Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 43

 

    "కాదు, ముందు నాకు జిలేబి కావాలి. ఆ తరువాత అన్నం అన్నాడు.

    "సరేలేరా జిలేబి ఇస్తానుగానీ గొడవచేయకు" అంది జయంతి

    రామశేషు, సర్వోత్తమరావు, మాధవరావు, సుందరం అందరూ వరుసగా కూర్చున్నారు.

    "వదినమ్మా! నువ్వు కూడా కూర్చో వడ్డించేస్తాం. పొద్దుపోయింది అంది కస్తూరి.

    "మీతోపాటే తింటాలేవే! ముందు అబ్బాయి వాళ్ళకు వడ్డించు అంది భ్రమరాంబ.

    "ఎందుకు వదినమ్మా! పెద్దవాళ్ళు ఆలస్యంగా భోంచేయకూడదు కూర్చోండి" అంది కస్తూరి.

    "కూర్చో అక్కా! మనందరం కలిసి భోంచేసి చాలా రోజులైంది. పనుల హడావుడిలో అందరం కలిసి భోంచేయలేకపోతున్నాం.....ఏంటో అందరం ఒకే ఇంట్లో ఉంటున్నా , ఎవరిదారి వారిదే అన్నట్లు తయారైంది అన్నాడు సర్వోత్తమరావు.

    మాధవరావు మనసు చివుక్కుమంది అన్నగారి మాటలతో.

    "దాన్దేముందిరా! రేపట్నుంచి అందరం కలిసే భోంచేద్దాం. ఇదిగో అమ్మాయిలూ! మీ మొగుళ్ళకు చెప్పండి. పొద్దుటపూట కాకపోయినా రాత్రి మాత్రం అందరూ తప్పనిసరిగా తొమ్మిదిగంటలకు ఇక్కడ కూర్చుని భోంచేయాలి. ఎవరు రాకపోయినా బావుండదు, ఎవరు ఆలస్యంగా వచ్చినా బావుండదు" అంది భ్రమరాంబ.

    ఆమె మాటలు అందరికీ ఆనందాన్ని కలిగించాయి. ఒక్క సోమసుందరానికి తప్ప, సోమసుందరం కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు.

    కస్తూరి నవ్వుకుంటూ అందరికి వడ్డించింది.

    "వదినా! ఒకపని చేయండి. మీరు కూడా కూర్చోండి, అందరం కలిసి భోంచేద్దాం. అన్నం కూరలు అన్ని మధ్యలో పెట్టండి. ఎవరికి కావాల్సివస్తే వాళ్ళు తీసుకుని వడ్డించుకుంటారు...." అన్నాడు మాధవరావు.

    "అదెలా కుదురుతుందయ్యా! వడ్డించుకోవటం ఇబ్బందికదూ..." అంది కస్తూరి.

    "ఏమి ఇబ్బంది ఉండదు. కూర్చో -కావాలంటే నేను వడ్డిస్తాను" అన్నాడు సర్వోత్తమరావు.

    ఆ మాటలకు అందరూ నవ్వారు.

    "కూర్చోమ్మా! తమ్ముడు చెప్పినట్లు అందరం కలిసే భోంచేద్దాం" అన్నాడు రామశేషు.

    కస్తూరి, దాక్షాయణి, శివపార్వతిలవేపు చూసింది.

    "ఏంటి ఆలోచిస్తున్నారు...? రండి పిన్ని కూర్చోండి....." అంది జయంతి.

    "సురేంద్ర, గిరిజలను కూడా పిలవండి. కొత్త దంపతులు లేకపోతే ఎలా?" అంది కస్తూరి.

    అందరూ బారులు తీరి కూర్చున్నారు. ఆడవాళ్ళంతా పట్టుచీరెలు కట్టి తలనిండా పూలు పెట్టుకుని సిగ్గుపడుతూ కూర్చున్నారు.

    "అబ్బ! మనిల్లు ఇలాగే కలకాలం కళకళలాడుతూ వుండాలి. ఏ చెడుచూపు మనమీద పడకూడదు" అంది భ్రమరాంబ.

    "పడిందక్కా! ఈ అనందం సంతోషం ఇంకా ఎన్నాళ్ళో వుండదని నాకనిపిస్తుంది అని మనసులోపలే అనుకున్నాడు మాధవరావు దిగులుగా.

    "ఇంతకీ ఏం వంటకాలు చేశారు.....?" అడిగాడు సర్వోత్తమరావు.

    "ఈరోజు అయన చాలా హుషారుగా ఉన్నారు. అందర్నీ ఇలా ఒకేచోట చూసుకోవటంవల్ల ఆయనకు పట్టరాని అనందం కలుగుతుంది.

    "నేను చెపుతాను నాన్నగారూ! పులిహోర, అన్నం పాయసం, గోంగూరపచ్చడి, వంకాయవేపుడు, పప్పుచారు, రసం, నెయ్యి, పెరుగు అవి మన దీపావళి స్పెషల్ వంటకాలు" అంది
    "అబ్బో! చాలా చేశారేపాపం" అంది భ్రమరాంబ.

    అలా అందరూ ఆనందంగా, హాయిగా కబుర్లు చెప్పుకుంటూ దాదాపు గంటసేపు కూర్చుని భోంచేశారు.

                                           23

    "ఏయ్ జయంతి! అగవే ఏంటా పరుగు నడక. మేము వస్తున్నాము కదా...కాస్త మెల్లగా నడువు తల్లీ" అంది రాధ.

    "లేకపోతే ఏంటే ఆ పెళ్ళి నడక" ఇప్పటికే ఆలస్యమవుతుందని నేను భయపడి చస్తుంటే" అంది జయంతి.

    "ఏమంత ఆలస్యమయిందని? టైం ఇప్పుడు నాలుగున్నరే" అంది మరో స్నేహితురాలు విద్య.

    "మన స్కూలునుంచి ఇంటికి కనీసం అరగంట సేపు నడవాలంటే ఇంటికెళ్ళేసరికి ఐదుగంటలు , ఆలస్యం కాక మరింకేమిటి? ప్రతిరోజూ నాలుగు గంటలకు ఇళ్ళకు చేరుకుంటాం. ఈరోజు ఆ వెధవ ఆటలు ఆడటం వల్ల ఆలస్యమయిపోయింది" అంది జయంతి.

    "ప్రెసిడెంట్ గారి అమ్మాయి అంత కంగారు పడిపోతే ఎలాగే..." అంది రాధ కంది చేలో నుంచి నడుస్తూ.

    "అబ్బ! ఏయ్ రాధ...అగవే కందికాయలు చూడు ఎంత బాగున్నాయో, కొన్ని కోసుకుని వెళ్దామే" అంది విద్య.

    "ఏయ్ రాదా! కందికాయలు లేవు, శనక్కాయలు లేవు, పదండి పోదాం అసలే కందిచేను ఆ గోపాలరావుగారిది మనం అయన చేలో కందికాయలు కోశామని తెలిస్తే, గొడవ అవుతుంది. నోరు మూసుకుని త్వరగా పోదాం పదండి" అంది జయంతి.

    "చేనంతా కోస్తామా ఏంటే....ఏవో కాలక్షేపం కోసం నాలుగు కాయలు కోసుకుంటాము" అంది రాధ.

    "చూడు రాధ! మీరు కోసుకుంటే కోసుకోండి నేను వెళుతున్నాను" అంది జయంతి.

    "పోవే! పెద్ద బడాయి. మాకు భయమా ఏమిటి? మేము ఎంచక్కా మా వొడినిండా కాయలు కోసుకునే వస్తాం" అంది రాధ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS