"ఏయ్! అబ్బాయ్!" అని పిల్చింది జగ్గమాంబ.
"ఏమిటి అమ్మాయి?" ఆయన యిటు తిరిగాడు.
"నేను అమ్మాయిని కాను. మీకు కాబోయే మహారాణి మల్లమ్మ చెల్లెలు జగ్గమాంబని" అంటూ తన దర్జా చెప్పుకుంది జగ్గమాంబ. అంత చెప్పుకున్నా యెదుటి వ్యక్తి లేచి నిలబడలేదు సరికదా తేలికగా నవ్వి తన వంకే చూస్తున్నాడు.
"మహారాణివారి చెల్లెలు అయినా అమ్మాయి అమ్మాయే కదా! అలాగే పిలుస్తాను" అంటూ మొండిగా తిరిగాడాయన.
జగ్గమ్మకు వొళ్ళు మండిపోయింది.
రవ్వంత గౌరవం అయినా యివ్వటంపోయి అమ్మాయి అంటాడట అమ్మాయి. అవునూ యితని గొంతు యెప్పుడో విన్నట్లుంది మనిషిని కూడా యెక్కడో చూచినట్లు వుంది, గుర్తుకు రావటంలేదు.
"అబ్బాయి నిన్నెక్కడో చూచినట్లుంది" అంది.
"అవునమ్మాయి చూచావు."
"ఈ గొంతుకూడా యెక్కడో విన్నట్లుంది."
"అవునమ్మాయి విన్నావు."
"నువ్వెప్పుడయినా మా సైన్యంలో పనిచేశావా?"
"నన్ను పోషించేటంత సైన్యం మీకెక్కడుంది?"
"గీర యెందుకులే! యెక్కడ కన్పించావో చెప్పు."
"కశింకోట వెలుపల అడవిలో."
"ఆఁ.....అడవిలో....."
"గుర్రంమీద."
"ఓహో నువ్వా నాయనా! మళ్ళీ యిక్కడా దాపురించావూ!"
"ఏం చెయ్యను? తప్పనిసరి అయింది."
"ఇక్కడ సైన్యంలో పనిచేస్తున్నావా?"
"అవును కత్తి పడతాను."
"యుద్ధం వచ్చేవరకూ సైన్యంలోపడి తింటారు యుద్ధం అనగానే పలాయనం చిత్తగించి మరొకచోట యుద్దాలు లేనిచోట సైన్యంలో చేరుతారు. యిటువంటి కత్తిపట్టే సైనికులు మాకూ వున్నారు, పోతుల్లా తినేందుకు" అంటూ యెగతాళి పట్టించింది జగ్గమాంబ.
పులిపంజా కత్తిమీదికి వెళ్ళబోయి ఆమె యెవరో గుర్తొచ్చి ఆగిపోయింది.
మరదలు కాబట్టి సరసం ఆడొచ్చులే అనుకున్నాడు.
అంతలో ఒంటికి నూనెపట్టే ఒక ఓఢ్ర యువకుడు వచ్చాడు. "ప్రభూ! యిక దయచేయండి" అన్నాడు వినయంగా వంగి.
"ప్రభువా! వారెవరు?" అంటూ చుట్టుప్రక్కల వెతుకుతోంది జగ్గమాంబ.
"వీరే!" అంటూ తనవంక తాను వేలెట్టి చూపించాడు రంగారావు.
"మీరా!" అంటూ నోరు తెరిచింది జగ్గమాంబ.
"బావగారూ! నన్ను క్షమించి పారెయ్యరూ!" అంది.
"క్షమిస్తాను పారెయ్యను."
"మీరే బావగారిని తెలియక....."
"తెలిస్తే యింత అందమయిన అల్లరి చెయ్యవుకదూ! అందుకే చెప్పలేదు."
"తప్పయిపోయింది. అల్లరి చేశాను."
"క్షమాపణ కోరడం యిహ చాలు మన్నించాం. యెక్కడకీ యీ పరుగు?"
"మీకోసమే బావగారూ!"
"ఎందుకట?"
"మీ చేతులో వున్న ఆ బుజ్జిపావురాయిని యిలా యివ్వండి" అంటూ ఆయన యివ్వకముందే దాన్ని లాక్కుని రెండు పావురాళ్ళనీ జంటచేసి చూపింది.
ఆయనకు అర్ధమయింది. ఒకదాని శరీరం ఒకదానికి తగలగానే అవి రెండూ వాటి భాషలో కువ కువ లాడుకుంటున్నాయి.
మల్లమ్మ పావురానికి మగస్పర్శ తగలటం అదే మొదటిసారి రంగారావుగారి పావురం బాధ కొంత వుపశమించింది. దాని కువ కువల్లో ఆరాటం పాలుతగ్గి ఆనందంపాలు అధికం అయింది.
"ఆ పావురం యెక్కడిదీ?" అని అడిగాడు రంగారావు.
"అక్కది."
"ఎందుకు తెచ్చావూ?"
"ఈ రెంటికీ పెళ్ళి చేస్తున్నాను."
"వాటికి యిష్టం కావద్దూ."
"ఇష్టం లేకపోతే యిలా కువ కువలాడుకోవు. యీ భాష మీకు తెలియదులే. మా అక్క పావురం యేమంటోందో తెలుసా?"
"ఏమంటోంది?" అంటూ ఆసక్తిగా అడిగాడు గోపాలకృష్ణ రంగారావు.
"ఇంకా దగ్గరకు రమ్మంటోంది."
"మరి నా పావురం యేమంటోందో?"
"ఏకాంతంలోకి యెగిరిపోదాం పదమంటోంది" అంటూ సొంత కవిత్వంలో జవాబిచ్చింది జగ్గమాంబ ఆమె మాటలకు రంగారావుకు ముచ్చట అయింది.
"అయితే వాటిని యింకా పట్టుకున్నావు యెందుకు? విడిచిపెట్టు ఏకాంతంలోకి యెగిరిపోనివ్వు" అన్నాడు రంగారావు జగ్గమాంబ వాటిని ఆకాశంలోకి యెగురవేసింది. చూస్తూ నిలబడింది.
అవి ఆకాశంలో చక్కెర్లు కొట్టాయి. పల్లటీలు కొట్టాయి. ఆనందంతో ఒకదాన్ని ఒకటి రాచుకు తిరిగాయి, చివరకు వచ్చి పున్నాగకొమ్మమీద వాలి ఒకదాన్ని ఒకటి ఆనుకుని కువకువలాడుకుంటున్నాయి. ముక్కులతో గీరుకుంటున్నాయి. ప్రకృతి స్పర్శతో పులకించిన ఆ ప్రేమ జీవులు రెండూ తమ యజమానుల సంగతి మర్చిపోయినాయి.
