Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 43


    "లేదాంటీ" నవ్వేసింది. "ఇంత కోల్పోయాక బాధ పడటానికి యింకేం మిగిలిందని. కానీ ఎందుకిలా జరిగిందీ అని ఆలోచిస్తున్నాను. నా గురించి కాదు. శివ విషయంలో."
    "పిచ్చిపిల్లా! నువ్వు సినిమా రంగంలో అడుగుపెట్టి నాశనమైనా పెంచుకున్నది మిత్రుల్ని కాదమ్మా శత్రువుల్ని ఆ శత్రువులైనా సామాన్య స్థాయికి చెందిన వాళ్ళు కాదు. ఇండస్ట్రీని శాసించగల వ్యక్తులు. నీకు అండగా వున్న శెట్టి కూడా ప్రముఖుడే. అయినా యిండస్ట్రీ అంటే అతనొక్కడే కాదుగా. నీ కోసం లక్షలు ఖర్చుపెట్టాలీ అంటే ఎలా సాధ్యం?"
    "శివ సమర్ధుడు ఆంటీ!"
    "కావచ్చు సుకృతీ! కానీ అది నిర్ణయించాల్సింది ప్రేక్షకులు ప్రేక్షకులు నిర్ణయించాలీ అంటే అతడు నిరూపించుకోవాలి. నిరూపించుకోవాలీ అంటే మొదట ఓ అవకాశం చిక్కాలి. అది చిక్కేదాకా విలువలేని కరెన్సీలా సమస్యలు సూట్ కేసులోనే వుండిపోవాలి. ఇది ఈ సినిమా రంగం థియరీ....." క్షణం ఆగి అంది అలివేలు. "నరేంద్ర పెద్ద హీరో కాకపోవచ్చు. కానీ బిజినెస్ కావటానికి సరిపోయినంత యిమేజ్ వుంది. అలాంటి నరేంద్ర యిప్పుడు మాట తప్పాడూ అంటే దీని వెనుక కొన్ని శక్తుల ప్రమేయం వుండి వుంటుంది. ఆ శక్తులు సుదర్శనరావులు కావచ్చు. రమ్యశ్రీలు కావచ్చు. రామన్ లు కావచ్చు. నారాయణశెట్టి మీదనో, శివ మీదనో కక్షకట్టిన మరెవరైనా కావచ్చు."
    జవాబు చెప్పలేదు సుకృతి. సాలోచనగా వుండిపోయింది. మనిషి సత్తాగలవాడని నిరూపించాలని ఎవరు ప్రయత్నించినా ఆగకుండా దూసుకుపోవటానికి పబ్లిక్ సర్వీస్ కమీషను పరీక్ష కాదు. పదిమంది చర్చించుకుని తప్ప చేజిక్కించుకోలేని సినిమా అవకాశం.
    అలివేలు చెప్పిందీ నిజమే. గాలిబ్ గీతాలు రాశాక తప్ప ఆ భావుకత ప్రపంచానికి అర్ధం కాలేదు. తాజ్ మహల్ నిర్మాణంకోసం షాజహాన్ ప్రేమహృదయం చరిత్రాత్మకం కాలేదు. శివ కూడా అంతే. మొదట ఓ అవకాశం దక్కి నిరూపించుకుంటే తప్ప ఈ పరిస్థితి యింకా కొనసాగుతూనే వుంటుంది.
    ఉన్నట్టుండి ఫోన్ అందుకుంది సుకృతి.
    "ఎవరికీ?" విస్మయంగా అడిగింది అలివేలు.
    "నారాయణశెట్టి తో మాట్లాడాలనుకుంటున్నాను."
    రిసీవర్ని లాక్కుంది అలివేలు. "ఏం మాట్లాడాలనుకుంటున్నావు"
    "శివకి ఈ ఒక్క అవకాశం యిచ్చి తీరాలని రిక్వెస్టు చేయాలనుకుంటున్నాను. రిస్క్ తీసుకుని కొత్త ఆర్టిస్టులతో ఈ సినిమా కోసమని....."
    "నీకు పిచ్చి పట్టిందా సుకృతీ!" బాధగా అంది అలివేలు." ఏమనుకుంటాడు?"
    "ఏ విషయంలో?"
    "శివకోసం నువ్వంత మొండిగా ఎందుకు పట్టుబడుతున్నా ఆలోచిస్తాడు శెట్టి. మీ ఇద్దరి మధ్య ఏ సంబంధాన్నైనా వూహించుకుంటాడు."
    ఉలిక్కిపడింది సుకృతి. ఈ క్షణం దాకా శివ గురించి అలా ఆలోచించని సుకృతి ఎందుకో అలివేలు అనుమానం విన్నాక నవ్వకుండా వుండలేకపోయింది.
    "ఎందుకు నవ్వుతున్నావు?"
    "శివని నాకు కొత్తకోణంలో పరిచయం చేస్తున్నావు ఆంటీ! కానీ శివ అలాంటివాడు కాదు."
    "అది నీకు తెలుసు, నాకు తెలుసు కానీ నారాయణశెట్టి వయసుడిగినవాడు కాబట్టే తప్పకుండా అనుమానిస్తాడు, అసూయపడతాడు.
    "దానివలన నాకొచ్చే ప్రమాదం లేదు ఆంటీ! నేనేం శీలవతినని శెట్టి పొరపాటు పడడుగా."
    "పిచ్చిపిల్లా! నీకెలా చెప్పీది!" రెండు దశాబ్దాల సినిమారంగం అనుభవాన్ని క్రోడీకరిస్తూ చెప్పింది అలివేలు. "ఇక్కడ అమ్మాయిల్లో చాలామంది శీలం కోల్పోయిన వాళ్ళే అని చాలామందికీ తెలుసు. కాబట్టే అవకాశం దొరికినప్పుడు యాంత్రికంగా అనుభవించి వదిలేస్తుంటారు. కానీ శెట్టి అలా నిన్ను అనుభవించి వదిలేయలేదు. నిన్ను తన మనిషి అనుకున్నాడు. నీకోసం చాలా ఖర్చు చేశాడు. అంతమాత్రంచేత అంతా వెనక్కి లాక్కుంటాడా అని అనకు. అలా లాక్కునే ధ్యేయమే వుంటే ప్రాపర్టీ నీ పేర ఉంచేవాడు కాదు. అవకాశవాది అయితేనేం నిన్ను నమ్మాడు. ఆ నమ్మకంతో చాలాకాలం నీకు అండగా వుండాలని నిర్ణయించుకున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన ఫీల్డు సుకృతీ! నీ మీద పగ పెంచుకుంటున్న పెద్ద చేపలనుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలీ అంటే నీకు నారాయణశెట్టి అండ చాలా అవసరం. కనీసం నువ్వు కొంచెం ఎదిగేదాకా...." సుకృతి బాధగా కళ్ళుమూసుకుంది. ఇంత చిన్న వయసులో తను సైతం యిదంతా సాధించింది అవకాశ వాదంతోనేగా? కోరి కాటుకి సిద్దపడి కాటువేద్దామన్నా భక్తుల మధ్య తనకంటూ ఓ అస్థిత్వం కావాలని శెట్టిని ఆశ్రయించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS