"ఏం సాయంత్రం మీ ఇద్దరికీ గర్ల్ ఫ్రెండ్స్ తో ప్రోగ్రామ్ ఏదైనా వుందా?!" నవ్వుతూ అడిగాడు కమీషనర్.
"సార్!...."
"మాకు ఏదో విధంగా విషయాలన్నీ తెలుస్తాయోయ్! పోనీ మీ గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా పార్టీకి తీసుకురండి.మీరు పార్టీకి మాత్రం తప్పకుండా రావాలి! అంతే!" అని ఫోన్ పెట్టేశాడు కమీషనర్.
"కమీషనర్ గారు వాళ్ళ పాప బర్త్ డే పార్టీకి మా ఇద్దర్నీ రమ్మంటున్నారు!" ఇన్స్ పెక్టర్ అప్పారావ్ వంక గర్వంగా చూస్తూ చెప్పాడు రాంబాబు.
17
"ఆ....ఇక్కడాపు" అన్నాడు రాంబాబు ఓ పబ్లిక్ ఫోన్ ని చూపించి.
జీపు పబ్లిక్ ఫోన్ ముందు ఆపాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
రాంబాబు, చిన్నారావ్ లు జీపు దిగారు.
"ఇంక నువ్వెళ్ళొచ్చు!" అన్నాడు రాంబాబు.
"నాకు కుక్క కిడ్నీని అమర్చిన సంగతీ...." అంటూ ఆగాడు అప్పారావ్.
"ఎవర్తోనూ చెప్పనులే....నువ్వెళ్ళు."
అభయం ఇచ్చాడు రాంబాబు.
థ్యాంక్స్ చెప్పి జీపు తోసుకుంటూ వెళ్ళిపోయాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
"ఇప్పుడు పబ్లిక్ ఫోన్ దగ్గర జీపునెందుకు ఆపించావు?" అడిగాడు చిన్నారావ్.
"కమీషనర్ గారు మీ గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా పార్టీకి తీసుకురండి కావాలంటే అన్నారు! నర్సింగ్ హోమ్ కి ఫోన్ చేసి వాళ్ళకి చెప్దామని" అన్నాడు రాంబాబు.
"మరి ఇందాకే అప్పారావ్ ఇంట్లోంచి ఫోన్ చేసుండాల్సింది!"
"అప్పుడు నాకు తట్టలేదు!" అని టెలిఫోన్ బూత్ లోకి వెళ్ళాడు రాంబాబు. అతనితో బాటే చిన్నారావ్ కూడా బూత్ లోకి వెళ్ళాడు.
రాంబాబు నర్సింగ్ హోమ్ నెంబరు డయల్ చేసి అవతల ఫోన్ ఎత్తిన వాళ్ళని సరోజ, సునీతలని పిలవమని చెప్పాడు.
ఓ పది సెకన్ల తర్వాత సరోజ లైన్లో కొచ్చి "హలో!...."అంది.
రాంబాబు కమీషనర్ ఇంట్లో పార్టీ గురించి చెప్పి మీరు కూడా మాతో రండి అని ఇన్ వైట్ చేశాడు. ఆయనేదో మాట వరసకి పిలిచాడు. అలా ముక్కూ మొహం తెలీని వాళ్ళింటికి పార్టీ కొస్తే బాగుండదు....కావాలంటే పార్కుకి ఎల్లుండి సాయంత్రం వెళదాం అని చెప్పింది సరోజ. రాంబాబు, సరోజ ఓ అయిదు నిముషాలపాటు కబుర్లు చెప్పుకున్నాక చిన్నారావ్, సునీతలు కబుర్లు చెప్పుకున్నారు.
ఇద్దరూ ఫోన్ బూత్ లోంచి బయటికి వచ్చారు. మెల్లగా తమ రూమ్ వైపు అడుగులు వేశారు. అక్కడికి దగ్గరే వాళ్ళ రూమ్. ఓ అయిదు నిమిషాల నడక.
కబుర్లు చెప్పుకుంటూ రూమ్ ని సమీపించిన రాంబాబు, చిన్నారావ్ లు అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దనిచేసి, నోరు పూర్తిగా తెరిచి పెట్టి అలానే చూస్తూ నిల్చుండిపోయారు.
వీళ్ళ గది మెట్లమీద ఓ వ్యక్తి బోర్లాపడి వున్నాడు. అతని శరీరంలో ఏ రకమైన కదలికా లేదు....కళ్ళు మూస్కుని వున్నాయ్.
ఇద్దరూ మొహామోహాలు చూసుకున్నారు.
"శవమా....?" భయం భయంగా చూస్తూ అడిగాడు చిన్నారావ్.
"హత్య....?" అన్నాడు రాంబాబు చిన్నారావ్ వంక చూస్తూ.
"ఒక వేళ హత్య అయితే ఆ మనిషిని చంపి మనింటి గుమ్మం ముందు ఎందుకు పడేస్తారు?" సందేహంగా అడిగాడు చిన్నారావ్.
"ఆత్మహత్యేమో!" అన్నాడు రాంబాబు.
"పోనీ ఆత్మహత్య అయితే మనింటి గుమ్మం దగ్గర ఎందుకు చేస్కోవాలి?" అన్నాడు చిన్నారావ్.
"మనింటి గుమ్మం దగ్గర కాకపోవచ్చు....వాళ్ళింట్లోనే ఏ పురుగుల మందో తాగి వుండొచ్చు....ఇక్కడికి వచ్చి చచ్చిపోయి వుండవచ్చు....!"
"నిజమే....మనింటి గుమ్మంమీదే ఎందుకు చావాలి? వాళ్ళింట్లోనే పురుగుల మందు తాగినవాడు బుద్దిగా వాళ్ళింట్లోనే చావొచ్చుకదా....! మన గుమ్మంలో చచ్చి మనకెందుకు ట్రబులివ్వాలని?"
చిన్నారావ్ కి వచ్చే సందేహాలకి రాంబాబుకి చచ్చేంత చికాకేసింది.
"అన్నీ సందేహాలు నన్నడిగితే నేనెక్కడ చెప్పను....?! నీకెంత తెలుసో నాకూ అంతే తెలుసు....అసలే టెన్షన్ తో చస్తుంటే నీ వెధవ ప్రశ్నలొకటి!"
"ఉండు....దగ్గరకెళ్ళి చూద్దాం...." అన్నాడు చిన్నారావ్.
"పద...."అన్నాడు రాంబాబు.
ఇద్దరూ చేయీ, చేయీ పట్టుకుని భయంగా అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదిలారు.
రాంబాబు, చిన్నారావ్ చేయిపట్టి నిక్కుతూ ఆపాడు.
చిన్నారావ్ ఏంటన్నట్లు రాంబాబు మొహంలోకి చూశాడు.
"అతను బ్రతికే వున్నాడు....పొట్ట చూడు పైకీ క్రిందికీ మెల్లగా కదుల్తూ వుంది" అన్నాడు రాంబాబు.
చిన్నారావ్ ఆ వ్యక్తి పొట్టవంక చూశాడు. నిజమే....! అది పైకీ క్రిందికీ కదులుతోంది.
ఇద్దరూ గబగబా అడుగులు వేస్తూ ఆ వ్యక్తిని సమీపించారు.
రాంబాబు ముందుకు వంగి ఆ వ్యక్తి భుజంమీద చెయ్యేసి ఏయ్ మిస్టర్ అంటూ వూపాడు.
ఆ వ్యక్తి కదలలేదు, మెదలలేదు.
"మూర్చపోయినట్టున్నాడు....! నీళ్ళు తీసుకురా...." అన్నాడు రాంబాబు.
చిన్నారావ్ తాళం తీసి లోపలికెళ్ళి గ్లాసుతో నీళ్ళు తెచ్చి ఆ వ్యక్తి ముఖంమీద చిలకరించాడు.
