నేనూ - కే.జి.క్లాసు సీటూ
"బుచ్చిబాబుగారూ... మిమ్మల్ని ఆఫీసరుగారు పిలుస్తున్నాడు..." అన్నాడు ప్యూను రంగయ్య నా ముందుకువచ్చి టేబుల్ మీదికి వంగుతూ.
నేను ఓసారి మా పెద్దల్ని తలుచుకుని ఆఫీసరు గదిలోకి అడుగు పెట్టాను.
"రావోయ్ బుచ్చిబాబూ...రా" అన్నాడు ఆఫీసరు.
అతనలా పిలవగానే వెంటనే దగ్గరికి వెళ్ళకపోతే బావుండదని గుమ్మంలోంచి రెండు గంతులు గంతేసి అతని ముందు నిలబడ్డాను.
"ఇదివరకు రామంజనేయ యుద్ధం నాటకంలో నువ్వుగాని ఆంజనేయుడి వేషం వేసేవాడివేమిటోయ్...ఆ...?"
".... మరేనండి... అంటే కాదండీ... నేను ఆంజనేయుడినేనండీ... అబ్బే...అసలు కాదండి....హిహిహి"
ఆఫీసరు అలా జోకేసేసరికి నాలో ఏదో చెప్పలేని గాబరా పుట్టి నేనేం అంటున్నానో నాకే తెలీడంలేదు.
"సర్లె... అనవసరంగా శ్రమపడకుగానీ... ఇలావచ్చి కూర్చో"

అమ్మో!!... ఈ కర్కోటకుడు నన్ను కూర్చోమంటున్నాడు, ఇది కలా నిజామా?
నా బుర్ర గిర్రున తిరిగింది-దబ్బున నేలమీదపడ్డాను. పడటం పడటం శరీరం అంతా అదిరిపోయి మెదడు కదిలిపోయి మత్తు వదిలి పోయింది.
నీ వాలకం చూస్తుంటే ఆఫీసుకు తాగి వచ్చినట్టున్నావ్, అవునా?"
అతను అరచిన అరుపుకి సీలింగ్ ఫాన్ కొద్ది క్షణాలు ఆగిపోయి మళ్ళీ తిరగడం మొదలుపెట్టింది.
నేను రివ్వునలేచి నిలబడ్డాను.
"అబ్బే...కాస్త కళ్ళు తిరిగాయ్ అంతేనండీ" అన్నాను వినయంగా.
"సర్లే కూర్చో"
నేను కూర్చున్నాను.
"నిన్ను ముఖ్యంగా పిలిపించిన కారణం ఏమిటంటే ఈ జూస్ ఒకటవ తేదీ మావాడి పుట్టినరోజు"
హమ్మ పీనుగ అదా సంగతి! ఈ ఆఫీసర్లు అందరికీ ఇదే తెగులు.పుట్టిన్రోజులకీ సత్యనారాయణ వ్రతాలకీ స్టాఫ్ అందర్నీ పిలవడం వాళ్ళ దగర్నుంచి కానుకలు కొట్టెయ్యడం. ఎవడికి తెలీవు ఈ బోడికిటుకులు?...
"ఆ... ఆ కిటుకులు" అన్నాను ఆలోచిస్తూ.
అడ్డెడ్డె... అనుకుని నాలుక కొరుక్కున్నానేమో నాలుక మంట పుట్టింది. నాలుక చాపి చూసుకున్నా రక్తంగానీ వస్తుందేమోనని.
"వింటున్నావా?" ఈసారి గట్టిగా అరిచాడు ఆఫీసరు.
"ఆ,ఆ మీవాడి పుట్టినరోజు. తప్పకుండా వస్తాం సార్"
"నువ్వేం రానక్కరలేదుగానీ-చెప్పేది శ్రద్దగా విను... ఈ జూస్ ఒకటవ తేదికి మావాడికి మూడు నిండి నాలుగువస్తుంది"
"ఆహాహా... నాలుగేళ్లు... చాలామంది వయసండీ అది."
"చెప్పేది విను. మీరుండేది జయానగర్ కాలనీ కదూ?"
"అవునండీ"
"మేముండేది జయానగర్ కి దగ్గర్లోని గిల్లే పల్లిలో-"
"అయితే మీరు మాకు చాలా దగ్గర మనుషులన్నమాట. చాలా సంతోషమండీ" సంతోషాన్ని నటిస్తూ అన్నాను.
"చెప్పేది విను"
నాలుక కొరుక్కుందామనుకుని ఇందాక నాలుక తెగి మంటపుట్టడం గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకున్నాను.
జయానగర్ కాలనీలో సెయింట్ డన్స్ స్కూల్లో మావాడికి లోయర్ కే.జి. క్లాసులో సీటు కావాలి"
నాకు తెగ నవ్వొచ్చింది. పొట్ట పట్టేస్కుని మరీ నవ్వాను.

"మీరు భలే జోక్ చేస్తారు సార్! యమ్.బి.బి.ఎస్. సీటు కావాలి అన్నట్టు అడిగారు. జూన్ పదో తేదీనుండి సెయింట్ డన్స్ స్కూల్లో ఎడ్మిషన్లు మొదలవుతాయి.అప్పుడు మీ అబ్బాయిని నాతో పంపండి. లోయర్ కే.జి క్లాసులో వాడిని, సారీ, అతన్ని, కాదు కాదు - అబ్బాయిగార్ని చేరుస్తాను"
"వాళ్ళు అప్పటికప్పుడు సీటు ఇవ్వరట. ముందే ప్రయత్నం చెయ్యాలి. మావాడికి ఆ స్కూల్లో సీటు సంపాదించే బాధ్యత నీది. తెల్సిందా?"
నేను తెలిసిందన్నట్టు తల ఊపాను.
"ఇంక నువ్వెళ్ళొచ్చు"
అతని గదిలోంచి బయటపడి సీట్లో కూలబడి చురుగ్గా ఆలోచించాను.
ఇప్పుడు నేను ప్రమోషను లిస్టులో ఉన్నాను... ఆఫీసరుకు సహాయం చేస్తే నా మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది... నాకు ప్రమోషను ఖాయం....
"యహో..."
సెక్షనులోని అన్ని తలలు నావైపు తిరిగాయి.
నేను నాలుక కొరుకున్నాను
"అబ్బా..."
నాలుక చాపి రక్తం కార్తుందేమోనని చూసుకున్నాను.
మర్నాడు ఉదయం కాస్త త్వరగా లేచి స్నానం చేసి కాఫీ కాచుకుని త్రాగేసి సెయింట్ డన్స్ స్కూలుకి వెళ్ళాను.
