Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 43

    ఆ వ్యక్తి మెల్లగా కళ్ళు తెరిచాడు.

    "దాహం....దాహం...." అతని పెదాల మధ్య నుండి అస్పష్టంగా వినిపించింది.

    చిన్నారావ్ మళ్ళీ లోపలికి పరుగులుతీసి మరో గ్లాసుడు మంచినీళ్ళు తెచ్చాడు.

    రాంబాబు అతని తల ఎత్తి పట్టి వుంచితే, చిన్నారావ్ మెల్లగా నీళ్ళు తాగించాడు.

    ఇద్దరూ అతన్ని చెరో రెక్కా పట్టుకుని లేవదీసి మెల్లగా లోపలికి నడిపించుకుని తీస్కెళ్ళి గది మూల వున్న పరుపుమీద కూర్చోబెట్టారు. అతనికి కూడా ఇంచుమించు వీళ్ళిద్దరి వయసే వుంటుంది....అంటే పాతిక వుండొచ్చు. కానీ మనిషి బండగా వున్నాడు....నల్లగా, పొట్టిగా.

    "ఎవరు మీరు?" అడిగాడు రాంబాబు.

    ఆ వ్యక్తి ఇద్దరి మొహాల వంకా మార్చి మార్చి చూసి "ఆకలి!" అన్నాడు.

    రాంబాబు చిన్నారావ్ వంక చూశాడు. చిన్నారావ్ గూట్లోంచి బ్రెడ్ పాకెట్ తీసి ఓ నాలుగు స్లయిసులకి జామ్ పూసి ప్లేట్లో పెట్టి ఆ వ్యక్తి ముందు వుంచాడు.

    ఆ వ్యక్తి వాటిని ఆవురావురుమంటూ రెండు నిముషాల్లో తినేశాడు.

    "ఇంకా కావాలి!" అన్నాడు.

    మరో నాలుగు స్లయిసులకి జామ్ పూసి ఇచ్చాడు చిన్నారావ్.

    ఇప్పుడు కాస్త ఆకలి తీరడంవల్లేమో ఆ వ్యక్తి మెల్లగా తింటూ గదిని పరికించి చూశాడు.

    అది ఒకటే చాలా పెద్ద గది. గది మధ్యలో రాడ్ కి కర్టెన్ కి అవతల నేలమీద ఓమూల స్టవ్, వంట సామాగ్రి, బాత్రూమ్ బహుశా వెనక వైపు నుండి వుండొచ్చు.

    ఆ వ్యక్తి బ్రెడ్ తింటూండగానే రాంబాబు స్టవ్ అంటించి కాఫీ పెట్టాడు.

    కాఫీ కప్పుల్లో పోసేసరికి ఆ వ్యక్తి బ్రెడ్ తిన్నాడు. మరి కాస్త మంచినీళ్ళు తాగి కాఫీ కప్పు అందుకుని తృప్తిగా తాగాడు.

    ఆ వ్యక్తి మోహంలో అలసట, నీరసం సగం తగ్గింది.

    "ఇప్పుడు చెప్పండి...." అన్నాడు రాంబాబు పరుపుమీద అతని ప్రక్కన కూర్చుంటూ. చిన్నారావ్ రాంబాబు ప్రక్కన కూర్చున్నాడు.

    ఆ వ్యక్తి గొంతు సవరించుకున్నాడు.

    "నా పేరు నాగరాజు....మాది విజయవాడ. మా నాన్నకి కాన్సర్, మా అమ్మకి పక్షవాతం, మా చెల్లెలికి చిన్నప్పుడు పోలేయోసోకి రెండు కాళ్ళూ వంకర్లు తిరిగిపోయాయ్, మా అన్నయ్య పుట్టు గుడ్డి...." బాధగా అన్నాడు నాగరాజు.

    అతని కుటుంబం గురించి విన్న రాంబాబు, చిన్నారావ్ లకి కళ్ళలో నీళ్ళు తిరిగాయ్.

    "సినిమాల్లో హీరోయిన్ కుండే కష్టాలన్నీ పాపం మీకున్నాయ్!" అన్నాడు రాంబాబు దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో.

    "అసలు ఇన్ని కష్టాలతో ఎలా బ్రతుకుతున్నారు?" జాలిగా చూస్తూ అన్నాడు చిన్నారావ్.

    "ఇప్పుడా కష్టాలేం లేవు లెండి...." అన్నాడు నాగరాజు.

    "ఏం....? మీ ఫామిలీ మొత్తాన్ని వదిలేసి ఇక్కడికొచ్చారనా?" అడిగాడు రాంబాబు.

    "కాదు....వాళ్ళే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు."

    "వాళ్ళే వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే....కొంపదీసి మీకు ఎయిడ్స్ గానీ కాదుకదా?" భయంగా చూస్తూ అడిగాడు రాంబాబు.

    నాగరాజు విరక్తిగా నవ్వాడు.

    "అదయినా బాగుండేది....కాని కాదు. మా కుటుంబ పరిస్థితి ఇంత దరిద్రంగా వుందని తిరపతి వెళ్ళి దేవుణ్ని దర్శనం చేస్కుందామని ఓ టాక్సీ మాట్లాడుకుని తిరుపతి బయలుదేరాం....టాక్సీ తిరుమల కొండల్లోంచి లోయలోపడి అందరూ చనిపోయారు....నేను ఎలా బతికి బయటపడ్డానో నాకే తెలీదు!"

    రాంబాబు, చిన్నారావ్ లు "అయ్యయ్యో" అన్నారు.

    "కుటుంబ సభ్యులందర్నీ పోగొట్టుకుని విజయవాడలో వుండలేక హైదరాబాద్ వచ్చేశాను. ఉద్యోగం లేదు....మూడు రోజుల్నుండీ ఆ ప్రయత్నంలోనే తిరుగుతున్నాను....ఎక్కడా ఏ పనీ దొరకలేదు.

    రెండు రోజుల్నుండీ తిండిలేదు....అందుకే ఆకలికి నీర్సం వచ్చి మీ ఇంటి గుమ్మంలో పడిపోయాను...." అన్నాడు నాగరాజు.

    నాగరాజు బాధామయ గాధ విని రాంబాబు, చిన్నారావ్ లు కరిగిపోయారు. మర్నాడు పోలీస్ కమీషనర్ యింట్లో జరగబోయే పార్టీకి నాగారాజుని కూడా తీస్కెళ్ళి, ఆయనకి పరిచయంచేసి ఆయనకున్న ఇన్ ఫ్లుయన్స్ తో నాగరాజుకేదైనా ఉద్యోగం ఇప్పించమని బ్రతిమిలాడాలని రాంబాబు, చిన్నారావ్ లు నిర్ణయించుకున్నారు.



                                *    *    *    *


    మర్నాడు సాయంత్రం....

    రాంబాబు, చిన్నారావ్, నాగరాజు ముగ్గురూ ఆటోలో కమీషనర్ లింగారావ్ ఇంటికి బయలుదేరారు.

    "అయినా పార్టీకి నేను వస్తే బాగుంటుందా?" అడిగాడు నాగరాజు.

    "ఏం ఫర్వాలేదు. కమీషనర్ గార్కి మేమంటే చాలా యిష్టం. కావాలంటే మా గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా తీస్కురమ్మని చెప్పారు. పార్టీలో మంచి మూడ్ లో కూడా వుంటారు కాబట్టి అక్కడే పరిచయం చేస్తే మంచిది!" అన్నాడు రాంబాబు.

    కొన్నిక్షణాల నిశ్శబ్దం తర్వాత నాగరాజు అడిగాడు.

    "అది వాళ్ళ పాప పుట్టినరోజు పార్టీ అన్నారుకదూ?"

    "అవును. ఏం?" అడిగాడు చిన్నారావ్.

    "పార్టీ తర్వాత నేను చిన్న మ్యాజిక్ ప్రదర్శన యిస్తాను."

    "ఏంటీ? నీకు మ్యాజిక్ వచ్చా?" ఆశ్చర్యంగా అడిగాడు రాంబాబు.

    "విజయవాడలో జంతర్ మంతర్ బాబు అనే ఫేమస్ మెజీషియన్ వున్నాడు కదా! అతని దగ్గర కాస్త నేర్చుకున్నా. పెద్ద పెద్ద స్టేజీ షోలు ఇవ్వలేను గానీ, ఇలా చిన్న చిన్న పార్టీల్లో మ్యాజిక్ షోలు ఇవ్వగలను" అన్నాడు నాగరాజు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS