Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 43

    "ఆ రాయుడు రేప్ చేసేశాడు బాబూ. రేప్ చేసేశాడు!!" ఘొల్లుమన్నాడు సంతానం.
    "రాధా...!"
    జుట్టు పీక్కుంటూ భయం భయంగా అరిచాడు గోపి.
    "రాయుడు రేప్ చేసింది నీ భార్యని కాదు గోపీబాబూ. నా భార్యని!..." బేర్ మన్నాడు సంతానం.
    "ఆ అవమానం భరించలేక అది ఆత్మహత్య చేస్కుంది బాబూ..."
    "ఆం!...." ఆశ్చర్యంగా నోరుతెరిచాడు గోపి.
    "పాములాంటి విషపూరితమైన మనిషిని ఆశ్రయించి ఉన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది బాబూ.... తగిన శాస్తి జరిగింది బాబూ... తగిన శాస్తి జరిగింది... అంతేకాదు బాబూ.... సీతాలుని రేప్ చేసి చంపేసి పోలీసులకి ఫోన్ చేసి నువ్వే చంపామని చెప్పాడు బాబూ ఆ రాయుడు."
    గోపి అదిరిపడ్డాడు.
    ఆ!... అయితే సీతాలుని చంపింది రాయుడా?... అయితే దోషి అయిన రాయుడిని చట్టానికి పట్టించాలి... రాయుడిని చట్టానికి పట్టించాలంటే ముందు నేను జైల్లోంచి తప్పించుకోవాలి!
    కానీ ఎలా?... ఎలా?.... ఎలా???....
    గోపీ తీవ్రంగా ఆలోచించసాగాడు.
                                                                      35
    జైల్లో తన టేబుల్ మీదున్న బెల్ ని ఠన్ ఠన్ మని వాయించాడు. వెంటనే ఒక సి,సెంట్రీ లోపలికి పరిగెత్తుకుని వచ్చాడు.
    "ఏంటి సార్ పిలిచారా?" అడిగాడు సెంట్రీ.
    "లేదు... ఊర్కే సరదాగా గంట కొట్టుకుంటూ ఆడకుంటున్నా. మరేమో నేను చిన్నపిల్లడిని కదా?... అందుకని  అన్నమాట!!... అని మళ్ళీ 'ఠన్ ఠన్' అని బెల్ కొట్టి "హిహి... హిహిహి..." అని సంబరంగా నవ్వాడు జైలర్.
    "ఓహో.... మీరు సర్దాగా ఆడుకుంటున్నారా? నేనింకా పిలిచారేమోనని అనుకున్నా... హి... హిహి..." నవ్వుకుంటూ బయటికి వెళ్ళబోయాడు సెంట్రీ.
    "ఏయ్ సెంట్రీ..." గట్టిగా అరిచాడు జైలర్.
    సెంట్రీ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు.
    "నేను బెల్ కొడితే పిలిచారా అని అడుగుతావేం?... పిలవడానికి కాకపోతే ఆడుకోడానికి బెల్ కొడ్తానా?..." జైలర్ మండిపడ్డాడు.
    "సారీ సార్! ఇంతకీ ఎందుకు పిలిచారు సార్?" అడిగాడు సెంట్రీ.
    "మన ఖైదీలు ఏం చేస్తున్నారు?..."
    "ఖాళీగా కూర్చుని గోళ్ళు గిల్లుకుంటున్నారు సార్?...."
    జైలర్ ఉలిక్కిపడ్డాడు.
    "ఏంటీ?.... గోళ్ళుగిల్లుకుంటున్నారా - వాళ్ళతో రాళ్ళు కొట్టించకుండా ఖాళీగా ఎందుకు ఉంచారసలు?-" చిరాకుపడ్తూ సెంట్రీని అడిగాడు.
    "ఎక్కడ సార్ - దేశంలోని రాళ్ళు మొత్తం వాళ్ళకి చాలడంలేదు - మొన్న తెప్పించిన కొండరాళ్ళన్నీ చిన్న చిన్న ముక్కలుగా గులకరాళ్ళు క్రింద కొట్టిపారేశారు సార్-" చెప్పాడు సెంట్రీ.
    "అలాగయితే లారీల్లో మరికొన్ని బండరాళ్ళు తెప్పించండి - వాళ్ళు ఖాళీగా ఉండటానికి వీలులేదు."
    "అలాగే సార్-"
    "సరేగానీ గోపీ సెల్ లో ఏంచేస్తున్నాడు - అతను కూడా గోళ్ళు గిల్లుకుంటున్నాడా "
    "లేద్సార్ - అతనికి మాత్రం చేతినిండా పనివుంది సార్"
    జైలర్ సెంట్రీవంక ఆశ్చర్యంగా చూశాడు.
    "జైల్లో వేరే ఏ ఖైదీలకీ పనిలేదుగానీ అతనికి మాత్రం చేతినిండా పనివుందా? ఆశ్చర్యంగా ఉందే! ఇంతకీ అతను చేస్తున్న పనేమిటి?..."
    "బొగ్గుముక్కల్తో దైవసమానురాలైన ఆయనగారి తల్లి బొమ్మల్ని, దేవతలాంటి ఆయనగారి భార్యబొమ్మల్నీ సెల్ గోడలనిండా వేస్తున్నాడు సార్. అతనికి సెల్ ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ లా ఉంది సార్."
    "కుర్రాడు చాలా బుద్దిమంతుడు. చేతిలో ఇంత మంచి ఆర్ట్ ఉంచుకుని బొమ్మలేస్కోకుండా హత్య ఎందుకుచేశాడో."
    గది సీలింగ్ వంక చూస్తూ సాలోచనగా అన్నాడు జైలర్.
    "ఒహుశా ఆ సీతాలు ఇంటి గోడమీద బొగ్గుతో ఆర్ట్ వేయబోతే గోడలు ఖరాబు అవుతాయని ఆమె ఒప్పుకోలేదేమో సార్. అందుకని కోపంవచ్చి ఆమెని హత్యచేశాడేమో సార్..." అన్నాడు సెంట్రీ.
    "పోలీసులు ఏవేవో పిచ్చి కారణాలు చెప్పి అరెస్టు చేశారుగానీ.... నువ్వు చెప్పిందే సరైన కారణంగా కనిపిస్తుంది సెంట్రీ. నీలాంటి తెలివైన సెంట్రీ నా దగ్గర పని చేస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది."
    "థాంక్యూ సార్..." పొంగిపోతూ అన్నాడు సెంట్రీ.
    ఇంతలో బయటనుండి అమ్ముకునేదాని కేక గట్టిగా వినిపించింది.
    "ఆ... లడ్డూలమ్మా.... లడ్డూలు.... తీపి తీపి లడ్డూలు... తింటే నోరూరించే లడ్డూలు... లడ్డూలమ్మా లడ్డూలు!...
    "సార్.... ఎవరో లడ్డూలు అమ్ముతున్నారు... తింటారా సార్!" సెంట్రీ జైలర్ ని చూసి అడిగాడు.
    "తినాలనే అనిపిస్తూంది.... తీపి లడ్డూలని అంటుందికదా మరి?" అన్నాడు జైలర్.
    "ఉండండి సార్... దాన్ని లోపలికి తీసుకొస్తాను."
    సెంట్రీ బయటికెళ్ళి లడ్డూలు అమ్మేదాన్ని లోపలికి తీసుకొచ్చాడు.
    ఆ లడ్డూలమ్మేది ఎవరో కాదు.
    ఆమె రాధ!
    కచ్చపోసి చీరకట్టి, నెత్తిన పెద్దకొప్పు చుట్టుకుని దాంట్లో చేమంతిపూలు తురుముకుంది. నెత్తిన ఒక గంపవుంది.
    జైలరు రాధని లడ్డూలు ఎంతకిస్తావ్ అని అడగబోయాడు... కానీ రాధ అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా గంప నేలమీదపెట్టి 'ఘయ్....' మని గట్టిగా ఓ కేకపెట్టి చెంగున ఓ గెంతు గెంతింది.
    ఆమె చేష్టకీ, కేకకీ అదిరిపడిన జైలరూ, సెంట్రీ కేర్, బేర్ అని అరుస్తూ గది చెరో మూలకీ కకావికాలై పరిగెత్తి భయం భయంగా రాధ వంక చూశారు.
    "ఏందమ్మా  అది? - ఎందుకట్టా కేకపెట్టి చెంగుమని గంతే సేవ్?-" రాధని అడిగాడు జైలరు భయంగా మొహంపెట్టి.
    అతని ప్రశ్న వింటూనే రాధ పకపకా నవ్వింది.
    "ఏటండి బాబుగారూ - అలా బయపడ్తారు? నేను పాట పాడదామని అనుకున్నానండి - పాట పాడేముందు ఆ మాత్రం ఆడావిడి ఏటీ లేకుండా ఉంటే ఏం బావుంటుందండీ-" అంది యాసగా మాట్లాడ్తూ.
    "చంపేసేవ్ కదే - నీ హడావిడికి గుండెలదిరిపోయాయ్ కదా" అంటూ సీట్లోవచ్చి కూర్చున్నాడు జైలర్.
    వెంటనే రాధ మరోసారి "ఖయ్-" మని అరిచి ఆ తర్వాత ఒక్క గెంతు గెంతి పాటందుకుంది.
    "లడ్డూలండి లడ్డూలు   
    పసందైన లడ్డూలు
    పడుచుపిల్ల లడ్దూలూ
    పరువాల ఉరవళ్ళూ-
    ఈ లడ్డూ తిని రావణుడూ
     సీతమీద కన్నేశాడూ
    ఈ లడ్డూతిని భీముడేమో
    లడ్డూలా తయారయ్యాడూ
    లడ్డూలండి లడ్డూలూ
     పసందైన లడ్డూలూ-
     ఈ లడ్డూ తింటే ముసలివాళ్ళు
     పడుచువాళ్ళు అవుతారూ
    ఈ లడ్డూతింటే పిరికివాళ్ళు
     ధైర్యవంతులవుతారూ
    లడ్డూలండి లడ్డూలూ
    పసందైన లడ్డూలూ-"
    పాటంతా అయ్యాక హెయ్యిన ఓ గంతు గెంతి నేలమీద దబ్బున పడింది రాధ.
    సెంట్రీ గబుక్కున రాధ చేయిపట్టి నేలమీంచి లేపాడు.
    "అబ్బా. అయితే నీ లడ్డూల్లో అంత మహత్యం ఉందా? నీ లడ్డూలు అంత బాగుంటాయా?" లొట్టలువేస్తూ అడిగాడు జైలర్.
    "ఊ.... మరేం అనుకున్నారు బాబూ.... ఈ లడ్డూలు తింటే ముసలాళ్ళకి కూడా రిమ్మ తెగులేస్తది! ఆ!" అంది రాధ నడ్డిమీద చెయ్యి పెట్టుకుని ఓ కాలు వంకరగా పెట్టి మోకాలు ఊగిస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS