"ఏమిటే ఈ మాటలు జ్యోతీ" అంటూ నౌకర్ని పిలిచి అయ్యగారిని పిల్చుకు రమ్మన్నది. ఈ లోగా జ్యోతి జయలక్ష్మి తో "జయా నువ్వు వెళ్ళి స్వాతి వదినెను చూడు. మా అమ్మ, నాన్నల తరఫున నేను వదినెను క్షమించమని వేడుకుంటున్నానని చెప్పు. వెళ్ళు త్వరగా " అంటూ జయలక్ష్మిని ఒక్క నెట్టు నెట్టింది. గుండెలు చిక్క పట్టుకోని వెళ్ళి పోయింది జయలక్ష్మి జ్యోతికి సంబంధించింది. ఆ సమయంలో ఎక్కడలేని బలంకూడా వచ్చింది.
జయలక్ష్మి వెళ్ళేసరికి స్వాతి మంచం మీద అట్లాగే పడుకుంది. పక్క మీద కృష్ణమూర్తి కూర్చున్నాడు. ఎదురుగా కుర్చీలో జానకిరాం కూర్చున్నాడు. జయలక్ష్మిని చూస్తూనే "ఎట్లా ఉంది జ్యోతి" అన్నది ఆదుర్దాగా.
"ఎట్లా ఉన్నదని చెప్పను వదినా. శుష్కించి పోయింది. నీ మాదిరిగానే ఉంది. మంచానికి అంటుకు పోయింది. " అన్నది జయలక్ష్మి కళ్ళు తుడ్చుకుంటూ.
ఒక్కసారి అదోలా జయలక్ష్మి వైపు చూస్తూ పిచ్చి నవ్వు నవ్వింది. ఆ నవ్వులో ఇద్దరి జీవిత వ్యధలు నిండి ఉన్నయ్యి. ఆ నవ్వులో నిరాశ, నిర్లిప్తతా లేదు. ఇంక మీరంతా ఏం చెయ్యగలరని సవాలు చేసినట్లుగా ఉన్నది. స్వాతి ముఖ కవళికలు, ఆ నవ్వూ చూసి జయలక్ష్మి కంపించిపోయింది.
"అవును జయా అనుకుంటూనే ఉన్నాను జ్యోతి మంచానికి అంటుకు పోతుందని. మనిషిని చులకనగా తీసి పారెయ్యవచ్చుగాని, మమతను తీసి పారెయ్యలేరు. ఒక్కో సమయంలో పరిస్థితుల ప్రాబల్యంవల్ల మమతను కూడా తీసి పారెయ్యవచ్చుగాని పురాకృత కర్మను తీసి పారెయ్యలేరు" అన్నది స్వాతి.
జయలక్ష్మి ఏమీ మాట్లాడలేక పోయింది.
"అవును జ్యోతి విషయం తేల్చేశాడు భగవంతుడు. ఆమె పరిస్థితి మనస్సూ నాకు తెలుసు. పోనీయండి" అంటూ జానకిరాం వైపు చూసి
"జానకిరాం, అత్త మామలూ, శ్రీలక్ష్మి నా కోరికను మన్నించలేదు కదూ' అన్నది తన అరచేతుల్లోని గీతల్ని చూసుకుంటూ.
"లేదు వదినా, వారిలో సాంప్రదాయ స్థిరమైనభావాలు కరుడు కట్టినయ్యి. వారి భావాలకు వెల్ల వేసి తెల్లగా చేసుకుంటున్నామని తృప్తి పడుతున్నారే కాని, ఆప్తులైన వారి మనస్సుల్లో అగ్ని రగిల్చి భగభగ మందేట్లు చేస్తున్నామని తెల్సుకో లేక పోయారు. ఈ పరిస్థితుల్లో వారు నిన్ను ఆదరించరు వదినా, ఆదరించరు" అన్నాడు జానకిరాం.
భిన్న వదనుడై స్వాతివైపు చూస్తూ కూర్చున్నాడు కృష్ణమూర్తి. అధైర్య పడ్డాడు. ఈ ప్రపంచంలో పుట్టి బుద్దెరిగిం తరువాత ఇంత అధైర్యంగా అతనెప్పుడు ఉండలేదు. నేటి స్వాతి పరిస్థితే అతన్నింతగా కృంగదీసింది.
ఆఖరుసారిగా అగ్ని పరీక్ష చేసుకుంది స్వాతి. ఈ అగ్ని పరీక్షలో శతకోటి దుఃఖల అనుభూతులను దగ్ధం చేసి వేసింది. ఆ స్థితిలో అన్ని మమతలను, అన్ని కోరికలనూ దగ్ధం చేసి నిష్కలంక శుభ్రతరమూర్తిగా ప్రశాంతమైన వదనంతో అమాయకంగా అందర్నీ చూసింది.
ఆమె నరాల్లోని పటుత్వం తప్పి పోతున్నది. ఒక్క తృటిలో లేని చిత్త స్థైర్యం వచ్చి అవనతవదనమై కృష్ణమూర్తి వైపు చూసి అతని చేతులు తన గుండెల మీదికి తీసుకుంది.
"ఏమండీ, మన వివాహం శోభస్కరమైంది కాదూ, సాంఘిక విలువల గీటురాయికి వన్నె రానిది. అయినా పదేళ్ళు కాపురం చేశాము. గతమంతా ఒక జీవన్నాటకము మాత్రమే. ఆ నాటకాన్ని ఎవరూ హర్షించక పోయినా మనమే ఆ పాత్రలలో లీనమై నటించాము. నాటకం రసవత్తరంగా ఉన్నతరుణంలో ఎవ్వరూ హర్షించరేమో అని చూస్తే ఒక్క ప్రేక్షకుడు లేడు. ఆ జీవన్నాటకాన్ని మధ్యలోనే ఆపి వెయ్యాల్సొస్తున్నది. నాయకునిపాత్ర పోషణ ఇంకా ఉన్నా నాయకురాలు వేదిక మీదినుండి నిష్క్రమిస్తున్నది." అన్నది.
ఆమెలో ఇది వరకూ ఉన్న ఆత్మ విశ్వాసంనుంచి బయటపడినట్లుగా ఉన్నదామె ముఖ వర్చస్సు.
కృష్ణమూర్తి కన్నీటి బొట్లు సంతతధారగా ఆమె గుండెల మీద, చేతుల మీద పడసాగినయ్యి.
"ఏడుస్తున్నారా, తప్పు, మీరు విచారించ కూడదు. ఒక్క మాట" అంటూ భర్త కళ్ళు తుడిచింది.
"ఈ స్వాతి ఎప్పుడూ ఎన్ని జన్మాలకైనా మీదే. ఎన్ని జన్మలకైనా మీరే భర్తగా కావాలని నిండు హృదయంతో చెపుతున్నాను. మనమూ, మన జీవితాలు శాశ్వతం కాకపోయినా మన అంత రాత్మలు ఎప్పుడూ ఒకటిగానే ఉంటయ్యి. నా సహచర్యంవల్ల మీరు అనుభవించింది ఏమీ లేదు. చివరికి ఒక్క మనో వ్యధ మాత్రమే మిగిలింది. తల్లితండ్రుల్లో నుంచి, బంధు వర్గంలో నుంచి మిమ్మల్ని విడదీశాను. అజ్ఞాతవాసం చేయించిన అజ్ఞానురాలిని. ఈ శాపం నన్ను శపించి దగ్ధం చెయ్యక ఏం చేస్తుంది? మీ చేతుల్లో, అమృత హృదయుడైన నా మరిది జానకిరాం సమక్షంలో వెళ్ళి పోతున్నాను. ఒక్క మాట. అత్తయ్యనీ, మామగార్నీ, శ్రీలక్ష్మినీ అందర్నీ క్షమించమని మనసార ప్రార్దించానని చెప్పండి వారి మీద ఈ నాటికీ గౌరవమూ, భక్తి భావమూ తప్ప నాకే దురభిప్రాయమూ లేదు. మనుష్యులు దూరమైనా వారి ఆశీర్వచనం నాకెప్పుడు ఉండనే ఉంది. పండువంటి వంశంలో చీడ పురుగులా ప్రవేశించినా నన్ను వారెవరూ నలిపి చంపి వేయలేదు.. ఇది వారి ఆశీర్వచనమే కదా" అన్నది.
అంతా నిశ్శబ్దంగా వింటున్నారు. ఆమె ప్రణయ నివేదనను వింటూ పిచ్చివాడుగా, అరవై ఏళ్ళు పైబడిన వృద్ధ మూర్తిలా అచేతనుడై కూర్చున్నాడు కృష్ణమూర్తి.
జయలక్ష్మి "ఇప్పుడే వస్తాను వదినా" అంటూనే సమాధానం కోసం ఆగకుండానే వెళ్ళి పోయింది.
"స్వాతియందు వారికి ఇష్టత లేకపోవచ్చు. స్వాతితో వారు మాట్లాట్టానికి వప్పుకోక పోవచ్చు. స్వాతి శవం వారినేమీ చెయ్యలేదు కదా భౌతికకాయం మీదనైనా వారికి కోపం లేకుండా ఉంటే నా ఆత్మ సంతోషిస్తుంది. దహన సంస్కారాలైనా శాస్త్రోక్తంగా చేయిస్తారు కదూ, లేకపోతే నా శవాన్ని కుక్కలు నక్కలు పీక్కు తింటూంటే మీ హృదయం ఆక్రోశించదూ" అన్నది స్వాతి.
"వదినా ఏం మాటలవి. నువ్వు పోవు, మమ్మల్ని వదలి ఎక్కడికి వెళతావు. నీ జబ్బు తగ్గి నువ్వు మళ్ళీ మాలో తిరుగుతావనే నా దృఢనమ్మకం. ఈ అప్పగింతలన్నీ ఎందుకు చేస్తున్నావో నాడు తెలీటం లేదు." అన్నాడు జానకిరాం స్వాతి వైపు చూస్తూ.
స్వాతి పేలవంగా నవ్వింది.
"నాకు పిలుపు వచ్చింది జానకిరాం. ఇంక వెళ్ళాలి. అత్తవారింటికి వెళ్ళలేక పోయినా పరమాత్ముని సన్నిధికైనా వెళ్ళొద్దా! నా పిచ్చిగాని పరమాత్ముని సన్నిధికి మాత్రం రానిస్తారా! యమచర అనుభవించొద్దూ" అన్నది.
జానకిరాం కళ్ళు చెమ్మగిలినయ్యి.
* * *
"ఏమండీ! మీ అమ్మగారినీ, నాన్నగారినీ బంధువర్గాన్ని చూడాలని ఇంత కాలమైనా అనిపించటం లేదూ, ఇంక చూడవచ్చునేమో? నేను వెళుతున్నాగా, నేను వెళ్ళిపోగానే వారంతా వస్తారు. కొడుకు పెళ్ళికి రాకపోయినా కోడలి చావుకయినా రాకుండా ఉంటారా? ఏమో చూస్తారుగా మీరే" అన్నది నవ్వు ముఖంతో.
ఈ సమయంలోనే ఎవరో తలుపు తీసుకువచ్చారు. చూస్తే తాసిల్దారుగారి జవాను. వాడూ ఏడుస్తూ బావురుమని"అమ్మగారూ, జ్యోతమ్మ గారుపోయారు. అయ్యగారూ, పెద్దమ్మగారూ మిమ్మల్ని రమ్మన్నారు. శవాన్ని చూట్టానికయినా మా వదినెను మనింటికి రానీయండి, ఆ మాత్రం అవకాశమైనా మా స్వాతి వదినెకు ఇప్పించండి, అని చచ్చిపోయే ముందు చెప్పింది జ్యోతమ్మగారు. ఆలస్యం చెయ్యక మీరు వచ్చెయ్యండి తల్లీ" అంటూనే వాడక్కడ నిల్చోకుండానే వెళ్ళిపోయాడు.
కృష్ణమూర్తి, జానకిరాం కంట తడి పెట్టారు, స్వాతికి కన్నీరు రాలేదు. ఆమె ముఖంలో విషాద రేఖలతోకూడిన ఆవేదనాపూరితమైన తెలియని సంతోషం ద్యోతకమైంది.
"చూశారా! జ్యోతి ఎంత అభిమానం గల ఆడపిల్లో. ఆత్మాభిమానం కలవారు అందరికన్నా ముందు వెళ్ళిపోతారు. నేను ఆత్మను చంపుకున్నదాన్ని కనక వెనుకనే వెళతాను. వస్తున్నానమ్మా జ్యోతీ, వస్తున్నా ఆ మరిచిపోయాను ఒక్క పని మిగిలి పోయింది" అని జానకిరాం వైపు చూసి దగ్గరకు రమ్మని పిలిచింది. జానకిరాం కూడా మంచం మీద కూర్చున్నాడు.
"చూడు జానకిరాం ఈ చివరి కోరిక తీర్చే భారం నీది. ఈ రోజునుంచీ నా జీవిత భాగస్వామిని మీ అన్నగారిని నీకు అప్పగిస్తున్నాను. వారిని మీ ఇంట్లో ప్రవేశ పెట్టు అదే నా అంతిమ కోరిక. శలవు" అంటూ కన్నీటి ధారలతో అన్నదమ్ములకు నమస్కరించింది. అంతే అన్న దమ్ములిద్దరూ బావురుమన్నారు.
ఒక దేవత సమస్త దుఃఖలూ, అవమానాలూ సహించి స్మిత ముఖియై ప్రజ్వరిల్లే ఆత్మ ప్రకాశంతో ఆ లోకాలకు వెళ్ళి పోయింది.
శవం మీదపడి కృష్ణమూర్తి ఎంత సేపు ఏడ్చాడో తెలియదు. అమృత హస్తాలని మించిన రెండు చేతులు అతని భుజాల మీద పడినయ్యి. తలెత్తి చూశాడు.
పదేళ్లుగా ఏ తప్పిదం చేత కన్న తల్లి దండ్రుల్ని దూరం చేసుకున్నాడో, ఆ తప్పిదానికి హేతువైన వ్యక్తి అంతరించగానే, ఆకన్న తల్లి దండ్రుల్ని చూశాడు. వారి ప్రక్కనే శ్రీలక్ష్మి. శవాన్ని వదిలి కన్న తల్లిదండ్రుల పాదాల్ని చుట్టేసి కన్నీటితో పాదాభిషేకం చేశాడు కృష్ణమూర్తి.
జ్యోతి శవాన్ని కూడా ఆ దారినే తీసుకు వచ్చారు. రెండు భౌతిక దేహాలనూ పూలదండలతో, పసుపు కుంకాలతో అలంకరించారు. వూరేగింపుగా స్మశాన వాటికకు తీసుకు వెళ్ళారు. ముందు జ్యోతి తండ్రి, స్వాతి మామగారు గోపాలశాస్త్రి నడిచారు. జ్యోతి శవ వాహకుల్లో ఒకడుగా ఉన్నాడు మురహరి. స్వాతి శవవాహకుల్లో ఒకడుగా ఉన్నాడు జానకిరాం తమ్ముని ప్రక్కగా అవనత వదనుడై నడుస్తున్నాడు కృష్ణమూర్తి.
జ్యోతి శవాన్ని తండ్రి ఖననం చేశాడు. మూడు గుప్పిళ్ళు మట్టి తనూ వేశాడు మురహరి. దాని ప్రక్కనే స్వాతి శవానికి చితి పేర్చారు.
స్వాతి శవానికి, కాదు, పెద్దకోడలి శవానికి నిప్పు అంటించాడు గోపాలశాస్త్రి.
అగ్ని డేవుడు స్వాతి భౌతిక దేహాన్ని స్వాహా చేశాడు.
భూమాత తనలో కలుపుకున్నది జ్యోతి భౌతిక కాయాన్ని.
అంతా సమాప్తమయ్యాక ఇళ్ళకు వెళ్ళారు. అందరికీ స్వాగతమివ్వటానికా అన్నట్లుగా, ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వచ్చిన గౌతమి ఒక్కర్తే ఆ ఇంట్లో ఉన్నది........
-:ఐపోయింది:-
