Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 43

 

    తన ప్రియమైన విష్ణును ఎలా రక్షించుకోవాలో, ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టని ఒక సనాతన సద్బ్రుహ్మణ వంశోద్ధారకున్ని దేశ ద్రోహి కాదని ఎలా నిరూపించాలో, తనకు తెలిసిన విష్ణు అసలు రూపాన్ని ఎలా కాపాడలో ఆ రాత్రి వేళ నిద్రకు దూరమై మరీ ఆలోచిస్తున్నది ధీరజ.
    
                                                      *    *    *    *

    ఊరికి చాలా దూరంలో చిన్న కాలువ.
    ఆ కాలువ ఒడ్డున ఒక రాతి బండపై కూర్చుని శూన్యంలోకి చూస్తున్న విష్ణుమూర్తి తన ప్రక్కనే ఎవరో వున్నట్టు గమనించి తల తిప్పి చూశాడు.
    ఆమె భవానీ......
    "విష్ణు....ఒక్కసారి నీ చుట్టూ చూడు......చీకటి ఎలా పరచుకుని వున్నదో.......ఇంత రాత్రివేళ వరకూ నువ్వు ఇలా దిగులుగా కూర్చోవడం నాకు నచ్చలేదు" అంటూ అతని పక్కనే చనువుగా కూర్చుంది భవానీ.
    "నేనేం పోగొట్టుకున్నానో నీకు తెలుసు. అదిగో చూడు అక్కడే నా తండ్రికి పిండం పెట్టింది. ఇంకా ఆ దృశ్యం నా కంటి ముందు కనిపిస్తూనే వుంది. పరీక్షలయితే రాయగలిగాను కానీ నా మనసంతా ఇక్కడే వుంది" అమాయకంగా వున్నాయి అతని మాటలు.
    "పుట్టిన ప్రతి మనిషి ఎప్పుడో ఒకసారి చనిపోక తప్పదు. అందుకని మనం ఇలా విచారిస్తూ కూర్చుంటే పోయినవాళ్ళు తిరిగిరారు కదా. నీ తండ్రి పోయినందుకు నీకు మాత్రమే బాధ వున్నట్లు, నువ్వే సర్వస్వం పోగొట్టుకున్నట్టు ఇలా ఒంటరిగా , చీకటిలో పిచ్చివాడిలా తిరగడం చూస్తుంటే నీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మ, అక్కలు ఎంత బాధపడతున్నారో నువ్వు అసలు ఆలోచించనే లేదు కదూ...."
    ఆమె మాటలు నిజమేనని'పించాయతనికి.
    అప్రయత్నంగా తలతిప్పి ఆమె ముఖం వైపు చూశాడు. ఆ చీకట్లో ఏం కనిపించ లేదు. కానీ ఆమె కళ్ళు అశ్రుసిక్తాలయి వుండడం స్పష్టంగా తెలిసిపోయింది.
    
    "సారీ భవానీ .........నా ప్రవర్తన విష్ణు బాధిస్తుందనే విషయమే మరచిపోయాను.'
    'అవును.........నీ కిది మాములేగా ....ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళగానే ఇల్లే మరచిపోతావు. నా దగ్గర నుంచి వెళ్ళిపోగానే తిరిగి నేను కనిపించే వరకూ మళ్ళీ గుర్తురాను. నీ సంగతి నాకు తెలియనిది ఏముంది......ఇలాంటి బాధలో అసలేం గుర్తుండదు కదూ" బేలగా వుంది ఆమె గొంతు.
    "ఛ......ఛ .....అలా అని ఎవరన్నారు?" అంటూ ఆమె చేతులను తన అరచేతులలోకి తీసుకున్నాడు విష్ణు.
    అంతవరకూ ఉగ్గపట్టుకుని వున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా బావురుమన్నది భవాని.
    నీకు నేను వున్నాననే ధైర్యం చెబుతున్నట్టు ఆమె వీపుపై అనునయంగా చేయి వేశాడు విష్ణు.
    భవానీ ఆలోచనలు మాత్రం ఎక్కడో వున్నాయి.....
    ఊహ తెలిసిన వయసులో తను దిగులుగా నడిరోడ్డు మీద ఏడుస్తూ వెళుతున్నప్పుడు ఎందరో చూసి తప్పుకుంటున్నారే తప్ప ఎవరూ తన స్థితికి జాలిపడిన వాలు లేరు.
    అలాంటప్పుడు ఒక మహనీయుని కంటపడింది తను.
    అతనే అవధాని......
    ఆ రోజు ఎప్పటిలానే కొడుకు విష్ణు మూర్తితో కలసి పోరోహిత్యం పనిపై వెళుతున్న అవధాని చెవులకు సోకింది భవాని ఏడుపు..........అందరిలా నాకెందుకులే అని తప్పుకోలేదతను......
    "ఏమిటమ్మా .....ఎవరివమ్మా నువ్వు అని పిలిచినా ఏకైక ఆత్మీయుడు అతనొక్కడే ........పక్కనే నిలిచి వున్న విష్ణుమూర్తి చూపులు ఆసక్తిగా గమనిస్తున్నాయి ఆ పాపను!
    రెండు మాటలలోనే ఆ పాప పరిస్థితి అతనికి బోధపడిపోయింది.
    ఏ కన్నతల్లి కడుపు శోకమో ఈ జనారణ్యంలో అనాధగా నడిచి తన స్వార్ధం తను చూసుకుంది. ఏం చేద్దామన్నట్టు కొడుకువైపు చూశాడు అవధాని.
    "నాన్న .......మన ఇంటికి తీసుకు వెళదాం.......మనతో పాటే ఉంటుంది. ........మన అక్కలతో పాటే తింటుంది.......తెలిసి తెలియని జ్ఞానంతో చెప్పిన ఆ పసివాడి మాటలు విన్న ఆ చిన్నారి మనసు విచిత్రంగా స్పందించింది.
    అవడానికి కూడా ఆ మాటలు వచ్చాయి.....
    తనకు కోరకుండానే ఏడుగురు ఆడపిల్లలను ఇచ్చాడు. ఆ పిల్ల తనకు ప్రత్యేకంగా భారమేమీ కాదు అని తనతో పాటు తీసుకువెళ్ళాడు.
    ఆ పాపకు భవానీ అని అవధానే పేరు పెట్టాడు.
    కానీ, ఎవరో కన్నబిడ్డ తన దగ్గరకు చేరింది కదా అని చదువు చెప్పించకుండా వుండలేకపోయాడు అవధాని. అందుకే హాస్టల్ లో వుంచి ఆమెను బి.ఎస్.సి హోమ్ సైన్స్ చదివిస్తున్నాడు.

                                                  *    *    *    *

    భవాని హృదయం జ్ఞాపకాల దొంతరాలతో బరువెక్కిపోయింది.
    ఏ కులమో , గోత్రమో తెలియకపోయినా , జాతిమతాల పట్టింపు లేకుండా తమ కుటుంబములో ఒకరిగా కలుపుకుని తన్నతండ్రి కన్నా ఎక్కువగా ఆదరించిన మహా మనిషి అవధాని ఆరోజున తనను వదిలివెళ్ళి పోయాడంటే భవానీ హృదయం మాత్రం గాయపడకుండా ఎలా ఉంటుంది?
    అందుకే మూగగా తనలో తనే కుమిలిపోతున్నదామె?
    ఇప్పుడు భవానీని ఊరడించడం విష్ణు వంతయ్యింది.
    ఎప్పటికో తెప్పరిల్లింది.
    ఇద్దరూ మౌనంగా ఇంటి దారి పట్టారు.
    భవానీ చదువు మధ్యలో ఆగిపోకూడదు కాబట్టి మరుసటి రోజు ఉదయాన్నే బలవంతంగా ఆమెను హాస్టల్ కు పంపించాడు విష్ణుమూర్తి.
    విష్ణుమూర్తికి తన కుటుంబం పరిస్థితి తలచుకుంటే అగమ్య గోచరంగా కనిపించింది. ఇంటి నిండా వున్న ఆడపిల్లలు.......సంపాదన లేదు ........ఎన్నాళ్లని అప్పులు చేసి పోషించగలడు?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS