"చూడను! అంతటి భయంకర విషయాల్ని పట్టించుకోను. సింపుల్ గా ఈ రోజెన్ని హత్యలయ్యాయి? ఎంతమంది పిల్లల్ని ఎత్తుకుపోయారు? ఎన్నిచోట్ల బస్సులూ, రైళ్ళూ తిరగబడ్డాయి? లాంటి సాధారణ విషయాల్ని మాత్రమే చూసి బాధపడి "ప్చ్....ప్చ్...." అని రెండుసార్లు అనుకునే సామాన్యుడ్ని" అన్నాడు.
లీలా, ధృతీ నవ్వేశారు.
ప్రేమ్ అసహనంగా టైం చూసుకుంటూ "పదండి" అన్నాడు.
"క్యారీఆన్! ఎక్కడికో వెళుతున్నారనుకుంటాను" అన్నాడు నవీన్.
"ఆ...లంచ్ చేయడానికి వెళుతున్నాం. నువ్వూ రాకూడదూ?" అంది ధృతి ఆప్యాయంగా.
ప్రేమ్ అక్కడినుండి కదిలి స్పీడ్ గా వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతున్న ప్రేమ్ నే చూస్తూ "నేను రాను ఆయన ఎక్కడికో మీటింగ్ కి వెళ్ళాలన్నారు" అన్నాడు.
ధృతి, లీలా ముందుకు నడిచారు.
ప్రేమ్ ముభావంగా మారిపోయాడు.
లీల కాసేపు ఏవేవో జోక్స్ చెప్పింది.
ధృతి మాత్రమే నవ్వింది. అతను పెద్దగా 'ఇంట్రెస్ట్' చూపించలేదు.
లీల లేచి టాయ్ లేట్ వైపు నడవగానే.....
"ఏమిటి అదోలా వున్నారు ప్రేమ్?" అనడిగింది ధృతి.
అతను చెప్పాలా, వద్దా? అన్నట్లు ఓ నిమిషం తటపటాయించి.....జుట్టులోకి కుడిచెయ్యి పోనిచ్చి రాసుకుంటూ-
"నవీన్ మన కంపెనీలోనే డ్రయివర్ ఉద్యోగం చేయడం నీకు నిజంగా బావుందా?" అనడిగాడు.
ఆమె సూటిగా అతనివైపు చూసి "మధ్యలో నాకు బావుండటం ఎందుకూ? అతనికి ఉద్యోగమవసరం కాబట్టి చేస్తున్నాడు" అంది.
"ఇందాక చూడు! నువ్వు నన్ను తెగ ఇరకాటంలో పెట్టావు.....లంచ్ కి అతన్ని నువ్వు 'ఇన్వైట్' చేయగానే అతను సరేనంటాడేమోనని నేను తెగ కంగారుపడ్డాను."
ధృతికి అతను చెపుతున్నది అర్ధంకానట్లు అయోమయంగా అతని కేసి చూస్తూ వుండిపోయింది.
"అతను వెనకబడిన తరగతులకు చెందినవాడే అనుకుంటాను. ఆ క్వాలిఫికేషన్స్ తో, సర్టిఫికెట్స్ తో మరో చోట 'ట్రై' చేయవచ్చుగా!"
అతని మాటలు పూర్తిచేయకుండానే ఆమె వేగంగా "సమాజంలో బలహీనతల్ని వుపయోగించుకుని బలపడటం గొప్ప కాదు. బలహీనంగా వున్న సమాజంలోని బలహీనతలు ఏమిటో తెలుసుకుని, వాటిని పోగొట్టడానికి కృషి చేయడం వుత్తమ లక్షణం. కులంవల్లో మతంవల్లో ఏదో పొందుదామనే వుద్దేశ్యం అతనికి లేదు. అతనికి తన స్వయంకృషిమీదే పరిపూర్ణ విశ్వాసం. అసలు నవీన్ లాంటి స్నేహితుడ్ని పొందడం..." అని ఆవేశంగా అనబోతుండగా లీల వచ్చేసింది.
ప్రేమ్ మొహం చాలా ఎర్రగా మారిపోయింది.
"ఏమిటీ ఏదో చెపుతున్నావు?" అంది లీల.
"స్నేహం గురించి."
"అదేమిటో నాకూ కాస్త బోధించు."
"సిరిసంపదలు స్నేహితుల్ని సృష్టిస్తాయేమోకాని దారిద్ర్యం మాత్రం స్నేహితుల్ని పరీక్షిస్తుంది. అటువంటి సమయాలలోనే స్నేహం చేయడానికీ, నిలుపుకోడానికీ తేడా తెలిసివచ్చేది" అంది నవ్వుతూ.
"ఇక బయల్దేరదాం" ప్రేమ్ లేచి నిలబడి చెప్పాడు.
* * *
ధర్మానందరావుగారు రెండు రోజులు వరుసగా ఆఫీసుకి రాలేదు. ఇంట్లో కూడా కనిపించకపోయేసరికి ప్రేమ్ ని అడిగింది.
అతను భుజాలెగరేసి "ఆయన ఎవరితో ఏమీ చెప్పడు" అని వెళ్ళిపోయాడు.
సుబ్బరాజుకి కూడా తెలీదన్నాడు.
మూడవరోజు కనుచీకటి పడుతూ వుండగా ఆయన కారు వచ్చి ఆగింది.
ధృతి ఆతృతగా గుమ్మంలోకి వచ్చి నిలబడింది.
"నవీన్! నువ్వు కూడా చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు..... రేపు డ్యూటీకి రాకు" అని చెప్పి చకచకా ఇంట్లోకి వెళ్ళిపోయారు.
అతను "సరే" అని వెనుతిరిగి వెళ్ళిపోయాడు.
ఆమె గట్టిగా చప్పట్లు కొట్టి పిలిచింది.
అతను వెనక్కి తిరగలేదు.
ఆమె కాసేపు సందేహించి చివరికి ఆయన దగ్గరకు వెళ్ళి పలకరించడానికి నిశ్చయించుకుంది.
ఆమె వెళ్ళేసరికి ఆయన స్నానంచేసి నైట్ డ్రెస్ లోకి మారినట్లున్నారు. వాలుకుర్చీలో పడుకుని పైప్ తాగుతున్నారు.
ఆమె సమీపంగా వెళ్ళి నిలబడింది.
ఆయన ఆమెవైపు చూడలేదు.
వచ్చినంత నిశ్శబ్దంగానూ వెనుతిరిగింది. రెండు అదుగులు వేసేసరికి-
"ధృతీ! వెళ్ళిపోతున్నావేం?" అన్నారు.
ఆయన తనని గమనించారని తెలీగానే ఆమె ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరకొచ్చి "ఏదో ఆలోచిస్తున్నారు కదా అని" అంది.
"ఆలోచన అనేది అంతం లేనిది. ఒకదానిలోంచి ఒక దానిలోకి గోలుసులుగా సాగుతూ, మనసుని ప్రశాంతంగా వుండనివ్వదు. కానీ ఆ ఆలోచనలు ఆగిపోతే మనిషి జీవితానికి 'ఫుల్ స్టాప్' పెట్టినట్లే అందుకే 'కామా' మాత్రమే పెట్టి కాసేపు ఆపుతూ వుండాలి" అన్నారు.
ఆమె చిరునవ్వు నవ్వు "రెండు రోజులనించీ కనిపించలేదు. ఒంట్లో బావుందా?" అనడిగింది.
ఆయన జవాబు చెప్పలేదు. "కూర్చో" అన్నారు.
ఆమె కూర్చుని ఏదో చెప్తారని చూడసాగింది.
"ఒకసారి మోసపోతే మోసం చేసినవాడి తప్పు మళ్ళీ మళ్ళీ మోసపోతే మన తప్పు! కాదంటావా?" అడిగారు.
"అవును" అంది వెంటనే.
"మరి ఈ మనుషులెందుకు మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి మొగ్గు చూపిస్తారూ?"
ఆయన ఏం చెప్తున్నాడో అర్ధంకాక మధ్యలో ప్రశ్నించడం ఇష్టం లేక అలాగే వుండిపోయింది.
