Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 43

 

    "నేను వెళ్ళి వస్తున్నాగా! అంచేత ఆమె రాలేదు. నిన్ను తీసుకు రమ్మని అమ్మ ప్రతిసారీ అడుగుతూనే వుంది. అయినా నిన్ను తీసికెళ్ళటం కుదరలేదు. పరీక్షలని కొన్నాళ్ళు. అనారోగ్యంతో కొన్నాళ్ళు గడిచిపోయాయి!"
    "రేపు హాలిడేస్ కి నేనే వెళతాలే!"
    'అలాగేలేమ్మా"
    "అన్నాయ్?"
    "మరెంటమా?"
    "నేనో మాట అడగనా?"
    "అడుగు స్వాతీ! నీకు అడ్డేమిటి?" నవ్వుతూ అన్నాడు రవి.
    బదులుగా స్వాతి కూడా నవ్వింది. ఈ మధ్య జబ్బు నయమయ్యేక స్వాతి అందంగా తయారయింది. కొత్త రక్తంతో కళ్ళు బుగ్గలు మెరిసిపోతున్నాయ్. వ\ళ్ళుచేసి నిండుగా తయారైంది.
    "నీకూ స్వప్నకి పెళ్ళటగా!" చప్పున అడిగింది స్వాతి.
    "సిగ్గుపడ్డాడు రవి " ఎవరు చెప్పారమ్మా?" అతని కంఠం కొద్దిగా చలించింది.
    అందరూ అనుకుంటున్నారు. అమ్మమ్మగారు చనిపోతూ మీ యిద్దరితో మాట తీసుకున్నారట కదా! అన్నాయ్ ఈ విషయం అమ్మతో చెప్పానా? అమ్మ ఎంత సంతోషిస్తుందో ! అసలు స్వప్నని చూస్తే చాలు మురిసిపోతుంది కదూ?" స్వాతి ముఖంలో అనందం దాస్తామన్నా దాగకుండా వెల్లి విరుస్తోంది. గుండెలనిండా నిండిన సంతోషం పొంగి వస్తోంది.
    "ముందు నీకు చాలా ఆనందంగా వున్నట్టుందే?"
    "పో అన్నాయ్! అన్నయ్యకి పెళ్లవుతూ వుంటే ఎవరికి ఆనందంగా వుండదు. అందులోనూ స్వప్నలాటి వదిన వస్తూ వుంటే మనస్సు నిలుస్తుందా?"
    "అంతేనా ఆడబిడ్డ లాంఛనాలు ఎక్కువగా వస్తాయనా?"
    "నాకేం అక్కరలేదులే!" అంతలో వచ్చిన కోపాన్ని ఆపుకోలేక ఉక్రోషంగా అంది.
    ఫక్కున వవ్వేడు రవి.
    "నవ్వు! నవ్వు! మాంచి అందమైన భార్య వస్తోందని ఆనందంగా వున్నట్టుంది నీకు------"
    లేచి ఆమె దగ్గరికి వెళ్ళి "లేదు స్వాతీ! మళ్ళీ నా చెల్లాయి ఎప్పటిలా ఆనందంగా వుంటే నవ్వుకున్నాను. అంతే! అమ్మమ్మగారే మనల్ని చేరదీయకుండా వుండి వుంటే మన గతి ఏమయ్యేది?" అన్నాడు.
    దానికీ స్వాతి సమాధానం చెప్పలేదు. ఆ అమ్మాయికి అది ఊహించటానికే మనస్కరించలేదు.
    అంతలో ఆయా వచ్చి అతన్ని పిలవటంతో వాళ్ళిద్దరి మధ్యా మాటలు ఆగిపోయాయి. ఇద్దరూ ఆయా వెంట భోజనానికి వెళ్ళేరు.


                                    32


    మరుసటి రోజు ఫోన్ చేశాడు విశ్వేశ్వరం గారు.
    "నమస్తే!"
    "నమస్తే! నమస్తే! రవీ! నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఇక్కడికి రాగలవా? ఫోన్లోనే మాటాడేద్దామా?"
    "మీ యిష్టం ఎలాగయినా సరే"
    "అక్కడేవరున్నారు?"
    "హల్లో యెవరూ లేరు. స్వప్న మెడపై వుంది .అంతే!"
    "పనిమనుషులు?"
    "వాళ్ళ పనుల్లో వున్నారు......"
    "రవీ! మనం మాటాడేవేళ యెవరూ రాకుండా చూడు."
    "ఫర్వాలేదు లెండి!" నవ్వుతూ అన్నాడు రవి.
    "రవీ! నేను తమాషాకి అడగటం లేదు. నీ మనస్సు కనుక్కోవటం ముఖ్యం. అందుకే అడుగుతున్నాను!"
    "అలాగే కానివ్వండి. మీరెందుకు జోక్ చేస్తారు. ఈరోజు ఫస్ట్ ఏప్రిల్ కూడా కాదు గదా?" తనూ నవ్వుతూ అన్నాడు రవి.
    "ఊ. అయితే చెప్పు, స్వప్న అంటే నీ ఉద్దేశ్యం ఏమిటి?"
    చప్పున సమాధానం చెప్పలేదు రవి. ఓ క్షణం ఆగి "ఏ విషయంలో ?" అని అడిగేడు.
    "ఏ విషయంలో నయినా?"
    "అందంలో అయితే మార్వేలేస్! ఐశ్వర్యం లో అయితే మాచ్ లెస్. చదువులో అయితే ట్రెమెండేస్ మానర్స్ లో......"
    "రవీ! తప్పుకోవద్దు. పెళ్ళి విషయంలో నీ అభిప్రాయం ఏమిటి."
    సమాధానం రాకపోవటంతో మళ్ళీ విశ్వేశ్వరం గారే అడిగారు. "అమ్మమ్మగారు దాదాపు మీ వివాహం జరిపించినట్టే చేశారు. నువ్వూ అన్నీ విషయాల్లో చాకచక్యంగా జోక్యం చేసుకుని సుభాష్ అనేట్టుగా ప్రవర్తించేవు. ఇదంతా ఈ సంపదపై వ్యామోహామా? లేక అమ్మమ్మగారి ఆజ్ఞాబద్దమా? లేకపోతే నువ్వు నిజంగా స్వప్నని యిష్టపడుతున్నావా?" గబగబ అడిగేరు అయన.
    దానికీ సమాధానం యివ్వలేదు రవి.
    "రవీ! జాగ్రత్తగా ఆలోచించుకో! పెళ్ళంటే మాటలు కాదు. నూరేళ్ళ పంట! సినిమాకి వెళ్ళి నచ్చకపోతే మధ్యలో లేచి వచ్చేసినట్టుగా చెయ్యలేం! చొక్కా కుట్టించుకుని యిష్టం లేకపోతే వదిలేసినట్టుగా వదిలేయ్యలెం------అలాగే-------"
    'సరే!' అయన మాటలకీ అడ్దోచ్చాడు రవి.
    "ఊ! ఏమిటి నీ అభ్యంతరం?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS