Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 43


    ఈ అర్ధమానవుడికి నేనంటే ఎందుకో అంతకోపం అన్నాడు ఫిజో ఆశ్చర్యపడిపోయి, కెప్టెన్ మాలతి ఆ ప్రశ్న విని తనలో తాను నవ్వుకుంది.
    "ఆ ప్రశ్న అడగవలసింది నన్ను కాదు, అతన్నే!" అంది ఫిజో అర్ధమానవుని వంక చూచాడు వారిద్దరూ మాట్లాడుకుంటున్న దేమిటో అతనికి అర్ధమైనట్లు లేదు.
    కాని తనను గురించే మాట్లాడుకుంటున్నారని మాత్రం గ్రహించాడు. జీవితంలో ప్రప్రధమంగా బిడియపడినట్లు కన్పించాడు. తాను వారి మాటల్ని పూర్తిగా అవగాహన పరుచుకోలేక పోయినందుకు బాధపడినట్లుగా కూడా కన్పించాడు.
    కెప్టెన్ మాలతి చేస్తున్నపని వదిలిపెట్టి అర్ధమానవుని మొరటు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఫిజో చేతితో అతనిచేతుల్ని కలిపింది.
    "మై ఫ్రెండ్" అవమని అర్ధమానవున్ని ఆదేశించింది. ఫిజో చేతిలోచేయి కలిపాడు అర్ధమానవుడు.
    వచ్చీరాని మాటలతో "మా.......యిఫే......ర్......oడ్" అన్నాడు. అతనికి నాలుక తిరగలేదు. పులితో పోరాడిన భుజబలశాలి ఆమూడు అక్షరాలను పలికినంత మాత్రానికే అలసిపోయినట్లు కన్పించాడు.
    మాలతి ఫిజోలు హాయిగా నవ్వుకున్నారు. అతడి మనసులో అర్ధంకాని అయోమయంతప్ప ఫిజో పట్ల ఎలాంటి కుటిల భావం లేదని అర్ధమైంది. ప్రకృతి పుత్రుడయిన అర్ధమానవుడు వారి నవ్వుతోపాటు శృతి కలిపాడు.
    అర్ధమానవునినవ్వు నిర్మలమైన గంగాజలం లాంటిది మనిషి చేసే దురాలోచనల తాలూకు మాలిన్యాలు రవంత అయినా అంటనివి.
    అతడు ఎందుకో తనమీద కోపగించుకుని ఉన్నాడనీ, ఎప్పుడైనా దొంగదెబ్బ తీయవచ్చనీ భావించే వాడు ఫిజో. అందుకు తగిన జాగ్రత్తలన్నీ తీసుకునేవాడు.
    కాని ఈ పర్యాయం అతడు తనతో చేయకలిపి వారి నవ్వుతో శృతి కలిపిన తరువాత అతని మీద ఫిజోకున్న అనుమానాలన్నీ నివృత్తి అయినాయి.
    తాను కూడా అతనితో మైత్రి సంపాదించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. తమ ఇరువురి మధ్య అకారణంగా ఏర్పడిన అగాధాన్ని తొలగించుకుందుకు సమకట్టాడు. అర్ధమానవునికి కూడా ఫిజో విశ్వాసపాత్రుడు అయ్యాడు.
    ఆ మధ్యాహ్నం వారు ప్రయాణం ప్ర్రారంభించారు. అప్పటికే మైదానాల మీదికి జనపదాలకు దగ్గరగావచ్చేశారు కావటంనించి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేశాయి. ప్రయాణం త్వరగా సాగింది.
    ఢిల్లీలో రెండు రోజులు ఆగారు ఆ రెండు రోజులు ఫిజో అర్ధమానవుడు కలిసి ఒక హోటల్ గదిలో ఉండిపోయి నారు. తాను చూస్తున్న అద్భుతాలు అర్ధమానవునికి విచిత్రమైన అనుభవాలను కల్గిస్తున్నాయి.
    కెప్టెన్ మాలతి ఢిల్లీలో చూచుకో వలసిన పనులు ముగించాక వారి తిరుగు ప్రయాణం ప్ర్రారంభమైంది.
    
                     ౦    ౦    ౦    
    
    హైదరాబాద్ లో జనసమ్మర్ధమైన వీధుల వెంటకారు పరుగులు తీస్తోంది. ఆ వెనుక మరో రెండు కార్లున్నాయి. ముందు కారులో ఫిజో, అర్ధమానవుడు వెనుక కూర్చున్నారు కెప్టెన్ మాలతి డ్రయివ్ చేస్తోంది. ఫిజో హైదరాబాదు రావటం అదే ప్రధమం. అయినా నగరాలు అతనికి కొత్త కాదు.
    అర్ధమానవునికి అదంతా చాలా విచిత్రమైన వాతావరణంలా అన్పిస్తోంది. కెప్టెన్ మాలతి ఫిజో లాంటి మనుషులు వందలు వేల సంఖ్యలో కన్పిస్తున్నారు.
    వారి వంక రెప్పవేయకుండా చూస్తున్నాడతడు.
    వెనుక ఆ కారుని అనుసరించి మరో రెండు కార్లు వస్తున్నాయి. వాటిలో కెప్టెన్ మాలతి మిత్ర బృందమంతా అనుసరించి వస్తున్నారు. స్నేహితురాలు అన్నమాటే గాని మాలతి వీరికి కేవలం చుట్టం చూపుగా మాత్రమేకన్పిస్తుంది. ఎప్పుడూ ఏవో ఎడతెగని కార్యక్రమాలలో నిమగ్నురాలై ఉంటుంది.
    ఈ పర్యాయం మంచుకొండల మీద శిఖరారోహణకైవెళ్ళే బృందానికి ఆమె నాయకత్వం నిర్వహిస్తోందని తెలిసి వారంతా చాలా సంతోషించారు.
    తెలుగు పతాకాన్ని హిమాలయాలపై ఎగురవేయగలదని వారు ఎంతగానో ఆశించారు. కాని ఈసారికి మాలతి ప్రయత్నాలు ఫలించలేదు.
    ఆమెను విడిచి తిరిగి వచ్చినవారు పత్రికల వారికి చెప్పిన వివరాలన్నీ అందరికీ తెలిసాయి. మాలతిని ఎవరో ఎత్తుకుపోయారు. అతడెలాంటివాడో మంచుకొండల మీద ఎలా ఉండగలుగుతున్నాడో మనుషుల్ని ఎందుకు అపహరించుకు పోయినాడో వివరాలు ఎవరికీ తెలియలేదు.
    కాని మాలతిని అపరించుకు పోయినాడని మాత్రం తెలిసింది. వారంతా ఆమె గురించి చాలా దిగులుపడిపోయి నారు. కాని తాము చేయగలిగింది లేదు.
    వారంతా బాగా సంపన్నులైనవారే.
    డబ్బు దండిగా సంపాదించి, పెద్ద పెద్ద కుటుంబాలలోకి కోడరికం వెళ్ళినవారే! అయినా హిమాలయాలలో దిక్కుమాలిన చోట దారి తప్పిన స్నేహితురాల్ని ఎలా రక్షించుకోవాలో వారికి అర్ధంకాలేదు. తమ డబ్బు, హోదా ఆమెను ఎలా రక్షించగలదో వారికి రవంత అయినా తెలియలేదు.
    అందునించి నిస్సహాయంగా ఉండిపోయినారు.
    అనూహ్యమైన సమయంలో మాలతి నించి ట్రంక్ టెలిఫోన్ రావటంతో మిత్ర బృందంలో అదొక గొప్ప సంచలనాత్మక వార్త అయింది. అందరూ ఒక చోట సమీకృతులైనారు.
    మాలతి వస్తానన్న సమయానికి రిసీవ్ చేసుకుందుకు రైల్వే స్టేషన్ కు వచ్చేశారు. ఆమెతోపాటుగా వచ్చిన రెండో వ్యక్తి ఫిజో అని వారు గుర్తించారు.
    మాలతి ఫిజోతో తనకు సంప్రాప్తమైన మైత్రి గురించి వ్రాసింది. కాని అర్ధమానవుడి గురించి ఏదేమీచెప్పలేదు. అందునించి ఆమెతో పాటుగా వచ్చిన నూతన వ్యక్తిని చూడగానే ముందు వారంతా జడుసుకున్నారు ఆ తరువాతఅతడు మనిషే అని అయితే అరుదైన విచిత్రమైన మానవుడని గ్రహించారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS