ఆ పట్టున మైసూరులో మరొక్క నాలుగు రోజులుండి 'తలవంచని వీరుడు' మాటలు పూర్తిచేశాం. మూడురోజుల్లో రాశాం. మరోక్కరోజు దాన్ని మళ్ళీ తిరగేసి చెక్ చేశాం.
'బెట్రోదహుళి' - కన్నడం పిక్చర్ కూడా చూడడం జరిగింది. వాళ్ళకి తొందరలేదని, నెల్లాళ్ళ తర్వాత డబ్ చేద్దామని అన్నారు. సరేనన్నాం.
శంకర్ సింగ్ గారు వారం పదిరోజుల్లో 'గంధర్వకన్య' విడుదల చేస్తున్నామని చెప్పారు. మూటా ముల్లే సర్దుకుని మద్రాసుకి బయలుదేరాం.
మన కోసం రెండు కంపెనీలవాళ్ళూ ఎదురుచూస్తున్నారన్నారు. 'సాహసవీరుడు' అయిపోయింది కదా, వాళ్ళెందుకు మా రాక కెదురుచూస్తున్నారా- అనుకున్నాను. ఒకరోజు రెస్ట్ తీసుకున్నాను.
మర్నాడు 'తలవంచని వీరుడు. ఆఫీసుకు వెళ్ళి 'స్క్రిప్ట్ రడీ' అని చెప్పాం. "పాటలు కూడా త్వరగా పూర్తిచేస్తే మాటలు, పాటలు కూడా ఒకేసారి తీసేద్దామ"ని అన్నారు.
మూవియోలా కాల్ షీట్ ఫిక్స్ చేయించుకొని, ఇద్దరం చెరో కాపీ పాటలు పెట్టుకున్నాం. వారు నాట్ చేస్తూంటే, అలాగే నేనూ కాపీ చేశాను. ఆయనక్కావల్సినవన్నీ, నాట్ చేసుకున్నారు.
చేసినవికాక, ఎక్స్ ట్రాగా నేను క్లోజ్ షాట్ లు, లిప్ లు, యాక్షన్ మాత్రం నోట్ చేసుకున్నాను.
మళ్ళీ ఆఫీసులో కూర్చున్నాం.
వారు పాటలు రాస్తారంటే, నాకు భయం ఎందుకంటే - చచ్చేటంత నసపెట్టేవారు. "రాద్దామండీ" - అంటే బాధ! పాటల గురించి ఎత్తకుండా వూరుకుంటే మరో బాధ!
పనివచ్చేటప్పుడు ఎంత చురుగ్గావుండి చేస్తారో, ఒకోసారి అంత సోమరిగా కూడా వుంటారు. తన కవితలయితే అర్ధరాత్రయినా, ఎప్పుడు ఎక్కడ ఏది తోస్తే అది రాసేసేవారు.
వారి టెక్నిక్ వేరని ముందే రాశానుగా! స్ట్రయిట్ పిక్చరయినా, డబ్బింగయినా ముందు పాటలన్నిటికీ పల్లవులు రాసి పెట్టేసి, "అయిపోయాయ"నేవారు.
"అదేమిటండీ" అని అడిగితే, "అంతే సరోజా! పాటకి పల్లవి వచ్చేసిందంటే అల్లుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ పాట అయిపోయినట్టేలెక్క" అనేవారు.
ఈ 'తలవంచని వీరుడు' చిత్రానికి అదే జరిగింది ఆరోజు రాత్రి పది గంటలవరకూ కూర్చొని, అందులోవున్న పాటలన్నిటికీ పల్లవులు వేసేసి కూర్చున్నారు. "పూర్తిచెయ్యండం"టాను నేను. "వాళ్ళు ఆర్టిస్టుల్ని బుక్ చేసి, సాంగ్ కాల్ షీట్లు వెయ్యనీ! నేను పాటలు ఇస్తానంటా"రాయన.
నాలుగు రోజులైపోయింది.
"పాటలు రడీయా" అని అడిగితే,
"ఆర్టిస్టుల్ని బుక్ చేశారా? స్టూడియో కాల్ షీట్లు ఫిక్స్ చేశారా?" అని అడిగారు.
"పాటలు రడీ అయితే అవన్నీ చేస్తామండీ" అన్నారు వాళ్ళు.
"మీకెందుకండీ మీరన్న టైముకి పాతలిచ్చే పూచీ నాది. మీరు మొదట ఆ పన్లు చెయ్యండి" అన్నారు.
యథాప్రకారంగా మర్నాడు ఆఫీసులో కూర్చున్నాం.
ఉలకరు, పలకరు సిగరెట్ మీద సిగరెట్ కాల్చేస్తున్నారు. ఎంతసేపని ఊరుకోవడం?
"నిన్న పల్లవులు రాసిన పాటలు పూర్తిచెయ్యకూడదూ? నేనీ లోపున బైండ్ పుస్తకంలో డైలాగ్స్ ఫేర్ చేస్తాను" అన్నాను.
"నేను రాయను సరోజా?" అన్నారు.
"అలాగంటే ఎలాగండీ? రికార్డింగ్ పెడతామంటున్నారు" అన్నాను.
"ఇప్పుడేనా?".
"కాదనుకోండి కానీ మనం రడీగా వుంటే మంచిదికదా".
"నన్నిలా పట్టుకొని పీడిస్తున్నావేమిటి సరోజా! ఈ సినిమాల సంగతి నీకు తెలీదు. నేనసలు పాటలు రాయను. ఎవర్ని పెట్టి రాయించుకుంటారో రాయించుకోనీ?" అన్నారు.
నా గుండె చల్లగా జారిపోయింది. ఈయన మూడ్స్, తత్వం ఏమిటో నాకు అర్ధంకాలేదు. ప్రతి పిక్చర్ కీ ఇలా పోట్లాడుకుంటూనే పని చెయ్యడం అంటే ఎలా ఒడ్డుకి చేరడం? - అని ఆలోచిస్తూ వుంటే నా కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి.
ఏంచెయ్యాలో అర్ధంకాక, తలమీద చెయ్యి వేసుకొని ముఖం దించుకొని కూర్చున్నాను.
"సరోజా, సరోజా" అని పిలిచారు.
ముఖం ఎత్తేసరికి, కళ్ళమ్మట జలజలా నీళ్ళు కారిపోయాయి.
"అంత బాధపడతావెందుకు సరోజా! ఏడుపెందుకు? సరే - నీకు పాటలు పూర్తి చెయ్యడమేగా కావాలి సరే రాద్దాం" అన్నారు.
వారి కోపం, మూడ్స్ అన్నీ క్షణాలమీదే వుండేవి. పోనీ - అది వారి స్వభావం అనుకుందామా అంటే అదీ కాదు. మరెందుకిలా ప్రవర్తిస్తారని ఆలోచిస్తూనే వున్నాను. "ఇంకా ఏమిటాలోచన?" అని అడిగారు.
"ఏమీ లేదండి. పని విషయంలో - మీరిలా మొండికెయ్యడం నాకు చాలా కష్టంగా వుంది. నాబాధ మీకు అర్ధంకాదు. మిమ్మల్ని విసిగించాలనికాదు నా ఉద్దేశ్యం. ఏదో ఇప్పుడిప్పుడే కంటిన్యూగా మనకి నాలుగు పిక్చర్లొస్తున్నాయి.
మీరు మాటలు, పాటలు రాసి నా ముఖాన పడేస్తే చాలు. మిగిలిన చాకిరీ నేను చేస్తాను. ప్లీజండీ! ఒక్కోసారి మీ మాటలు, ప్రవర్తన, మొండితనం చూస్తే నాకు చాలా నిరాశ కలుగుతోంది. నేను కష్టపడతానండి" మరేం ఫరవాలేదన్నా.
అంతా "బాగానే వుంది సరోజా! కానీ నాకు అసిస్టెంట్ గా పనిచెయ్యడానికి వచ్చావా, లేక నా మీద అథారిటీ చెయ్యడానికా అడిగారు.
ఇంతలో ప్రొడ్యూసర్ వచ్చి, "శ్రీశ్రీగారూ! ఎల్లుండి నుండి సాంగ్స్ రికార్డింగ్ పెట్టాం. రడీయేనా?".
"ఆఁ" - అన్నారాయన.
"ఏమమ్మా?" - అని నావైపు చూశారు ప్రొడ్యూసర్.
"అలాగే సార్! రేపు సాయంకాలానికల్లా పాటల కాపీలు తయారుచేసేస్తాన"న్నాను. మెచ్చుకున్నట్టు నావైపు చూశారు.
ఇద్దరం కోడిపుంజుల్లా కొట్లాడుకున్నా, అండర్ స్టాండింగ్స్ ఎక్కువ మాకు ఒకర్నొకరం పైవాళ్ళ దగ్గర మాత్రం బయటపెట్టుకునేవాళ్ళం కాము.
ఒక్కోసారి ఏమీ రాయకుండానే, "పాటలు రాసి సరోజకిచ్చేశాను. ఫేర్ చేసి కాపీలు రాయాలి. సరోజదే ఆలస్యం" అనేవారు. నేను నిర్ఘాంతపోయేదాన్ని.
నేనూ అలాగే "మేము రడీ సార్! మీదే ఆలస్యం మీరెప్పుడు కాల్ షీటంటే అప్పుడే మేం స్క్రిప్ట్ తోవచేస్తాం" అనేదాన్ని వాళ్ళు వెళ్ళిపోగానే "డైలాగ్స్ రడీయా?" అని అడిగేవారు. నవ్వేదాన్ని.
ఆరోజు ఎంత రాత్రయినా పాటలు పూర్తి చేద్దామని అన్నారు. రాత్రి రెండు గంటలదాకా కూర్చొని పూర్తి చేశాం.
ఇక జీవితంలో పని విషయంలో వారితో పేచీ పెట్టుకోకూడదని ఆరోజు నిశ్చయించుకున్నాను. నాతో సాల్లేమని ఆయన అంటారు కానీ, నిజంగా ఆయనతోనే ఎవరూ సాల్లేమని అనుకున్నాను.
"ఏమంటావు సరోజా! ఇప్పుడు నీకు తృప్తేనా? పాటలు రాసేశానా, లేదా? నాకు మాత్రం తెలీదా? ఎందుకు అనవసరంగా గబహరా పడిపోతావు?" అన్నారు.
"నిజమేనండీ క్షమించండ"న్నాను.
"సరే! పోదామా! ఇంటికి వెళ్ళి ఇంకా జాగారం చెయ్యకు రేపు ఆఫీసులో పాటలు కాపీ తియ్యొచ్చు పద" అన్నారు.
ఇంటికి వచ్చేశాం, అప్పుడు మరొకటికూడా నిశ్చయించుకున్నాను. ఎంత కష్టపడి అయినా సరే - డైలాగ్స్ రాయడం నేర్చేసుకోవాలి. రఫ్ గా అయినా డైలాగ్స్ రాస్తే ముందు స్క్రిప్ట్ తయారౌతుంది. వారికీ కాస్త శ్రమ తగ్గుతుంది. తరువాత వారు చెక్ చేస్తారు.
ఇలా చేస్తే మాకు పిక్చర్లు వచ్చినా నేను చకచకా లాగేయొచ్చని నిర్ధారణకి వచ్చి ఆ సంగతే ఆలోచిస్తూ నిద్రపోయాను.
మర్నాడు ఆఫీసులో కూర్చొని కార్బన్ పెట్టి ఒక్కోపాట మూడేసి కాపీలు చొప్పున మొత్తం పాటలన్నీ తీసేశాను. ఒంటిగంటకల్లా ఓ కాపీ ఆఫీసులో ఇచ్చేశాను.
శ్రీశ్రీగారి రాతపని అయిపోయినట్లే నా పనే మిగిలిపోయింది. రెండు మూడు రోజులయినా రాస్తేకానీ డైలాగ్స్ ఫేర్ చెయ్యడం, ఆర్టిస్టుల పోర్షన్లు పూర్తికావు. నా చేతిలో పనేకదా, లాగెయ్యొచ్చనుకున్నాను.
'తలవంచని వీరుడు' పాటలూ, లిప్....అనీ చాలా బాగా వచ్చాయి. డబ్బింగ్ స్టార్ట్ చేసే డేట్ ఇచ్చేశారు. ఆర్టిస్టులందర్నీ బుక్ చేశారు. డబ్బింగ్ కూడా ఆనాటి జయంతి స్టూడియోలోనే పెట్టారు.
సావిత్రి, కన్నాంబ సిద్దంగా వున్నారు. శివాజీగారి వాయిస్ కి జగ్గయ్యగారు మాట్లాడుతారని చెప్పారు. పోర్షను ఇళ్ళకి పంపక్కర్లేదు. అక్కడే చూసి మాట్లాడేస్తామని వాళ్ళు అన్నారు.
అన్నీ రాసి సిద్దంగా వున్నాం.
పూజ రోజున అందరూ వచ్చారు. జగ్గయ్యగారి పనితో ప్రారంభించాం.
సావిత్రిగారు, కన్నాంబగారూ కూడా వచ్చారు. వాళ్ళ వర్క్ కూడా ఆరోజు చేశాం. మొదటిరోజు కొంచెం భయపడినా తర్వాత సర్దుకున్నాను. డబ్బింగు గొడవలేమీ లేకుండా సాఫీగా సాగిపోతోంది.
