Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 42


    అతడు కోతి చేష్టలయిన శృంగార కార్యకలాపాలను చూచాక శారీరకంగానూ, మానసికంగానూకూడా ఒకేసారి ఒక విచిత్రమయిన అనుభూతిని పొందాడు.
    అతని లోకమంతా కెప్టెన్ మాలతి మాత్రమే. మరొకరిని చూచినా వారు అతని మానసిక ప్రపంచంలోకి చొచ్చుకుపోలేక పోయినాడు. అతడు కావాలని తిరస్కరించలేదు. అతని నైజాన్ని అనుసరించి మరొకరి గురించి ఆలోచించలేడు.
    తాను శారీరకమయిన శక్తిని ప్రయోగించి ఏదయినా సాధిస్తే దాని గురించి ముందుగా మాలతికి చెప్పుకోవాలి. తన ఆరాధ్యమూర్తి ముఖంలో ఆనందాన్ని తానుచూడాలి. ఆమె ప్రశంసలకు తాను పాత్రుడు కావాలి అని ఆశిస్తాడు.
    తాను మానసికంగా ఒక సమస్యకు గురి అయితే అదంతా తన ఏకైక ఆత్మీయురాలయిన మాలతికి చెప్పుకోవాలి. ఆమె ఆ సమస్యను విప్పి అతనికి మానసికమయిన శాంతిని అందించాలి. అప్పుడే అతనికి తృప్తి.
    ఆమె తనను కలిసి తిడుగా ఉండటం ప్ర్రారంభించింది మొదలుగా అతడు అనుసరించైనా పద్ధతి అది. అతనికి అత్యంత ప్రీతిపాత్రమైన విధానమది.
    కాని యిప్పుడు ఇతఃపూర్వం ఎన్నడూ తనకు అనుభవంలోకి రాని ఒక విచిత్రమయిన సమస్య అతనికి ఎదురుఅయింది. అది బాధ అయిందీ తెలియదు. ఆనందమయిందీ తెలియదు. శరీరమూ, మనసూ కల్లోలిత మయినాయి ఒకేసారి.
    ఇటువంటి అనుభవం గతంలో లేదు. కొంగ్రొత్తగా ఎదురైన విచిత్రానుభవం.
    దాన్నించిఎలా విముక్తుడు కావాలో అతనికి రవంత అయినా తోచలేదు. తనకు సాధించుకో సాధ్యంకాని సమస్య లన్నింటినీ మాలతి మీద వొదిలేసి నిశ్చింతగా ఉండిపోవటం అతనికి అలవాటు.
    ఈ పర్యాయం కోతుల అనురాగ దృశ్యం చూచిన తరువాత కలిగిన కల్లోలాన్నించి కూడా మాలతి మాత్రమే తనను బయటపడవేయగలదని భావించాడు.
    అతని మనోమయ ప్రపంచం కొత్తగా వాకిలి తెరచుకుంది. అనుభవాలు ప్రాతఃకాలపు శీతల పవనాలలా లోనికి చొచ్చుకుని వచ్చి అమితమైన ఆనందాన్ని, వినూత్నమైన దివ్యానుభూతిని కలిగిస్తున్నాయి.
    అయినా అతని మనసులో ప్రతి సమస్యకూ సమాధానంగాని తోచిన రూపం ఒక్కటే! అది స్నేహమయి అయిన మాలతి రూపం. అందునించి ఈ సమస్యకు సమాధానం ఆమె నించే పొందాలని పరుగున వచ్చి తుఫానులా దాడిచేశాడు అర్ధమానవుడు.
    
                            17
    
    "క్షమించు అనాలి నువ్వు" అంది నవ్వుతూ అలా చెప్పి ఆమె ప్రేమ దక్కించుకునేందుకు అర్ధమానవునికి ఎటువంటి అభ్యంతరమూ లేదు.
    క్.....క్......సమిం......చ్ అంటూ కాళ్ళమీద పడిపోయి నాడతడు. అతడు అర్ధించిన కౌగిలి  కానుకగా ఇచ్చేసింది మాలతి. కామంతో కాదు. కన్న తల్లిగా:
    క్షమాపణలు కోరటం. ఆమె దయార్ద్రంగా కరిగిపోవటం జరిగాక వారు విడిది దిగిన ఇంటిలో చాలా ఆహ్లాద కరమైన వాతావరణం ఏర్పడింది.
    ఆ మధ్యాహ్నం ఫిజో వచ్చాడు. తిరుగు ప్రయాణం కొనసాగించేందుకు అభ్యంతరాలన్నీ తొలగినాయి. మరునాటి మధ్యాహ్నం నించి పయన మయేందుకు నిశ్చయించుకున్నారు. ఇటీవలకాలంలో తాను జీవించటం కేవలం తన ఒక్కడి కోసమే అన్నట్లుగా కాక ప్రక్కవారి కోసం జీవించాలన్న సామాజికమైన ఎలిమెంట్అర్ధమానవునిలో మొగ్గతొడిగింది.
    తన తెలివి తేటల్ని, తన శక్తినీ కాలాన్ని కొంతలో కొంత మరొకరి కోసం వినియోగించటాన్ని కెప్టెన్ మాలతి అతనికి నేర్పుతోంది. ఆ విధంగా అతడు తాను అందించబోయే సామాజిక మైన జీవితంలో తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుందుకు ఒక దారి చూపిందామె.
    అర్ధమానవుడు ఇతరులకోసం తాను చేయగలిగిన దాన్ని చేయటంలో రవంత తృప్తినికూడా చవిచూస్తున్నాడు అంతే కాక తాను చేసే పని కెప్టెన్ మాలతికి ఉపకరించేది అయితే అతడికి అది పండుగే అవుతోంది.
    తిరుగు ప్రయాణానికి వారు సంసిద్ధులు అవుతూ ఉండగా అతడు తనకేమీ సంబంధం లేనట్లు తొలగిపోయి దూరంగా కూర్చోలేదు. తన ఒంటరి తనాన్ని పోగొట్టిన అమృతమయి స్నేహమయి అయిన కెప్టెన్ మాలతికి ఫిజో దగ్గరగా సంచరించటం అతనికి ఇష్టంలేదు.
    మనిషిలో అసూయ అనేది చాలా ప్రాచీనమైన ఎలిమెంట్! అదికూడా అర్ధమానవునిలో ఆరంభమైంది. కెప్టెన్ మాలతితో మైత్రి అనే స్వార్ధానికి ఫిజో ఎప్పుడైనా అడ్డురాగలడన్న ఆలోచనను అతడు భరించలేడు.
    అందునించి ఫిజోకి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తాడు. అయినా తిరుగు ప్రయాణానికి సమాయత్తమౌతున్న ఈ తరుణంలో మాత్రం అతడు దూరంగా తొలగిపోలేదు.
    ఫిజో అక్కడే ఉన్నప్పటికీ తనకు తోచిన సహాయం చేతనైన సహకారం అందించసాగాడు.
    కెప్టెన్ మాలతి బట్టలన్నీ మడిచి కిట్టులో సర్దుతూ ఉంటే తాను కూడా బట్టలు మడిచేందుకు ప్రయత్నించాడు. ఆపని చేతకాని ప్రయత్నం విఫలమై పోగా మాలతికి చేయవలసిన పని రెట్టింపు అవుతోంది.
    ఐనా ఆమె విసుగుదలను ప్రదర్శించలేదు. తన పనిలో లీనమై ఉండగా విఘ్నాలు కలిగించే పసిపాపాయిని తల్లి సహనంతో లాలించినట్లుగా అతడి తప్పిదాలను నిండు మనసుతో క్షమించేసింది.
    తనతో సహకరించాలన్న అతడి అభిలాషను అర్ధంచేసుకుని పొంగిపోయింది. తన పట్ల అతను చూపే అదరభావాన్ని ఆరాధననూ గుర్తించి గర్వపడింది.
    ఓర్పుగా తప్పుల్ని సవరించి పని సరిగా చేయటం ఎలాగో నేర్పించుతోంది.
    వారిరువురి మధ్య పెరుగుతున్న విచిత్రమైన అనుబంధాన్ని గమనిస్తూనే ఉన్నాడు ఫిజో. అతడి తాపత్రయాన్ని గమనించి తనలో తాను నవ్వుకుంటున్నాడు.
    మరికొన్ని బట్టలు మడిచేందుకు అతడు మాలతికి అందించాడు. వాటిని తీసుకుని విరిసి నేలకేసి కొట్టాడు అర్ధమానవుడు. అవి తీసి కెప్టెన్ మాలతి సరిగా సర్దుతూ ఉంటే తాను అందుకుని ఆమెకు సహాయం చేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS