నేను : ఓయి వెఱ్ఱబ్బాయి! అంతటితో మన సమస్య పూర్తవుతుందా? ఒకడు ఎక్కువ అధికారాలు వాంఛిస్తాడు. ఒక సంఘం ఎక్కువ భాగం ఆశిస్తుంది. ఒకదేశం ఎక్కువు లాభం కోరుతుంది. అప్పు డీ సమానత్వం ఏమౌతుంది?
రామ : ఏమోయి మూర్తీ! నీ వాదం వితండంగా ఉంది. మనం ఇల్లు కట్టించుకుంటున్నాము. పెద్ద భూకంపం వచ్చి ఇల్లు పడిపోతుందనుకో అన్నట్టుగా మాట్టాడుతున్నావు.
విశ్వ : మనుష్యుల్లోని నీరసత్వాలవల్లా, అన్యాయ కాంక్షలవల్లా ఇప్పటి భయంకర స్థితి ప్రపంచానికి దాపురించింది. అవన్నీ పరీక్షచేసి మానవ నైజం సంపూర్ణంగా గ్రహించి కారల్ మార్క్సు తన 'డెస్ కాపిటల్' రచించాడు.
నేను : అవునయ్యా! సరిగా 'డెస్ కాపిటల్' గ్రంథంలో వున్నట్లు రష్యా సోవియట్ రాజ్యం స్థాపన అయిందంటావా విశ్వం?
విశ్వ : ఏ ఉత్తమ విషయమైనా ఆచరణలో పెట్టేటప్పటికి కొన్ని తాత్కాలికాలూ, స్థానికాలూ, అయిన మార్పులు వస్తూనే ఉంటాయి. గాంధీగారి తత్త్వం ప్రకారం కాంగ్రెసు నడవ కలుగుతోందా మూర్తీ?
నేను : అందుకనే నేను చెప్పేది, ఆచరణ వేరు, ఆశయాలు వేరుగా ఉంటాయని, కనుక ఏనాటికైనా కారల్ మార్క్సు ఆశయాలు వృధా అవుతాయి.
ఇలా మా ముగ్గురికీ వాదనలు ప్రబలాయి. నా మనస్సులో ఉన్న ఆశయాలన్నీ నా శకుంతలతోనే వెళ్ళిపోయాయి. నాకు బోల్షివిజం అయినా ఒకటే, గాంధీయిజం అయినా ఒకటే. ప్రపంచంలో కొట్టుకు తినడానికి మనుష్యుడూ, జంతువులూ ఉద్భవించారు. ఎవరి వస్తువులు వారు కాపాడుకొంటూ వుంటారు. కొట్టుకు తినడానికీ, కాపాడుకోవడానికీ ఎప్పుడూ యుద్ధం. అందుకనే వెనుకటి ప్రపంచ యుద్ధం వచ్చింది. అనే నమ్మకం స్థిరపడి పోయింది.
నా స్నేహితులు నాకు చదువుకోమని అనేక గ్రంథాలు యిచ్చారు. రహస్యంగా రాష్యానంచి అనేక కరపత్రాలు వస్తూవుండేవి.కూలీలను రైతుకూలీలను, బీదరైతుల్నీ లేవదీయడం, కోటీశ్వరులను జమీందారులను కూల్చివేయడం, ప్రజా విప్లవం తెచ్చి సోవియట్ ప్రభుత్వం స్థాపించడం, ఇవి ఆ కరపత్రాలలో ఉండే ముఖ్యవిషయాలు. ఒకసారి అన్ని దేశాలలో స్వామ్య రాజ్యాలు స్థాపన కావాలి అని భావించాను.ఒకసారి ఏ రాజ్యంలేకుండా దేశాలన్నీ నాశనం కావాలనుకున్నాను. కాని అన్నింటికీ వెనకాల చిన్ననాటి నుంచీ మా శకుంతలతో బాటు పూజించిన మహాత్మాజీ ఆహింసాభావం నన్ను వదలక దెయ్యంలా పట్టుకుంది.
సుశీల నానాటికీ తేరుకుంది. ఓరోజు సాయంకాలం నేను సుశీల యింటికి వెళ్లాను. నా మనస్సులో ఆవేదనలు అణిగి ఉన్నాయి. నాకు అంత చైతన్యంకాని, హుషారుకాని లేక, ఏదో బొమ్మలా తిరుగుతూ ఉన్నాను. మా అమ్మ ఏమిచేసి పెడుతుందో ఏంతింటున్నానో నాకా రోజుల్లో తెలియనే తెలియదు. అప్పటికి సుశీలకు జబ్బు నెమ్మదించి నాలుగు నెలలు అయింది. వసంతకాలం రోజులు. మత్తుదినాలు. ఆరోజు సాయంకాలం సుశీల యింటికి వెళ్ళగానే ఆనాలుగంతస్థుల పూర్వకాలం మేడపై, డాబామీద కుండల్లో పూల మొక్కల మధ్య, తివాసీ పైన పరచిన దిండ్లమీద ఆనుకొని పడుకొని ఉంది.
నే నామె దగ్గరకు వెళ్లాను. ఆమె ఒయ్యారం, కులుకు, అప్పుడే వస్తూన్న గిరజాలజుట్టు, కొత్తరకం! వేసవికాలంలో హిమాలయాలలో పొంగివచ్చే శైవాలినిలాంటి క్రొత్తదనంతో వరూధినిలా ఒరిగివుంది. నేను రాగానే'' ఇలారా, మూర్తీ!''అంది.
నేనామె దగ్గరకు వెళ్లి కూర్చున్నాను. ఆ డాబామీద వాళ్ళు ప్రక్క డాబామీద వాళ్ళకు కనబడకుండా చుట్టూ ఎత్తుగా తడికెలు కట్టి ఉన్నాయి.''మూర్తీ! నీకోసం బ్రతికా సుమా!'' అని ఆమె అన్నది.
23
నేను మౌనంగా సుశీల ప్రక్కనే కూచున్నాను. నా శకుంతల కూడా ఇలా బ్రతకరాదా? ఆమె బ్రతికితే! ఓ దౌర్భాగ్యుడా! నీ కంత పవిత్రవరం ఎక్కడ దక్కనురా! ఓయి ఛండాలుడా! సర్వరసపరిపూర్ణ మహాభావం గ్రహించే ప్రతిభ ఎక్కడరా? ఓయి నష్టాత్ముడా! ఆ అప్రతిమాన సౌందర్యనిధిని అనుభవింప నీ వెక్కడ తగుదువురా! ఓయి మురికి గోతుల పొర్లాడేపందీ! నీకా అసదృశ దివ్యతేజస్సు భరింపశక్తి ఎక్కడరా?
సుశీల నాతో ఏమి మాట్లాడిందో తెలియదు. కొంత మనస్సు ఇటు తిరిగేటప్పటికి సుశీల నన్ను గట్టిగా, అప్పుడే పొంగి మరల తమతొల్లింటి పీనత్వం సంపాదించుకొనే వక్షోజాలను అదిమి నామోమంతా ముద్దులతో ముంచివేస్తున్నది. ఈ హీనావస్థ నాకు నేనై తెచ్చుకున్నాను. నాగోయి నేను తవ్వుకొన్నాను. నాకు మతిలేదు. శకుంతలా స్మృతి మాయమైంది, ఏదో శూన్యభావమే నా ఎదుట, నాచుట్టూ , నాలో!
సుశీలాదేవి, ఎన్ని విలాసాలు, కురిపించిందో! నాకు చైతన్యం ఏది? ఆమె నా లాల్చీ విప్పి అవతలవేసిన సంగతి నాకు తెలియదు. చిన్నపిల్లవాడి వలె ఊరుకున్నాను కాబోలు! లాల్చీలోపల బనీను విప్పుతుంటే ఊరుకున్నాను కాబోలు! సుశీల ఉదయకాల హిమాచలసానువుల నాక్రమించిన సువర్ణమేఘశకలంలా నన్ను ఆక్రమించి ఉండగా మెలకువ వచ్చింది. నాలో ఇంతకాలం అణచి పెట్టబడిన అతి పురుషత్వ వాంఛలు ఉప్పొంగిపోయినాయి.
* * *
రాత్రి ఎనిమిదిగంటలు కొట్టుతుండగా ఇద్దరమూ మామూలు మానవత్వానికి వచ్చాము. సుశీల మోము అత్యంతానందంతో చిరుగాలులు వీస్తూ ఉండగా కలకలలాడే వెన్నెల రేయిలో కలువపూవులా ఉంది. నేను మనో నీరసత్వంతో అక్కడనుంచి లేచివెళ్ళి పక్కమేడ డాబామీద ఆట లాడుకొంటున్న బాలికలను చూస్తున్నాను.
ఇది మహాదోషమా? దోషరహితమా? పుణ్యమా, పాపమా? శకుంతలా స్మృతి ఒక్కసారిగా ఎగిరివచ్చి నామీద వాలింది. ఆమె పేరు ఉచ్ఛరించడానికి అర్హత తీసివేసుకున్న ద్రోహం చేశాను నేను. హీనుడను, హీనుడను, హీనుడనయ్యా! చెవిలో గింగుర్లు పెట్టినవి.
పుణ్యమేమిటి, పాపమేమిటి? అన్న భావం వచ్చింది. ఎంత నీరసుణ్ణి. నాకు నేనే శత్రువునా? విరోధినా? ప్రబలహంతకుణ్ణా? సుశీల ఎరుపెక్కిన బంగారు కమలంలా నా దగ్గిరకు వచ్చి డాబా పిట్టగోడ నానుకున్న నాపక్క నిలబడింది.
