"ఛీ... నీచుడా... నేను పవిత్ర భారతనారిని రా. భారతనారి ఒక్క భర్తనే కొలుస్తుందిరా."
"హ-హ-హ-" రాయుడు వికటాట్టహాసం చేస్తూ ముందుకి అడుగులు వేశాడు.
దుర్మార్గుడా... ఆగు....అడుగు ముందుకువెయ్యకు. ఇది సీతా, సావిత్రీ, అనసూయలు పుట్టిన దేశంరా. నన్ను ముట్టుకున్నావో మాడి మసైపోతావ్."
"ఏది... మసవుతానో లేదో చూద్దాం."
రాయుడు రెండంగల్లో గౌరిని చేరి చటుక్కున ఆమె చేతిని పట్టుకున్నాడు.
"ఛీ... దుర్మార్గుడా... వదులు. నా చేయి వదులు" గౌరి గింజుకోసాగింది. రాయుడు పకపకా నవ్వి తర్వాత పొరబోయి దగ్గాడు.
"బాబుగారు! మీకు చేతులెత్తి దణ్ణం పెడ్తా. దాన్ని వదిలేయండి బాబుగారూ. కావాలంటే నన్ను ఏమైనా చేస్కోండి" దీనంగా వేడుకున్నాడు సంతానం.
"ఛీ... యాక్" అన్నాడు రాయుడు.
"నన్నేమైనా చేస్కోండి అంటే తమరు పొరపాటుగా అర్ధం చేస్కుంటున్నారు బాబుగోరూ. నా ఉద్దేశం నన్ను కత్తికొక కండగా కోయ్యండి. కాకులకీ, గద్దలకీ వెయ్యండి. మీ ఇష్టం బాబుగారూ. ఏమైనా చేస్కోండి గానీ నా గౌరిని వదిలి పెట్టెయ్యండి బాబుగారూ."
"కత్తికొక కండగా కొయ్యడానికి నీ ఒంటికి అసలు కండనేది అంటే కదా?"
పకపకా నవ్వాడు రాయుడు.
"ఛీ... నీచుడా... దుర్మార్గుడా" రాయుడి చేతిలోంచి తన చేతిని విడిపించుకోడానికి గౌరి ఇంకా గింజుకుంటూనే ఉంది.
"బాబుగారూ! ఇది రాయుడు పుట్టిన దేశం బాబూ. రాయుడిదేమో మరేమో ఒకటే మాట. ఒకటే బాణం. ఒకటే పెళ్ళాం బాబూ" సంతానం గోలగోలగా అన్నాడు.
"నాకు మాత్రం ఎందరో పెళ్ళాలున్నారా? నాకూ ఒకరేగా పెళ్ళాం?హహహ" విరగబడి నవ్వాడు రాయుడు.
రాయుడి రౌడీలు సంతానం గొంతు మీద కత్తి అనించారు.
"బాబుగారూ. ఇంకో విషయం బాబుగారూ. ఇది గాంధి గౌతమబుద్దుడు పుట్టిన ప్రదేశం బాబుగారూ. ఈదేశంలో హింసతగదు బాబుగారూ" సంతానం కత్తులవంక భయంగా చూస్తూ అన్నాడు.
"ఒరేయ్! వీడి సోది రాన్రానూ ఎక్కువ అయిపోతూంది... వీడిని బయటకి లాక్కెళ్ళి పోండ్రా..." రౌడీలను చూస్తూ అన్నాడు రాయుడు.
రౌడీలు సంతానాన్ని బయటికి బరబరా లాక్కెళ్ళిపోయారు.
రాయుడు గౌరిని గదిలోకి లాక్కెళ్ళి మంచంమీదకి తోశాడు.
* * *
తన సెల్ లో ఓమూల దిగులుగా కూర్చున్నాడు గోపి. అతనిమనసులో ఎన్నెన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయ్.
రాధ... తన రాధ ఎలావుందో ఏమో! దేవతలాంటి తన తల్లి?
తనమీద బెంగతో వాళ్ళసలు తిండి తింటున్నారో లేదో... అనుకున్నాడు.
రాధతో తను గడిపిన మధుర క్షణాలన్నీ తలుచుకుని కుమిలిపోయాడు.
"భగవాన్." ఆలోచనల తీవ్రత తట్టుకోలేక బాధగా అరిచాడు.
అతని అరుపు విని ఓ ముసలి సెంట్రీ పరిగెత్తుకుని వచ్చాడు
"పిలిచావా బాబూ?" అడిగాడు సెంట్రీ.
"లేదే" అయోమయంగా చూస్తూ అన్నాడు గోపి.
"ఇప్పుడేకదా బాబూ భగవాన్ అని అరిచావ్?"
"అవును. అయితే?"
"నాపేరు భగవాన్ బాబూ" చెప్పాడు సెంట్రీ. అతని వయసు అరవైపైనే ఉంటుంది. కాని ఎందుకనో ఇంకా రిటైరవలేదు పాపం.
గోపి విరక్తిగా ఓ నవ్వు నవ్వాడు.
"చూశావా తాతా. విధి ఎంత విచిత్రమైనదో! నేనేమో దేవుడ్ని తలుచుకుంటే నిన్ను లిపిచానేమో అనుకుని నువ్వు పరుగెత్తుకొని వచ్చావ్. అదే నేను నిన్నే పిలిచివుంటే దేవుడ్ని తల్చుకున్నానని అనుకుని ఉండేవాడివేమో..."
"విధి అంతేబాబూ. చాలా మాయదారిది మనం ఒకటి తలిస్తే మరొకటి జరిగేలా చేస్తుంది" అన్నాడు సెంట్రీ.
"అందుకనే కదా తాతా. నా భార్యతో సుఖంగా కాపురం చేస్కోవలసిన నేను చేయని హత్యానేరానికి ఇలా జైల్లో మగ్గుతున్నాను" కళ్ళు తుడుచుకున్నాడు గోపి.
"ఈ చట్టంకూడా చాలా చిలిపిదిలే బాబూ. సరేగానీ ఇలా ఎంతసేపు దిగులుగా కూర్చుంటావ్? కాస్త ఎంగిలిపడు బాబూ." ప్రేమగా అన్నాడు లతా.
"వద్దులే తాతా. నాకాకలిగా లేదు"
"బాధలన్నీ మర్చిపోతే ఆకలి అదే అవుద్ది బాబూ"
"ఎలా మర్చిపోగలను తాతా? ఎలా మర్చిపోగలను?" జుట్టుని రెండుచేతుల్తోపాయలు పాయలుగా పీక్కుంటూ అన్నాడు గోపి.
"మర్చిపోవాలి బాబూ. మర్చిపోవాలి!"
"తాతా..."
రంకెవేశాడు గోపి.
ఆ అరుపుకి సెంట్రీ ఉలిక్కిపడ్డాడు.
ఓసారి తన చొక్కా ముందుకు లాక్కుని "థూ....థూ...థూ" అని ఊస్కున్నాడు.
"నా రాధని మర్చిపొమ్మని అంటున్నావా తాతా... దైవంలాంటి నా తల్లిని మర్చిపొమ్మని అంటున్నావా తాతా..."ఆవేశంగా అన్నాడు గోపి.
"వాళ్ళని మరచిపొమ్మని నేనెక్కడ అన్నాను బాబూ? బాధల్ని మర్చిపొమ్మని అన్నానుగానీ..." బెరుకు బెరుకుగా అన్నాడు ముసలి సెంట్రీ.
"నా సంతోషం అయినా, బాధయినా వాళ్ళతోనే లింక్ అయివుంటుంది కదా తాతా?"
"పోనీలే బాబూ. తెలివితక్కువతనంగా ఏదో అన్నాను. ఇహ నన్ను వదిలెయ్. పోనీ నీ ఇష్టం ప్రకారమే బాధపడ్తూనే కాస్త ఎంగిలిపడు బాబూ."
"వద్దు తాతా. కాస్సేపయ్యాక తింటా. నాకో సహాయం చేస్తావా తాతా..."
"ఏంటి బాబూ? కన్నకొడుకు సహాయంచెయ్యమంటే చెయ్యకుండా ఏ తండ్రయినా ఉంటాడా బాబూ?" "ఓ బొగ్గుముక్క ఇస్తావా తాతా?" అడిగాడు గోపి.
"ఏంబాబూ. పొద్దున్న పళ్ళు తోముకోలేదా?"
"అందుక్కాదులే తాతా. నేను బొమ్మలేస్కుంటా" చెప్పాడు గోపి.
"బాబూ..."
బాధగా అన్నాడు తాత.
"వద్దు బాబూ వద్దు. ఇప్పటికే జైలుగది గోడలనిండా బొమ్మలేసి ఏసీ గదంతా ఖరాబు చేశావ్."
"తాతా." బాధగా మూలిగాడు గోపి.
"ఇంతకీ గోడలనిండా నువ్వు గీస్తున్న ఆ అమ్మాయ్బొమ్మ ఎవరిది బాబూ? నీ ప్రేయసిదా బాబూ?" కుతూహలంగా అడిగాడు సెంట్రీ.
"ప్రేయసీ గీయసీ అనకుతాతా. నా భార్య నా టెంకి వాయగొడ్తుంది! అది నా భార్యబొమ్మ తాతా. నా రాధ బొమ్మ!!"
జైలు గది గోడలమీద బొగ్గుతో తనుగీచిన రాధ బొమ్మలవంక ఆరాధనగా చూస్తూ అన్నాడు గోపి.
"ఆహా. ఎంత కళగావుంది బాబూ నీభార్య!" తన్మయత్వంతో రాధ బొమ్మలవంక చూస్తూ అన్నాడు సెంట్రీ.
"నేను బొగ్గుతో కాకుండా చాక్ పీసుతో గీసుంటే ఇంకా కళగా ఉండివుండేది తాతా." బాధగా అన్నాడు గోపి.
"పోన్లే బాబూ. రేపు నీకు చాక్ పీసు తెచ్చిస్తాలే. కానీ నాదో చిన్నకోరిక బాబూ..."
"ఏంటి తాతా?"
"రేపు నువ్వు మీ అమ్మగారి బొమ్మని వెయ్యాలి బాబూ. ఆవిడ ఎలావుంటారో చూడాలని వుంది!"
"ఓ. అలాగే తప్పకుండా."
"నీకు బొగ్గుముక్క తెచ్చిస్తాగానీ ముందు భోజనం చెయ్ బాబూ. చిప్పలో అన్నం వేస్కుని తీసుకురానా బాబూ?" ప్రేమగా అడిగాడు తాత.
"ఎందుకు తాతా నీకు నామీద అంత ఆప్యాయత?" అడిగాడు గోపి.
"అదో విషాదకధలే బాబూ. నా భార్య ఒక మగబిడ్డని ప్రసవించి పురిట్లోనే పోయిందిబాబూ. వాడిని నేను అల్లారుముద్దుగా పెంచుకున్నా బాబూ. కానీ వాడికి పదేళ్ళవయసు వచ్చాక తిరునాళ్ళలో తప్పిపోయాడు బాబూ. వాడు ఉండివుంటే ఇప్పుడు నీ అంతవుంటాడు బాబూ" కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ అన్నాడు సెంట్రీ.
"ఊర్కో తాతా ఊర్కో మీ వాడు ఎక్కడో ఓచోట క్షేమంగానే ఉండి ఉంటాడు!" సముదాయించాడు గోపి.
అంతలో అక్కడికి సంతానం గోలగోలగా అరుస్తూ పరుగెత్తుకుని వచ్చాడు.
"బాబూ.గోపీ బాబూ. అన్యాయం జరిగిపోయింది బాబూ."
సంతానం జైలుగది ఇనప కడ్డీలకు తల బాదుకున్నాడు.
"ఏమైంది సంతానం? ఏమైంది?" ఆందోళనగా అడిగాడు.
