Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 43


    ఇంతకాలం ఊళ్ళో పెద్దమనుషులు సానుభూతి తనమీద వుందనుకొంటూ వచ్చాడు. అంతా తన కొడుకునీ, కోడల్నీ దుయ్యబడుతున్నారనుకొన్నాడు. కాని ఈరోజు తన చెవుల్తోనే విన్నాడు. ఛీ! ఛీ! తన బతుకిలా అయిపోయిందేం? అటు అయినవాళ్ళకూ, ఇటు కానివాళ్ళకూ కూడా కాకుండాపోయాడు. అవును! వాళ్ళన్నదీ నిజమే! రేపు తను పోయాక వెంకటపతిని ఎవరు అదుపు చేస్తారు? వాడు పెళ్ళాం చెప్పినట్టు ఆడడా? మంచోచెడ్డో వాళ్ళపాటికి వాళ్ళను  వదిలేయటమే మేలు. తనకెందుకీ చిత్తక్షోభ. ఈ ఆస్తి వాడి కోసమేగదా తను సంపాదించాడు? వాడికికాక మరొహడికి తను ఇవ్వడు గదా? ఏ రామాలయానికో రాస్తే?
    లీలామాత్రంగా వచ్చిన ఈ ఆలోచనకు తనే ఉలిక్కిపడ్డాడు సాంబయ్య. తను రామాలయానికి ఆస్తి  రాసివ్వట మేమిటి? తనేం దిక్కులేనివాడా? బిడ్డా పాపా లేనివాడా? తనకొడుకు తనంతటి వాడయ్యాడు. ఇక తప్పుకోవడం మంచిది. తనకు కావాల్సిందేమిటి? ఇంత ప్రసాదం- అంతే!
    ఇంట్లోకొచ్చిన సాంబయ్య తలుపు తెరిచి వుండటం చూసి గతుక్కుమన్నాడు. పురోహితుడు శాస్త్రుళ్ళు గారేమో? ఆయనయితే వరండాలోనే కూర్చుంటాడే? మెల్లాలో ఏం చేస్తుంటాడూ?
    వరండా దాటి గబగబా మెల్లా ఇంట్లోకి వచ్చాడు సాంబయ్య. ఇల్లంతా చీకటిగా వుంది. లాంతరుకూడా వెలిగించాడు. అగ్గిపుల్ల వెలుగులో తన మంచంమీద ఎవరో అటు తిరిగి పడుకున్నట్లుగా కన్పించింది.
    "ఎవరదీ?" అన్నాడు సాంబయ్య ఆదుర్దాగా.
    వెంకటపతి లేచి తండ్రి ముందు తల వంచుకొని నిలబడ్డాడు. అగ్గిపుల్ల వెలుగులో కొడుకు ముఖం దీనంగా కన్పించింది.
    "చీకట్లో పడుకున్నావేంరా? దీపం అన్నా వెలిగించలేదు. రాముడి తల్లి రాలేదా?" సాంబయ్య హృదయంలో వాత్సల్యం పొంగులువారింది.
    ఆ నిముషంలో కొడుకుమీద వున్న కోపం అంతా మంచులా కరిగిపోయింది. అగ్గిపుల్ల వేడికి సాంబయ్యవేళ్ళు చుర్రుమన్నాయి. పుల్ల అవతలపడేసి, మరొకటి వెలిగించి లాంతరుకోసం వెతికాడు. లాంతరు వెలిగించి ముక్కాలుపీటమీదపెట్టి వరండాలోకి వచ్చి కూర్చున్నాడు. సాంబయ్య కొడుకు రాకలోని ఆంతర్యం ఏమిటా  అని ఆలోచనలో పడిపోయాడు.
    వెంకటపతి తను తెచ్చిన లడ్లూ, జిలేబీ, బూందీ పోట్లాలు విప్పి ఒక పళ్ళెంలో పోసి తండ్రి ముందు పెట్టాడు. సాంబయ్య తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. ఇది వీడి స్వంతఆలోచనకాదు. పెళ్ళాం చెప్పి వుంటుంది. ఏదో ఎత్తు వేసి పంపించింది.
    "నా కెందుకురా ఈ లడ్లూ బొడ్లూ?" అన్నాడు సాంబయ్య.
    "తిను, నీ కోసమే తెచ్చా!" నంగినంగిగా అన్నాడు వెంకటపతి.
    "తిన్నది చాల్లే, ఎందుకొచ్చావ్?"
    "ఊరికే వచ్చా పండగని!" వెంకటపతి గొంతు పూడిపోయింది.
    కొడుకు కంఠంలో ధ్వనించిన నిజాయితీ, ఆర్ద్రతా, ఆపేక్షా సాంబయ్య హృదయంలో చోటు చేసుకున్నాయి. వాడొట్టి అమాయకుడు. తనంటే వాడికి ప్రేమ లేకపోలేదు. జిలేబీ నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ అనుకున్నాడు సాంబయ్య.
    వాడంతట వాడే వచ్చి వుంటాడు. తను పండగపూట ఒంటరిగా వుంటాడని తెలిసి వచ్చాడు. వాడు పుట్టి బుద్ది ఎరిగింతర్వాత ప్రతి పండక్కూ తనతోనే వున్నాడు. వాడికి పదహారేళ్ళు వచ్చేదాకా ప్రతి పండక్కూ తలంటిపోసి కొత్తబట్టలు తొడిగేవాడు. అది వాడికి మాత్రం గుర్తుండదా ఏం? తను చేసిన తొందరపాటుకు వాడెంత బాధపడుతున్నాడో, వాడి ముఖం చూస్తేనే తెలుస్తుంది. ఏనాడూ వాడు దేన్నిగురించీ బాధపడలేదు. వాడి తప్పేముంది? పెళ్ళాం విషం పోసింది. వాడు మింగాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు. ఇక తెలుసుకున్నట్లే, వాడు బాగుపడతాడు. తన కొడుకు వెంకటపతి బాగుపడతాడు.
    పళ్ళెంలోని మిఠాయి పూర్తి అయేంతవరకు సాంబయ్య నోరుతోపాటు మెదడు కూడా పనిచేసింది.
    మరునాడు వెంకటపతి ప్రయాణమై వరండాలో చుట్ట కాల్చుకుంటూన్నా తండ్రిముందుకొచ్చి నిలబడ్డాడు. సాంబయ్య చుట్ట విసిరి ఆవల పారేసి, మొలతాడ్లో కట్టుకున్న తాళంచెవుల గుత్తి తీసి వెంకటపతి ముందు పారేసి "నీ ఇష్టం! ఏం చేసుకుంటావో చేసుకో! నా కెందుకొచ్చినట్టు ఈ బాదర బందీ?" అన్నాడు. వెంకటపతి బిత్తరపోయాడు.
    "డబ్బుకోసం రాలేదు. ఊరికే వచ్చాను." అన్నాడు.
    "డబ్బుకోసమే వచ్చావో ఊరికే వచ్చావో నా కెందుకురా చెప్తావ్? గొడ్డూ గోదా, భూమీ పుట్రా, ఇల్లూ వాకిలీ వదలిపెట్టి నువ్వు బస్తీలో కూర్చుంటే ఎవడ్రా ఇక్కడ చేస్తాడూ?" అని సాంబయ్య లోలోపల సంతోషపడ్డాడు.
    కొడుకు లొంగి వస్తున్నాడు ఇప్పుడు తను మెత్తపడకూడదు. అంతా వాడి నెత్తినే వేస్తేసరి. దోవకు రాక ఏం చేస్తాడు?
    "అది ప్రసవించాక అంతాకలసి ఒక్కసారే వస్తాం, ఇంకా నాలుగు నెల్లాగి."
    "అంతా కలిసి గంగలో దూకుతారో, ఇల్లూ వాకిలే చూసుకుంటారో - మీ ఇష్టం! నాలుగు నెల్లుకాదు-నాలుగేళ్ళ తర్వాత రండి, నాదేం పోయింది? ముక్కోటి ఏకాదశి వెళ్ళగానే నేను తూర్పుకు వెళ్ళి నాలుగు నెలలు వుండి వద్దామనుకుంటున్నా" అని, కొడుకు జవాబుకు ఎదురుచూడకుండా లేచి గొడ్లచావిట్లోకి వెళ్ళిపోయాడు సాంబయ్య.
    వెంకటపతి నెలమీద పడివున్న తాళంచెవులు తీసుకొన్నాడు. తండ్రి ధోరణి మారిపోయింది. మనిషి పూర్తిగా మారిపోయాడు. ఆ క్షణంలో వెంకటపతికి తన తలమీద తండ్రి పెద్ద బరువు పెట్టి వెళ్ళినట్టు అనిపించింది. ఎన్నో ఏళ్ళుగా తండ్రి అవలీలగా మోసిన తాళంచెవులు, తండ్రి శరీరంలో ఒక భాగంగా వున్న తాళంచెవులు, వెంకటపతి చేతుల్లో చాలా బరువుగా వున్నట్లు తోచాయి.
    వెంకటపతి ప్రయాణం మానుకొని ఇంటిదగ్గరే వుండిపోయాడు. పొలాన ఏమీలేకపోయినా, ప్రొద్దుటా, సాయంకాలం పొలం వెళ్ళి గనెం, గట్టూ చూసి వస్తున్నాడు. తాటితోపూ తుమ్మలబీడూ కూడా వెళ్ళి చూసొచ్చాడు. జీతగాడితో తూర్పు పొలాన కోసుకుపోయిన  గట్లను గురించీ, కొత్త పొలాన మెరకలుపడ్డ చెక్కల గురించీ,  వాటి మరమ్మత్తుల గురించీ వెంకటపతి మాట్లాడుతుంటే విన్న సాంబయ్యకు వళ్ళు పులకరించిపోయింది. గుండెల్లో అమృతం చిలికినట్టయింది. అయినా అదేమీ పట్టనట్టు బింకంగా వున్నాడు.
    నాలుగు రోజులకన్నా వరూధిని నుంచి కబురు రానే వచ్చింది. ఊళ్ళోకి వచ్చిన కనకయ్య రహస్యంగా వెంకటపతికి కబురు పెట్టాడు. కనకయ్యను కలిసి తిరిగి ఇంటికొచ్చిన వెంకటపతి గంటలమీద ప్రయాణం అయ్యాడు. చావిట్లో ఆవు పాలు పితుకుతున్న సాంబయ్య దగ్గిరకొచ్చి, తాళంచెవుల గుత్తిని, దూడను కట్టేస్తున్న చావిడిగుంజకు తగిలిస్తూ "నే వెళ్తున్నా!" అన్నాడు.
    సాంబయ్య పలకలేదు. చెబుతున్నది తనకు కావట్లే  వంగి పాలచెంబు తీసుకున్నాడు? సాంబయ్య తలెత్తి చూసేసరికి వెంకటపతి అక్కడనుంచి వెళ్ళిపోయాడు. సాంబయ్య మనస్సు చివుక్కుమంది. తప్పుచేసినవాడిలా బాధపడ్డాడు. వెళ్తానని చెబితే తను "ఊఁ" అని అయినా అనలేదు. కన్నెత్తయినా చూడలేదు. ఇంత హఠాత్తుగా వెళ్ళిపోయాడు వెంకటపతి. అక్కడేం జరిగిందో! ప్రసవించే రోజులు కూడా కాదే! ఎలా వుంది ఏమిటో? మాట వరసకైనా తను అడగలేదే? అది మనసులో పెట్టుకొని విసురుగా వెళ్ళినట్టున్నాడు. వాడు మాత్రం అదేమిటి? అది తనతో ఆ మాత్రం చెప్పకూడదూ? పెళ్ళానికి ఏమన్నా అయితే తనతో చెప్పకుండా వుంటాడా? లేక బలరామయ్యకు ఏదైనా రోగం ఎక్కువయిందా? ఇటో అటో అయితే చెప్పకుండా ఉంటాడా?
    సాంబయ్య మనసు పరిపరి విధాలుగా ఆలోచించింది. కొడుకు వదిలి వెళ్ళిన తాళం చేవులూం పాలచెంబూ తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు సాంబయ్య. పాల చెంబు రాముడి తల్లికి ఇచ్చి, పడమటిగదిలోకి వెళ్ళి ఇనప్పెట్టె తెరిచి చూశాడు.
    ఇనప్పెట్టె ఖాళీగా వుంది! సాంబయ్య గుండెలు బిగిసిపోయినై.
    
                          17
    
    వెంకటపతి చేతికి సంచీ, డబ్బూ ఇస్తూ "రాత్రికి రామనాథబాబుగారు వస్తున్నారు" అన్నది వరూధిని.
    డబ్బు లెక్క పెట్టుకొంటున్న వెంకటపతి తలెత్తి  భార్యముఖంలోకి చూశాడు.
    "ఏవిటిలా నోరు వెళ్ళబెట్టి చూస్తారూ? రాత్రికి రామనాథబాబుగారు మనింటికి డిన్నర్ కు వస్తున్నారు. మొన్న స్థలం రిజిష్టరు అయిన రోజున పిల్చాగా? గుర్తులేదూ?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS