Previous Page Next Page 
ఎండమావులు పేజి 44

 

                                                              32

    స్వాతికి జ్వరం తగ్గలేదు. జ్వర తీవ్రతను మించి ఆమె మనస్సు దిగులుతో పరాభవంతో కొట్టుమిట్టులాడుతున్నది. ట్యూషన్లు లేవు, వంట లేదు. మందు లేదు, ఆహారం లేదు. క్రమంగా శరీరం కృశించి పోతూనే ఉన్నది. ఇది వరకు కృష్ణ మూర్తి ఆరోగ్యంలో ఏ మార్పు వచ్చినా ఆమె మనస్సు తల్లడిల్లి పోయేది. గుండెల్లో నొప్పిగా ఉన్నదంటే ఎంతో శ్రద్ధతో ఉపచారం చేసి, మనస్సుకు మాట పట్టడానికి అనునయ వాక్యాలు చెప్పి, డాక్టరు చెప్పిన దానికి తగినట్లుగానే వేళకు మందిచ్చి, ఆహారమూ, పండ్ల రసమూ ఇచ్చి ఎంతో శ్రద్దతో వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉండేది. ఇప్పుడు తనే మంచం దిగలేని స్థితికి వచ్చింది. కృష్ణమూర్తిని నేను ఈ స్థితికి తీసుకు వచ్చానా, నన్ను చేపట్టడంనుంచే ఎందుకూ పనికి రాకుండా అసమర్దునిలా, ఎవరూ పట్టించుకోని వ్యక్తిలా, జీవచ్చవంలా బ్రతుకుతున్నాడా అని వాపోతుంది. ఒక వస్తువుని చెడగొట్టటం చాలా తేలికే. ఒక వస్తువును సృష్టించటం కొంచం కష్టమైన పని. ఒక జీవితాన్ని నాశనం చెయ్యటం కూడా తేలికే. కాని ఆ నాశనమైన జీవితాన్ని, ఆ తరంలో బాగు చెయ్యటం కష్టసాధ్యం. వివాహం బాంధవ్యాన్ని కలుపుకోవాలి, బంధు కోటిలో పేరు ప్రతిష్టలు కావాలి. ఫలానివారి అమ్మాయి ఫలాని వారి కోడలని అంతా ఆనందంతో సంతోషంతో గౌరవ పరస్పరంగా చెప్పుకోవాలి. ఈ అమ్మాయి మా కోడలు అని అత్తగారు అమ్మలక్కలకు చూపించి మురిపించి, మురిసి పోవాలి. ఆ పిల్ల పొరుగిళ్ళకు వెళ్ళినప్పుడు ఫలాని వారి కోడలివా అమ్మా, ఫలాని అబ్బాయి భార్యవా అని గౌరవ మర్యాదలతో పలకరించాలి. పుట్టింటి వారు నీకేంతల్లి అల్లుడు ఎంతో మంచివాడు, ప్రయోజకుడు, సంపాదించి నిన్ను సుఖ పెట్టగలవాడు, మీ అత్తగారు మహాలక్ష్మి సమానురాలు. నిన్ను కడుపులో పెట్టుకుని కన్న కూతురిలా ఆదరిస్తుంది. అని అనునయ వాక్యాలతో, సంతోష పరితప్త హృదయాలతో, ఆనంద బాష్పాలతో, హర్ష పులకాంకితులై అత్త వారింటికి కాపురానికి పంపించాలి. "మా కోడలు మా ఇల్లు మెట్టిన తరువాత మాకు చాలా కలిసొచ్చింది. మా వాడికి మంచి ఉద్యోగం దొరికింది. నిజంగా మా కోడలు మా ఇంటి మహాలక్ష్మి గానే వచ్చింది" అని మామ గారు పెద్దలతో చెప్పి సంతోషించాలి. ఆడబిడ్డలు "మా వదినె, మా పెద్ద అన్నయ్య భార్య, మేమంటే ఎంతో ఆపేక్ష". అంటూ ఘనంగా చెప్పుకోవాలి.
    ఆ తీరుగా ఆ వాతావరణంలో, అందరి ఆశీర్వచనాలతో కాపురానికి వెళ్ళి అందరిలోనూ తలమానికంగా ఉంటంలోనే అత్తింటి కోడలుగా ఉన్న గృహిణికి ఘనత, గౌరవమూను.
    కాని తనకా యోగ్యత ఈ జన్మలో లేదు. అలాంటి వాతావరణంలో వివాహమై తను కాపు రానికి రాలేదు. అత్తవారిల్లు చూడ లేదు. అత్త మామలను మా ఇంటి కోడలుగా చూడలేదు. మా పెద్ద కోడలని వారు చెప్పుకోలేదు. ఎవరూ, ఎప్పుడూ మాట్లాడుకోలేదు. అసలు తను ఆ ఇంటి కోడలిగానే పరిగణింప బడలేదు. మా కోడలు కాదు అనుకున్నారువారు. తమకూ వాళ్ళకు ఏమీ సంబంధం లేదన్నారు. భ్రష్టులుగా, వెలివేసిన వారినిగా, అగౌరవంగా ఈర్ష్యా, క్రోధ దృష్టులతో చూడబడుతున్నారు.
    ఈ జీవితంలో కాంక్షించినదీ అనుభవించినదీ ఏమీ లేదు. సర్వం వదలుకుని, సర్వ బంధువర్గాన్ని వదలుకుని, సర్వత్రా అగౌరవంగా చూడబడుతూ, సర్వేశ్వరుని దృష్టిలో ఇలాంటి నికృష్ణ జీవితం గడపటం కూడా ఒక ఘనతేనా? మహనీయమైన మానవ జీవితానికి తమ వివాహం దాంపత్య జీవితం ఆదర్శనీయమైదేనా? ఆ వాటి వివాహానికి వచ్చిన పెద్దలు ఈ వర్ణాంతర వివాహం ఎంతో ఆదర్శనీయమైందనీ, సాంఘిక జీవిత కట్టు బాట్లను వర్ణవ్యస్థనూ సంఘటిత పరచి, పటిష్టం చేసిందనీ అన్నారు. సంస్కారవంతులైన యువతీ యువకులకు ఈ వివాహం మార్గదర్శక మన్నారు. కర్మిష్టులైన పెద్దల హృదయ కవాటాలు తెరిచి, సర్వ జనులూ ఒకటే ననాని ఈ ఆదర్శ దంపతులు ఎలుగెత్తి చాటారన్నారు. పంచరత్నాలు చదివి తమ పాండిత్య ప్రకర్షను వెల్లడించుకున్నారు. ఆ నాటి వివాహ మహోత్సవ సందర్భమంతా పత్రికల వారు ప్రకటించారు. వధూవరుల పెళ్ళి ఫోటోలు పత్రికల్లో ప్రకటించి ఆదర్శ దంపతులుగా అభివర్ణించారు.
    కాని నిత్యజీవితంలో, అనుభవంలోకి వచ్చేసరికి అంతా తారుమారయింది. వ్యతిరేక వాతావరణం ఏర్పడింది. పరిగణింపబడని దంపతులుగా ఈ పదేళ్ళూ జీవితం గడిపారు.
    ఈ జీవితమంతా చర్వితచరణం చేసుకుంది స్వాతి. ఈ మహా యజ్ఞంలో సమున్నత స్థానం సంపాదించుకున్న సంస్కార ప్రియులైన ఆదర్శ దంపతులుగా అందరూ ప్రస్తావిస్తే, ఆచరణలో కొచ్చేసరికి యజ్ఞ పశువులే అయ్యారు.
     కన్నీటితో దిండంతా తడిసింది. కడుపులోని వ్యధ అంతా కన్నీటి మయమే అయింది. కాని ఒక్క కోరిక మాత్రమే బలవత్తరంగా హృదయంలో హత్తుకు పోయి తిష్టవేసింది. అత్త మామలకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వచనం పొందాలి. మా పెద్ద కోడలు స్వాతి అని వారు చెప్పుకోవాలి. ఆ ఇంట్లో పెద్ద కోడలుగా కొద్ది కాలమైనా తిరగాలి. మా వదినె మా ఇంటికి వచ్చింది అని శ్రీలక్ష్మి సంతోషించాలి. ఇదే స్వాతి కోరిక, ఆకాంక్ష, మనో వ్యధ. ఈ మనోవ్యధతో కుమిలి పోతున్నది స్వాతి ఆ సర్వేశ్వరుడు ఈ జీవితంలో నాకా వరాలను ప్రసాదిస్తాడా?నేనూ ఒక వ్యక్తిగా, గృహిణిగా, సంసార స్త్రీగా పరిగణింపబడతావా వారందరి దృష్టిలో?
    అనుక్షణమూ ఈ ప్రశ్నలతోనే సతమతమై పోతూ, వ్యధతో కుమిలి పోతున్నది స్వాతి.
    మగతగా కళ్ళు మూసుకు పడుకున్న స్వాతి కళ్ళు తెరచింది.
    ఎదురుగా జానకిరాం, కృష్ణమూర్తి, మురహరి, జయలక్ష్మి కనిపించారు. అందర్నీ చూసి ఆశ్చర్యం తో లేని ఓపిక తెచ్చుకొని లేవబోయింది. జయలక్ష్మి సహాయంతో పక్కమీద కూర్చుంది స్వాతి.
    "జ్యోతి రాలేదా మురహరీ" అన్నది ఆధుర్ధాగా.
    "రాలేదు. ఆమెకు టైఫాయిడ్ జ్వరము" అన్నాడు మురహరి.
    హతాశురాలైంది స్వాతి. మెల్లిగా పడుకుని అటువైపుకు తిరిగి కళ్ళు తుడ్చుకుంటూ "జ్యోతికి టైఫాయిడ్" అని ఆవేదనతో అనుకుంది మనస్సులో.
    "వదినా" పిలిచింది జయలక్ష్మి.
    ఇటు తిరిగి అందర్నీ చూసింది.
    "జ్యోతికి ఎన్నాళ్ళనుంచి జ్వరం" అన్నది తడారిన నాలుక తడుపుకుంటూ స్వాతి.
    "పుట్టింరోజు పండుగ అయిన మర్నాటి నుంచి ప్రారంభమైంది. నాలుగు రోజులనాడే డాక్టరు టైఫాయిడ్ గా తేల్చి చెప్పాడు" అన్నాడు మురహరి.
    "పాపం, పిచ్చి పిల్ల, పిచ్చి వూహలతో గాలి మేడలు కట్టుకుంది. ఆ గాలి మేడలు తేలిపోగా, నా స్థితికే వచ్చిందన్న మాట" అన్నది మెల్లిగా.
    "మీరు రాకపోవటం చేత చాలా బాధ పడుతున్నది. మిమ్మల్ని తీసుకురమ్మని పంపింది. మీరీ స్థితిలో ఉన్నట్లు జ్యోతికి తెలీదు" అన్నాడు మురహరి.
    "అవును ఎట్లా తెలుస్తుంది, ఆమెను చూట్టానికి నాకూ సందర్భపడలేదు. వారింటికి వెళ్ళినా ఇంక సందర్భ పడదేమో కూడా" అన్నది మనోవ్యధను మనస్సులోనే ఇముడ్చుకుని.
    "నువ్వయినా వెళ్ళి చూశావా జయా" అన్నది.
    "లేదు వదినా వెళ్ళలేదు. ఇవ్వాళ వెళ్ళి చూస్తాను" అన్నది అభిమానంతో జయలక్ష్మి.
    "అవును, వెళ్ళవని నాకూ తెలుసు. కాని నేను ప్రార్ధిస్తాను నువ్వు వెళ్ళి జ్యోతిని చూసిరా జయా, నాకోసమైనా వెళ్ళిరా, నా మనస్సుకు సంతోషాన్నిచ్చే ఈ ఒక్క సహాయమైనా చెయ్యవా జయా" అంటూ ప్రాధేయపూర్వకంగా ఆమె చేతులు పట్టుకుంది.
    
                                 33

    జయలక్ష్మిని చూడంగానే వ్యధిత పీడితురాలైన మనస్సుతో, రుద్ధపోయిన కంఠంతో కళ్ళప్పగించి చూస్తూ "వచ్చావా జయా, స్వాతివదినెను కూడా తీసుకురాపోయావా" అని మళ్ళీ తనలో తనే "అవును ఇంక ఎందుకు వస్తూంది" అన్నది జ్యోతి. అందాలుచిందే ఆమె సోయగమంతా ఆమె ముఖంలోనే హరించిపోయింది. కాళ్ళూ, చేతులూ పుల్లలయి పోయినయ్యి. పొట్ట వీపుకు అతుక్కున్నట్లుగా ఉంది. కళ్ళు పీక్కుపోయి, దవడలు గుంటలు పడ్డయ్యి. ఒక్కమాట మాట్లాడినా ఆయాసపడుతూ మాట్లాడుతున్నది. మందు దారి మందుది-రోగం దారి రోగంది.
    ఈ కాలంలో వైద్యం కూడా అంతేనాసిగా ఉన్నది. ఫలాని రోగానికి ఫలాని మందని క్యాటలాగుచూసి మందులు వాడటంతప్ప రోగియొక్క జబ్బుని సమూలంగా తెల్సుకుని మందు నడిపే వైద్యులు అరుదు.
    జ్యోతి డాక్టరు కూడా టైఫాయిడ్ మందులూ, మాత్రలూ, ఇంజక్షన్లూ ఇస్తున్నాడు తప్ప మానసికంగా ఆమె తరహా ఏమిటో తెలుసుకోలేదు. మనిషి అంటే దేహమూ, ప్రాణమూ, వూపిరితిత్తులే కాదు. మనస్సే మనిషి రోగానికి మూలము. అలాంటి మనస్సుని వదిలి మనిషిని పరీక్షచేస్తే రోగాలు తగ్గటం కూడా అరుదైన విషయమే.
    జ్యోతిని నిలువెల్లా ఒక్కసారి చూసి అప్రయత్నంగా బావురుమని, మళ్ళీ అదేం జరిగిందని అంతా అనుకుంటారని పైట చెంగుతో నోరు మూసుకుని వచ్చే వెక్కుని ఆపుకుంది జయలక్ష్మి.
    "జ్యోతీ నువ్వు మా జ్యోతివేనా, మరెవరైనా రోగిష్టి మారి పిల్లను తెచ్చి, ఇక్కడ పడుకోబెట్టి నాకు చూపిస్తున్నారా" అన్నది జయలక్ష్మి, జ్యోతి చేతులూ, కాళ్ళూ పట్టుకు చూస్తూ.    

 

                                
    "అంత చిక్కిపోయానా జయా! పోనీలే మనిషి జన్మ ఎత్తాక చిక్కకుండా, బలవకుండా ఉంటారా. అందులోనూ నన్నిపాత జ్వరంకదా" అన్నది మెల్లిగా.
    "కాదు జ్యోతి ఇది జ్వరం కాదు, నాకు తెల్సు మనోవ్యాధి. దీనికి మందు లేదు. దానికే మీ డాక్టరు టైఫాయిడ్ అన్నాడు. నాకు తెలుసు ఇది మనోవ్యాధ"ని అన్నది జయలక్ష్మి.
    జ్యోతి దిగాలు పడి చూస్తున్నది. ఆమె మనస్సులో సహస్రకోటి వ్యాకుల జ్వాలలు భగభగ మండుతున్నయ్యి. ఆ జ్వాలల వెలుగులో పసుపు బట్టలతో జయలక్ష్మి, మురహరి ఆ అగ్ని హోత్రం చుట్టూ సప్తపది తిరుగుతున్నట్లు లీలగా కనిపించారు.
    "నాకు దిగులేమిటి జయా. నాకు దిగుల్లేదు. ఒక సుఖం వెనుక ఒక దుఃఖం ఉంటుంది, ఒక దుఃఖం వెనుక ఒక సుఖం కాసుకు కూర్చుంటుంది. దుఃఖం వెనుక ఒక సుఖం కాసుకు కూర్చుంటుంది. మానవ జీవితమే అంత. అయినా నా వయస్సుకు నా జీవితంలో నేను ఏ కష్టాలనుభవించాను. ఎవరికీ అన్యాయం చేశానని భగవంతుడు నన్ను పాప లోకానికి పంపుతాడు. పరిశుద్ధమైన మనస్సుతో పరితప్త హృదయంతో నువ్వూ మా మురహరి బావా ఒక ఇంటివాళ్ళు కావాలన్నదే నా కోరిక. ఈ కోరిక తీరితే నా మనస్సులోని ఆవేదన తగ్గినట్లే, నా జీవితం చరితార్ధమైనట్లే. ప్రేమించని వారిని ప్రేమించుట అనేది ఆత్మ వంచనే అవుతుంది. నిన్ను మా బావ ప్రేమించాడు. మా బావను నువ్వు ప్రేమించావు. నేనూ ఉన్నానంటూ ఈ పరిస్థితుల్లో మా బావను నేను ప్రేమించటంలో అర్ధమేమైనా ఉందా? అది ఆత్మవంచన కాదూ? ఆత్మ ద్రోహం చేసుకున్నట్లు కాదూ? ఏమంటావ్ జయా" అన్నది ఆయాసపడుతూనే.
    జయలక్ష్మి నివ్వెర పోయింది. ఏం సమాధానం చెప్పటానికి తోచలేదు. దుఃఖాశ్రువులు మాత్రం జ్యోతి మీద పడకుండా ముఖం పక్కకు తిప్పుకుని కళ్ళు తుడ్చుకున్నది.
    "నువ్వు విచార పడుతున్నావని నాకు తెల్సు జయా, ఎవరి మనస్సే వాళ్ళకు అద్దమువంటిది. సరే దానికేంగాని స్వాతి వదినె రాలేదేం. మురహరి వచ్చి చెప్పలేదా నేను రమ్మన్నానని." అన్నది.
    అవమాన అఘాతంతో కృంగిపోయింది జయలక్ష్మి.
    "జ్యోతీ ఏం చెప్పేది, ఎట్లా చెప్పేది. స్వాతి వదినె కూడా నీ మాదిరే మంచాన అంటుకు పోయింది. ఆమె మనోవ్యాధి, ఎవ్వరూ తీర్చలేనిది. మనస్సు మంచిదయినా, వాక్కు మంచిదయినా నిష్కల్మషమైన హృదయురాలయినా జన్మతః ఆవిడ చేసుకున్న తప్పిదం ఆ పరమాత్ముడికే ఎరుక. ఇంత కాలం అంతా వెలి వేసినా ఓర్పుతో సహించాను. ఇంకా ఎంతకాలం నాకీ శిక్ష. నేను మీ పెదనాన్నగారి కోడలిని కానా, నాకు ఆ ఇంట్లో వారి పాద సేవ చేస్తూ పడి ఉండే హక్కు లేదా, దాసీ దాని మీద చూపే ఆదరాభిమానాలు కూడా నా విషయంలో వారు చూపలేరా? జీవితాంతం ఇలాంటి ఏకాకి జీవితం గడపవలసిందేనా? నాకు నిష్కృతి లేదా? నన్ను వారింటి ఛాయలకు కూడా రానీయరా? అంటూ వాపోతున్నది స్వాతి వదినె. ఆమెను పీల్చి పిప్పి చేస్తున్న సమస్య, తహతహ, ఉద్వేగపూరితమైన కోరికా ఇదే" అన్నది జయ లక్ష్మి.
    జ్యోతి మూర్చపడి పోయిందిసూన్య దృక్కులతో చూస్తున్నది. ఏదో అనుమానం, అవమానం ఆమె మనస్సులోనుంచి, హృదయంలోనుంచి విస్ఫులింగాలుగా ఆమె ఉచ్చ్వాస నిశ్వాసాల ద్వారాబయట పడుతున్నయ్యి. ఆ పరిస్థితి చూసి భయపడింది జయలక్ష్మి. "జ్యోతీ" అని పిల్చింది. "ఊ" అంటూ మూలిగింది జ్యోతి. వెంటనే లోపలికి వెళ్ళి జ్యోతి తల్లిని పిల్చుకొచ్చింది జయలక్ష్మి. తల్లివచ్చి జ్యోతి చేతులు రాస్తూ "ఏమిటమ్మా జ్యోతీ అట్లా ఉన్నావేం" అన్నది.
    "ఎట్లా ఉన్నాను. నీ కళ్ళకు ఇట్లాగే ఉంటాను నన్ను ఇట్లా చేశావ్. స్వాతి వదినెను అట్లా చేశావ్. ఎందుకమ్మా మామీద ఇంత కక్ష" అన్నది కళ్ళు మూసుకుని తల్లి ముఖం చూడకుండానే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS