ప్రైవేట్ నర్సింగ్ హోం
హమ్మో... నా కళ్ళు కనిపించడం లేదు... వామ్మో... నేను గుడ్డివాడినై పోయాను... నా బతుకు చీకటైపోయింది దేవుడో..."
ఉదయం నిద్రలేవగానే గోలగోలగా అరిచాడు సాంబమూర్తి.
అతని గోలకి కంగారుగా వంటగదిలోంచి పరిగెత్తుకుని వచ్చింది అతని భార్య రమణి.
"ఏమైందండీ?... ఏంటీ మీ గోల??"
"హమ్మనాయ్ నో... నువ్వు నా ముందే నిలబడి ఉన్నావా?... అయినా నువ్వు కనిపించడం లేదు.. నేను గుడ్డివాడినైపోయాను దేవుడో... దేవుడా..."
"నోర్ముయ్యండి... కళ్ళు మూసుకునే ఉంచుకుని కనబడటం లేదంటారేంమీ పాసిగూల..."
"ఆ...నేను కళ్ళు తెరవలేదా?...మూస్కునే ఉన్నానా?... నేనింకా తెరిచానని అనుకున్నానే!!..."అని కాస్సేపు కళ్ళు చిలికించి "హమ్మో!... నా కళ్ళు తెర్చుకోడం లేదు... నా కళ్ళంటుకుపోయాయ్ దేవుడో..."అన్నాడు సాంబమూర్తి.
"అబ్బబ్బ... ప్రతి విషయానికీ అలా అఘోరిస్తారేం?... కళ్ళని నీళ్ళతో కడిగేస్కుంటే అంటుకున్నవి విడిపోతాయ్ అంది రమణి.
సాంబమూర్తి రమణి చెప్పినట్టుగానే కళ్ళను నీళ్ళతో తడిపాడు. అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయ్. కానీ అద్దంలో చూస్కున్న సాంబమూర్తి అదిరిపడ్డాడు.
అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయ్.
ఆ మర్నాటి ఉదయం కూడా సాంబమూర్తి కళ్ళు అంటుకుపోయాయ్. కళ్ళు నీళ్ళతో నానబెడ్తే తప్ప విడలేదు. అప్పుడూ అంతే...కళ్ళు ఎర్రగా ఉన్నాయ్. ఆ పైరోజు కూడా అంతే.
ఆ రోజు లేటుగా ఆఫీసుకి వచ్చినందుకు బాస్ సాంబమూర్తిని కాబిన్ లోకి పిల్చి అడిగాడు.
"ఏంటోయ్... ఆఫీసుకి లేటుగా వసున్నావ్?" సాంబమూర్తిని చూసి కళ్లెగరేశాడు బాస్.
సాంబమూర్తి తలెత్తి బాస్ కళ్ళలోకి చూశాడు.
"ఏంటలా ఎర్రగా చూస్తున్నావ్?... జాగ్రత్త తోక కట్ చేస్తాను... ఆఫీసుకి లేటుగా ఎందుకొస్తున్నావ్ అని అడిగితే కోపలేం?..." మండిపడ్తూ అన్నాడు బాస్.
"అది కాద్సార్... మరేమో... నా కళ్ళూ..." విడమరిచి చెప్పబోయాడు సాంబమూర్తి.
"ఇంకేం చెప్పకు... వెళ్ళి సీట్లో కూర్చుని పంజేయ్... ఇకముందు ఆలస్యంగా వస్తే తోక కట్ చేస్తా..."
ఆ రోజు సాయంత్రం యింటికెళ్లగానే రమణి థెయ్యిమంటూ ఇంతెత్తున లేచింది సాంబమూర్తి మీద.
"నేనేం చేశానే అలా ఎగుర్తావ్?" నీళ్ళు నముల్తూ అన్నాడు సాంబమూర్తి.
"ఇంకా ఏం చెయ్యాలీ?... ఈవేళ ఉదయం పెరట్లో పళ్ళు తోముకుంటూ కంపౌండ్ వాల్ మీదుగా పక్కింటావిడ వంక అదోమాదిరిగా చూశారటగా... మీరఫీసుకు వెళ్ళగానే ఆవిడ వచ్చి చెప్పింది... అయినా నాలో ఏం తక్కువైందనీ, ఆవిడలో ఏం ఎక్కువైందనీ... ఇట్టా లాభం లేదు... ఈవాల్టి నుండీ కూరల్లో, సాంబారు రసాలల్లో ఉప్పూ కారం, మసాళా అన్ని తగ్గించి పారెయ్యాలి!!..."
"అది కాదే బాబూ... నా కళ్ళు ఎర్రగా ఉన్నాయ్ కదా... అందుకనే మామూలుగా చూసినా అదోమాదిరిగా చూసినట్టు అనిపిస్తుంది... మరేమో ఈవాళ మా బాస్ కూడా నన్నిట్టానే అపార్థం చేస్కుని ఛడామడా తిట్టేశాడు తెల్సా...భలే గమ్మత్తుగా ఉంది కదూ హిహి!..."
"అఘోరించార్లే...మామూలుగా చూసినా, అదోమాదిరిగా చూసిన అసలు గోడమీంచి ఆమె వంక ఎందుకు చూడాలి అసలు?" అని సాంబమూర్తిని జల్లకాయ్ కొట్టి వంట గదిలోకి వెళ్ళిపోయింది రమణి.
'నా కళ్ళకేదో అయింది... వీటిని బాగుచేయించుకోకపోతే లాభం లేదు... రేపు హాస్పటల్ కి వెళ్లాలి!' అనుకున్నాడు సాంబమూర్తి.
ఆ మర్నాడు ఆఫీసుకి శలవు పెట్టి హాస్పటల్ కి వెళ్లాలి!' అనుకున్నాడు సాంబమూర్తి.
ఆ మర్నాడు ఆఫీసుకి శలవుపెట్టి హాస్పటల్ కి వెళ్ళడానికీ రెడీగా ఉన్న సమయంలో వాకిట్లో ఓ బిచ్చగాడు అరిచాడు.
"పాడైన కన్నుని బాగుచేయించుకోడానికి గవర్నమెంటాస్పత్రికి వెళ్ళి బాగున్న కన్నుని కూడా ఊడగొట్టించుకుని కబోదినైపోయిన అభాగ్యుడ్ని బాబూ... ఓ ముద్దవెయ్యి తల్లీ... కళ్ళులేని కబోదిని!!"
సాంబమూర్తి గుండె గుభేల్ మంది. తనిప్పుడు గవర్నమెంటాస్పత్రికే వెళ్ళబోతున్నాడు.
రమణి బిచ్చగాడికి అన్నం వేసి పంపించి లోపలికొచ్చింది.
"విన్నారుగా గవర్నమెంటాస్పత్రికి వెళ్తే ఏమౌతుందో... సుబ్బరంగా మన కాలనీలోని డాక్టర్ అత్యాశానాథ్ నర్సింగ్ హూంకి వెళ్లండి..." అంది సాంబమూర్తితో.
