Previous Page Next Page 
ఎండమావులు పేజి 43


    అమ్మను చూడాలనీ, ఆమె అమృతవాక్కులు వినాలనీ, ఆమె చేతి భోజనం ఆప్యాయంగా కడుపారా తినాలనీ, నాన్నగారితో బాటుగా వారి పక్కన కూర్చుని భోజనం చెయ్యాలనీ, పెద్ద కొడుకుగా ఆ ఇంటి గౌరవ మర్యాదలూ, పెద్దరికమూ తాను వహించాలనీ అతని మనస్సులో అప్పుడప్పుడూ బాధగా కలకవేస్తున్నా, ఆ ఆవేదనాపూరితమైన కోరికల నన్నింటినీ ఈ జన్మలో సాధ్యపడనివిగా తేల్చుకుని ఏకాంతంగా ఉన్నప్పడు దిగులుపడినా నిర్మలమైన స్వాతి ముఖం చూసేసరికి అన్ని దిగుళ్ళూ మర్చిపోయేవాడు. అన్ని అనుభూతులు గాలికి ఎగిరినట్లుగా ఎగిరిపోయేవి. నిండైన ఆ మూర్తిలో నశ్వముఖంలో, విస్పారిత నేత్రాల మిలమిల కాంతులలో, నిష్కల్మషమైన ఆమె హృదయంలో, అవ్యాజానురాగాల్ని చిందించే ఆమె ప్రేమానురాగాలలో తల మున్కలుగా ముణిగి వ్యధల్నీ, అన్ని బాధల్నీ, అన్ని అవమానాల్నీ మరచి పోయి జీవించేవాడు తను. సంసార జీవితంలో అలాంటి మధురానుభూతుల్ని చవిచూసిన తరువాత ఈనాడు ఇలాంటి దిగుళ్ళతో, కోరికలతో స్వాతి చెడి మంచమెక్కిందంటే నమ్మలేకపోయాడు కృష్ణమూర్తి.
    ఎంత ఆలోచించినా అతని మనస్సుకేమీ తట్ట లేదు. జయలక్ష్మివైపు చూశాడు కృష్ణమూర్తి.
    "జయా, మీ వదినె కోరికలు విన్నావు కదూ, అమ్మా, నాన్నా, శ్రీలక్ష్మీ ఈ కోరికల్ని మన్నించుతా రంటావా" అన్నాడు సిగ్గుతో. అవమానంతో అతని గొంతు పెగిలిరాలేదు. కన్నీరే అతని భావాలకు లయ విన్యాసం చేసింది.
    జయలక్ష్మి సంభ్రమాశ్చర్యాలలో ముణిగిపోయింది,
    "అన్నయ్యా! వదినెయొక్క యీ కోరికే ఎంతో సముచితమైనది. ఏదో ఒక సంఘటనతో ఆమె నిర్మల అంతఃకరణ ఏదో అజ్ఞాత భీతితో కంపించి ఈ కోరికను మనస్సులో కలిగేటట్లుగా చేసింది. ఇందుకు నేను నడుం కడతాను. ఈ కర్తవ్యతా నిర్వహణలో ఎంతవరకు కృతకృత్యురాలి నవుతానో నా అనుమానం నాకు లేకపోలేదు. రేపే అందర్నీ సంప్రదించి ఆ చల్లని కబురు నేనే వచ్చి చెబుతాను" అన్నది జయలక్ష్మి నిశ్చలమైన మనస్సుతో. స్వాతి హృదయం తేలికపడ్డది. కృష్ణమూర్తి నవ్వుతూ స్వాతివైపు చూశాడు.
    
                                     31

    ఆ రోజునుంచీ జ్యోతికి జ్వరం తగ్గలేదు. రాత్రి పగలూ టెంపరేచరు ఉంటూనే ఉన్నది. ఏ రోజూ నూటమూడు, నూటనాలుగు డిగ్రీలకు తగ్గటం లేదు. డాక్టరు మూడు వేళలా వచ్చి పరిస్థితి చూసి పోతూనే ఉన్నాడు. చివరికి టైఫాయిడ్ కింద తేల్చాడు. అంత జ్వరంలోనూ తెలివిగా మాట్లాట్టమే ఒక సుగుణంగా ఉంది.
    "స్వాతి వదినె గాని, జయలక్ష్మి గాని మనింటికి రావటం లేదమ్మా" అన్నది జ్యోతి తల్లితో. అయిష్టత చేత వినిపించనట్లుగా చూసి ఔన్సు  గ్లాసులో మందు పోసి మెల్లిగా గొంతులో పోసింది తల్లి.
    "కాసేపు విశ్రాంతి గా పడుకోమ్మా." అన్నది. జ్యోతి మనస్సులో ఆ ప్రశ్నకు సమాధానం ఈ సారీ రానందువల్ల ఆరాటం ఎక్కువైంది.
    "అమ్మా"
    "ఏం జ్యోతీ, ఏంకావాలమ్మా"
    "ఏమీ అక్కర్లేదమ్మా, నేనేమీ అనుకోను. స్వాతి వదినెను రావద్దన్నారమ్మా" కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    "లేదు తల్లీ, వాళ్ళేరావడంలేదు. జయలక్ష్మికి వచ్చే అవుసరమే లేదు. ఏ ముఖం పెట్టుకుని వస్తుంది? ఆవిడకు సంధానకర్త గనక స్వాతీ రాదు మనింటికి. ఇద్దర్నీ నువ్వు నమ్మావు. ఇద్దరూ కలిసి నిన్ను పిచ్చిదాన్నిగా చేసి మురహరిని తమవైపుకు తిప్పుకున్నారు." అన్నదావిడ మనస్సులోని క్రోధాన్ని బైటపెడుతూ.
    పేలవంగా తడారిపోయిన నాలుకతో నిరాశగా చూస్తూ నవ్వింది జ్యోతి.
    "అమ్మా, ఎవరమ్మా నీకీ కబుర్లు చెప్పింది? స్వాతి వదినె ప్రమేయం ఇందులో ఏమీ లేదు. బావ, జయలక్ష్మి ఒకే కాలేజీలో మూడేళ్ళనుంచి చదువుకుంటున్న వాళ్ళు. వాళ్ళు ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న సంగతి మనకెంతో స్వాతి వదినెకు కూడా అంతే తెల్సు. అంతేగాని మురహరి బావను ఆవిడ మభ్యపెట్టించుకోవడం నమ్మవలసిన విషయం కాదమ్మా" అన్నది జ్యోతి ఆయాసపడుతూ మెల్లిగా.
    "ఎవరివల్ల తప్పుంటే మనకేంతల్లీ. అతన్ని మనవాడు కాకుండా చేశాడు. అందుకు కొంత వరకూ నేనూ బాధ్యురాలినే. ఆ ఉసురే నిన్ను ఈ స్థితికి తెచ్చింది తల్లీ" అన్నదావిడ కళ్ళొత్తుకుంటూ.
    "అమ్మా, నాకు జ్వరంగా ఉన్నట్లు బావకు తెలుసామ్మా? జ్యోతికి ఎట్లా ఉన్నదని ఎప్పుడయినా ఈ అయిదారు రోజుల్లోను అడిగాడా బావ?"
    మనస్సును తేలిక పర్చుకుందామని అడిగింది జ్యోతి. ఆమె మనస్సులో మురహరి మూర్తి ఏ మాత్రం చెరిగి పోలేదు. అంత జ్వరంలోను బావను తల్చుకుంటే లేని ఓపిక వచ్చినట్లుగా ఉండేది జ్యోతికి. కాని జయలక్ష్మి మనస్సులో మెదలగానే ఆ ఓపికంతా చచ్చిపోయినట్లనిపించేది.
    "రోజూ మీ నాన్నగార్ని అడుగుతూనే ఉన్నాడు. అది మనస్ఫూర్తిగా అడుగుతున్నాడో, అడక్కపోతే బావుండదని అడుగుతున్నాడో, అతని మనస్తత్వం ఎవరికి తెలుస్తుంది."
    జ్యోతి ఆలోచనలో పడ్డది.
    "బావకు మనం చేసిన అన్యాయం ఏముందమ్మా. నేనంటే అంత అయిష్టతగా ఉంటానికి. నన్ను పెళ్ళి చేసుకోనన్నాడుగాని నన్ను ద్వేషిస్తున్నట్లుగా ఎప్పుడూ అనలేదే" అన్నది.
    మురహరి మీద జ్యోతికి ఎంత నమ్మిక ఉన్నదో తల్లికి ఇప్పుడు అర్ధమైంది. ఈ పిచ్చితల్లి బావను ఇంతగా తన మనస్సులో నిలుపుకుని ఆరాధిస్తున్నదనే పరిజ్ఞానం ఆ కన్నతల్లికేలేదు. తన మూర్కపు పట్టుదలతో, ధనాధికారహోదాతో ఇలాంటి వాతావరణాన్ని కల్పించటంతో తనకా ఇంట్లో స్థానం, గౌరవం లేదని గ్రహించి మురహరి ఈవిధంగా ప్రవర్తిస్తున్నాడా అనే ఆవేదనా పూరితమైన హృదయంతో ఇప్పుడామె బాధ పడుతున్నది.
    "జ్యోతీ నీ విషయంలో నేను చాలా అన్యాయమే చేశానమ్మా. ఆ అన్యాయమే నిన్ను ఈ స్థితికి తెచ్చిందేమో."
    హృదయావేదన ఆమెలో సుళ్ళు తిరిగింది. "ఇందులో నీ తప్పేమీలేదమ్మా. బావకు నేను నచ్చలేదు. తన చదువుకూ, తన మనస్థత్వానికీ తగిన భార్య జయలక్ష్మి అని తెలుకుని ఆమెనే ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. అందులో నీ తప్పే ముందమ్మా" అన్నది జ్యోతి.
    మనస్సులోని వ్యధను దూరం చేసుకుని పైకి ఈ మాటలు అన్నా లోలోన కుమిలిపోతూనే ఉన్నది జ్యోతి.
    "నాన్నగారు బావతో మళ్ళీ ఏమీ మాట్లాడలేదేం అమ్మా."
    ఆశయానికి కొనవూపిరినిచ్చి ఈ ప్రశ్న వేసింది జ్యోతి.
    "ఆయన మనస్సు విరిగిపోయింది తల్లీ. నీ కూతుర్ని చేసుకోనని ముఖంమీదనే చెపితే ఇంక ఏ ముఖం పెట్టుకుని ఆయన అడుగుతారు. పోనీ అత్తయ్య అయినా బ్రతికుంటే కన్నకొడుకు మనస్సు మార్చ గలిగేదేమో ఆవిడ కూడా పోవటంతో తెగిన గాలిపటంలా అయ్యాడు మురహరి. ఈ గాలిపటానికి మళ్ళీ దారం కట్టి ఎగుర వేస్తున్నది జయలక్ష్మి."
    అవును అత్తయ్య కనక బ్రతికుంటే తాను ఆ ఇంటికోడలు తప్పక అయ్యేది. కాని అత్తయ్య పోవటం కూడా తన దురదృష్టమే అనుకుంది జ్యోతి.
    "అత్తయ్యా లోపలికి రావచ్చునా, జ్యోతికి ఎట్లా ఉంది" అన్నాడు మురహరి గుమ్మం అవతల ఉండి.
    తల్లీ, కూతుళ్ళు చకితులయ్యారు. మురహరి ఈ రీతిగా అంటాడని వాళ్ళు ఎన్నడూ అనుకోలేదు.
    "రావచ్చు నాయనా లోపలికి రా" అన్న దావిడ. మంచంపక్కనున్న కుర్చీ లాక్కుని కూర్చుని "ఎట్లాఉన్నది జ్యోతీ. రోజు మొత్తంమీద ఒకసారయినా టెంపరిచరు నార్మలుకు వచ్చిందా. డాక్టరు గారు ఏమన్నారు" అన్నాడు.
    "టైఫాయిడ్ గానే తేల్చారు. రోజల్లా ఎప్పుడూ నూటమూడు డిగ్రీలకు తగ్గటమేలేదు. మాట్లాడుతూ ఉండు నాయనా వంటావిడకు వంట ఏర్పాట్లు చెప్పివస్తాను" అని వెళ్ళింది.
    మురహరి ముఖంలోకి కళ్ళార్పకుండా చూస్తూ పడుకుంది జ్యోతి. పెదవులపై మందహాసాన్ని తెచ్చుకున్నా కన్నుల్లో అశ్రుకణాలు నిలిచే ఉన్నయ్యి. ఆమె ముఖం వింతగా ప్రకాశించింది. మనస్సు సంతృప్తితో నిండిపోయింది. మనోభావాలలో అణగారిన చైతన్యం తొంగిచూసింది. తనంతట తానుగా మాట్లాడని బావ ఈనాడు తన మంచం దగ్గరికి వచ్చాడనే తృప్తి ఆమె నర నరాల్లోనూ ఉత్తేజాన్ని కలుగజేసింది.
    "బావా, కులాసాగా ఉన్నావా, ఇంట్లో ఉండి కూడా దర్శన మివ్వటానికి నీకు మనస్కరించదా, నేనేం తప్పు చేశాను బావా"
    పెల్లుబికివచ్చే ప్రేమాను రాగాన్ని వ్యక్తపర్చలేక, అంతకన్నా అడగలేకపోయింది.
    "దర్శనమివ్వటానికి నేనేం భగవంతుడినా జ్యోతీ. రోజూ మీ ఇంట్లో తిని, మీ ఇంట్లో ఉండే వాడిని కనిపించకపొవట మేమిటి. నీ మనస్సులోని ఆవేదన అట్లా అనిపిస్తుందేమోగాని నీమీద నాకు కోపం ఎన్నడూ లేదు జ్యోతీ, ఎన్నడూ లేదు" ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు.
    తదేకంగా అతనివైపు చూసింది జ్యోతి. జ్వర తీవ్రతతో, మానసిక ఆందోళనతో, ఆవేదనతో వాడిపోయిన ఆమె ముఖం విప్పారింది. సర్వమూ మరిచి ఎవరికోసం పరితపిస్తూ మంచాన అంటుకు పోయిందో ఆ మేనబావ తన మంచం దగ్గర కూర్చుని తనతో మాట్లాడుతుంటే ఆమె సర్వమూ మరిచి అట్లాగే అతనిమీద దృష్టి నిల్పి చూస్తున్నది. బావ చేతుల్లో ఉన్న ఆమె చేతులు సిగ్గుతో వణకసాగాయి. కాని తన చేతులను తీసుకోలేకపోయింది.
    "నన్ను క్షమించు బావా. నీ సహచర్యాన్ని కోరింది జయలక్ష్మి. నువ్వామెకు మాట ఇచ్చావు. మీది నిజంగా ఆదర్శ దాంపత్యమే అవుతుంది. నీ మనస్సును తెల్సుకోకుండా ఎక్కడో ఉన్న నిన్ను నా మనస్సులో నిలుపుకోవటం హర్షించతగిన విషయం కాదుకదూ బావా."
    ఈ మాటలు అన్విరచనీయమైన ఆనందంతో జ్యోతి అన్నా, ఎత్తి పొడుపుమాటగా తీసుకున్నాడు మురహరి.
    "జ్యోతీ, నువ్వు ఎన్నన్నా ఈ సమయంలో పడకతప్పదు. మీరంతా నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను ఈ రోజుకూ ప్రేమిస్తున్నాను. కాని నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలనే ఉద్దేశ్యం నాకెన్నడూ లేదు. అత్తయ్య దయవల్ల నాకీ ఇంట్లో అలాంటి వాతావరణమే ఎప్పుడూ ఆవిడ కల్పించలేదు. నీకు తెలియదు. మూడేళ్ళనాడు ఒకసారి సినిమాకు వెళ్ళి రాత్రి పది దాటాకవస్తే ఇదేం హోటలా లేక ధర్మసత్రమా ఎవరిష్ట ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి కంచెడన్నమూ తినేందుకు అన్నది అత్తయ్య. ఇలాంటి వాతావరణం లో ఉన్న నేను నిన్ను వివాహం చేసుకుంటానని ఎట్లా అనుకోగలనో ఆలోచించు జ్యోతీ? ఆ మనస్సులో ఏ భావాలులేని అలాటి తరుణంలో జయలక్ష్మి తో నాకు పరిచయమైంది. ఇంకొక్క సంగతి. నేను సంఘ సంస్కర్తని కాదు. సంస్కరణాభిలాష నాలో ఏమాత్రం లేదు. కాని వితంతువైన జయలక్ష్మిని నేను పెళ్ళాడ దల్చుకున్నా నంటే నాలోని భావాలూ, నిశ్చయాలూ ఎటువంటివో నువ్వు అర్ధం చేసుకున్నావనే అనుకుంటాను జ్యోతీ" అన్నాడు రుద్ధపోయిన కంఠంతో. అప్రయత్నంగా రెండు కన్నీటి బొట్లు జ్యోతి చేతుల మీద పడినయ్యి.
    ఒక్కవేడి నిట్టూర్పు విడిచింది జ్యోతి. "పోనీలే బావా ఎవరికీ ఎవరు ప్రాప్తమో ఎవరు చెప్పగలరు" అన్నది.
    మురహరి మాట్లాడలేదు.    
    "బావా, ఒక సహాయం చేసి పెడతావా?"
    "తప్పక చేస్తాను. ఏమిటి జ్యోతీ అది"
    "స్వాతి వదిని మనింటికి రావటంలేదు. జయ లక్ష్మి కూడా రావటం మానేసింది. ఒకసారి వాళ్ళిద్దర్నీ చూసి ఇక్కడికి తీసుకువస్తావా"
    "అట్లాగే జ్యోతీ, రేపే వెళతాను"
    "ఆ కారణంగా వారు మనింటికి రావటం ఎప్పుడూ మానెయ్యరు. వారి మనస్సు నాకు తెలుసు. అమ్మ ద్వారా వారేదో పరాభవం పొంది ఉంటారేమోనని నా అనుమానం, అదే నిజమైతే ఎంత జ్వరంలో ఉన్నా నేను వెళ్ళి వాళ్ళను బ్రతిమాలుతాను; వేడుకుంటాను. అకస్మాత్తుగా రాక పోకలు ఆగిపోయాయంటే అంతకన్నా వేరు కారణం నాకు తెలిసినంతవరకూ ఏమీలేదు. తప్పక వెళ్ళొస్తావుగా" అన్నది.
    
                                  *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS