Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 43

 

    "నాకేసి చూడకు. నాతొ మాట్లాడకు. త్వరగా బట్టలు వేసుకుని ఇక్కణ్ణించి బయటకు పో!" అన్నాను సునీత వంక కోపంగా చూసి.
    'అది కాదన్నయ్యా!" అంటూ ఆమె ఏదో మాట్లాడబోయింది.
    "వద్దు, వెళ్ళిపో!" అన్నాను తీవ్రంగా. ఆమె అయిదు నిమిషాల్లో అక్కణ్ణించి వెళ్ళిపోయింది.
    చాలా విచిత్రమైన పరిస్థితుల్లో విచిత్రమైన భావాలతో ఒక్కడ్నీ అక్కడ ఒక పది నిమిషాల సేపు వుండిపోయాను. మగబుద్ది ఎంత చెడ్డది. ఒక ఆడది నగ్నంగా కనబడితే దాన్ని వాంచించాను. అది నా చెల్లెలి శరీరామని ఇప్పుడు తెలిసింది . తెలియక పొతే?
    అయినా నా చెల్లెలు ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. అయినా ఇది నాకు చాలా పాడు దినం. లేకపోతే నా చెల్లెలు నగ్న శరీరాన్ని చూసి వాంఛ పెంచుకుంటానా? ఒక హత్య చేయగలుగుతానా?
    హత్య ....హటాత్తుగా నేను హత్య చేసిన విషయం గమనించాను.
    ఎదురుగా బోర్లా పడి వున్నది వీర్రాజు శవం. ఒక్కసారిగా శరీరం ఆపాదమస్తకం వణికింది. అ క్షణంలో ఇతర ఆలోచనలన్నీ మరిచిపోయి, హత్య గురించి భయపడసాగాను. తక్షణం అక్కణ్ణించి కదిలి వీధిలోకి వచ్చాను.
    ఇప్పుడు ఏం చేయాలి?
    నేను జీవితంలో ఇటువంటి నేరం చేయలేదు. నేను, నా చెల్లెలు చాలా సాదాగా జీవితం నడుపుకుంటూ వస్తున్నాం. ఇద్దరం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం. అయితే వ్యాపారంలో నేను రాణిస్తానని నా మనసు మరీ మరీ చెప్పడం వల్ల , ఆ కోర్కె నాలో క్రమక్రమంగా బలం కాసాగింది. ఒక్క ఐదు వేలు ఎక్కడైనా దొరికితే చిన్న వ్యాపారాన్ని ప్రారంభిద్దామని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ కుదరడం లేదు.
    అయితే పదిరోజుల క్రితం అతను కనిపించాడు. ఒక్కరోజు -- ఈ వెంకటాద్రి అనుకున్న వీర్రాజు ఇంటికి వెళ్ళి పది గంటల ప్రాంతాల అతనికి నిద్ర మాత్రలిచ్చి పడుకోబెట్టాలన్నాడు. అలా చేస్తే పది వెలిస్తానన్నాడు.
    అయితే అతని మీద నాకు చిన్న అనుమానం కలిగింది. నిద్ర మాత్రలని అతను నా చేతికి విషం ఇస్తే?
    అందుకే చెప్పాను. నేనే స్వయంగా ఏదైనా షాపులో నిద్ర మాత్రలు కొని వీర్రాజుకి ఇస్తానని.
    వెంటనే అడ్వాన్సు గా అయిదు వేలు ఇచ్చేశాడు. నేను చేయవలసిన ఈ పని వెనకాల వున్న రహస్యం గురించి నేనెక్కువగా ఆలోచించ దల్చుకోలేదు. వ్యాపారం చేయడానికి అవసరమైన పెట్టుబడి లభిస్తోంది. అయినానేనేమీ నేరం చేయడం లేదు కూడా.
    ఈ పని నేనే ఎందుకు చేయాలి? అతను చేసుకోలేదా? ఈ పని వల్ల నాకు పది వేలివ్వడానికి అంగీకరించాడంటే అతని కెంత లాభముంది? నిజంగానే ఈ పనిలో ప్రమాదం లేదే?....ఇలాంటి ఆలోచనలు నాలో చోటు చేసుకోబోయాయి. కానీ వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదనీ , నన్ను పదివేలకీ అవి దూరం చేస్తాయనీ అనిపించి వాటిని దగ్గరకు రానివ్వలేదు.
    అయితే ఈరోజు అన్నీ తలక్రిందు లై పోయాయి. నేను హంతకుడినయిపోయాను. ఇప్పుడు నాకు అతను తప్ప వేరే ఎవరూ దిక్కు లేదు.
    నేను వెళ్ళేసరికి అతను నా కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ అతని ముఖంలోకంగారు వుంది. "ఇంకా పది కాలేదు. అప్పుడే వచ్చేశావేమిటి?" అన్నాడు.
    నేను జరిగింది చెప్పాను. అతని ముఖంలో తంగులు మారాయి. "చాలా తొందర పడ్డావు. అతన్ని నిద్ర పుచ్చాలని నేను చెబితే శాశ్వతంగా నిద్ర పుచ్చేశావు?" అన్నాడు. నేనేం మాట్లాడలేదు. "అయినా పది గంటల ప్రాంతాల అతని ఇంటికి వెళ్ళమంటే అంత పెందరాళే ఎందుకు వెళ్లావు?" అన్నాడు ఒక్క పిసరు కటువుగా . నాకు ఉక్రోషం వచ్చింది.
    "నీ మూలంగానే !" అన్నాను. "అతను 13 నెంబరు బస్సు ఎక్కుతాడన్నావు. వెంటనే ఎక్కలేదు. లక్కీ స్ట్రీటు దగ్గర దిగితాడన్నావు. వెంటనే దిగలేదు. ఎలక్ట్రిక్ స్తంభాలు గుర్తు చెప్పావు. కానీ అక్కడ అటూ ఇటూ కూడా వెంకటాద్రి లున్నారని చెప్పలేదు. ఇవన్నీ నన్ను చాలా కంగారు పెట్టేశాయి. అదీకాక నువ్వు వెంకటాద్రి అని చెప్పి నతని పేరు వీర్రాజు."
    అతను షాక్ తిన్నట్లు కనిపించాడు. మరోసారి ఆ రూమునీ, ఆ పరిసరాలనీ, వీర్రాజు రూప విశేషాలనీ వర్ణించేక అతను స్థిమిత పడ్డట్లు కనిపించాడు. "సరేలే. ఇందులో నా పొరపాట్లు కూడా చాలా వున్నాయి. అయాం వెరీ సారీ! ఇప్పుడు నిన్ను రక్షించవలసిన బాధ్యత కూడా నా పైన  వుంది. కాసేపు ఆలోచించనీ" అన్నాడు.
    నేను మౌనంగా కూర్చున్నాను. తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ముఖకవళికలు చెబుతున్నాయి.
    పది నిముషాలు గడిచిపోయాయి. నాలో క్రమంగాసహనం నశిస్తోంది. ఉన్నట్లుండి అతను లేచాడు. "ఇప్పుడు నాకు ఒకే వుపాయం తోస్తోంది. చనిపోయిన వీర్రాజుని హంతకుడిగా మార్చేద్దాం - నువ్వు చచ్చిపోవాలి" అన్నాడు.
    నాకు అర్ధం కాలేదు.
    "త్వరగా పక్క గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకురా" అన్నాడతను అజ్నాపిస్తున్నట్లుగా. నేను మాట్లాడకుండా వెళ్ళాను. అక్కడ చాలా పాంట్లు, షర్టులు ఉన్నాయి. గబగబా నా బట్టలు విప్పి ఒక జత వేసుకున్నాను. అవి నాకు చక్కగా సరిపోయాయి. బయటకు రాగానే అతను "ఇప్పుడు నీ బట్టలు శవానికి తొడుగుతాను. గుర్తు తెలీకుండా శవం ముఖం పచ్చడి చేసేస్తాను. అప్పుడు పోలీసులు దృష్టిలో నువ్వు చచ్చిపోయినట్లు లెక్క అవుతుంది. వాళ్ళు వీర్రాజు కోసం అన్వేషణ ప్రారంభిస్తారు. నీవు హాయిగా జీవించవచ్చ్జు. అయితే చిరంజీవుగా కాదు, మరో రంగనాద్ గా" అన్నాడు.
    మనసులోనే అతని తెలివి తేటలకు జోహార్లు అర్పించాను. అతను నా చేతికి ఒక చిన్న బ్రీప్ కేసు ఇచ్చాడు. "ఇందులో నీక్కావలసిన అయిదు వేలూ వున్నాయి. వెళ్లి హాయిగా బ్రతుకు. మిగతా పని నేను చూసుకుంటాను" అన్నాడు.
    నేను థాంక్స్ చెప్పి బయటకు వెళ్ళబోయాను. ఆ శవం నీదే ననడానికి ఒక్క బట్టలు మాత్రం చాలకపోవచ్చు. నీకని ప్రత్యేకమైన గుర్తు లేమైనా వున్నాయా? ముఖ్యంగా నీ స్నేహితులెవరైనా సరే గుర్తుపట్ట గలిగేవి. అప్పుడు మనపని సులభమవుతుంది."
    ఆలోచించడానికి వ్యవధి లేదు. బ్రీఫ్ కేసు క్రింద పెట్టి నా మొలత్రాడు కున్న తాయెత్తు ఒకటీ, మెడలోని లాకెట్ గొలుసూ, చేతి కున్న వాచీ ఇచ్చేశాను.
    నా మొలత్రాడు కున్న తాయెత్తు సంగతి మా ఇంటికి వచ్చే స్నేహితులందరికీ తెలుసు. నేను లుంగీ మీదకు మొలత్రాడు కడతాననీ, ఇంట్లో వున్నప్పుడు చొక్కా వేసుకోననీ వాళ్ళు వెటకారం చేస్తుండేవారు. నా మెడలోని లాజెట్ గొలుసు చిన్నప్పటిది కావడం వల్ల నేను బనియన్ వేసుకోకుండా ఉత్త బుష్ షర్ట్ వేసుకుని పై బొత్తాం వదిలేస్తే -- అందరకూ కనబడుతుంది. కొంతమంది - ఆ గొలుసు వల్ల నాను రౌడీలా కనబడుతున్నాననీ , తీసేయమనీ సలహాలిచ్చారు. కానీ దానితో నాకున్న సెంటిమెంటల్ అటాచ్ మెంట్ వాళ్ళ కేలా తెలుస్తుంది? మా అమ్మ బ్రతికుండగా ఆ లాకేట్టూ, తాఎత్తూ తీయరాదని మా అమ్మ చిన్నప్పుడు నన్ను శాసించింది. కానీ ఈరోజు నేను బ్రతికుండడం కోసం అవి తీసేస్తున్నాను. ఎందుకంటె నేను నేనుగా చచ్చిపోయాను.
    అతని చేతికి లాకేట్టూ, తాయేత్తూ ఇస్తుంటే నిజంగానే నేను చచ్చిపోయా ననిపించింది.
    అక్కణ్ణించి బయటపడ్డాను. నా దగ్గర మరో అయిదు వేలున్నాయి. అవి ఓ ముసలమ్మ ఇంట్లో దాచాను. ఆమెకు నేనంటే ఎంతో ఇష్టం. సెలవు రోజుల్లో నేనూ, చెల్లాయీ ఆమె ఇంట్లోనే భోం చేస్తుంటాం. మా అమ్మకు ఆమె ఏదో దూరాపువరుసలో మేనత్త అవుతుందిట. ఇప్పుడు నేను అక్కడికే బయల్దేరాను.
    సమయం సుమారు పదిన్నరయిందనుకుంటాను. ముసలమ్మా ఇంకా మెలకువగానే ఉంది. నన్ను చూడగానే టైమెంతయిందని అడిగింది.
    పదిన్నర అనబోయి నాలిక్కరచుకుని ఎనిమిదిం పావు అని చెప్పాను.
    పదిన్నరకు ఆమెను కలుసుకున్నట్లు తెలిస్తే ఎలా? అంతకు ముందే నేను చచ్చిపోయాను.
    'అంతేనట్రా? పది దాటిందేమో ననుకున్నాను. అందుకే కాబోలు నాకు ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు" అందామె. నేను నవ్వి - "నేనిచ్చిన డబ్బు సంచీ అడిగి తీసుకున్నాను. సంచీని బ్రీఫ్ కేసు లోకి తోసేశాను.
    "వస్తాను మామ్మా! చాలా పెద్ద పని వుంది. " అంటూ అక్కణ్ణించి హడావుడిగా బయల్దేరాడు.
    సరాసరి రైల్వే స్టేషన్ కి వెళ్లాను. ఇంతవరకూ ఎదుగని చోటికి, నన్నెవరూ గుర్తుపట్టని చోటుకి బయల్దేరాను పది వేల రూపాయల రోక్కంతో.
    

                                  2
    రెండేళ్ళు గడిచిపోయాయి.
    ఈ రెండు సంవత్సరాల్లోనూ వ్యాపారం పేరు చెప్పి నేను పెద్దగా గడించినదేమీ లేదు. కానీ వ్యాపారమంటే బాగా ఆకళింపు చేసుకున్నాను. అందువల్ల నేనా పెట్టుబడితో ఇంకా నిలబడగలిగాను. అతి కొద్ది కాలంలోనే లక్ష లార్జించగలనన్న విశ్వాసం ఇప్పుడిప్పుడే నాలో చోటు చేసుకుంటోంది. ఆ విశ్యసానికి మరింత బలం ప్రసాదించడం కోసం అప్పుడప్పుడు నేను జ్యోతిష్కుల దగ్గరకు పోతుంటాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS