Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 43

 

    నాయనమ్మ మీద నాకు జాలి వేసింది. మళ్ళీ ఆమె చెప్పుకు పోసాగింది.
    "ఒకరోజు అయన వడ్లు పోయటానికి కొత్తగా గాదె కొనుక్కోచ్చారు. ఇద్దరు కూలోళ్ళను పిలిపించి, మట్టీ పెడా బాగా తొక్కించారు. తను పొలం వెళుతూ వాళ్ళను ఆ గాదె అలికి డబ్బులు తీసుకొని వెళ్ళమన్నారు. మా అత్తగారి చేతికి అర్ధరూపాయి ఇచ్చి వాళ్ళపని అయాక వాళ్ళకు ఇచ్చి పంపేయమని చెప్పి వెళ్ళారు. అయన అలా వెళ్ళగానే వాళ్ళిద్దరకూ చెరొక అణా యిచ్చి పంపి వేసింది. నన్ను పిల్చి "ఒసే పిల్లా! ఆ గాదె అలికేసేయ్! మట్టి చూడు ఎంచక్కా మెత్తగా తొక్కి వెళ్ళారో! కూస్త సేపట్లో అయిపోద్ది" అని పురమాయించింది. నేను గాదె అలకటం మొదలు పట్టాను. కొత్తమేదర వెదురు బద్దలు చేతుల్ని చీలుస్తున్నాయి. అరిచేతుల మంట నసాళనికి అంటుతున్నది. కిక్కురు మనకుండా ఉబుకుతున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అలికాను."
    "మరి ఆ విషయం తాతయ్యకు తెలియలేదూ?"
    "ఎలా తెలుస్తుంది! ఎవరు చెబుతారు? కూలోళ్ళను మా అత్తగారు బెదిరించి మరీ పంపించారు. తెల్లవారి వాళ్ళను వచ్చి మజ్జిగ పోయించు కేళ్ళమని కూడా చెప్పింది. మా పుట్టింట్లో ఇటువంటి పనులు చేసి ఎరగను. పైగా చిన్న ముండును: నేనెంత నా ఆయెంత! దొడ్లో ఉన్న బీర పాదులకూ పొట్ల పాదులకూ పందిళ్ళు వేయించేది. మళ్ళీ అక్కడ సరిగా లేదని అంతా వూడదీయించి మరికొంచెం అపక్కకూ ఈ పక్కకూ జరిపి వేయించేది. ప్రతి మధ్యాహ్నం ఇలాంటి పనేదో నాకోసం వెతుకుతూనే వుండేది. పాదాల పారాణి పూర్తిగా ఆరకముందే అయన పోయారు. ఆ తరువాత నాలుగు నెలలకు మీ నాన్న పుట్టాడు. వాడంటే మా అత్తకు ఎంత ప్రేమనుకున్నావ్! నన్ను మాత్రం అట్టాగే చూసేది. "పాతికేళ్ళ ఆయన్ను నా నుంచి తీసుకెళ్ళి అరవై ఏళ్ళ ముసల్దాన్ని నాకు వదిలేశావా భగవంతుడా!" అనుకుంటూ కంటికి కడివేడుగా ఏడ్చేదాన్ని. మీ తాతయ్య పోయాక వేరే కూరలూ నారలూ వందాల్సిన పనికూడా లేకుండా పోయింది. వంట పని నాకు  అప్పగించింది. ఒకరోజు అన్నం పెడతానంటే తొందరేం అంది. అలా అంది కదా అని రెండో నాడు కొంచెం ఆలస్యం చేశాను. కోడి ఆమె దగ్గర కొచ్చింది తను అన్నం తినేప్పుడు కోడికి కొంచెం వేసే అలవాటుంది. "వచ్చావ్! నీ యింట పీనుగెల్లా! నాకొకటేడ్చిందినీకు వెయ్యటానికీ?" అంది. అప్పటికే ఆమెకు చాలావరకు  ఓపిక తగ్గిపోయింది. నేను కిక్కురుమనకుండా అన్నం గిన్నె తెచ్చి ముందుపెట్టాను. ఒసే అమ్మాయ్! అన్నిటి కంటే నన్ను బాధ పెట్టిన సంగతి చెప్పనా?" అంది నాయనమ్మ.
    చెప్పమన్నాను కుతూహలంగా .
    "తలంటి పొసుకోవాలంటే కూడా భయమే. నూనె కూడా తనే వేసేది అరిచేతులో. కుంకుడుకాయలు రెండు నానవేసి ఒక్కొక్క చుక్కే తల రుద్దుకుంటుంటే పోసేది. యెంత  రుద్దుకొన్నా తల మురికి గానీ, సమురు గానీ పోయేది కాదు. ఏడుపోచ్చేది. ఇక చాల్లే అనేది పూర్తీ నూనె వదలకుండానే . నీళ్ళు కూడా తోలిపి చెంబుతో అందించేది . పోనియ్ నీళ్ళయినా పోసుకోనిచ్చేదా! "ఒసే పిల్లా అట్టా వచ్చి ఆ పోట్లపాదు దగ్గరకు రా!" అనేది. మరో రెండు చెంబులు పోసుకోగానే "ఇక ఇక్కడ చాల్లే. ఆ వంగమొక్కలు ఎండిపోతున్నాయి అక్కడకు పద!" అనేది. నాకు దుఃఖం పొర్లు కొచ్చేది. సిగ్గుతో భూదేవి గుండెల్లో ముఖం దాచుకోవాలనిపించేది."
    నాకు నవ్వాగింది కాదు. పొట్ట చేత్తో పట్టుకొని నవ్వసాగాను.
    "ఇప్పుడు నీకు నవ్వుగానే వుంటదే! పిల్లకాకి కేం తెలుసు ఉండేలు దెబ్బ! పాతధోవతితోనో, చీరతోనో ఒళ్ళు తుడుచుకుంటే అనేది "మా కాలంలో మేం ఎరగమమ్మా ఈ ఒళ్ళు తుడుచుకోవటాలేంటో?" అనేది చోద్యంగా చూస్తూ . మధ్యాహ్నం మరీ తోచనప్పుడు పక్కింటి బంగారమ్మ కూతుర్తో గవ్వ లాడుకొనే దాన్ని. "ఏం గవ్వలే పిల్లా! కూటికా గుడ్డకా! డబ్బుకా దమ్మిడికా" అంటూ ఇట్టా ఇట్టా చేత్తో చిమ్మేసేది" అంటూ నాయనమ్మ వాళ్ళత్త గవ్వలేట్లా చిమ్మేసేదో యాక్షన్ చేసి చెబుతుంటే మళ్ళీ నవ్వొచ్చింది.
    "మరి మీ అత్త మంచిదన్నావ్?"
    "మంచిదేనే! నా బిడ్డకు ఏం తక్కువవుతుందోనని అల్లాడి పోయేది. తమ్ముడు తిండి లేక నానా అవస్థ పడుతున్నా ఒక్క ఎర్రనే గానీ సహాయం చేసేది కాదు. మంచం పట్టింది. అప్పుడు కూడా నేనే ఆమె మాటకు ఎదురు చెప్పలేదు. ఒకసారి దగ్గరకు పిల్చి "ఒసే పిల్లా! ఒకేళ ఈపాడు పాణం మంగళారం నాడు పొద్దో ఏమో! నీకు అసలేం తెలవదు. ఇంతలావు దాన్ని వేశావ్. పావలా ఎట్టి చిన్న పిల్లను తెచ్చేయ్ "అంది . నేను "చాల్లే వూరుకుందూ!" అన్నాను.
    ఆ పిల్లేమిటో అర్ధంకాక నేను తెల్లముఖం వేసి నాయనమ్మ బోసి నోటివైపు చూశాను.
    "అంటే అర్ధం కాలా! మంగళవారం చచ్చిపోతే కోడిపెట్టను వేస్తారు. చిన్నాపిల్లను వేస్తె చాలని చెప్పింది. "ఒసేపిల్లా! నువ్వసలే తెలివి తక్కువ దానివి. దినానికి గంగాళాలు వండి వార్చేవు సుమా! ఓ కుంచెడు వండు చాలు" అనేది.
    ఆ మాటలు విని నాకు ఆశ్చర్యం వేసింది. అవును ఆమె మంచిదే. ఆమె స్వార్ధంతో అలా ప్రవర్తించలేదు. ఆ పల్లె వాతావరణంలో అజ్ఞానంలో పుట్టి పెరిగిన ఆమెకు అంతకంటే మంచిగా ఎలా ప్రవర్తించాలో బతకాలో తెలియదు.
    "ఏమాట కామాటే. మీ అమ్మకూడా ఈనాటికీ నా మాటకు ఎదురు చెప్పదేవ్. కాని దాని కోడలు దాన్ని నోరు తెరవనివ్వదు. కలికాలం ప్రవేశించింది. కోడళ్ళు అత్తలకు ఎదురుతిరుగుతున్నారు." ఆ చివరి మాటలు నాయనమ్మ తనకు తనే చెప్పుకుంటున్నట్లుంది.
    "అవును నాయనమ్మ! ఒకోతరం మారుతుంది. విజ్ఞానం పెరుగుతుంది. నీ తరంలో ఆడవాళ్ళు మగవాళ్ళతో సమంగా తిండి కూడా తినకూడదు. అమ్మతరం వచ్చేప్పటికి కొంత మారింది. అమ్మతరంలో ఆడది అత్తమామల, భర్త అదుపాజ్ఞలలో అణిగి మణిగి పడి వుంటే చాలు. కాని మాతరంలో చాలా మార్పు వచ్చింది. యుగయుగాలుగా అణచబడిన స్త్రీ ఎదురు తిరుగుతుంది. అందుకే అత్త మామాలంటే పెద్ద గౌరవం లేదు. కాని మా పిల్లలతరం వచ్చేప్పటికి ఇంకా మార్పులొస్తాయి. ఈనాడు చదువుకుంటున్న పిల్లలు రేపు కోడళ్ళూ , ఎల్లుండి అత్తలూ అవుతారు. వాళ్ళు అత్తలయ్యేప్పటికి అత్తాకోడలు ఒకరి వ్యక్తిగత విషయాల్లో మరొకరు పట్టించుకోకుండా , ఒకర్నోకరు అర్ధం చేసుకొని బ్రతకటానికి ప్రయత్నించవచ్చును."
    చిత్రంగా చూస్తుండిపోయింది నాయనమ్మ.
    "మా అమ్మ చదువు గురించి ఎవరూ ఆలోచించలేదు. నా చదువు గురించి నేను ఆలోచించాను. కాని మీరంతా అ నా అలోచాన్నే తప్పుగా భావించారు. ఇప్పుడు పిల్లల చదువు గురించి, పెద్దలు కూడా అలోచిస్తూన్నారు. ఈఊరి ఆడవాళ్ళు నా చిన్నప్పుడు జుట్లు జుట్లు పట్టుకోనేవారు. ఒకరిమీద ఒకరు చెప్పుకొనేవారు. వాళ్ళకు వేరే వ్యాపకం వుండేది కాదు. కాని ఇప్పటివాళ్ళు , అంటే నా ఈడువాళ్ళు, ఈ పల్లెటూర్లో కూడా వారపత్రికలూ, మాసపత్రికలూ తెగ చదువుతున్నారు. అందులో వచ్చే కధల్ని గురించి మాట్లాడుకుంటున్నారు. తీరిక సమయాల్లో మహిళాసంఘాలంటూ లైబ్రరీ అంటూ నలుగురు ఒకచోట చేరుతున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా వుంది. కాకపోతే ఒకటే బాధిస్తుంది నన్ను. ఆనాడే నన్ను మీరంతా చదివించి వుంటే ఇప్పుడు ఓ పెద్ద డాక్టర్నయి ఇలాంటి పల్లెటూర్లకు సేవ చేసి వుండేదాన్ని అని."
    అమ్మ అన్నానికి పిలవడంతో మా సంభాషణ ఆగిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS