జానకికి స్నేహితురాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు . వాళ్ళలో కొందరు అప్పుడప్పుడూ జానకికోసం వచ్చేవాళ్ళు. వాళ్ళలో ఒక్కరుకూడా సుందరంకేసి చూసేవాళ్ళుకారు, సుందరంతో మాట్లాడేవాళ్ళు కారు. ఇరవైఏళ్ళవాళ్ళతో స్వేచ్చగా మాట్లాడే పదేళ్లు ఆడపిల్లలు దాదాపు తమఈడు మగపిల్లల దగ్గిర ఎందుకు బెట్టుగా ఉంటారో ఎవరికీ తెలీదు. సుందరానికి ఆడపిల్లలంటే పెద్ద భయంగాని ఆకర్షణగాని లేదు. అయినా జానకి స్నేహితురాళ్ళెవరన్నా వస్తే ముళ్ళమీద ఉన్నట్టుండేది. సుందరం కనిపిస్తేచాలు, జానకితో వటావటా మాట్లాడేవాళ్ళు కాస్తా అట్టే కొయ్యబారిపోయి మూతులు గట్టిగా బిగించేసి బొమ్మలల్లే తయారై కళ్ళతో తమలో తాము అవధానం ప్రారంభించేవాళ్ళు.
సుందరానికి ముఖ్యంగా చిరాకెందుకు కలిగిందంటే వాళ్ళు దగ్గిర ఉండగా జానకికూడా తన అన్నతో వాళ్ళలాగే ప్రవర్తించేది. వాడికేసి చూసేదికాదు. ఒకవేళ వాడు తనను పలకరిస్తే "ఏమో, నాకు తెలీదు" అని క్లుప్తసరిగా సమాధానం ఇచ్చితోటి స్నేహితురాళ్ళతో మళ్ళీ నేత్రావధానంలో పడేది.
"మేం ఆడవాళ్ళం, నువు మగవాడివి. మా జోలికి వచ్చేవు, భద్రం! నీ జాగాలో నువుండు, మా జాగాలోకి రాకు! తరవాత నీ యిష్టం!" అని ఈ ఆడముఠా తనతో అన్నట్టు తోచినప్పుడల్లా సుందరానికి వీళ్ళమీదేకాక, ఆడజాతిమీదనే చెప్పరాని రోత కలిగేది.
అయితే ఈ రోత అందరిమీదా కలిగేదికాదు, జానకి స్నేహితురాళ్ళలో శకుంతల అనే పిల్ల ఉండేది. ఏ అనిర్వచనీయ కారణమోగాని సుందరానికీ శకుంతలంటే ఏ మాత్రామూ కోపం ఉండేదికాదు. పైగా ఆ పిల్లను చూస్తే వాడికెందుకో ఎక్కడలేని గౌరవమూఉండేది. తనకు తెలియని బాధ లేవైనా శకుంతల కున్నాయేమోనని సుందరం విచారించేవాడు. ఎప్పటికైనాసరే ఏ శకుంతలకు ఏదన్నా సహాయం చెయ్యవలసివస్తే తాను తప్పక చేస్తాననుకునేవాడు.
శకుంతల పెద్ద అందగత్తె అనికాదు. సుందరానికి అసలు సౌదర్యమంటే ఏమిటో తెలియదు. వాడు మనుష్యులను మంచివాళ్ళుగానూ, చెడ్డవాళ్ళుగానూ విభజించేవాదు. తనకు మంచి వాళ్ళుగా తోచిన వాళ్ళంతా అందంగా ఉన్నట్టూ, చెడ్డవాళ్ళుగా తోచినవాళ్ళంతా వికారంగా ఉన్నట్టూ, ఊహించుకునేవాడు. ఎవరిమీదనన్నా వాడికి పూర్వంఉన్న అభిప్రాయం మారుతుంటే దానితో బాటు వారి అందచందాలు కూడా మారుతున్నట్టు భావించుకునేవాడు. దీనికి దృష్టాంతంగా సుందరానికి పూర్వం చాలా అందంగా కనబడిన శేషగిరిమావయ్య మొహం ఇప్పుడిప్పుడంత అందంగా కనబడటంలేదు.
శకుంతలలో సుందరాన్ని ఆకర్షించిన లక్షణం ఆమె మంచి తనం___ కోప్పడటమూ, చిరాకుపడటమూ, పరుషంగా మాట్లాడటమూ, కపటంగా ప్రవర్తించటమూ మొదలైనవి చాతగాని, మంచితనం. ప్రపంచంలో ఏ మనిషిగాని శకుంతలకన్న మంచిగా ఉండటం. సాధ్యమని సుందరానికి తోచలేదు. జానకికూడా శకుంతల మంచిదని అనేదేగాని ఆ మంచితనం గురించి తనకు తెలిసినంత బాగా ఇంకొకరికి తెలుసునన్న నమ్మకం వాడికిలేదు ఇది సుందరం తొలి ప్రణయం, ఇంగ్లీషులో దీన్ని లేగదూడ ప్రణయమంటారు.
శకుంతల జానకికన్న ఏడాదో, ఏణ్ణర్ధమో పెద్దది. ఆమెకు పెళ్ళికావటం సుందరం ఎరుగును. పెళ్ళి బూజంబంతినాడు జానకితోపాటు సుందరంకూడా భోజనానికి వెళ్ళాడు. ఆ రాత్రే శకుంతల పెళ్ళి ఊరేగింపుకూడా చేశారు. పెళ్ళికూతురు అవతారంలో శకుంతల సుందరం కళ్ళకు మరింత అందంగా కనబడటంకాక, మరింత గొప్ప ఆపదలో ఉన్నట్టూ, తాను తప్ప ఆ ఆపదనుంచి ఎవరూ రక్షించలేనట్టూ, తాను రక్షిద్దామంటే మిగిలిన మనుషులంతా అడ్డంఉన్నట్టూ సుందరానికి తోచింది.
ఊరేగింపు సుందరంవాళ్ళ ఇంటివేపు వచ్చేటప్పటికే పన్నెండు దాటింది. ఊరేగింపు వెళ్ళిపోయిన అరగంటదాకా సుందరం నిద్రపోలేదు. కాని ఈ అరగంటలోనూ సుందరం తలలో చెలరేగిన ఆలోచనలు నిమిషాలతో కొలిచేవి కావు.
"వచ్చేఏడు ఏ సబ్జక్టు తీసుకుంటావోయ్?" అన్నాడు నాగేశ్వరరావు బావ సుందరంతో.
"ఇంకేం తీసుకుంటానూ? లెక్కలే తీసుకోవాలి."
శ్రీనివాసరావు పెద్దగా నవ్వాడు.
"లెక్కలు తీసుకుని ఏం చేద్దామని?"
"ఇంటరు చదువుదామని."
"తరవాత?"
"బియ్యే"
"ఆ తరవాత?"
"చేతైతే ఎమ్మేకూడా చదవొచ్చు."
"చేతకాకపోతే"
"మానేసేదీ!"
సుందరంచేత ఉద్యోగం విషయం మాట్లాడించాలని శ్రీనివాసరావు ప్రయత్నించాడుగాని సుందరం చదువుసంగతి తప్ప ఇంకేమీ ఆలోచించలేదు. వాడికి చదువే ఒక పరమాశయంగా బుద్ధిలో మెసులుతున్నది. చదువువెంబడే ఉద్యోగంమాట ఆలోచించాలనిగాని, ఉద్యోగానికీ చదువుకూ సంబంధం ఉంటుందని గాని, ఉద్యోగం దృష్టిలో ఉంచుకుని చదువు నిర్ణయించుకోవాలనిగాని సుందరం ఎరగడు.
వాడు లెక్కలు తీసుకుంటాననటంలో కూడా ఒక ఉద్దేశ్యం లేకపోలేదు. తెలివికలవాళ్ళంతా లెక్కలు తీసుకుంటారనీ అవి రానివాళ్ళు హిస్టరీ తీసుకుంటారనీ వాడితలలోకి క్రమంగా_ అనేక సంభాషణల ఫలితంగా_ ఎక్కింది.
"ఉద్యోగం మాటేమిటోయ్?" అన్నాడు శ్రీనివాసరావు.
