రామం తనని చూసి ఖంగారు పడతాడో, ఆశ్చర్యపోతాడో - పెళ్ళివిషయం చెప్పటానికి కొచ్చినపుడు తనుప్రవర్తించిన తీరు మరిచిపోడుకదా - అనుకుంది లలిత బస్సులో కూచుని.
ముహూర్తం సమీపిస్తుంటే గుడిలో కెళ్ళారు వెంకట్రామయ్య లలిత. కృష్ణమూర్తిమేష్టారు ఎదురొచ్చి ఆహ్వానించారు. రామం ముఖం ఆనందంతో నిండిపోయింది. అంతా ఒక ఇరవైమందిలోపు వున్నారు ఆగుడిలో లలిత శ్రద్దగా గాయత్రి వంక చూసింది. నల్లగా వున్నామంచి కళగావుంది ముఖం పెద్దజడ. ముఖంలో ఒకవిధమైన నిర్లిప్తత, ప్రశాంతథా - రామం ఈ అమ్మాయితోనైనా సుఖపడాలి - భగవంతుడు మంచివాళ్ళకి మంచిమార్గం చూపించకపోతాడా !! - అక్షింతలు సరిగ్గా రామం గాయత్రి తలపై పడేలా విసిరింది లలిత - ఆరుశత్రులను ఆక్షణంలో జయించిన గొప్పతృప్తి కలిగింది లలితకి ఆ దేవాలయం ప్రాంగణంలో !!
పెళ్ళిభోజనాలు అయ్యాయి. వెంకట్రామయ్యకి పంచెలజత పెట్టి కాళ్ళకు నమస్కరించారు కొత్త దంపతులు.
'మీ ఆడబిడ్డని సన్మానించు' నవ్వాడు రామం.
పట్టుచీర, పసుపుకుంకుమ, పూలు తెచ్చింది గాయత్రి లలిత చేతికందించి వంగి నమస్కరిస్తుంటే లలితకి కళ్ళలో నీళ్ళు బయటపడకుండా దాచుకోటం ఎంతో కష్టమయింది. తన చిన్న తమ్ముడూ, మరదలు - పిల్లాపాపలతో వర్ధిల్లాలి అని మనసులో అనుకుంటూ రామం వంక చూసింది. మొన్న హైదరబాదు వచ్చినపుడు కొన్నాను బావుందా. గ్రీన్ చీర, మెరూన్ అంచులోవున్న పెద్ద జరీ కంచి చీర!! - లలిత ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతుంటే మాటలురాలేదు వెంటనే.
'నాన్నా, మనం ఎవరినీ ఎప్పుడూ అపార్ధంచేసుకోకూడదు కదు - వీలయితే - అర్ధంచేసుకోవాలి బతికున్నంతకాలం - అంతేకాని ఒకరిని అపార్ధం చేసుకుని మనసుపాడు చేసుకోటం తప్పుకదు -అంది ఆటోలో ఇంటికొస్తూ లలిత, 'తప్పేనమ్మా భగవంతుడు ఎవరికీ ఏదిస్తే అది తీసుకోవాలి అంతే - మన చేతిలోఏముంది' - ఆటోదిగాడు వెంకట్రామయ్య.
ఆ ఆటోలోవెళ్ళిన ఐదునిముషాలకే మరో ఆరో ఆగింది లలిత ఇంటిముందు ఎవరూ ఓ శారదా రా, రా, - నేను రావాలనుకుంటున్నా సాయంత్రం - ఎన్నెన్ని కబుర్లు చెప్పుకోవాలో మనం లలిత ఉత్సాహాన్ని చూస్తుంటే శారదకి మతిపోయింది- దేనికా సంతోషం !! - దేనికీ !!
శారద గదిలోకూచుంది. లలిత కాఫీ తెచ్చి కుర్చీలో కూచుంది - ఇదిగో శారదా. ఇది ఆడబిడ్డకట్నం. చూడు 'పెద్దకంచిచీర ! ఆడబిడ్డ మొన్న కొత్తగా పుట్టిన తమ్ముడు పెళ్ళిచేసుకుని నిన్ను కొత్తగా మళ్ళీ ఆడబిడ్డని చేశాడా' అంది చీరకొంగు ఎంత అందంగా వుందో చూస్తూ శారద.
'ఆ తమ్ముడెవరో చెప్తే ఆశ్చర్యపోతావు - రామం" - లలిత అనగానే శారదనోట్లో వున్న కాఫీ టక్కున బయటకొచ్చేసింది. శారద చీరపైన పడింది. దగ్గొచ్చి శారద ఉక్కిరిబిక్కిరయింది. కొత్త చీరలోపల దాచివచ్చింది లలిత. చెవులను నమ్మలేక పోతుంది శారద.
రామం ఎవర్నో పెళ్ళి చేసుకుంటే లలితకి ఇంత ఆనందమా ! 'ఎవర్నీ' అంది ఎటో చూస్తూ శారద. లలిత మాటలు విని 'అయ్యో' అంది అప్రయత్నంగా శారదకి అక్కడవుండబుద్ది పుట్టలేదు. నువ్వు సాయంత్రంరా -నీకోసం ఎదురుచూస్తూవుంటా' - శారద గబగబా వెళ్ళిపోయింది. ఈ లలిత ఎంత ఎదిగిపోయిందో - కామక్రోధాలకి అతీతమైపోయి, తనతో, రామంతో, స్నేహం కొనసాగిస్తోందో తల్చుకుని లలితని ఎంతగానో అభినందించింది మనసులో.
భోజనాలు, చేసి నిద్రబోతున్నారు వెంకట్రామయ్య, లలిత బస్సు ప్రయాణంలో ఎంతో అలసిపోయారిద్దరూ మనసు ప్రశాంతంగా వుందేమో మరీ గాఢ నిద్రలో మునిగిపోయారు.
'ఇంతసేపా నిద్ర' - పనిమనిషి తలుపుకొట్టడంతో ఉలిక్కిపడిలేచింది లలిత. వీధి తలుపు తీయగానే గుమ్మంలో పడివున్న కవరు పల్కరించింది. చిన్నన్నయ్య -మళ్ళీ అదే విషయం - అవకాశాలు జారవిడుచుకుంటే మళ్ళీరావు - మీరు రమ్మనిరాస్తేనే నేను, అతను వస్తాముచాలా మంచివాడు, తెలిసినవాడు కనక నేను ఇంతగా చెప్తున్నాను. లలితా, నువ్వు చిన్నపిల్లవి కావు - నీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి నువ్వు. ఇలా సాగిన ఉత్తరం మళ్ళీ మళ్ళీ చదివింది లలిత - అన్నయ్య మాటలు నిజమే !! - ఆనాడు, ఎప్పుడూ ఏమీ మాట్లాడనిరామం కూడా అన్నాడు....పొరబాటే చేసింది మీ అమ్మాయి" అని పొరబాటేనా - లలిత మళ్ళీమళ్ళీ ఆ ఉత్తరం చదువుకుంది ఆ క్షణంలోనే నిశ్చయం చేసుకుంది.
వేంకట్రామయ్య ఇంకా నిద్రపోతున్నాడు. పనిమనిషి లోపల అంట్లుతోముతోంది. తలుపు దగ్గరగా వేసి బయటకెళ్ళింది లలిత. పదినిముషాల్లో వచ్చేసింది.
వెంకట్రామయ్య నిద్రలోనేవున్నాడు - పనిమనిషి పనిచేస్తూనే వుంది.
రాత్రి భోజనం చేస్తూ లలిత తండ్రికి అన్నయ్య రాసిన ఉత్తరం గురించి చెప్పింది.
"మనం ఒకసారి అనవసరం అనుకున్నాక ఇక ఆజోలికి పోకూడదు - ఆ ఉత్తరం చించిపారేయ్" అన్నాడు చిరాగ్గా లలిత నవ్వుతూ, 'కొంచం పెరుగువేసుకోండి' అంది తండ్రితో.
'ఎందుకమ్మా - పాలతో, పెరుగుతో ఈ శరీరం బాగా బలిపించి, ఏం చెయ్యాలీ - ఇక వెళ్ళేమార్గం ఆలోచించుకోవాలి' - పెరుగు అన్నం తిన బుద్దిపుట్టటం లేదు -పారేస్తే లలితకి కోపం వస్తుంది.
లలితకర్ధమైంది తండ్రిబాధ ఏమిటో !! - ఆయన బాగా వృద్దుడయిపోతున్నాడు - చిన్నన్నయ్యమాట వినేస్థితిలో లేదు అమ్మాయి. పిల్ల తల్లిని ఆరామం లక్షణంగా చేసుకోగాలేంది, పిల్లల తండ్రిని ఇది చేసుకుందుకు అభ్యంతరమేమిటో అర్ధంకాదు - వయసుదాటి పోయినదానికి ఓపాతికేళ్ళ యువకుడు వస్తాడా పెళ్ళాడటానికి !! తండ్రిగా తను ఇలా అనుకోటానికే బాధగావుంది - కానీ ఏం చెయ్యాలీ -చిన్న అబ్బాయి మళ్ళీరాసాడు -మంచి మనిషి సంబంధం వదులుకోకండి అనీ, - తనేం చేస్తాడూ. - 'అమ్మాయి, ఆ ఉత్తరం ఇటియ్యి" - లలిత తెచ్చి యిచ్చింది. రెండు ముక్కలు చేసి విసిరేశాడు - వాడికి రాస్తాను, ఇంకోసారి దీని పెళ్ళి విషయం నువ్వు పట్టించుకోవద్దూ అని - వేంకట్రామయ్య కోపంగా అరిచాడు. లలిత పకపకానవ్వింది.
'నన్ను చూస్తేనవ్వుగా వుందా. ఆడపిల్లకి పెళ్ళి చేయలేని అసమర్ధుడైన తండ్రిని చూస్తే అందరికీ నవ్వే - నవ్వండి -నేను కృష్ణమూర్తి మేష్టారి పాటిచేయలేకపోయాను కదా - భర్త పోయినపిల్లకి లక్షణంగా పెళ్ళిచేసి చేతులు దులుపుకున్నాడు కదా - అమ్మా, లలితా ఒక్కపనిచేయి'
"ఏమిటండీ, చెప్పండి" -
"నువ్వుకూడా ఆ శారదతోబాటు దానింట్లోవుండు - ఈఇంట్లో రామం, భార్యకాపురంవుంటారు - నేను ఏ ఆశ్రమమో వెతుక్కుంటా - లలిత మళ్ళీనవ్వింది - "అన్నయ్యని వెంటనే రమ్మని, అతన్ని కూడా వెంటబెట్టుకురమ్మని వైర్ చేశాను నాన్నగారూ. నేను జీవితంలో స్థిరపడిపోవాలనుకుంటున్నాను. జీవితంలో కొంత రాజీ అవసరం అని నిశ్చయించుకున్నాను - రేపొస్తాడు అన్నయ్య' వెంకట్రామయ్య ఆనందం పట్టలేక పోయాడు. దేవుడు తనపై దయ తలచాడు. ఈ లలిత ఓ ఇంటిదయితే, ఇంక నేను కోరేదేమీ లేదు. నేను ఎవరికీ ఏ అన్యాయమూ చేయలేదు - దేవుడు నాకెందుకు అన్యాయం చేస్తాడు !! - వేంకట్రామయ్య కళ్ళు మూసుకుని దైవధ్యానంలో మునిగిపోయాడు.
