Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 42

 

    "అయ్యబాబోయ్ పగలు కనిపించటమే? మా మామగారు నా పెళ్ళికి ముందే పోయారు. మా అత్తగారి ముందు పలకరించటానికి అయన కూడా బిడియపడేవారు. ఈ రోజులా పీటల మీద కూర్చునే ఎకసక్కాలు ఆడుకోటానికి!"
    "వంట నువ్వే చేసేదానివా?"
    "కాదే అమ్మాయ్! ఇంటి చాకిరీ, గొడ్ల చాకిరి చేయించేది. కాని వంటింట్లోకి అడుగెట్ట నిచ్చేది కాదు సుమా! మీ తాతయ్యకు మాత్రం సన్నబియ్యం అన్నం వండేది. మంచి కూరా, పెరుగూ , నెయ్యి పోసి పెట్టేది. ఆ కూర సరిగ్గా ఒక్క మనిషికి సరిపడానే వండేది.
    "మరో మీకో?"
    "మాకు నూకల అన్నం వండేది. గోంగూర తొక్కు లక్ష్మీంచారు! రోజూ అదే! ఒకోరోజు గిన్నె దగ్గర కూర్చుని ఏడ్చేదాన్ని ముద్ద మింగుడు పడక. దొడ్లో కాసిన కూరలు ఊళ్ళో వాళ్ళకొచ్చేది.  ఎంత మందయితే లక్షప్ప అవుతుంది అనేవాళ్ళు." అంటూ నాయనమ్మ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఓ క్షణం మౌనంగా వుండి పోయింది.
    "ఆ రోజుల్లో మట్టుగిన్నెల్లో అన్నం తినేవాళ్ళం. మరీ తినలేకపోతే ఆవిడ చూడకుండా గిన్నె అడక్కు తోసేసి , తిన్నట్టు నటించేదాన్ని. తరవాత కుడితిలో పోసేదాన్ని. రెండుగొడ్ల పాడి వుండేది. ఒక్క నేతిచుక్క గానీ, పెరుగు దొబ్బ గానీ ఎరగను. ఆ రోజుల్లో మజ్జిగ అమ్ముకోవడం తెలియదు. పెరుగంతా నాచేతే మజ్జిగ చేయించేది. ముందుగా , చిన్న గిన్నెలోకి మీగడ పెరుగు కొడుక్కు తీసేది. మిగతా కుండెడు పెరుగూ మజ్జిగ చేయించేది. పనిపాటల వాళ్ళకు పోయగా మిగిలింది కుడితి తొట్లో పోసేది. మజ్జిగ తాను కొంచెం పోసుకొని నాక్కొంచెం పోసేది.
    నాయనమ్మ మాటలు విని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.
    "పాపం మాటలెందుకు? పాపిష్టిది తనూ తినేది కాదు. నాతొ పాటే తినేది. ఒకరోజు దొడ్లో వున్న బొప్పాసకాయ ఎండిపోవటానికి సిద్దంగా వున్న కాయ కోసి కూర వండింది. అందులో ఒక ఉల్లిపాయ లేదు, మసాలా లేదు. కొడుక్కు రెండు కోడిగుడ్లు ఉడకబెట్టి నేతిలో వేయించి పెట్టింది. నాకు ఆ కూర నోట్లో పెట్టుకుంటే గొంతు దిగలేదు. ఎదురుగా కూర్చొని తను తింటూ "ఒసే పిల్లా! కూర అమృతంగా లేదూ? ఎంచక్కా కుదిరిందో!" అంటూ తినటం మొదలు పెట్టింది. రెండు మొట్టి కాయలేసి నా గిన్నెలో కూర కూడా ఆవిడ గిన్నెలోనే వేసి లేచి పోవాలనిపించింది. పైకి మాత్రం నిజంగా చాలా బాగున్నట్లు ముఖం పెట్టి తినటానికి ప్రయత్నించానే అమ్మాయ్!"
    అవొక రోజులు, ఆడవాళ్ళు, తిండి కూడా మగవాళ్ళతో సమానంగా తినవచ్చని ఊహించలేని రోజులు.
    "ఇదంతా తాతలు తెలుసా? ఆమె ఇలా చేస్తుందని ఎప్పుడూ చెప్పలేదా?"
    "అయ్యబాబోయ్ ! నాకు ఆయన్ను చూస్తే గుండెలు పీచు పీచు మానేయ్! అయన నన్ను పల్లెత్తుమాట అనడు. అయినా ఎందుకో చాలా భయం వేసేది. పైగా చచ్చేంత బిడియంగా వుండేది. చివర చివరకు ఆయనకు కొంచెం అర్ధం అయిపొయింది. అందుకే గిన్నెలో అన్నంతో పాటు మంచి కూర వండిన రోజూ వదిలేసేవారు. "అయ్యో దేస్టపిల్లాడు తినలేదు" అంటూ అందులో సగం తను తీసుకొని తినేది."
    నేను కుతూహలంగా వింటూ కూర్చున్నాను. నాయనమ్మ మీద ఏంతో జాలి ముంచుకొచ్చింది. నాయనమ్మ మళ్ళీ ప్రారంభించింది .
    "ప్రతి శనివారం ఒక్క పొద్దు ఉండేదాన్ని. అన్నం వండే బియ్యం నూకతోనే ఉప్పుపిండి చేసుకోమనేది. అదంతకంటే గొంతు దిగేది కాదు. ఒకసారి ఆ ఉప్పుపిండి బాగా కుదిరిందనిపించింది. ముసలిముండ నోటికి కాస్త బాగుంటుందేమోనని ఆవిడకూ పెట్టాను. నోట్లో పెట్టుకుని ఒక్క ముద్ద మింగింది. చేతిలో వున్న ఉప్పుపిండిని పరిశీలనగా చూసి "ఇందులోకి కొబ్బరికాయ కూడా బయల్దేరిందే" అంది. నాకు  పై ప్రాణాలు పైనే పోయాయంటే నమ్ము! 'నాకు కొబ్బరికాయ ఎక్కడిది?" అన్నాను. ఆమె పలకలేదు. కాని నా మాట నమ్మలేదు. నాకు ఏడుపొచ్చినంత పనయింది. ఆవిడ అలా అనటానికి కారణం మా దొడ్లో కొబ్బరి చెట్టు ఉండేది. చెట్టు నిండా కాయలున్నాయ్. నేను దొంగతనంగా కోసుకొని తింటున్నానేమోనని ఆమె అనుమానం! అవమానంతో ప్రాణం చచ్చిపోయింది. కాని ఒక్కమాట అనలేదు.
    "ఒకసారి నిజంగానే కొబ్బరికాయ తినబుద్దయింది. అప్పుడు నాకు మూడో నెల. మరో రెండు నెల్లకే మీ తాతయ్య పోయారు. అయన పొలం కెళ్ళారు. ఆయన్ను అడిగితే తప్పక కొబ్బరికాయ కోసి , పగల గొట్టి ఇస్తారు. కాని నాకే సిగ్గు. మధ్యాహ్నం మా అత్తయ్య నిద్ర పోతోంది. చిన్నగా దొడ్లోకి వెళ్ళి కొబ్బరికాయ కోశాను. ఆ చెట్టు పొట్టిగా వుండేది. ఒక స్టూలు వేసుకుని ఎక్కితే చేతి కందుతుంది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. దొడ్డి సందులో కూర్చొని కొబ్బరికాయ పీచు లాగటానికి ప్రయత్నిస్తున్నాను. అంతలోకే "ఒసే పిల్లా!" అంటూ మా అత్తగారు గావుకేక పెట్టింది. నాకు ముచ్చేమట్లు పట్టాయి. ఏనాడూ లేని కక్కుర్తికి ఆనాడు పాల్పడినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. గాబరాగా లేచి  ఆ కాయను గొడ్లతవుడు పోసి వుండే పీపాలో దాచాను. గబగబా ఏమీ ఎరగనట్టే లోపలకు పరుగెట్టాను.
    "ఏం చేస్తున్నావే దొడ్లో?" అంది ముసల్ది. నన్ను పరిశీలనగా చూస్తూ నా చేతివైపూ , ముఖంలోకి చేతికి తవుడు అంటి వుందని అప్పుడే తెలుసుకున్న నాకు కాళ్ళు వణికాయి.
    "ఏ.......ఏం లేదు. కోళ్ళకు కాస్త తవుడు చల్లి వస్తున్నాను" అనేశాను. అంతే, అనాడంతా నన్ను ఆ ముసల్ది వెయ్యి కళ్ళతో కనిపెడుతూనే వుంది. పీపాలో కొబ్బరికాయ నా గుండెల మీద బండరాయిలా కూర్చుంది. అది ఎవరైనా చూస్తే ఎంత అప్రతిష్ట! దొంగ తిండ్లు తింటున్నాననుకోరూ? భగవంతుడా! ఎలాగయినా నన్నీ గండం నించి తప్పించు! అంటూ మనసులోనే భగవంతుణ్ణి ప్ర్రార్ధించాను పదేపదే.ఇంకెప్పుడూ అలాంటి పాడుపని చెయ్యనని మనసులో దేవుడు ముందు చెంపలేసుకున్నాను. బాగా చీకటి పడ్డాక ఎలాగో ఆ కాయ అక్కడి నుంచి తీసి పెంట కుప్పలో లోతుగా పాతిపెట్టి తేలిగ్గా ఉపిరి పీల్చుకున్నాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS