Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 44

 

    "వాడికేం ఇచ్చావు?"


    "ఏమి ఇవ్వలేదు. డ్రైవింగ్ లైసెన్స్ అడిగాడు. చొక్కా లోపల వుందని ఓ గుండీ తీసి లోపలున్న డైవింగ్ లైసన్స్ తీసి చూపించా.....'


    "ఇంకా....."


    "ఆర్ సి బుక్కడిగితే రెండో గుండీ విప్పి లోపలున్న ఆర్ సి బుక్ తీసి చూపించా...."


    తలమీద కొట్టుకున్నాడు గరుడాచలం.


    కేనటిక్ స్టార్టయింది.


    తప్పనిసరిగా కేనటిక్ మీద, పీలూ వెనుక కూచున్నాడు.


    అతని మనసంతా అదోలా అయింది.


    పీలూ మాత్రం టేకిటిజిగా బండిని నడిపిస్తోంది మరేమీ ఆలోచించకుండా.

 

                                                          * * *


    "చూడమ్మా సమీరా! రేపు ఉదయం సారధి స్టూడియోకి వచ్చేయ్ పదిగంటలకు. ఘాటింగ్ ఉంది." చెప్పాడు డైరెక్టర్.


    "సరే" అంది అంతకుముందు చేసిన ప్రోగ్రాం తాలూకా చెక్స్ అందుకుంటూ.


    చందూ, తనూ, కలిసి చాల రోజులైంది. ఈ డబ్బులతో చందూకి మంచి డ్రెస్ తీసుకోవాలి. ఓ పిక్చర్ కి తీసుకెళ్ళాలి అనుకుంది సమీర బస్ స్టాఫ్ కి నడుస్తూ.


    సరిగ్గా అప్పుడే శ్రీచంద్ర సమీర కోసం వస్తున్నాడు.


    "హాయ్ చందూ! ఏంట్రా ఇలా వచ్చావ్?" గట్టిగా అంది సమీర బస్ స్టాఫ్ లో నుండే చెయ్యి ఉపుతూ.


    "ఏంటా పిలుపు? ఎన్నిసార్లు చెప్పానలా పిలవద్దని" కోపంగా అన్నాడు శ్రీచంద్ర.


    "అబ్బ! ఎంత కోపం....అయినా కోపంలో కూడా అందంగా వున్నవులే"


    "చాల్లే సంబడం. ఏంటి ఇంటికేనా?"


    "అవును వస్తావా నువ్వు కూడా. అమ్మ చక్రపొంగలి, పులిహొర చేసింది రోజు."


    "నీకు నేను తిండిపోతులా కనిపిస్తున్నానా?"


    "అదేం కాదులే. పాపం తృప్తిగా తిని ఎన్ని రోజులయిందో కదాని తింటావని"


    "తమరంత జాలి చూపించాల్సిన అవసరం లేదు గానీ అలా రెస్టారెంట్ కి వెళ్లి మాట్లాడుకుందాం రా" అన్నాడు శ్రీచంద్ర.


    "నా దగ్గర ఓ హండ్రెడ్ ఉంది అంతే. చెక్కు తిసుకోరుగా" అంది అమాయకంగా మొహం పెడుతూ.


    "ఆ....చెక్కులు, క్రెడిట్ కార్డులూ, తీసుకునే హోటలెం కాదులే. కామత్ కి వెళ్లి టిఫిన్ చేసి వెల్లిపోదాం పద" అన్నాడు.


    "ఆహా! ఇన్నాళ్ళకి నా జన్మ ధన్యమైంది గురూ" అంది సమీర మెచ్చుకుంటూ.


    "లాంగ్వేజ్ మార్చు అమ్మడు......గురు అట గురూ. బొత్తిగా మొగుడనే భయం, భక్తీ లేవు నేటి ఆడపిల్లలకి."


    "సారీ" మనస్పూర్తిగా అంది సమీర.


    "ఇద్దరూ అక్కడ దగ్గర్లో వున్న హోటల్ కి నడిచారు.


    
                                                                  * * *


    "మీ ప్రశ్న- మా జవాబు" షూటింగ్ జరుగుతోంది ఆ ఫ్లోర్ లో.


    సమీర చీర కట్టుకుని మేకప్ అయి రెడీగా కూర్చుంది. కో యాంకర్ రవి వచ్చి మరో కుర్చీలో కూర్చున్నాడు. సమీర చేతిలో ఆ వారం ప్రోగ్రాం మీద వచ్చిన ఉత్తరాల కట్ట వుంది.


    "స్టార్ట్ చేద్దామా?" అన్నాడు డైరెక్టర్.


    "ఓసారి రిహార్సల్స్ వేసుకుందాం సార్!" అంది సమీర.


    "నో....నో....నో....రిహార్సల్స్ ఎక్స్ ప్రేషన్స్ ఒరిజినల్ గా ఉంటేనే బావుంటాయి. సో వుయ్ స్టార్ట్ ద ప్రోగ్రాం" అన్నాడు.


    "మీ ఇష్టం!" అంది సమీర.


    షూటింగ్ మొదలైంది.


    "మీ ప్రశ్న- మా జవాబు' ప్రోగ్రాంకు స్వాగతం- సుస్వాగతం. అతధిక అభిమానులు గత వారం వచ్చిన మా ప్రోగ్రామ్స్ మీద అభిమాన వర్షం కురిపించారు. ఆ వర్షంలో తడిసి కాస్త జలుబు కూడా చేసి కోల్డరిన్ వేసుకున్నాం. ఇప్పుడు కాస్త తగ్గింది గనుక ప్రోగ్రాం చేయడానికి వచ్చాం. మరి మొదలెడదామా" అంది సమీర చిరునవ్వుతో.


    "మొదటి ఉత్తరం....తిక్కలరెడ్డిపాలెం నుండి టి. తిక్కమ్మ ఇలా రాసారు. "వేసిన ప్రోగ్రామ్స్ నే వేసి రిపీట్ చేసి మరి మమ్మల్ని బోర్ కొట్టిస్తున్నారు. కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చేయొచ్చుకదా" అని చదివి సమాధానం చెప్పమన్నట్లు రవి వంక చూసింది.


    "మరి అంత బోర్ కొడితే బీరు తాగండి తిక్కమ్మగారు. అయినా మీ ఇంట్లో వారం రోజుల్లో ఒకసారి చేసిన కూర మళ్ళీ వండుతారా లేదా? అలాగే ఇదిను. మీరు వండుకు తింటే తప్పులేదు గానీ మేం వేసిన ప్రోగ్రామ్స్ వేస్తె తప్పేంటి?" అన్నాడు రవి నవ్వుతూ.


    "శభాష్ రవీ! బాగా చెప్పారు. అన్నట్లు మరో ఉత్తరం. తాటిపాక నుండి రాజబాబు గారు రాస్తున్నారు. 'సమీర గారూ! మీరు మరీ మంచి మంచి చీరలు డ్రెస్సులు వేసుకురాకండి. మా ఆవిడ చూసి అలాంటివి కొనమని చంపుతోంది. ఎలా చచ్చేది?' అని రాస్తున్నారండి' అంది సమీర తన చిరాల్ని మెచ్చుకున్నాడని తెగ మురిసిపోతూ.


    "చూడండి రాజబాబుగారూ! మీ ఆవిడ కళ్ళకు గంటలు కట్టేసి ఆడియో మాత్రం వినమని చెప్పండి సరిపోద్ది' అన్నాడు సింపుల్ గా రవి అన్సర్ ఇస్తూ.


    "ఆ! మరో ఉత్తరం. బందర్ నుండి సుందరి రాస్తున్నారు. ఆరో తారీకు మీరిచ్చిన పజిల్ పూర్తీచేసి పంపాను. విజేతల లిస్టులో నా చిరునామా చదివారు. కానీ నాలుగునెలలయినా ప్రైజ్ పంపలేదు. కారణం ఏమిటి? ఎప్పుడు పంపిస్తారు' అని .


    "చూడండి సుందరిగారు! మీ చిరునామా చదివాం కదా. సంతోషించండి, ప్రైజ్ కోసం మూగమనసుల్లో జమునలా ఎదురు చూడకండి. అది మా ఛానల్ ఆఫీసులో ఆఫీసర్ల ఇంటికి ఎప్పుడో చేరిపోయి వుంటుంది" నవ్వుతూ చెప్పాడు.


    "ఎవరింటికి?" అడిగింది కుతూహలంగా.


    "షూటింగ్ పూర్తయ్యాక చెప్తాన్లే గానీ రికార్డవుతోంది నెక్స్ట్ చదవండి"


    "మొన్న మీరు చికెన్ కర్రీ ఎలా వండాలో చెప్తున్నప్పుడు సగంలో మా కరెంట్ పోయింది. సో నేను మొదలుపెట్టిన కర్రీ వండడం పూర్తీ చేయాలి. దయచేసి ఈ లెటర్ అందగానే చెప్తే నేను వంట పుర్తిచేస్తాను అని సరోజ, వరంగల్ నుండి రాస్తున్నారు."


    "చూడండి సరోజగారు! చెప్పేవాళ్ళమే ఆ కర్రీ ఎలా పూర్తీచేయాలో. కానీ మా వంటలతను రాలేదు కనుక వచ్చే వారం చెప్పడానికి ట్రై చేస్తాం. ఈలోగా ఆ కర్రీ మీ సొంత తెలివి తేటలతో పూర్తిచేసుకుని తినండి. ఆపైన వారం చూడ్డానికి మీరిక ఉండకపోవచ్చు" ముక్కు మూసుకుంటూ "నేక్స్త్" అన్నాడు.


    "వింతరాగాలు సీరియల్ ని ఎందుకలా పొడిగిస్తున్నారు. మాకు విసుకొస్తుంది. సాగదీయకుండా మంచి కధతో ప్రసారం చేయగలరు అని పండు, చిట్టి, కన్న ముంబాయి నుండి రాస్తున్నారండి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS