Previous Page Next Page 
విశిష్ట పేజి 42

    "మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధంకావడంలేదు" ఆశ్చర్యంగా చూసింది కాంతం.

    "దాన్ని ఆ కురూపికి భార్యను చెయ్యడమే దాని అహంకారానికి నేను వేయదలుచుకున్న శిక్ష! నా కొడుకును దెబ్బతీసి పరోక్షంగా నా పరువు తీసింది. దాన్ని వూరికే వదలను. మాధవరావు దెబ్బంటే ఏమిటో, అది ఎంత కఠోరంగా వుంటుందో తెలియాలి." "మీకు మతిగాని పోయిందా? చందూ ముఖంమీద ఏసిడ్ పోసి వాడిని అందవికారంగా మార్చిన ఆ పొగరుబోతు పిల్లనే వాడికి కట్టబెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఆ పిల్ల ఈ ఇంటి కోడలిగా రావడానికి నేను ఎంతమాత్రం ఒప్పుకోను."

    "ఆ పిల్ల కూడా ఒప్పుకోదు ఈ ఇంటి కోడలిగా రావడానికి! కాని, ఒప్పిస్తాను."

    "ఆ పిల్ల చేసినపని మనసులో మందిలినప్పుడల్లా నా మనసు కలుక్కుమన్నట్లుగా అవుతూంది. సాక్షాత్తూ ఆ పిల్లనే తెచ్చి ఇంట్లో వుంచుతారా? ప్రతిక్షణం అది కళ్ళముందు తిరుగుతుంటే నేనెలా సహించేది?"

    "ఊరికే తిరగదు! ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చస్తూ తిరుగుతుంది. అత్తవారిల్లే పంజరమౌతుంది. కురూపి మొగుడవుతాడు. దాన్ని చూస్తూ నీ కొడుక్కి జరిగిన అన్యాయం మరిచిపోవచ్చు కాంతం."

    "వద్దు! అనవసరంగా ఒక ఆడపిల్ల ఉసురుపోసుకొనే ఆలోచనే వద్దు. ఆ పిల్ల మనకు ఎంత కష్టమైనా కలిగించనీ! దాని పాపాన అది పోతుంది."

    "నా కంట్లో పొడిచిన వాళ్ళని పోనీలే అని వూరికే వదిలిపెట్టే మనస్తత్వం కాదు నాది. నా కన్ను ఒక్కటి పొడిస్తే అవతలి వాళ్ళని రెండు కళ్ళు పొడిచేస్తాను. అదీ నా తత్వం"

    కాంతానికి భర్త ధోరణి నచ్చలేదు. ఎవరైనా తనకి బాధ కలిగించితే వాళ్ళని రెండు మాటలు తిట్టడమే కాని పగబట్టే మనిషికాదు."

    "ఏమిటో మీరు. మొదట్లో ఇలా లేరు. రాజకీయాల్లోకి వచ్చాక మారిపోయారు. మీరు కొంచెం నిదానంగా ఆలోచించండి. అసలా పిల్ల దేంతప్పుంది? తలుపులు మూసి కొడితే పిల్లయినా పులిగా మారిపోతుందని సామెత! మీ కొడుకు ఆమెను మానభంగం చేయబోయాడు. వాడి బారినుండి తప్పించుకోడానికి ఆ పిల్ల ఎన్నుకొన్న మార్గం అది. 'ఏసిడ్' ఆలోచన ఆ పిల్లకు వచ్చేదో కాదో గాని అది మీ కొడుకు కలిగించిందే. ఆ పిల్ల ముఖంమీద వీడు ఏసిడ్ పోస్తానన్నాడు కదా? ఆ పని తనే చేసి చూపించింది.

    "పిల్ల తరపున నువ్వు వకాల్తా పుచ్చుకున్నావేమిటి?"

    "ఆడది ఆడదానికే , శత్రువు కాకూడదండీ! అందులో మన వాడి తప్పులేకపోతేగా ఆ పిల్లను అనాల్సింది."

    "అబ్బా! ఎంతటి సంస్కారం."

    "మీరు వెక్కిరించినాసరే! నేను మాత్రం మీ ప్రయత్నాన్ని వ్యతిరేకించి తీరుతాను. మీరు మాత్రం ఇకా పిల్లజోలికి వెళ్ళడానికి వీల్లేదు. చేసిన పాపానికే చందమామలాంటి చందూ ముఖం చూడడానికే భయం గొల్పేలా తయారైంది. ఆ పిల్ల ఊసు మానేసి, వాడిని బాగు చేసుకునే మార్గం చూడండి. దయచేసి నా మాట వినండి."

    "అందంగా తయారై మళ్ళీ ఆంబోతులా ఆడపిల్ల మీద పడడానికా? వెర్రి వేషాలేసి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. తండ్రి పరువునూ, పదవినీ పోగొట్టాడు. ఇంకా ఏం పోగొట్టాలని? అద్దంలో తన ముఖం చూచుకొన్నప్పుడల్లా తన పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తాడు. తల్లిగా నువ్వు కోరుకోవాల్సింది వాడి పరివర్తన. అందం కాదు" సీరియస్ గా చెప్పాడు మాధవరావు.

    "ఎంత చెడ్డవాడైనా వాడు మన రక్తం పంచుకు పుట్టిన వాడండీ! వాడిమీద ప్రతీకారం తీర్చుకోవడం ఏమిటి మీరు?" కోపంగా అడిగింది కాంతం.

    "రక్తం పంచి సుపుత్రుణ్ణి కన్నావుకదా!"

    కాంతం ముఖం ఎర్రబడింది. "నా రక్తం మంచిదికాదని నిందిస్తున్నారా? అంటే మా వంశాన్ని తిట్టినట్టే కదా? ముప్పయ్యేళ్ళ క్రితం ఈ కాంతం మగడిచాటున కాపురం చేసుకుంటున్న ఒద్దికైన పిల్లండీ! మీ మాయదారి కన్ను నామీద పడింది. నన్ను మాయమాటలతో లేవదీసుకుపోయారు. నిందిస్తే మీ వంశాన్ని నిందించుకోండి. మీ రక్తాన్ని నిందించుకోండి. కాపురాలు కూలదీసే బుద్దులు మా వైపు ఎవరికీ లేవు."

    "ఏమిటే వాగుతున్నావ్? లేవదీసుకువచ్చి నిన్ను అన్యాయం చేశానా? తిరుపతి కొండమీద పెళ్ళి చేసుకున్నాను. రాణిలా చూచుకున్నాను రాణివాసం అనుభవిస్తున్నావు కదా?"

    "ఇదొక రాణివాసమా? ఇదొక సుఖమా? పుట్టింటి ముఖం చూసి ముప్పయ్యేళ్ళయిపోయింది! కన్నతల్లి చచ్చిందని తెలిసినా వెళ్ళి చూసేందుకు ముఖం చెల్లకుండా చేశారు. తెలివిగా నన్ను నా మగడినుండి విడిపించి తీసుకుపోయి 'కళంకిని' అన్న ముద్ర నా ముఖాన వేయించారు" కోపం దుఃఖంగా మారిపోగా చీరచెంగు నోటికి అడ్డు పెట్టుకుని ఏడవసాగింది కాంతం.

    కొంచెం మెత్తబడ్డాడు మాధవరావు.  "ముప్పయ్యేళ్ళ క్రిందటిది తవ్వుకొని ఇఫ్పుడు మనం ఒకరినొకరం నిందించుకోవడం, ఎత్తిపొడుచుకోవడం బాగాలేదు, కాంతం! వాడు చెడిపోయాడంటే మన ఇద్దరిదీ బాధ్యతే. మన పెంపకంలో లోపమో, మన రక్తంలో దోషమో వాడు మంచి మనిషిగా ఎదగలేదు. ఇప్పుడు చింతించి లాభంలేదుగాని వాడిని మళ్ళీ అందగాడిని చెయ్యడం కోసం నేను లక్షలు గుమ్మరించడానికి సిద్దంగా లేను. అంత డబ్బు నా దగ్గరలేదు."

    "ఎలక్షన్స్ లో నిలబడితే లక్షలు గుమ్మరిస్తారు కదా? కన్నకొడుక్కోసం ఆమాత్రం ఖర్చు పెట్టలేరా?"

    "ఎలక్షన్స్ లో ఖర్చుపెడితే పెట్టిందానికి వందరెట్లు తిరిగి వస్తుంది వాడి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తే ఏమొస్తుంది చెప్పు? పైగా అందమన్నది అశాశ్వతమైనది."

    "మీ డబ్బూ, సంపాదన ఎవరికోసం? పోయేప్పుడు వెంటగట్టుకు పోతారా? ఉన్నది ఒక్కడు. వాడికోసం కాకపోతే ఇదంతా ఎందుకు?"

    "పోయాక ఏమౌతుందన్నది అప్రస్తుతం! వాడికి బలవంతంగానైనా పెళ్ళి చేయకపోవడం మనం చేసిన తప్పు. పెళ్ళయితే ఇళా వెధవేషాలు వేసేవాడు కాదు. ఇప్పటికైనా వాడికి పెళ్లి చేసి తీరాలి. పెళ్ళికి వాడిని ఒప్పించే బాధ్యత నీదే."

    "వాడికెవరు పిల్లనిస్తారు? పగలుచూస్తే రాత్రి కల్లోకి వచ్చేలా వుంది ఆ ముఖం. పోతే వాడి చరిత్రంతా పత్రికలకెక్కింది. ఊరూవాడా తెలిసి పోయింది. పోలీసులు కేసు పెట్టారు. బెయిల్ మీద బయటికి వచ్చినా ఎప్పుడు జైలుకి వెళ్ళేదీ తెలియదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS