'సరదాగా ఆయన పిల్లల్ని తీసుకొని వెళ్ళి రావచ్చు! తనెందుకు వెంట?' ఇబ్బందిగా అనుకొంది సంధ్య. అదే మాట పిల్లలతోనూ అంది.
"నువ్వు రావాలి ఆంటీ! నువ్వు రాకపోతే మాకు సరదాగా ఉండదు!" శ్రీకాంత్ గారాంగా అన్నాడు.
"ఆంటీ! ఆంటీ! అనమని ఎవరు చెప్పారు?" ఆశ్చర్యంగా అడిగింది.
"డాడీ చెప్పారు!"
సాయంత్రం నాలుగవుతూంటే చక్రపాణి, పిల్లలు కారెక్కారు.
వెనుక సంధ్య బాస్కెట్ తో, కారియర్ తో ఎక్కింది.
"ఏమిటది?" చక్రపాణి అడిగాడు.
"చెట్లక్రింద కూర్చొని పిల్లలు సరదాగా తింటారని....."
"గుడ్! వనభోజనమన్నమాట." చక్రపాణి సంతోషం వ్యక్తం చేశాడు.
సంధ్యకి జూ చూడటం ఇది మొదటిసారి! పిల్లలతో పాటు సంధ్య కూడా వింతగా చూడసాగింది, ఆ జంతువుల్నీ, రకరకాల పూలమొక్కల్నీ!
చక్రపాణి శ్రీకాంత్ చెయ్యిపట్టుకు నడుస్తూ, అన్నీ వివరించి చెబుతున్నాడు. అక్కడక్కడా ఆగి అన్నీ చూపుతున్నాడు. ప్రేమ చెయ్యి పట్టుకొని సంధ్య కొంచెం ఎడంగా నడుస్తూంది.
"డాడీ! అటు చూడండి!"
పని అయిపోయాక గృహిణులు కబుర్లు చెప్పుకొంటూ, గుమ్మంలో కూర్చొని తల్లో పేలు చూచుకొంటున్నట్టుగా కొమ్మలమీద తీరుబాటుగా కూర్చొని పేలుచూచుకొంటున్నాయి కోతులు! చిన్నపిల్లలు తల్లుల ప్రక్కనే ఆడుకొంటున్నాయి, కొమ్మలు పట్టుకు ఊగుతూ.
"మనిషిలాగే ఎలా చూస్తూంది పేలు?" ఆశ్చర్యంగా చూస్తూంది సంధ్య.
"మనిషికి దగ్గర బంధువు అదే కదా?" అని నవ్వాడు చక్రపాణి.
పంచరంగుల చిలుకలు, పాములు, నీటి గుర్రాలు, సింహాలు, చింపాంజీలు, అన్నీచూడడం అయిపోయింది! వెంట తెచ్చిన కేరియర్ ఓ చెట్టుక్రింద విప్పింది సంధ్య. పులిహార ఒక ఆకులో, మైసూర్ పాకు బిళ్ళలు ఒక ఆకులో ఉంచి ముందుగా చక్రపాణికి అందించింది తరువాత పిల్లలకు అందించి, మరచెంబు తీసుకొని నీళ్ళున్న చోటికి బయల్దేరింది.
వెనుక నుండి చూస్తున్నాడు చక్రపాణి.
భుజాలనిండా కప్పుకొన్న పమిటమీద నల్లగా చారెడు జడ అటు ఇటు కదులుతూంది. పొడవుగా, పొడవుకు తగిన లావుతో చూడడానికి చక్కటి పర్సనాలిటీ అనిపించేట్లుగా ఉంటుంది. పసుపురాచుకొన్నట్టుగా ఉన్న శరీరఛాయ, చెంపకు చారడేసికళ్ళు, చెక్కుటద్దాలన్నట్టుగా చెంపలు, చిన్న పెదవులు- చూడగానే రాణివాసంలో పుట్టాల్సిన పిల్ల అనిపిస్తుంది. నిజం చెప్పాలీ అంటే, చనిపోయిన తన భార్య కూడా ఇంత అందగత్తెకాదు.
ఇంత అందమైన అమ్మాయిని భగవంతుడు జానకమ్మక్క ద్వారా ఆయాగా తనింటికి పంపి తనని ఏం పరీక్షించాలనుకొన్నాడు! అసలే తనకు వయసుమీరాక పుట్టారు పిల్లలు! ఈ వయసు మీరిన దశలో ఇరవయ్యేళ్ళ పిల్లను చూసి వ్యామోహపడడం ఏమన్నా బాగుందా?
మరచెంబు నిండా నీళ్ళు తీసుకువచ్చింది సంధ్య. అందరికీ గ్లాసుల్లో పోసి ఇచ్చింది. తరువాత టీ ఇచ్చింది.
"అందరికీ ఆతిధ్యం బ్రహ్మాండంగా చేశావు! మరి నువ్వేం తీసుకోవేం?" చక్రపాణి అడిగాడు.
"తీసుకొంటాను" అందేగాని తీసుకొనే ప్రయత్నం చేయలేదు సంధ్య.
"నీకు ఆతిథ్యం నేనిస్తానిప్పుడు!" నవ్వుతూ కారియర్ అందుకొని, పులిహార ఆకులో ఉంచి అందించాడు.
"మీకెందుకు శ్రమ? నేను తీసుకోనా?" ఇబ్బందిగా అందుకొంది.
సంధ్య టీ తీసుకోవడం కూడా అయింది. మిగిలినవి డ్రైవరుకిచ్చేసి వచ్చి కూర్చొంది.
"నీ గురించి చెప్పు, సంధ్యా! మీ అమ్మా నాన్న ఇద్దరూ పోయారని విన్నాను! ఇక నీకు కావలసిన బంధువులెవరూ లేరా!" చక్రపాణి అడిగాడు.
"లేరు!"
"మనిషి పుట్టాక బంధువులు లేకుండా ఎలా ఉంటారు?" ఆశ్చర్యంగా అడిగాడు.
