రెండువందల యాభైయిస్తాను ఇష్టమేనా?" అని కరుగ్గా. అడిగాడు. విధిలేనట్టు నవ్వి, చాలా అసహ్యంగా చూస్తూ " అదేదో యిటివ్వు-ట్రైన్ వచ్చేస్తోంది. వెళ్ళాలి" అని వాచ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు సింగ్ .
లోకాచారి ఆ వాచ్ పెట్టుకున్నాడు. తన తోటిరైల్వే వాళ్ళు తప్ప మిగిలినవాళ్ళంతా " వాచ్ చాలా బావుందిలోకా, కొత్తదా-ఖరీదెంత?" అని అడుగుతుంటే , సెకండ్ హ్యాండ్ వాచ్ ని కొత్తదని భ్రమసిపోతుంటే లోకచారి ఆనందం చెప్పేందుకు వీలులేదు.
అవతల వ్యక్తి పీకలోతు కష్టాల్లో వున్నప్పుడు ఆ వ్యక్తి నిస్సహాయతను లాభం కింద మార్చుకోవటంలో వున్న ఆనందాన్ని అనుభవించటం నేర్చుకున్నాక యిక ఎప్పుడూ ఆదృష్టే వుంటుంది. దాంతో అతను ఆ తరువాత సెకండ్ హ్యాండ్ లో కొననివస్తువంటూ లేకపోయింది.
ఉంగరాలు, మంచాలు బెడ్ షీట్ లు, రేడియోలు, టేప్ రికార్డర్లు, మిక్సీలు, గ్ర్రైండర్లుటి.మీ., ఒకటేమిటి అది ఏదయినా సరే సెకండ్ హ్యాండ్ గా వుంటే చీఫ్ గా వస్తుందంటే వదిలిపెట్టాడు. యింట్లో వుండాల్సిందే.
ఎంత చీఫ్ గా కొంటాడో అంత ఖరీదుకి అమ్ముతాడు. తనకు ఎక్కువయిన దానినిఅవతల మనిషికి అది బాగా అవసరమైనప్పుడు అప్పుకి ఇస్తారు,ఇక దాని మీద లాభం. తను ఇచ్చిన వస్తువు మీదవడ్డీ-ఇలా రెండు విధాలా లాభం. తను ఇచ్చిన వస్తువు మీద వడ్డీ- ఇలా రెండు విధాలా లాభం గుంజుతాడు, జైబ్ లో పర్మినెంట్ అయిపోయాడు. జీతం కూడా బాగానే పెరిగింది.
ఇప్పుడు అతనిల్లు చిన్న సైజు ఎగ్జిబిషన్ స్టాల్ లా అయిపోయింది. ఆ మధ్య పాపం భార్య జబ్బుపడి ఆసుపత్రిలో వుంటే ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు ఓ సహోద్యోగి తను కొత్తగా కొనుక్కున్న మోపెడ్ ను అమ్ముతానన్నాడు. ఆపరేషన్ అనే మాట ఎప్పుడయితే వినిపించిందో కొత్త మోపెడ్ ను మరీ చీప్ గా అడిగాడు.
అతను ఏమీ చేయలేక- మరోదారిలేక మోపెడ్ ను లోకాచారి ఆడిగిన ధరకి ఇచ్చేశాడు. లోకాచారి ఆనందాన్ని కొలిచేందుకు ఏ సాధనమూ లేదు. మెపెడ్ మీద వెళుతూ ఆడపిల్లలవైపు గర్వంగా చూసేవాడు.
లోకాచారి లో పెళ్ళి ఆలోచన కలగచేసింది అతని అత్త. ఆమె సుళ్ళూ రుపేటలో వుంటుంది. చుట్టం చూపుగా వచ్చినప్పుడు భోజనాలు వండి- వడ్డించి-ఇద్దరూ కలిసి తింటున్నప్పుడు మెల్లగా విషయంలోకి వచ్చింది.పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం గురించి, చేసుకున్నాక వచ్చే లాభాల గురించి చెప్పింది.
అంతా విన్న లోకాచారి చివరికి సరేనన్నాడు.
తనవై పెళ్ళికూతుర్ని చూస్తానంది. వెళ్ళిన నెలకే ఓ సంబంధం వచ్చింది. మరో నెలకు అంతా పెళ్ళయిపోయింది. కొత్త భార్య, కొత్త సంసారం, కొత్తరుచులు, లోకాచారికి రోజులు హాయిగా సాగిపోతున్నాయి.
భార్య పేరు ఉషారాణి. చదువేం లేదు. అందువల్ల లోకజ్ఞానం చాలా తక్కువ. బతికేందుకు ఎంత తెలివితేటలుంటే సరిపోతుందో అంతే తెలివితేటున్నాయి. భార్య సంగతంతా తెలిసి మరింత సంతోషపడ్డాడు లోకాచారి. భార్య ఎంత తెలివితక్కువదయితే భర్త అంత సంతోషంగా వుంటాడన్నది అతని నమ్మకం.అందుకే భార్యలంటే చాలా యిష్టమైపోయింది.
ఉషారాణకి భర్త ఏమిటో తెలిసింది. సంసారం లాక్కొచ్చేవిధానం, పొదుపు, సెకంహ్యాండ్ వస్తువులు కొనడంలో అతనికి వుండే ప్రావీణ్యం అన్నీ కనిపెట్టింది. అంతే కాకుండా సెకండ్ హ్యాండ్ వస్తువులే కలిసోస్తాయన్న విషయాన్ని కూడా గ్రహించింది.
ఆమె కాపురానికి వచ్చిన కొత్తలో తల్లిదండ్రులు ఇచ్చిన మొత్తంలో కొత్త మిక్సీ కొనాలనుకుంది. ఆ విషయం వింటూనే లోకాచారి తేళ్ళూ జెర్రులూ పాకినట్టు ముఖం పెట్టాడు. "కొత్తదా!" అంటూ ఆశ్చర్యపోయాడు-అంతకు ముందు తను కొన్న సెకండ్ హ్యాండ్ మిక్సీని తనకు అవసరం లేదని అమ్మటం ఎంత బుద్దితక్కువ పనో అప్పటికి తెలిసొచ్చింది లోకాచారికి.
కొత్త భార్య ముచ్చటపడి చెప్పడంతో ఇద్దరూ వెళ్ళి కొత్త మిక్సీ కొన్నారు. అదివారం రోజులు పని చేసింది గానీ ఆ తరువాత మొండికేసింది. హై ఓల్టేజ్ రావడంతో లోపలున్న మిషన్ కాలిపోయిందట.
దాన్ని రిపేరు చేయటానికి టౌన్ లో యిచ్చాడు. ఆ రిపేరు షాపు వాడు ఓ రాత్రి పర్మినెంట్ గా దుకాణం ఎత్తేశాడు. అలా జీవితంలో మొట్టమొదటగా కొన్న మిక్సీ వారం రోజులకే పర్మినెంట్ గాపోయింది.
దీంతో ఉషారాణికి కూడా బాగా బుద్దొచ్చింది. "అవునండీ- మీకు ఫస్ట్ హ్యాండ్ వస్తువులు అస్సలు కల్సిరావు" అని భర్త ముందు ఒప్పుకుంది. పెళ్ళికావడంతో లోకాచారి మరింత లావయ్యాడు. కొత్తకళ వచ్చింది. భార్య వచ్చింది కదా అని దుబారా పోయేవాడు కాదు. ఏదిగానీ పొదుపు, చివరికి బెడ్ రూమ్ లో కూడాపొదుపే.
" అంతే మరి. పైసా ఖర్చులేదని బెడ్ మీద వాలిపోతే చివరికి కాళ్ళు పట్టుకుపోతాయ్. ఇప్పుడు ఫరవాలేదుగానీ ముసలితనం వచ్చినప్పుడు కీళ్ళనొప్పులు- అబ్బో నరకం" అనేవాడు. భార్యకీ అదే చెప్పేవాడు.ఎంత వరకు వుండాలో అంతవరకే వుండేవాడు. మితిమీరిన శృంగారం కూడా మంచిదికాదని భర్త చెప్పడంతో ఆమె కూడా నిజమేనని నమ్మింది.
లోకాచారి ముందున్న గుడిసెను కొట్టేసి దానిస్థానంలో చిన్న మిద్దెఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. ఈ ఐడియా కూడా బలరామయ్య కుటుంబం మద్రాసుకి వెళ్ళిపోతుందని తెలిసినప్పుడు వచ్చింది.
బలరామయ్యది పెద్ద పెంకుటిల్లు. సిమెంట్ ఇటుకలతో కట్టింది. అది శిథిలమైపోయింది. దానిని కొనేసి అందులోని కలపను , రాళ్ళను. తలుపుల్ని ద్వారాల్ని ఉపయెగించుకుని స్వతంగా మిద్దిల్లు కట్టుకోవచ్చు కదా అని ఆలోచనలోపడ్డాడు. ఉషకు చెప్పాడు.
"అంటే ఇల్లు కూడా సెకండ్ హ్యాండ్ వస్తువుల్తో కడతారన్న మాట కానివ్వండి" ఆమె షావుకారిచ్చింది.
అట్లా మరో మూడు నెలలకి ఇల్లు పూర్తయ్యింది.
