Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 42

    ఆ మర్నాడు దర్శకుడు వీరబ్రహ్మ కోరినవిధంగా హోటల్ రూంలో ఆయన్ని కలవడానికి వెళ్లింది సరోజ. రూమ్ లో ఆయనతోబాటు నిర్మాత తిమ్మరాజు ఉన్నాడు.వీరబ్రహ్మం అతన్ని సరోజకి పరిచయం చేశాడు. సరోజ అతనికి నమస్కరించింది.
    "ఎలా వుంది మన సెలక్షన్?" కళ్ళు ఎగరేసి అడిగాడు వీరబ్రహ్మం తిమ్మరాజువంక చూస్తూ.
    తిమ్మరాజు సరోజవంక తేరిపారచూశాడు.
    "కానీ... మరేమో...అమ్మాయి కాస్త పీలగా వున్నట్టుందికదా?..."అన్నాడు నసుగుతూ.
    ఆమాట వింటూనే వీరబ్రహ్మం గుడగుడా నవ్వాడు.
    "ఈ అమ్మాయిని ఇట్టానే వదుల్తామని అనుకున్నావా? ఎక్కడబడ్తే అక్కడ ప్యాడ్స్ కట్టేసి పుష్టిగా తయారుచేస్తాం... నువ్వేం భయపడకు.."
    "అవునండీ తిమ్మరాజుగారూ...మీరు ప్యాడ్స్ కట్టుకోమంటే కట్టుకుంటా... ఏం కట్టుకోమంటే అది కట్టుకుంటా..."అంది సరోజ.
    "ఈమెకి జుట్టుకూడా పల్చగా వున్నట్టుంది..." మళ్లీ నసిగాడు తిమ్మరాజు.
    "హబ్బా...జుట్టు పల్చగా వుంటే విగ్గు పెడ్తాంలేవయ్యా"అన్నాడు వీరబ్రహ్మం
    "అవునండీ...మీరు విగ్గుపెట్టుకోమంటే విగ్గు పెట్టుకుంటాను... సవరాలు పెట్టుకోమంటే సవరాలు పెట్టుకుంటాను..."అంది సరోజ తిమ్మరాజుతో.
    "ఈమె గొంతుకూడా అంత బాగున్నట్టు లేదే..." నసగడం మానలేదు తిమ్మరాజు.
    "గొంతు బాగోపోయినా డైలాగులు చెప్పలేకపోయినా వేరేవాళ్లచేత డబ్బింగ్ చెప్పిస్తాం లేవయ్యా..." అన్నాడు డైరెక్టర్ వీరబ్రహ్మం.
    "ఇలా చేసేకంటే అన్నీ వున్నవాళ్లనే హీరోయిన్ గా తీస్కోవచ్చుకదండీ బాబూ" నెత్తి కొట్టుకున్నాడు తిమ్మరాజు.
    "అబ్బబ్బ... మీలాంటి కొత్త ప్రొడ్యూసర్లతో ఇదేనయ్యా చిక్కు! ఏ విషయమూ సరిగా అర్థం కాదూ... అన్నీ ఉంటే మనం ఎందుకిక్కడ వున్నదీ? మనం వున్నది లోటుపాట్లు కవర్ చేయడానికేకదా?... నువ్వు చెప్పేది పాతకాలం హీరోయిన్ల గురించి. పాతకాలం హీరోయిన్లకి అందం వుండాలి. పర్సనాలిటీ వుండాలి, నటన వచ్చి వుండాలి, వాచకం సరిగా వుండాలి...ఇప్పటి హీరోయిన్ కి స్టెప్సులెయ్యడం వస్తేచాలు...ఇంకేం అక్కర్లేదు..." విసుక్కుంటూనే విడమర్చి చెప్పాడు వీరబ్రహ్మం
    "మరి ఈ అమ్మాయికి స్టెపులెయ్యడం వచ్చో రాదో..." సందేహంగా అన్నాడు తిమ్మరాజు.
    "స్టెప్పులెయ్యడం గొప్ప విద్యా? నీ కళ్లముందే ఈ అమ్మాయితో స్టెప్పులేయిస్తా చూడు..."తిమ్మరాజుతో అని సరోజ వైపుకు తిరిగాడు వీరబ్రహ్మం.
    "చూడమ్మా నీకెప్పుడైనా సెగ్గడ్డలు వచ్చాయా?" అడిగాడు వీరబ్రహ్మం.
    "ఓ వచ్చాయండి... ఓసారి కన్నుమీద వచ్చిందండి. ఓసారి బుగ్గమీద వచ్చిందండి.
చెప్పింది సరోజ.
         "చంకల్లో వచ్చాయా?"
    "రాలేదండి..."
    "నువ్విప్పుడేం చేస్తావంటే చంకల్లో సెగ్గడ్డలు వచ్చినట్లు చేతులు రెండూ కాస్త పైకి పెట్టి నిలబడు."
    డైరెక్టరుగారు చెప్పినట్టే చంకలు పైకెత్తి నిలబడింది సరోజ.
    "నేనిప్పుడు నోటీతో మ్యూజిక్ ఇస్తాను. నువ్వట్టానే చేతులు పైకుంచి థెయ్యిథెయ్యిమంటూ గెంతాలి... ఊ గెంతూ... లబ్జులకిడి... లబ్జులకిడి... లబ్జులకిడి..."
    సరోజ అతని నోటి మ్యూజిక్ కి తగినట్టు అలా చంకలు ఎత్తిపట్టి వుంచే గెంతింది.
    "అంతే!... అవే స్టెప్స్!" తిమ్మరాజువంక చూస్తూ అన్నాడు వీరబ్రహ్మం.
    తిమ్మరాజు సంతృప్తిగా తల ఊపాడు.
    "సార్... మన సినిమాలో హీరో ఎవరు సార్? కుతూహలంగా అడిగింది సరోజ.
    "కళా కురూపి కోతి హనుమంతరావమ్మా" చెప్పాడు వీరబ్రహ్మం.
    సరోజ గుండెలు ధన్ ధన్ మని బాదుకుంది.
    "హబ్బా!... ఆయనా? ఆయన నా అభిమాన హీరో అండీ... ఏమండే వండీ.. ఇంకా మన సినిమాలో ఏయే నటీనటులుంటారండీ...?"
    వీరబ్రహ్మం చెప్పాడు.
    "అదేంటండి మన సినిమాలో జైమాల్ని అన్రాధా అలాంటివాళ్లు లేరేం?" ఆశ్చర్యంగా అడిగింది.
    వీరబ్రహ్మం పోట్టపట్టుకుని గుడగుడా నవ్వాడు.
    "వాళ్లుంటే నువ్వేం చేస్తావ్?" అన్నాడు నవ్వాపుకుంటూ.
    సరోజ తెల్లబోయి చూసింది.
    "పాతకాలం సినిమాల్లో వాళ్లు వుండేవారు. ప్రస్తుతం హీరోయిన్ అన్నీ చేస్తుంది.నీకీ సినిమాలో ఒక పాటలో ఈత డ్రెస్సుంది. దాన్ని రెండురుమాలలతో కుట్టిస్తున్నాము. ముత్యాల చెడ్డీ వేస్కుని ఒకటీ, చెమ్కీ చెడ్డీ వేస్కుని ఒకటీ, చీలికల లంగా వేసుకుని మరొకటీ ఇలా మూడు క్లబ్బుడాన్సులు ఉన్నాయ్ నీమీద. ఇహపోతే చెర్లో మునుగుతూ ఒకటీ, వానలో తడుస్తూ ఒకటీ, రెండుపాటలు వున్నాయ్...అంచేత అన్రాధా, జైమాల్నీలు మనకి అవసరంలేదు."
    "ఏవండీ... మన సినిమాకథని కాస్త చెప్తారా?" అడిగింది సరోజ.
    వీరబ్రహ్మం ఆమెకి కథ టూకీగా చెప్పాడు.
    "అర్రే!... ఈ కథలో నా పాత్రే లేదుకదండీ!!" ఆశ్చర్యంగా అంది సరోజ.
    వీరబ్రహ్మం గుడగుడా, తిమ్మరాజు ఘొల్లుమని నవ్వారు.
    "నువ్వెక్కడో వెర్రిబాగుల్డానిలా ఉన్నావ్!... తెలుగు సినిమాల్లో హీరోయిన్లకి కథతో సంబంధం ఉంటుందా ఎక్కడైనా? హీరో వెంట ఉండి స్టెప్పులేసి డాన్సులు చెయ్యడమే హీరోయిన్ల పని... తెల్సిందా?... ఇలాంటి పిచ్చి సందేహలు పెట్టుకోకు... భవిష్యత్తు పాడైపోద్ది"
    సరోజ బుద్ధిగా తలఊపింది.
    వీరబ్రహ్మం తీసిన సినిమా బ్రహ్మాండంగా హిట్టయింది. దాంతో సరోజ చాలా సినిమాల్లో బుక్ అయింది. కొన్నాళ్లకి సరోజ గొప్ప హీరోయిన్ అయిపోయింది. ఆమెకి ఓ సంస్థ 'కళాతాటకి" అనే బిరుదుకూడా ఇచ్చి సన్మానించింది.
                                                                               *    *    *   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS