శశిరేఖ కాఫీ పెట్టడంలో దిట్ట. రుచిగా వుంటాయి.
మొన్న గుర్తించలేదు గనీ ఈ రోజు టెన్షన్ ఏమీ లేదు కాబట్టి కనిపెట్టింది చింతామణి. "భలే పెట్టావ్ కాఫీ" అంటూ మెచ్చుకుందామె.
శశిరేఖ- చింతామణి మాటల్లో పడ్డారు. చివరికి అలా ఇలా టాపిక్ పిల్లలమీదకి మళ్ళింది.
"నిరుత్సాహపడకు. మీకేమంత వయసైందని? పెళ్ళయి అయిదేళ్ళే గదా! ఏనుగుకాన్పు ఎంతమందికి రాలేదు" ధైర్యంగా చెప్పింది చింతామణి.
"ఏనుగుకాన్పా?" ఆమె ఎప్పుడూ ఆ మాట వినలేదు.
" ఆం! ఏనుగు పధ్నాలుగేళ్ళకి ఓసారి కంటుందంట. అలానే స్త్రీలలో కూడా చాలామందికి పెళ్ళయిన పధ్నాలుగేళ్ళకి పిల్లలు పుట్టారు. అలా చాలా ఏళ్ళకి గర్భం నిలిస్తే ఏనుగు కాన్పంటారు" అని వివరించింది. ఆ తరువాత తనకే ఏదో గుర్తొచ్చినట్టుగా నవ్వి-" దానికి కూడా కాలం కలిసి రావాలి" అంది చిన్నగా నవ్వుకుంటూ,
ఆమె ఏదో గుర్తుకు తెచ్చుకుని నవ్వుతోందని కనిపెట్టింది శశిరేఖ. "ఏమిటి నీలో నువ్వే అలా నవ్వుకుంటు న్నావ్. నాతో చెప్పకూడనిదా?" అడిగిందామె.
" ఛ ఛ! అటువంటిదేం లేదు. లోకాచారి గుర్తొచ్చాడు. అందుకు నవ్వాను" అంది చింతామణి.
"లోకాచారా?" ఆమె వూరికి కొత్త గనకే అడిగింది.
" నువ్వు బయటికి రావు కాబట్టి ఇక్కడి విషయాలేమీ నీకు తెలియదు. మీ ఇంటికి నాలుగిళ్ళ అవతల" అంటూ చేతిలో చూపించింది చింతామణి.
"ఆయన గుర్తొచ్చి నవ్వావా?"
" ఆయనంటే పెద్దోడనుకునేవ్. నిండా ముప్ఫై అయిదేళ్ళుడవ్. కాలం కలిసి రావాలి. అన్నాగదా. ఆసందర్భంగా అతనూ, అతని భార్యా గుర్తొచ్చి నవ్వాను."
" ఏమైంది వాళ్ళిద్దరికి?" శశిరేఖ అదేదో వినడానకి కుతూహలంగా వుందన్న విషయం కనిపెట్టింది.
"అయితే అ వివరాలన్నీ చెబుతాను వుండు. నీకూ కాలక్షేపంగా వుంటుంది" అంటూ చెప్పడం ప్రారంభించింది చింతామణి. ఇదేదో సరదా సరదాగా వుంటుందనిపించింది శశిరేఖకి.
" లాకాచారి అంటేనే ఎవరికైనా గుర్తొచ్చేది సెకండ్ హ్యాండ్ అంతనికి సెకండ్ హ్యాండ్ ఆచారి అనే పెట్టుడి పేరుంది. అతని తండ్రి ఏదో కొంతభూమి పెట్టుకుని వ్యవసాయం చేసేవాడు.ఆయనకి మొత్తం ముగ్గురు మగపిల్లలు, ఓ ఆడపిల్ల సంతానం.
ఆయన అవసానదశకు వచ్చేటప్పటికి రెండోవాడైన లోకాచారి రైల్వే లో కుదురుకున్నాడు.
అప్పట్లో ఇక్కడ్నుంచి బలార్సావరకు కరెంటు రైలు వేయడం ప్రారంభించారు.అప్పుడు కొంతమంది ఎలక్ట్ర్రిక్ పని తెలిసినవాళ్ళుకావాల్సివచ్చారు. లోకాచారి చదువబ్బలేదు. అందులోనూ చదివించే స్థోమతా లేదు. లోకాచారి చదువు మానేశాక అతని తండ్రి టౌన్ లో ఓ ఎలక్ట్ర్రీషియన్ దగ్గర పనికి పెట్టాడు.
అక్కడ అతను ఎక్కువకాలం పనిచేయకపోయినా, బొటాబొటిగా పని నేర్చుకున్నాడు. తిరిగి ఊర్లోకివచ్చి చిన్న చిన్న కరెంటుపనులు చేయడం ప్రారంభించాడు.ఏదో తన ఖర్చులకి సంపాందించునేవాడు.
చిన్నప్పట్నించీ అతను జాగ్రత్తపరుడు. రూపాయి అయినా సరే పదివేలతో సమానంగా చూసేవాడు.
తండ్రి చనిపోయాడు. అందరూ పెళ్ళి వయసుకి వచ్చారు. కూతురి పెళ్ళి అయిపోగానే కొడుకులకి వున్న భూమిని పంచేసింది తల్లి. తలా పదికుంటల పొలం వచ్చింది. మహావస్తే సంవత్సరానకి అందులో మూడు బస్తాల వరి వస్తుంది తప్ప అంతకంటే ఏ ఆదాయమూ రాదు. కరెంటు పనులు కూడా తగ్గాయి.
లోకాచారి ఒంటరివాడు కాబట్టి సరిపోయిందిగానీ లేకుంటేతట్టు కునేవాడు కాదు. లోకాచారి అన్న వెంకటాద్రి బతుకుతెరువు వెతుక్కుంటూ బెంగుళూరు వెళ్ళిపోయి అక్కడో ఆగరత్తుల ఫ్యాక్టరీలోచేరి పోయాడు. ఇక మిగిలింది లోకాచారి. తల్లి కూతురి దగ్గిరికి వెళ్ళి పోయింది.
తల్లిదండ్రులు ఇచ్చిన ఓ చిన్న గుడిసెలో లోకాచారి కాలం వెళ్ళదీస్తున్నాడు.అదిగో ఆ మమయంలో కరెంట్ రైల్ వేస్తున్నామని, లైన్ మీద పని చేసేందుకు మనుషులు కావాలని తెలిసింది.
వెంటనే వెళ్ళిపోయాడు.
ఒడ్డూ పొడుగూ, దేహదారుఢ్యం లేకపోయినా చలాకీగా వుండటంతో అతన్ని పనిలోకి తీసుకున్నారు.
అట్లా అతను రైల్వేలో దినకూలీ అయిపోయాడు.
డబ్బు దగ్గర ఎంత జాగ్రత్తమనిషంటే అంత జాగ్రత్త మనిషి. దీనికీ ఒక ఉదాహరణ చెబుతాను. ఓ సారి టౌన్ నుంచి ఈ వూరికి బస్సెక్కాడు. అప్పుడు వూరికి ఒకటీ ముప్పావలా. అతను పదిరూపాయల నోటిచ్చాడు. కండక్టర్ తిరిగి ఎనిమిది రూపాయలు ఇచ్చాడు గానీ పావలా ఇవ్వలేకపోయాడు. క్యాష్ బాగ్ లో లేదు.
చిల్లర లేదయ్యా ఈసారి కనిపించినప్పుడు ఇస్తాలే అని కండక్టర్ ఏదో ఆషామాషీగా చెబుతుంటే లోకాచారికి ముంచుకొచ్చింది. పావలా ఇచ్చేంత వరకు దిగనన్నాడు.
అలానే బస్సులో పది కిలోమీటర్లుండే పర్పేడు వరకు వెళ్ళి అక్కడ పావలా తీసుకుని ఒస్ లో వస్తే ఛార్జీ లాస్ అని నడిచొచ్చాడు. అదీ అతని పరిస్థితి.
ఇలాంటివాడు కావడంతో జీతాన్ని మిగిలించగలిగాడు. రూపాయి రూపాయి కూడబెటుతున్నాడు.
రైల్వేలో నానా రకాల మనుషులుంటారు. అదోపెద్ద సముద్రం లాంటిది.తాగుబోతులూ, జాదర్లు, మంచివాళ్ళు, డబ్బున్నవాళ్ళు- యిలా ఎన్నోరకాలు. కొందరు వచ్చిన జీతమంతా జల్సాలకు ఖర్చుపెట్టేసి వడ్డీకి డబ్బులు తీసుకుంటూవుంటారు.
ఇది జాగ్రత్తగా గమనించాడు లోకాచారి. వడ్డీకి తిప్పడం లాభదాయకమని తెలుసుకున్నాడు. తన దగ్గిర మిగిలిన ఆకాసిన్ని డబ్బుల్నీ వడ్డీకిచ్చాడు.
ఇలా కొంతకొంత డబ్బుచేరటం ప్రారంభించింది.
ఓరోజు సింగ్ అనే ఓ వ్యక్తి లోకాచారిని వెదుక్కుంటూ వచ్చాడు.అతనిది ఎక్కడో పంజాబ్. ఈమధ్య కొత్తగా పెళ్ళయింది అర్జంట్ గా ఇంటికి రమ్మని టెలిగ్రాం రావడంతో వూరికి బయలుదేరాడు. కానీ దారి ఖర్చులకి డబ్బులేదు.ఎవరో చెబితే లోకాచారి దగ్గిరికి వచ్చాడు. విషయమంతా చెప్పి డబ్బులడిగాడు.
" వడ్డీకిస్తాను- కానీ తిరిగి నువ్వు వస్తావన్నా గ్యారంటీ ఏమిటి?" అనడిగాడతను.
" నువ్వు రాకుంటే నేనేంచేయాలి?"
ఇలా ప్రశ్నలతో సింగ్ కి విసుగెత్తించాడు.
ఇకలాభం లేదని సింగ్ "పోని ఒకపనిచెయ్.... అప్పూ వడ్డీవద్దు. ఇదిగో ఇది హెచ్.ఎం.టి. వాచ్ కొనుక్కో" అని కొత్త ప్రపోజల్ పెట్టాడు.
అతను వూరెళ్ళే తొందరలో వున్నాడు.టెలిగ్రాం రావడంతోనే అతను హడలిపోయాడు.
లోకాచారి వాచ్ ని తీసుకున్నాడు. రైల్వే స్టేషన్ లోంచి బజారులోకి వచ్చాడు. తనకు తెలిసిన వాచ్ రిపేరు షాపు వాడి దగ్గరికి వెళ్ళాడు.ఎంతకు తీసుకోవచ్చో అడిగాడు. అయిదు వందలకి అద్దుకుని తీసుకోవచ్చాన్నాడు. తిరిగి లోకాచారి స్టేషన్ లోకి వచ్చాడు.
