Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 43


    "జగ్గమాంబా! నువ్వు యీరోజు చాల గొప్పపని చేశావు. నాకు యెంతో మేలు చేశావు" అంటూ రంగారావుగారు లేచారు.
    రాజుగారికి ఒక విన్నపం చేసిన సేవకుడు అటునించి జవాబు వచ్చేవరకూ అలాగే నిలబడాలి. ఓడ్ర యువకుడు అలాగే నిలబడ్డాడు. పాపం వాడి నడ్డి విరిగేలా వుంది. యిందాకటినించీ వంగి అలాగేవున్నాడు. "యిక మీరు స్నానానికి వెళ్ళండి" అన్నది జగ్గమాంబ.
    గోపాలకృష్ణ రంగారావు నవ్వుతూ లేచి వెళ్ళిపోయారు. ఆ యువకుడు లేచి నడుం సవరదీసుకుని ఆయన వెనుక చేతులు కట్టుకుని నడిచాడు.
    జగ్గమాంబ తిరిగి వస్తూ వుంటే రంగారావు పోలికలే కలిగిన మరొక యువకుడు కన్పించాడు. రవ్వమీసం నూనె రాసినంత నిగ నిగ లాడుతోంది.
    "చిన్నబావా!" అంటూ దగ్గరకు పోయింది. వెంగళరాయుడుకు యీ మరదలు పిల్ల యెవరో అర్ధంకాక అయోమయంగా చూచాడు.
    "నేను చిన్నబావా! మల్లమ్మ చెల్లిని. మీ వొదిన మహారాణి మల్లమ్మ లేదూ! ఆ మల్లమ్మ చెల్లిని" అంటూ వివరం విప్పి చెప్పుకుంది జగ్గమ్మ.
    "ఓ నువ్వా! నిన్ను గురించి నేనూ విన్నాను" అన్నాడు నవ్వుతూ వెంగళరాయుడు.
    "ఏమని విన్నావు చిన్న బావా!"
    "అల్లరి పిల్లవటగా!"
    "అవన్నీ వుత్తిమాటలు బావా! నువ్వు నన్ను యిందాకటినించీ చూస్తున్నావు నేను యేమయినా అల్లరిచేశానా? నువ్వు చెప్పు" అంటూ దగ్గరగా వెళ్ళింది వెంటనే సమాధానం యివ్వకపోతే మరదలు మరింత మీదికి వస్తుందనీ, అలా రావటం యెవరైనా చూస్తే బావుండదనీ అనుకుని వెంటనే సమాధానం యిచ్చాడు పింగళరాయుడు, "అబ్బే! నువ్వు చాలమంచి అమ్మాయివి" అంటూ.
    "పెద్దబావకూడా యిలాగే అన్నాడు" అంటూ సంతోషించింది జగ్గమాంబ.
    "అన్నగారిని చుట్టివచ్చావా?" నోరు తెరిచి అడిగాడు వెంగళరాయుడు.
    "చుట్టి రాలేదు చిన్నిబావా! చూచి వచ్చాను."
    "మంచిపని చేశావు"
    "ఇంకొక మంచిపనికూడా చేశాను."
    "ఏమిటో అది?"
    "పెద్ద బావగారి పావురం లేదూ! పాపం పిచ్చిముండ. పెంటిపోయి కువ కువా యేడుస్తోంది. అందుకని అక్కదగ్గర వున్న పెంటి పావురాన్ని దానికి జోడీ చేశాను" అంటూ అభినయంచేసి చెప్పింది.
    "కశింకోట ప్రభువుకూ, బొబ్బిలి ప్రభువుకూ నీవే ముందుగా వియ్యం కలిపావన్నమాట" అంటూ నవ్వాడు వెంగళరాయుడు.
    పొద్దస్తమానమూ చిన్ని బావగారే తనని పొగడటం జగ్గమ్మకు యిష్టం లేకపోయింది. చిన్నిబావను తనుకూడా పొడగాలి అనుకుంది.
    "చిన్నిబావా! నువ్వు గొప్ప వీరుడివిటగా!" అని అడిగింది అందుకు సమాధానంగా వెంగళరాయుడు నవ్వాడు.
    "నీ చేతిలో కత్తివుంటే సింహాన్ని అయినా, మదించి యెదురు తిరిగిన యేనుగుని అయినా చీల్చివేస్తావుటగా!"
    "ఇవన్నీ నీకు యెవరు చెప్పారు?"
    "అలాగని చాలామంది చెప్పుకుంటూ వుంటే విన్నాను."
    "అవన్నీ నీకు నమ్మకం కలిగించాయా?"
    "నిన్ను చూస్తుంటే నమ్మాలనే అనిపిస్తోంది" అంటూ దగ్గరగా వెళ్ళి అతని ఒరలోంచి కత్తిని లాగి అటూ యిటూ చాలనంచేసి చూచింది జగ్గమాంబ.
    
                           11
    
    ఆమె చనువూ, మంచితనమూ, నిష్కపటితనమూ వెంగళరాయుడిని కదిలించినాయి తనకు వదినగారు కాబోతున్న మల్లమ్మ తనమీద చూపనున్న వాత్సల్యం తాలూకు నీడల్ని ఆమెలో చూచి వూహిస్తున్నాడు.
    ఆమె చలనం చేస్తున్న కత్తి సాయంకాలపు నీరెండలో రక్తవర్ణిం తళుకుల్ని కురిపిస్తోంది. ఆమె కత్తిని అటూ యిటూ త్రిప్పి చూచి అంతమాత్రానికే సంతోషపడి తిరిగి యిచ్చింది.
    "నీ కత్తి చూస్తేనే నీ వీరత్వం తెలుస్తోంది" అంది తిరిగి యిస్తూ.
    "కత్తిని చూస్తే వీరత్వం యెట్లా తెలుస్తుంది?" వెంగళరాయుడు ఆశ్చర్యంతో అడిగాడు.
    "అంతేలే, కొన్ని విషయాలు మనసుకే అర్ధం అవుతాయి. మాటల్లో చెప్పటానికి కుదరవు అట్లాంటి సంగతులు" అని బదులు యిచ్చింది జగ్గమాంబ.
    "అదెట్లా?"
    "మా అక్క గురించి నీ అభిప్రాయం ఏమిటి?"
    "ఆమె నన్ను పరిపాలించాల్సిన మహారాణి."
    "అంతేనా, యింకా చెప్పు."
    "నన్ను వాత్సల్యంతో చూచే వొదినగారు."
    "నిన్ను వాత్సల్యంతో చూస్తుందని యెందుకనుకుంటున్నావు."
    "నిన్ను చూస్తే అలా అనిపించింది."
    "ఎందుకన్పించింది?"
    "ఏమో అనిపించింది అంతే!"
    "అదే ఎందుకని?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS