Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 42

    శరత్ నవ్వాడు బిగ్గరగా "భాగుంది ఈ సైన్స్ జోక్" అంటూ.

    "రానున్న శతాబ్దంలో ఇలాంటివి జరిగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మనిషి ఎంత ఎత్తు ఎదిగిన కొద్దీ మనసు అంత చెడుబుద్ధులకు దారి తీస్తుంది" అన్నాడు భార్గవ.

    "ఇలా సెమన్ ని స్మగ్లింగ్ చేసే ముఠాలు రావచ్చనే....విదేశాల్లో ప్రభుత్వాలు Sperm Banks, Oosperm Banks ని స్థాపించనున్నాయట" చెప్పింది లక్ష్మి.

    మధ్య మధ్యలో క్లినిక్ లోని పరికరాల గురించి వివరిస్తోంది వాళ్ళిద్దరికీ.

    "లక్ష్మి! మరి ఈ బేబీ ఎన్నేళ్ళక్రితం పుట్టింది?" అడిగాడు శరత్ ఆ అందమైన కుందనపు బొమ్మలా ఫోటోలో వున్న బేబీనే చూస్తూ.

    "1978 జూలై 25న అర్దరాత్రి అతిరహస్యంగా పుట్టిందా పాప. నిజానికి ఆ పాపకు ప్రాణంపోసే ప్రయోగాలు మాత్రం ప్రపంచంలోనే మొదటిసారిగా 1977 నవంబర్ 10న జరిగాయి.

    "అంటే?" అనుమానాల పరంపరలో నివృత్తికోసం అడుగుతూనే వున్నాడు భార్గవ.

    "అంటే....ప్రయోగాలు సత్ఫలితాలిస్తాయని ఆశించకపోయినప్పటికి ఆ ఇద్దరు డాక్టర్లూ ప్రతి సృష్టికార్యానికి నాందీ పలికారన్నమాట"

    సుగాత్రిలాగే అమెరికాలో కూడా పెళ్ళయి తొమ్మిదేళ్ళు గడిచినా, సంతానప్రాప్తి కలుగని 'లెస్లీ' అనే స్త్రీ ప్రతిరోజూ క్రుంగిపోయేది. భార్యతో బాధను పంచుకుంటూ కుమిలిపోయేవాడు ఆమె భర్త బ్రౌన్. డాక్టర్ల చుట్టూ తిరిగేవాళ్ళు, చర్చిలో ప్రార్ధనలు జరిపేవాళ్ళు అయినా వాళ్ళకు ఏ దేవుడూ సహకరించలేదు. చివరికి వారు రాబర్ట్ ఎడ్వర్డ్ అనే డాక్టర్ ని కలిసారు. అప్పటికే మరో డాక్టర్ పాట్రిక్ స్ట్రెప్టో లాపరోస్కోప్ అనే పరికరాన్ని కనుగొన్నాడు. ఈ పరికరం ద్వారా ఆపరేషన్ చేయకుండానే, కడుపుమీద చిన్న కోతద్వారా ఉదరంలోని భాగాలన్నీ స్పష్టముగా చూడొచ్చు. ఈ ఇద్దరు సైంటిస్ట్ లు స్త్రీల వ్యంధత్వం మీద పరీక్షలు చేశారు. కానీ లోపమంతా లెస్లీలోనే ఉంది. లెస్లీలో సాలోఫియన్ ట్యూబ్స్ మూసుకుపోయాయట.

    స్త్రీలలో అంతస్థిమితంగా వుండే గర్భకోశం (Uterus) బీజవాహికలు (Fallopion Tubes)రెండు బీజశయాలు (Ovesies) అనేవి ముఖ్య ప్రత్యుత్పత్తి అంగాలు. బీజవాహికలనేవి గర్భాకోశాల కిరువైపులా వుంటాయి... "ఇంతకీ అర్ధమవుతుందా?" అడిగింది లక్ష్మి వాళ్ళవైపు తిరిగి. వాళ్ళకు మరింత తేలిగ్గా తెలియటానికి ఒక స్పెసిమెన్ ని చూపించింది. స్త్రీ ప్రత్యుత్పత్తి అంగాల స్పెసిమేన్ అది చూపిస్తూ చెప్పింది.

    "బీజశయాల్లో లక్షలాది అండాలుంటాయి. బీజాశయంనుండి విడుదలయిన ఒక అండం బీజవాహికల్లోకి ఆకర్షింపబడుతుంది. అక్కడినుండి అది గర్భాశయంవైపు ప్రయాణం చేస్తుంది. నీటిలో ఈదే చేపపిల్లలా....ఇది గర్భాశయం అనే గమ్యాన్ని చేరటానికి వారం రోజులు పడుతుంది. ఈలోగా గాని సంభోగం జరిగితే...."

    "ఆ టైమ్ ఏ మగాడితోనయినా కలిస్తేనా...?" అడిగాడు భార్గవ.

    "ఎస్. సంపర్కం జరిగితే పురుషకణాలు గర్భాశయం గుండా ఫాలోఫియన్ ట్యూబ్స్ ల్లోకి వచ్చి అండం చుట్టూ చేరతాయి. అయితే వీటన్నింటిలో అతిశక్తివంతమయిన ఒకే ఒక్క పురుష బీజకణం (Sperm) అండంతో (Ovasy) ఫలదీకరణ చెందుతుంది. అది విభజనలు చెందుతూ బ్లాస్టోసిస్ట్ అనబడే దశలో గర్భకోశంలోకి వచ్చి స్థిరపడి పిండంగా ఎదుగుతుంది"

    "మరింకా స్త్రీలలో వ్యంధత్వం ఎలా ఏర్పడుతుంది?" అడిగాడు శరత్.

    "ఈ విధంగా కాక ఒక్కోసారి స్త్రీలలో బీజాశయాల పెరుగుదల నిల్చిపోతుంది. అండాలు విడుదల కాకపోవచ్చు. బీజవాహికల్లో కూడా లోపాలు వుండొచ్చు ఇలా ఏ లోపమున్నా స్త్రీ వ్యంధత్వానికి గురైనట్లు" చెప్పింది లక్ష్మి. చెప్పి "అలాగే బ్రౌన్ దంపతుల మీద కూడా ఆ డాక్టర్లు పరీక్షలు చేశారు. మత సంస్థలకు తెలియకుండా 1977 నవంబర్ 10న లెస్లీయొక్క పరిపక్వమైన అండాన్ని డాక్టర్ స్ట్రెప్టో బయటికి తీశాడు. ఆ అండాన్ని డాక్టర్ ఎడ్వర్డ్, ఆమె భర్త గిల్బర్ట్ బ్రౌన్ స్పెర్మ్ తో పరీక్షా నాళికలో కలిపాడు. అండం పొదగ్గానే...తిరిగి దానిని లెస్లీ గర్భాశయంలో వుంచారు. ఎనిమిది నెలలు నిండగానే...మాంచెస్టర్ కు సమీపాన వున్న "ఓల్టామ్" అనే వూర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో వుంచారు. అప్పటికే మతసంస్థల విమర్శలకు తట్టుకోలేక ఇదంతా రహస్యంగానే చేశారు. 1978 జూలై 25వ తేదీన అర్దరాత్రి సమయాన ఆ ఇద్దరు డాక్టర్లు ఠెస్లీకి సిజేరియన్ ఆపరేషన్ చేశారు"

    "ఆ ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళెంత టెన్షన్ ఫీలయ్యారో?" వూహిస్తూ చెప్పాడు భార్గవ.

    "అవునూ! తమ ప్రయోగాలు ఫలిస్తాయో లేదోనని భయపడ్డారు. కాని ఆపరేషన్ పూర్తయి రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఓ పాప కేర్ మంది...."

    "ఆ కేర్ మన్న కేకతోనే...నేనే ప్రపంచపు ప్రప్రధమ టెస్ట్ ట్యూబ్ బేబీనని పరిచయం చేస్కుందేమో? రియల్లీ గ్రేట్" అన్నాడు శరత్.

    "నిజమే! బ్రౌన్ దంపతుల ఆనందానికి హద్డులేదు. అంతకంటే రెట్టింపు ఆనందాన్ని పొందింది ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు...అంతా కల్సి ఆ బేబీపేరు "లూయీసీ" అని పెట్టారు" డాక్టర్ లక్ష్మీ కూడా అలాంటి తన్మయత్వంలో మునిగి చెప్పింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS