...ఎంత ఆనందపడుతుందో....పండంటి బిడ్డను కనగానే ఆ తొలిసిగ్గుల్ని తనివి తీరా చూడాలి పాప ఆదుకునే ప్రతివస్తువూ ఫారిన్ నుంచి తెప్పించాలి. పాపని పట్టుకొని....ఏడాదికి రెండుసార్లు గోవా వెళ్ళిరావాలని...ఈ పాపతో సుగాత్రిలో అన్నీ సర్దుకుంటాయి" అనుకున్నాడు.

    అతనికి తెలీదు. ఆ పాప పుట్టకుండా వుండటానికి మరో 'మహా యజ్ఞం' మొదలౌతుందని.


       
                          *    *    *    *    *


    కొత్త విషయాలు తెలుస్తున్నకొద్దీ వాళ్ళిద్దరికీ ఎగ్జయిట్ గా వుంది. సబ్జక్ట్ కమాండ్ లేకుండా వాళ్ళడిగే అమాయకమైన అనేక ప్రశ్నలకు ఓపికగా వివరిస్తోంది డాక్టర్ లక్ష్మి.

    "టెస్ట్ ట్యూబ్ బేబీని సృస్టించాలానే పద్దతిలో ఎవరి ప్రయోగాల్లో నయినా రెండు దశలుంటాయి. నామటుకు నేను చేసే ప్రయోగాల దశలు చెప్పాలంటే...ముందు సుగాత్రికి హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చి ఆమెలోని అండాన్ని పరిపక్వం చెందించి, అండాశయం నుండి బాగా ఎదిగిన ఒక అండాన్ని లాపర్ స్కోప్ ద్వారా బయటికి తీయటం. ఆ తర్వాత భార్గవ నుండి సెమన్ ని తీయటం....ఇది మొదటిదశ!

    ఆ తర్వాతి దశలో...అండాన్ని, వీర్యాన్ని టెస్ట్ ట్యూబ్ లో వేసి Life Supporting Sollutionజాగ్రత్తగా పోసి వుంచి కలపాలి. ఈ పనే చాలా జాగ్రత్తగా, నిదానంగా చేయాల్సుంటుంది. అవి రెండూ కల్సి ఫెర్టిలైజ్ అవుతాయి. అవి ఎనిమిది కణాల విభజన చెందే బ్లాస్టోసిస్ట్ అనే పిండంలో ఒక దశ ఏర్పడేవరకూ పరీక్ష నాళికలోనే వుంచి....మరి కొద్ది వారాలవరకూ ఎదిగిన అండాన్ని సుగాత్రి గర్భాశయంలో ప్రవేశపెట్టాలి. ఈ రెండో దశ చాలా క్లిష్టమైంది. ముఖ్యంగా లైఫ్ సపోర్టింగ్ సొల్యూషన్ కలిసేటప్పుడు..." చెప్పింది డాక్టర్ లక్ష్మి.

    "అయామ్ రెడీ డాక్టర్" అన్నాడు భార్గవ, శరత్ వైపొకసారి చూసి.

    "మీరు రెడీయే కావచ్చు. కాని లేడీస్ ఫస్ట్ అన్నారు తెల్సా? ముందు సుగాత్రికి అనుమానం రాకుండా అండాన్ని తీయాలి. ఆ తర్వాత కడుపు నొప్పి ఆపరేషన్ పేరా ఆమె గర్భాశయంలో పొదిగిన అండాన్ని వుంచాలి. సుగాత్రికి వైద్య పరిజ్ఞానం ఎక్కువ లేదు. కాని ఎలా...?" అంది లక్ష్మి.

    "అదంతా నువ్వే చూసుకోవాలి లక్ష్మి! ఎలా చెబుతావో? ఏం చేస్తావో నీ ఇష్టం" అన్నాడు శరత్ భారంగా.

    "సుగాత్రికి ఫోన్ చేసి ఓసారి హాస్పిటల్ కు రమ్మంటాను. ఎందుకయినా మంచిది. ముందే తెలిస్తే ఆమె వప్పుకోకపోవచ్చు. మీరు కూడా మాట జారకండి" అంది.

    "సరే మళ్ళీ ఎప్పుడు కలవమంటారు డాక్టర్?" అడిగాడు భార్గవ వెళ్తామన్నట్లుగా.

    "ఆల్ రైట్....మూడ్రోజుల తర్వాత కన్పించండి" అంది లక్ష్మి క్లినిక్ నుండి బయటికి వస్తూ... వాళ్ళిద్దరూ సెలవ్ తీసుకున్నారు మరోసారి థాంక్స్  చెప్పి.

    "భార్గవా! నిన్నెక్కడ డ్రాప్ చేయమంటావ్?" కారు స్టార్ట్ చేస్తూ అడిగాడు శరత్.

    "నేను డిటెక్టివ్ అమితేష్ దగ్గరకెళ్ళాలి. ఫోన్ కాల్స్ తగ్గినా లెటర్స్ తగ్గలేదు. ఈసారి విచిత్రంగా రాసింది. బెదిరింపు కాదు బేలగా చంపొద్దని వేడుకుంటూ....అసలీ పాత్రలో జరగరానిదే జరుగుతుందనిపిస్తోంది. అందుకే.... మళ్ళీ ఓసారి అమితేష్ ని కలవాలనుకుంటున్నాను" అన్నాడు.

    "సరే....అక్కడే దింపి వెళతాను. థాంక్యూ యువర్ కో__ఆపరేషన్" కారు వేగంగా కదిలిపోయింది.

    __గేటు దాటి లాస్ ప్రక్కన కారాపి వరండాలోకి అడుగుపెట్టిన శరత్ కు ఫోన్ లో మాటాడుతున్న సుగాత్రి కన్పించింది. అతనిలో పట్టరాని ఆనందం.....అనంతమైన సంతోషంతో గుండెల్నిండా ఊపిరి పీలుస్తూ....మెల్లగా నిశ్శబ్దంగా సుగాత్రి వెనక్కి వెళ్ళాడు అతనికా సమయంలో దాగుడు మూతలాడాలన్నంత ఉద్వేగంగా వుంది.

    "ఎస్ డాక్టర్....నాకీ మధ్య కడుపునొప్పి రావటం లేదు....మీ ఉద్దేశ్యం ఏమిటో నాకు బాగా తెల్సు. కడుపునొప్పుల పేరిట....పురిటి నొప్పులు తెప్పించాలనేగా? మీ ప్రయోగాలు....ప్రయత్నాలు...నేను....నేను కూడా ఓ నిర్ణయం తీసుకున్నాను డాక్టర్....మీరు వేసుకున్న ప్లాన్ ని కాదనటమే నా నిర్ణయం...." అంటుంది సుగాత్రి సీరియస్ గా.

    అంటే!!! ఇన్నాళ్ళ అతడి నిర్ణయం గాలిమేడలై కూలిపోయింది.

    ఆశలన్నీ ఆధారం తెగిన పతంగుల్లా ఎగిరిపోయాయి.....

    అతని త్యాగానికి ఆమె నిర్ణయం రెక్కలు విరిచేసింది....

    "మీరు నన్ను మభ్యపెట్టాలని ప్రయత్నించకండి డాక్టర్! మీ నిర్ణయం నాకు తెల్సు ఎలా తెలుసునన్నది మీకనవసరం. ఒక పాపాన్ని తొమ్మిది నెలలు మోసేంతటి నీచత్వం లేదు లక్ష్మిగారు నాలో!! ఐయాం సెన్సిటివ్ ....రియల్లీ వెరీ సెన్సిటివ్" కళ్ళలో నీటిని, గొంతులో కర్కశాన్ని కలగాపులగంగా నింపుకొని ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగిన సుగాత్రి నోరు తెరిచింది.

    మచ్చలేని నీలాకాశంలోకి....అకస్మాత్తుగా చుట్టిన మబ్బుల్లా తడితడి కళ్ళతో నిల్చున్న పోరా చూసి ఎరుగదు శరీరం ప్రకంపిస్తుంటే....గొంతులో అలాంటి ఉద్విగ్నతతో ఆమె పెదవులు ఏవో చెప్పాలని వణుకుతున్నాయి రెపరెప లాడుతున్న గులాబీ రేకుల్లా....

    అమరత్వం నిండిన అతని ప్రేమ చేసే నిష్కల్మషమైన త్యాగానికి తాళలేనట్టు....కంఠంలో కెరటాలై ఘోషిస్తున్న దుఃఖాన్ని అణచడానికి.....నోటికి కొంగు అడ్డం పెట్టుకొని...మెట్లపైనించి వేగంగా పరిగెత్తి బెడ్ మీద బోర్లా పడిపోయి బావురుమంది.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS