స్వాతి మనస్సు ద్రవీభూతమైంది. ఆమెకు ఇద్దరూ ఒకటే. ఇద్దరూ చెరో కన్ను. ఇందులో ఏ కంటిని ఎందుకు పోగొట్టుకోవాలి? ఒక్క కన్నుతో ఆమె ఏం చెయ్యగలదు? ఎవరిని త్రోసి రాజనకలదు?
"జయా! ఒకరి ప్రేమను కాదనీ, ఒకరినే చేపట్టమనీ ఎవరివైపూ నేను బాసటగా నిలబడి సమర్దించలేను. జీవిత ప్రమాణాలు విలాస వస్తువులు కావు, బేరమాడ ఏది బాగున్నదో ఎంచుకోటానికి. ప్రేమ రాహిత్యంలో భావ సమైక్యతకు తావులేదు. ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు.? ఎవరి ప్రేమ న్యాయ సమ్మతమైనది? ఒకరి ప్రేమ చట్ట విరుద్ధమైనదని చెప్పటానికి సాహసించటం జీవితాలతో పందెం వేసినట్లే అవుతుంది. నా జీవితాన్ని పందెం వేసి మీ అన్నయ్యను గెల్చుకున్నాను. కాని అ గెలుపు నాది కాదని ఇటీవల మళ్ళీ తెల్సుకున్నాను. వ్యక్తిగతంగా పందెం గెలిచినా సంఘానికి సవాలువంటిది. ఈ సవాలులో నేను వోడి పోతానో, అణగద్రొక్కబడతావో నాకే తెలియదు. దారితప్పిన జీవితాలు ఎన్నడూ రాజబాటని చేరుకోలేవనుకోటం మొదట్లో పిచ్చి వూహలుగానే కనిపించినా, కాలక్రమేణా రాచబాటని చేరుకున్నా మళ్ళీ ముళ్ళ బాటనులోకి లాగబడుతూనే ఉంటయ్యి. ఈ అనుభవం క్రమేణా, కాలానుగతంగా తెల్సుకుంటాము" అన్నది స్వాతి. ఈ మాటలు చెబుతుంటే ఆమె ముఖం వెల వెలబోయింది. అంత రాంతరంలోని దుఃఖ పూరితమైన అన్ని సన్నివేశాలూ ఆమె మానసిక పరిధిలో విన్యాసం చేసినట్లుగా అనుభూతిని పొందింది. జీవితమంతా ఉత్తమ విలువలనూ, ఉత్తమ ఆశయాలనూ పుణికి పుచ్చు కుని, నిష్కల్మషమైన జీవితాన్ని గడుపుతున్నా నిశ్చలమైన, నిర్మలమైన కొలనులో ఒక రాయి విసిరి నట్టుగా ఉన్నదామె మనస్సు. అందుకామె పడే మానసిక ఆవేదన అంతులేనిది. దానికి తోడు ఇప్పుడే కొత్త సమస్య ఉత్పన్నమైనది.
స్వాతి భావాలు కొద్దిగా అర్ధంచేసుకున్నది జయలక్ష్మి. స్వాతి కూర్చుని మాట్లాడలేక పోయింది. మెల్లిగా నడుంవాల్సింది. కాసేపు కళ్ళు మూసుకుని పడుకుంది. ఆయాసం ఎక్కువైనట్టుగా గ్రహించింది జయలక్ష్మి.
"వదినా, మనస్సులో బాధపడినా, మధనపడినా జరగవలసిన జీవిత సంఘటనలు జరగక మానవు. ఇంతగా నువ్వు మనస్సులో ఎందుకు బాధపడుతున్నావో నాకు అర్ధంకావటం లేదు" అన్నది జయలక్ష్మి.
"జయా, నేను బాధపడను గాని ఒక్క విషయం చెపుతావా" ఆదుర్దాతో ఆశగా అడిగింది.
"ఏమిటది వదినా"
"నన్ను గురించీ మీ కృష్ణమూర్తి అన్నయ్యని గురించీ మీ పెద్ధనాన్న గారింట్లో ఏమనుకుంటారు జయా. కన్నకొడుకునీ పెద్దకొడుకునీ చూడాలనీ, ఆయన ఆరోగ్యం గురించి తెల్సుకోవాలనీ ఆ తల్లి తండ్రుల మనస్సుల్లో ఎప్పుడూ కడుపు తీపి కలగదా జయా!" అన్నది స్వాతి. ఈ పరిస్థితులో ఈ ప్రశ్న ఎందుకు స్వాతి అడిగిందో జయలక్ష్మికి అర్ధం కాలేదు.
"నేను ఆ ఇంటి పెద్దకోడల్ని ఎప్పుడూ కాలేనా జయా, నన్ను కోడలిగా చెప్పుకోటానిక్కూడగా వారు వారు నామర్దాగానే ఎంచుతారా? పోనీ అత్తగారైనా ఎప్పుడూ నా ప్రసక్తి ఎత్తరా? శ్రీలక్ష్మి వదినెకు నేనంటే ఏమాత్రమూ ఇష్టం లేదనుకుంటాను. మామగారి దృష్టిలోకి నేనెప్పుడూ రాలేదేమో? ఏం జయా నిజం చెప్పు" జయలక్ష్మి గడ్డం పుచ్చుకుని బ్రతిమాలుతున్నట్లుగా అడిగింది స్వాతి.
స్వాతి మనస్సు ఈ ప్రశ్నలకు సమాధానం వినటానికి ఆదుర్దాతో ఉవ్విళ్ళూరుతున్నది. జయలక్ష్మి మనస్సు ఏం చెప్పటానికి నిరాకరిస్తున్నది.
"నిన్ను బ్రతిమాలుతున్నాను జయా నిజం చెప్పు. నా మనస్సు అవమానంతో, బాధతో ఎప్పుడో నిండిపోయింది. కొత్తగా నేననుభవించే బాధ ఏమీలేదు. అత్తమామల, ఆడబిడ్డల అభిప్రాయాలు తెల్సుకోటం కోడలు విధి కదా!" అన్నది స్వాతి మళ్ళీ.
జయలక్ష్మి మనస్సు సుళ్ళు తిరిగింది.
"వదినా, వారి భావాలూ, అనుభూతులూ యధాప్రకారంగానే ఉన్నాయి. మార్పేమీ లేదు. ఈ భ్రష్టయోగి అయిన కృష్ణమూర్తి అన్నయ్య కన్నతల్లి మనస్సులో ఎప్పుడూ మెదుల్తూనే ఉంటాడు. కాని, రాకపోకలకు గాని, కన్న కొడుకు ఆశయాల్ని, మానావమానాల్ని, సహించి కడుపులో పెట్టుకుని ఆదరించే వాతావరణం గాని ఆ ఇంట్లో ఎప్పటికీ రాదేమో. కన్నీరు నింపుకుని, కన్న ప్రేమను చంపుకుని జీవచ్చవంలా గడపటం కన్నా ఆవిడ చెయ్యగలిగిందేమీ లేదు. ఆవేదన అంచులు తట్టినా, ఆప్యాయత పాల పొంగులా ఉప్పొంగినా నీళ్ళు చల్లి చల్లార్ప సమర్దురాలు, ఆ ఇంటి సనాతనాచార ధర్మ విశిష్టాపరురాలు. శ్రీలక్ష్మి తండ్రికి తగిన కూతురు. కూతురు భావాలకు నీళ్ళు పోసి పెంచే తండ్రి. ఇంక నీకా ఇంట్లో తావెక్కడుంటుంది వదినా."
కుండ పగుల గొట్టినట్లుగా చెప్పిన ఈ మాటలు స్వాతి హృదయకుహరాన్నే పగులగొట్టినయ్యి. హృదయావేశంలోని కుమిలింపు మాత్రమే ఆమె సొమ్ము.
"మీ అన్నయ్యకు గుండె జబ్బు తిరగబెట్టిందని వాళ్ళకు తెలుసా జయా" అన్నది స్వాతి.
"తెల్సు, అన్నీ తెలుసు. జానకిరాం అన్నయ్య ఇక్కడికి వచ్చినప్పుడల్లా అన్ని విషయాలూ చెపుతూనే ఉంటాడు. కాని, వాటిని మనస్సుకు పట్టించుకునే దెవరు?" అన్నది జయలక్ష్మి.
"నిజమేనమ్మా జనాభా లెక్కలకు మాత్రమే ఈ అన్నా వదినెలు మనుష్యులు కాని బాంధవ్యానికీ, సంఘానికీ మాత్రం కాదు. నాలోని అవమానాలు ఈ పదేళ్ళలోనూ సమసిపోయినయ్యనీ, నేనూ నలుగురిలో తలెత్తుకు తిరగగల స్థోమతుకు రాగలిగాననీ, అనుకున్నాను. కాని ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా, నలుపు నలుపే గాని తెలుపు రాదు, అన్న వేమన సూక్తులు నా విషయంలో యదార్ధమే అయింది. పోనీలే జయా, వారి భావాలూ, అభిప్రాయాలూ మార్చుకోమని నే ననను. మత ప్రమేయమే లేని ఈ లౌకిక ప్రపంచంలో ఎవరి వర్ణా శ్రమ ధర్మాలు వాళ్ళవి. ఎవరి ఆచార వ్యవహారాలు వాళ్ళవి. వాటిని మార్చటం, మార్చబూనటం తగని పని." అన్నది స్వాతి నిరాశగా పైకి చూస్తూ.
కృష్ణమూర్తి మళ్ళా వచ్చాడు.
"ఏమంటున్నదమ్మా జయా మీ వదినె" అన్నాడు పక్కమీద కూర్చుని. భర్తని చూసి మెల్లిగా లేచి కూర్చుంది స్వాతి.
"పడుకో స్వాతీ కదలకు. మంచినీళ్ళు కూడా తాగకుండా ఈ నిరశనపత్రం ఏ ఆశయాల్ని సాధించటం కోసం స్వాతీ" అన్నాడు కృష్ణమూర్తి.
పేలవంగా మనస్సులోనే నవ్వుకుంది స్వాతి.
"నిరశన పత్రాలతో, నిష్ఠూరాలతో ఆశ యాల్ని సాధించే రోజులు ఎప్పుడో పోయినయ్యండీ. నా మనశ్శాంతి కోసమే, నా పాపపరిహారం కోసమే నేను తాపత్రయ పడుతు పడుతున్నాను. ఎవర్నీ బాధపెట్టటానికి మాత్రం కాదు." అన్నది స్వాతి.
"ఏమిటా మాటలు స్వాతి. ఇప్పుడు ఎవరే మన్నారు నిన్ను" జాలిగా అడిగాడు.
కృష్ణమూర్తిని చూసి జాలిపడింది స్వాతి.
"మీ మనస్సులోని వ్యధలూ, కుమిలింపూ, హృదయానుగతమైన ఆకాంక్షలూ ముద్దచేసి హృదయంలో దాచిపెట్టుకున్నారు. అదే గుండె జబ్బుగా మీ వూపిరితిత్తుల్లో తిష్ట వేసింది. నా వ్యధలూ కోరికలూ అన్నీ పెనుగాలికి ఎగిరి పోయె దూది పింజల్లా ఎన్నడో పోయినప్పటికీ ఆ దూదిపింజల్ని ఏకి, వడికి, దారంతీసి, బట్టలుగా నేసి నాకే చుట్ట బెట్టారు. అలాంటి బట్టలు కట్టుకుని నేను ఏ ముఖం పెట్టుకుని తిరిగేది?" అన్నది స్వాతి. ఆమె మనస్సులో అత్తమామలూ, ఆడబిడ్డ, తన తల్లిదండ్రులూ, బంధువర్గమూ అంతా మెదిలారు. తన వివాహమైన కొద్ది రోజులకే తల్లి పోయింది. గూడెంలో తప్ప తాగి కొట్లాటలకు దిగితే నెమరి కణతకూ, తలకూ తగిలిన దెబ్బలవలన ఆస్పత్రిలో మరణించాడు తండ్రి. తన తరువాత ఒక చెల్లెలు ఉంటే అది ఎవరితోనో వెళ్ళిపోయింది. జీవించి ఉన్నదీ లేందీ కూడా తెలియదు. అన్నదమ్ము లెవరూ లేరు. మాలపల్లిలోని ఆ గుడిశా, ఆ వాతావరణమూ, ఆ కబుర్లూ మర్చిపోయి పన్నెండు సంవత్సరాలైంది. మళ్ళా ఈనాటికి ఆ వాతావరణం గుర్తు కొచ్చింది. ఎందుకు గుర్తుకొచ్చిందో స్వాతికి అర్ధం కాలేదు. అత్తమామల్ని, ఆడబిడ్డల్ని అప్పుడప్పుడూ ఎక్కడైనా చూసినా వాళ్ళతో మాట్లాడే వాతావరణం వాళ్లెప్పుడూ కలిగించలేదు. ఎక్కడయినా ఎదురుపడ్డా చూసీ చూడనట్లుగానే వెళ్ళేవారు. ఈ వివాహంతో పుట్టింటి ఋణం ఆ తీరుగా తీరిపోయింది. అత్తగారిల్లు ఎట్లా ఉంటుందో కూడా ఎరుగదు. తన్ను కన్నవారినీ, తను మెట్టినింటివారినీ దూరం చేసుకుని జీవించ గలుగుతున్నా ఆ మానసిక వధల్ని దూరంచేసే తీరుగా కృష్ణమూర్తి తమ సంసార జీవితాన్ని నేర్పుగా పట్టుకొచ్చాడు. మన చేతిలోని వస్తువు జారిపోయినప్పుడు తాత్కాలికంగా బాధపడతాం. తరువాత ఆ విషయమే మర్చిపోతాం. బంధుత్వాన్ని దూరం చేసుకోవలసి వచ్చినప్పుడు మరుపనేది జీవితంలో ఏర్పడక పోయినా, సాంఘిక కట్టుబాట్లకు వెరిచి గుండెను బండరాయిగా మార్చుకుని వ్యధల్ని, అనుభూతుల్ని, అనురాగాన్నీ, వాత్సల్యాన్ని ఆ బండరాతికింద భూస్థాపితం చేసి జీవచ్చవంలా జీవించగలుగుతాం. కాని జీవితంలో ఏదో ఒకప్పుడు ఆ బండరాతికి సమ్మెటపోటు లాంటి దెబ్బ తగిలి ఆ రాయి బీటలువారి అంతవరకు దాకా అణిగిఉన్న అన్ని రకాల భవ బంధాలూ పెల్లుబికి వచ్చి గత జీవితపు సంపుటాల్ని పేజీలకు పేజీలు తిప్పి ఆ సంఘటనలను మనస్సులో చిత్రీకరిస్తుంటే హృదయానుగతంగా ఆ వ్యక్తి పడే ఆవేదన భరింపరానిది.
ఆనాడు జ్యోతి ఇంట్లో జరిగిన పరాభవమే స్వాతిని ఈ స్థితికి తెచ్చింది.
భర్తని చూసి కళ్ళు తుడ్చుకుని ఒక కోరిక కోరింది స్వాతి.
"ఇన్ని సంవత్సరాల నుంచీ కోరని కోరిక ఒకటి కోరుతున్నాను. అది సర్వే సర్వత్రా అందరికీ కావలసిందే. నా యీ కోరిక తీరుస్తారా" అన్నది స్వాతి దిగులుగా అతనివైపు చూస్తూ.
కృష్ణమూర్తి నవ్వుతూ వూరుకున్నాడు. ఒక్క క్షణం ఆగి "ఏమిటా వింత కోరిక స్వాతీ" అన్నాడు.
"ఏమీ లేదండి. అత్తమామల పాదాలమీద పడి వారిని క్షమించమని ప్రార్దించాలని ఉంది. వారి మనస్సులో ఎట్లా ఉన్నా మన భావంలో నేను వారి పెద్ద కోడలినే కదా. ఒక్కసారి మనసారా, ఆదరాభిమానాలతో 'అత్తయ్యా' అని మీ అమ్మ గార్ని పిలిచి సంతోషించటానికి అనుజ్ఞ ఇప్పిస్తారా. మన ఉభయులమూ వారి కొడుకూ, కోడళ్ళుగా నలుగురిలోనూ చెప్పుకునే యోగ్యత లేనేలేదు. కనీసం ఈ చిన్న కోరికనైనా మన్నిస్తారని నా ఆశ. జీవితాలు శాశ్వతం కావు. మాట మాత్రం కల కాలం ఉండి తరతరాలుగా నిల్చిపోతుంది. ఏమంటారు" అన్నది స్వాతి బిక్కముఖంతో.
ఆశ్చర్య చకితుడయ్యాడు కృష్ణమూర్తి. అప్రయత్నంగానే అతని కళ్ళు చెమ్మగిల్లినయ్యి, శరీర మంతా కంపించినట్లయింది. స్వాతి యొక్క ఈ కోరిక అతని నరనరాలనూ చేదించివేసిన నట్లయింది. మానసిక వ్యధతో ఆ బాధలు మనస్సులో ఇముడ్చుకో లేక స్వాతి ఇట్లా మాట్లాడుతున్నదా? ఇంత కాలం నుంచి ఇరువురి హృదయాల్లోనూ పెరిగి పెద్దదైన వ్రణం నేటికి పగిలి బాంధవ్యమూ, రక్తస్పర్శా అనే చీమూ, నెత్తురును బయటికి చిమ్మిందా? ఈ బాహ్య ప్రపంచంలోని అన్ని రకాల అనుభవాలూ, ఈ పదేళ్ళూ అనుభవించాక ఈ జీవితం ఇంతేనా అనే నిరాశతో, నిస్పృహతో ఆ బాంధవ్యాన్ని పునశ్చరణ చేసుకుని ఆ జలనిధిలో మునిగి స్నానంచేసి పునీతురాలు కావాలని కోరుకుంటున్నదా? జీవితంలోని ఏ సంఘటన అకస్మాత్తుగా స్వాతిని ఈ స్థితికి తీసుకువచ్చాయో అతనికి అర్ధం కాలేదు.
