Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 44


    "ఏంటి?" అన్నట్టు చూసింది.
    ప్రనూష చేతిని తన చేతిలోకి తీసుకొని, పెదవులకు ఆన్చుకున్నాడు.
    వెంటనే వెనక్కు లాక్కుంది ప్రనూష ఆమెలో వేల ప్రకంపనలు. చిగురుటాకులా వణికింది....చిన్నపాటి ఉద్వేగం.
    "ఓహ్.... అయాం సారీ....మీ ఆత్మీయ స్పర్శకోసం తొందరపడ్డ ఫూల్ ని....తన చేతుల్తో తన చెంపలు వాయించుకున్నాడు.
    "సార్..." అంటూ అతన్నా ప్రయత్నాల నుంచి ఆపే ఉద్దేశంతో అతని చేతులు పట్టుకుంది.
    తన చేతుల్ని పట్టుకున్న ప్రనూష చేతుల్ని, తన చేతుల్లోకి తీసుకొని, ఆ చేతుల్లో తన మొహం దాచుకున్నాడు.
    చిత్రంగా...ఆమె నిశ్చల ఛాయాచిత్రమే అయింది.
    
                                                          * * *
    
    "శశికళా నా మీద నీ ఒపీనియనేంటి?" అడిగాడు శ్రీచరణ్ శశికళను. ఇద్దరూ టాంక్ బండ్ కు వచ్చారు. ఆఫీసు నుంచి తన స్కూటర్ మీద టాంక్ బండ్ తీసుకువచ్చాడు శ్రీచరణ్.
    "అలా వైశ్రాయ్ వరకూ వెళ్ళొచ్చి...ఒపీనియన్ల గురించి ఒపీనియన్ చెప్పుకుంటే బావుంటుందేమో..." అంది శశికళ నిర్మొహమాటంగా.
    "అంటే ఓ టూ హండ్రెడ్ రూపీస్ కు టెండర్ పెట్టానన్నమాట" అంటూనే స్కూటర్ స్టార్ట్ చేసి ఎక్కమన్నాడు.
    ఇద్దరూ వైశ్రాయ్ లోపలకు నడిచారు.
    స్విమ్మింగ్ ఫూల్ ని ఆనుకుని వున్న రెస్టారెంట్లో కూర్చున్నారు. అక్కడినుండి గ్లాస్ డోర్ లో నుండి స్విమ్మింగ్ ఫూల్ కనిపిస్తోంది.
    ఎవరో నలుగురు ఆంగ్లో ఇండియన్స్ స్విమ్ చేస్తున్నారు. ఉత్సాహంగా చూస్తూ కూర్చుంది శశికళ.
    స్టీవార్ట్ వచ్చాడు.
    "టూ బటర్ నాన్, చికెన్ కర్రీ, వెజిటబుల్ సలాడ్, మసాలా పాపడ్, మంచూరియా..." ఆర్డర్ చేసింది.
    "హమ్మో" మనసులోనే మెనూ చూసి లెక్కలేసుకున్నాడు శ్రీచరణ్.
    "పెళ్ళయ్యాక కూడా ఇలా హోటల్స్ అంటూ తిరుగుతావా?!! అడిగాడు కన్ఫర్మేషన్ కోసం శ్రీచరణ్.
    "డౌటా? లేకపోతే అసహ్యంగా కిచెన్ లో కూచొని వండుకుంటూ కూర్చోవాలా అసహ్యంగా?" అంది మొహమంతా అదోలా పెట్టి.
    "ఆ మాత్రం దానికి రెండు "అసహ్యాలు ఎందుకులే అన్నాడు. ఈలోగా స్టీవార్ట్ ఆర్డర్ చేసినవి టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు.
    "ఇవి తిన్నాక ఫ్రూట్ పంచ్ తాగాలి" అంది ఫోర్క్ తో మంచూరియాని గుచ్చుతూ.
    విరక్తిగా నవ్వుకున్నాడు శ్రీచరణ్ "అన్నట్టు ఇందాక ఏదో అడిగినట్టున్నావు?" అంది శశికళ శ్రీచరణ్ ని.
    "నా మీద నీ ఒపీనియనేంటని....అడిగి చచ్చా...." అన్నాడు వళ్ళుమండి.
    'నాట్ బ్యాడ్' అంది శశికళ.
    "అయితే మనం పెళ్ళి చేసుకోవచ్చన్నమాట..." అన్నాడు.
    "పెళ్ళా....మనమా?" అంది శశికళ.
    "అదేంటి....నేను మ్యాచవ్వనా?"
    "ఫర్లేదనుకో....కానీ ఓన్లీ స్కూటర్ వాలాని నువ్వు మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ తప్ప, క్రెడిట్ కార్డ్స్ కూడా లేవు ఎట్లీస్ట్ ఫోర్ వీలర్ అసలే లేదు...." అంది శశికళ నిర్భయంగా.
    "ముక్కుసూటిగా, అడగడం తనదే బుద్దితక్కువ" అనుకున్నాడు శ్రీచరణ్. ముందు ఆమెను డీప్ గా అబ్జర్వ్ చేసి, అడ్వాన్సవ్వాల్సింది తన తొందరపాతుకు తనను తాను తిట్టుకున్నాడు.
    ఆ టాపిక్ అక్కడితో డైవర్ట్ చేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చాడు.
    శశికళ ఇంటికి వచ్చేసరికి ఒళ్ళంతా హడావిడిగా కనిపించింది. చెల్లెలు, తమ్ముడు బుద్దిగా ఇంట్లోనే ఉన్నారు. తల్లి టిఫిన్స్ చేసే హడావిడిలో వుంది.
    "ఏమిటమ్మా.... ఈ హడావిడి?" చికాగ్గా అడిగింది శశికళ. వైజాగ్ నుంచి మాధవయ్య మామయ్య వచ్చాడే అంది తల్లి.
    "వస్తే.... ఇంత హడావిడి చేయాలా?" మరింత చికాకుగా అంది శశికళ.
    "అదికాదే మనకా ముందూ, వెనకా ఎవరూ లేరు, తన ఎరికలో మంచి సంబంధమొకటి ఉందిట....అంది చెప్పి పోదామని వచ్చాడు "సంతోషంగా చెప్పింది తల్లి.
    "అదేం కాదు. ఇక్కడ ఏదో పని వుండి వుంటుంది. లాడ్జింగ్ లో దిగితే డబ్బులు అవుతాయని, సంబంధం తెచ్చాననే నెపంతో రెండ్రోజులు ఇక్కడ తిష్ట వేయాలని వచ్చివుంటాడు' అంది.
    కూతురి వంక కోపంగా చూసింది.
    "అవేం మాటలే....ఎంత మాటొస్తే అంత అనేయడమేనా? మనకు మాత్రం పెద్దదిక్కు ఎవరున్నారు. చెల్లెలుకూడా పెళ్ళికి ఎదిగింది. నీ పెళ్ళయితే, చెల్లెలికి ఓ సంబంధం చూడొచ్చు."
    "నా పెళ్ళయితే మీరు వీధిన పడతారు" అంది శశికళ.
    "అదేం కాదు....అబ్బాయి మంచివాడు. తమ్ముడికి ఏదో ఓ ఉద్యోగం చూస్తానన్నాడుట.."
    "ఇంతకీ ఆ పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడే..."
    "కలెక్టరాఫీసులో..."
    "అసిస్టెంట్ కలెక్టరా?" ఉత్సాహంగా అడిగింది శశికళ.
    కూతురి మొహంలోకి పిచ్చి చూపులు చూసి తల దించుకుని చెప్పింది తల్లి.
    "గుమస్తానట....అయినా పై సంపాదన బాగానే వుంటుందట.
    "గుమస్తానా!.... ఇంకా నయం అటెండరేం కాదూ...అయినా నీకెన్నిసార్లు చెప్పాలి....నాక్కాబోయే మొగుడు ఎలా వుండాలో నీకు తెలుసా? మీకు తెలుసా...?" కోపంగా అని....
    "ఇంకోసారి ఇలాంటి సంబంధాలు తీసుకురావద్దని నీకు తమ్ముడి వరసైన అతగాడితో చెప్పు.... హు. గుమస్తాతో తాలి కట్టించుకోవాలా?" అంది నిరసనగా శశికళ. తల్లి అలానే నిలుచుండిపోయింది. శశికళ విసవిసా తన గదిలోకి నడిచింది.
    
                                                            * * *
    
    "అక్కయ్యా శశికి నేను తెచ్చిన సంబంధం ఇష్టం లేనట్టుంది. నేనిక వెళ్తాను" అన్నాడు మాధవయ్య. "అదేంట్రా...రెండ్రోజులు వుంటానన్నావు..."
    "వద్దక్కా.....పిన్ని కూతురిని అనే అభిమానంతో వచ్చాను. శశి అన్నది కూడా నిజమే. నాకు సిటీలో కాస్త పనివుంది. నా పని మీద వచ్చి... మీ ఇంట్లో ఉండటం పద్ధతి కాదు. అదీగాక, నేను తెచ్చిన సంబంధం వద్దన్నది....అలాంటప్పుడు ఏ పని లేకుండా, నా పనికోసం... వద్దక్కా.... నేను వెళ్తాను" బ్యాగు చేతిలోకి తీసుకుని అన్నాడు మాధవయ్య.
    "టిఫిన్ చేసైనా..."
    "వద్దక్కా..." అంటూ బయటకు నడిచాడు. ఈ సంభాషణ అంతా తన గదిలోనుంచి వింటున్న శశికళ మనస్సు చివుక్కుమంది. తను తొందరపడి అన్ని మాటలు అని వుండాల్సింది కాదు." అనుకుంది.
    
                                                         * * *
    
    "ఇప్పుడు నీకు తృప్తిగా వుందా? వాడిని టిఫిన్ కూడా చేయకుండానే పంపించావుగా..." అది కోపంగా తల్లి కూతురి గదిలోకి వచ్చి..."
    "నేనేమైనా తినకుండా వెళ్ళమని అన్నానా?" తనని తాను సమర్ధించుకుంటూ అంది శశికళ.
    "అనవే....అను....రేపు నన్ను కూడా అంటావు, అయినా పెళ్ళి చేసుకోకుండా ఇంకా ఎన్నాళ్ళని వుంటావు. నీకు పెళ్ళి కాకుండా, చెల్లెలికి ఎలా పెళ్లవుతుంది. మా బరువు బాధ్యతలే నీ పెళ్ళికి ఆటంకం అంటే మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం.... ఇంత విషం మింగి చస్తాం..." అంది కళ్ళొత్తుకుంటూ తల్లి.
    
                                                              * * *
    
    శశికళ ఆలోచనలో పడింది. అస్థిమితంగా వుందామె మనసు. తల్లి మాటలు చెవుల్లో గింగురు మంటున్నాయి.
    తను పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం కేవలం తల్లి. తమ్ముడు, చెల్లెలు పట్ల తనకున్న బాధ్యత ఒక్కటే కారణం కాదు.
    పెళ్ళి జీవిత కాల సమస్య....తను పేదరికంలో గడిపింది ఇప్పటివరకూ, కనీసం పెళ్ళయ్యకైనా తను దర్జాగా బ్రతకాలి. తనకు అందముంది. చదువు వుంది. ఓ మామూలు గుమస్తాని చేసుకుని జీవితాంతం గుమాస్తా భార్యగా బ్రతకాలి? తన పిల్లలు గుమస్తా పిల్లలుగా బ్రతకాలి? ఎదుగూ, బొదుగూ లేని జీవితం తనకు ఎందుకు? ఆమె ఆలోచనలు అలా సాగుతూనే ఉన్నాయి.
    తను పెళ్ళి చేసుకోక తప్పదు....కానీ కట్నం ఇచ్చే తాహతు తనకు లేదు. ఏమీ లేకుండా... అప్పుడు గుర్తొచ్చాడు శ్రీచరణ్.
    మంచి జీతం. అతనికి ఫ్యూచర్ బాగానే వుంటుంది. అందముంది. స్కూటర్ వుంది. ప్రస్తుతం తన కళ్ళ ముందున్న చాలామంది మీద అతనే బెటర్. అదీగాక...అతనే ఆ ప్రపోజల్ తెచ్చాడు.
    ఆమె మనసు ఇప్పుడు రిలీఫ్ గా వుంది.
    రేపే తన నిర్ణయాన్ని శ్రీచరణ్ కు చెప్పాలి.
    ఆ ఆలోచన రాగానే ఆమెకు నిద్రపట్టేసింది హాయిగా.
    
                                                                   * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS