Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 42


    ఇదే ఆరునెలలు పోతే తనకు అలవికాదు. మరో సంవత్సరం గడిస్తే మిసమిసలాడుతూ, కోడెవయసులో చావిడంతా కదంతొక్కుతుంది. మరో ఏడాది గడిస్తే పోట్లగిత్త అవుతుంది. అందర్నీ కుమ్మేస్తుంది.
    సాంబయ్య చేతుల్ని నాకుతున్న ఆవుదూడ, చావిట్లోకి తల్లి రావటం చూసి పలుపు గుంజింది. సాంబయ్య మంచం కదిలింది.  ఆవువచ్చి దూడను నాకసాగింది. సాంబయ్య లేచి బలవంతంగా ఆవును దూడనుంచి విడదీసి గాట్లో కట్టేశాడు. లేగదూడ పలుపు గుంజుకుంటూ 'అంబా!' అంది.
    అణిచిపెట్టుకున్న మమకారం, వాత్సల్యం సాంబయ్య గుండెల్ని చీల్చుకుని పొంగాయి.
    వెంకటపతి! తన బిడ్డ వెంకటపతి! ముఫ్ఫై ఏళ్ళు తన గుండెలమీద పెరిగిన వెంకటపతి! తను వాడ్ని కనురెప్పలచాటున పెంచుకున్నాడు. వాడే సర్వస్వం అనుకున్నాడు. వాడికోసం తన వయసూ-ఆనందం ధారపోశాడు. జన్మతా వాడికోసమే వెచ్చించాడు. తినీ, తినకా, ఎండనక, వాననకా రెక్కలు ముక్కలు చేసుకొన్నాడు. నిందా, అవమానం భరించాడు. సిరిసంపదలు పోగుచేశాడు. అంతస్తును అందించాడు. గౌరవాన్ని కొనిపెట్టాడు. దానికి ప్రతిఫలంగా తనకు తన కొడుకు ఏం ఇచ్చాడు? కొడుకునుంచి తను ఆశించిందేమిటి? తనకు బ్రతుకులో కావాల్సిందేమిటి?
    సాంబయ్యకు గుండెలు బరువెక్కాయి. కళ్ళు చెమ్మగిల్లాయి.
    ఆ రోజు ఉగాది. రాముడు పెందలాడే ఇంత ఉడకేసి వెళ్ళిపోయాడు. పండగనాడు కొడుకూ, కోడలితో కళకళలాడాల్సిన ఇల్లు బావురుమంటూ వుంది. ముఫ్ఫై ఏళ్ళ క్రితం పండగపూట-దుర్గమ్మ తలస్నానంచేసి, కొత్త చీరకట్టుకొని పళ్ళెంలో గారెలూ, బూరెలూ పెట్టి, తను తింటూ వున్నప్పుడు - ఏం చెప్పింది? కొడుకు పుట్టబోతున్నాడని విని పరవశించిపోయాడు. వాడిమీద ఎన్ని ఆశలు పెంచుకున్నాడు? ఎన్ని కల్లు కన్నాడు? ఏడి? తన వెంకటపతి ఈనాడు ఏడీ?
    మునిమాపు వేళదాకా వెంకటపతిని గురించిన ఆలోచనలతోనే గడిపాడు సాంబయ్య. ఏ ముహూర్తాన కొడుకు పెళ్ళయిందోకాని అప్పటినుంచి ఒక్క రోజుమనస్సాంతిలేదు. మరీ...పోయిన ఏడాదంతా ఎగుడు దిగుడుగానే గడిచిపోయింది. ఈ కొత్త సంవత్సరం ఎలా వుంటుందో? తన వెంకటపతి దోవన పడ్తాడా?
    సాంబయ్య లేచి, నెత్తిమీదగా పైపంచ కప్పుకొని రామాలయం దగ్గిరకు బయలుదేరాడు. అప్పటికే జనం బాగా పోగయివున్నారు. రామాలయం అరుగులమీదా, గడపలమీదా ఊళ్ళో పెద్దలంతా కూర్చున్నారు. బీదవాళ్ళూ తక్కువస్థాయివాళ్ళూ నేలమీద పక్కగా కూర్చున్నారు!
    శాస్త్రులు పంచాంగం చదవడం పూర్తి కావస్తున్నది. సాంబయ్య మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి, రామాలయం గోడ కానుకొని పెడగా కూర్చున్నాడు. పంచాంగ శ్రవణంలో మునిగిపోయిన వూళ్ళో పెద్దలెవరూ సాంబయ్య రావటాన్ని గమనించలేదు.
    పంచాంగం చదవడం పూర్తయాక శాస్త్రులుగారు సంకురుమయ్య వరాహం ఎక్కి ఏ యే దిశగా వెళ్ళిందీ, ఏ యే ప్రాణులకు వినాశమో లాభమో చిలువలూ, పలవలూ చేసి చెప్పాడు. పంచాంగశ్రవణంలో ఆఖరిఘట్టం పేరుఫలాలు వచ్చేసరికి అందరూ సర్దుకొని కూర్చున్నారు. అంజయ్య, రాంసుబ్బయ్య, లక్ష్మీపతీ, కోటయ్యా, వీరయ్యా ఒకరి పేరును మరొకరు అందిస్తూ శాస్త్రిని అడిగారు. పేరుఫలాలు వింటూ ఒకర్నొకరు అభినందించుకోవడం, వేళాకోళం చేసుకోవడం మొదలుపెట్టారు. పేరుఫలాల్లో అక్షర క్రమం పూర్తి అవుతుండగా జనంలో ఎక్కువ భాగం తమకు చెప్పిన లాభనష్టాలను నెమరువేసుకుంటూ వెళ్ళిపోయారు. పదిమందిదాకా ఊళ్ళో పెద్దలు మిగిలిపోయారు. వారు శాస్త్రికి దగ్గరగా కూర్చొని కొత్త సంవత్సరపు విశేషాలను గురించి మాట్లాడుకుంటున్నారు.    
    శాస్త్రి పంచాంగం మడిచి లేవబోతూ ఏదోస్ఫురణకు వచ్చినట్లు ఆగిపోయాడు.
    "రాంసుబ్బయ్యగారూ! ఏరీ, మన సాంబయ్యగారు ఎక్కడ?" ప్రతి సంవత్సరం ముందెత్తునే కూర్చొని పురాణ శ్రవణం చేసే సాంబయ్య కన్పించకపోయేసరికి అడిగాడు శాస్త్రి.
    "సాంబయ్యదే ఓ పెద్ద పంచాంగం అయింది. ఇంకా ఇదికూడా ఏం వింటాడు?" అన్న రాంసుబ్బయ్య మాటలకు అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు.
    "ఏమిటండీ మీరనేది? సాంబయ్యగారికి ఏమయింది?" ఆదుర్దాగా అడిగాడు శాస్త్రి.
    "ఆఁ చాలా వుందిలే గ్రంథం!" అన్నాడు అంజయ్య.
    "మీకు తెలియదా శాస్త్రిగారూ? కొడుకు చావచితకబాదాడు." అన్నాడు వీరయ్య.
    "హరి హరీ! సాంబయ్యగారి కొడుకు వెంకటపతి చాలా బుద్దిమంతుడు గదండీ! ఇంతపని యెలా చేశాడూ?" అన్నాడు శాస్త్రి.
    "ఆఁ చాలా వుందిలే గ్రంథం!" అన్నాడు అంజయ్య.
    "మీకు తెలియదా శాస్త్రిగారూ? కొడుకు చావచితకబాదాడు." అన్నాడు వీరయ్య.
    "హరి హరీ! సాంబయ్యగారి కొడుకు వెంకటపతి చాలా బుద్దిమంతుడు గదండీ! ఇంతపని యెలా చేశాడూ?" అన్నాడు శాస్త్రి.
    "కొడుకు  బుద్దిమంతుడే. మరి తండ్రో?" అన్నాడు రామచంద్రయ్య.
    "అంతపనీ చేస్తాడని నేనెప్పుడో అనుకున్నానయ్యా!" అన్నాడు వీరయ్య.
    "రామ రామ! ఇంతకీ తండ్రీకొడుకుల మధ్య మనస్పర్ధలూ ఎందుకొచ్చినట్టు? ఒక్కడే కొడుకు కదండీ? కోడలు కాపరానికి కూడా వచ్చిందని విన్నాను."
    "అదే మొదలనుకోండి శాస్త్రిగారూ! కొడుకునీ, కోడల్నీ కాపరం చెయ్యనిస్తేనా?" అన్నాడు రాంసుబ్బయ్య.
    "శివ శివా! సాంబయ్యగారి గురించి మీరు ఆ మాటంటే నమ్మలేకుండా వున్నాను. ఆ కొడుకంటే ఆయనకు పంచప్రాణాలు గదండీ? సాంబయ్యగారు ప్రతి ఏడాదీ ఉగాది పండక్కు, ఒకటో రెండో సంభావనలు ఇచ్చేవారు. మరి ఈ యేడు పంచాంగం శ్రవణానికి కూడా రాలేదు. ఇంటికెళ్ళి కలుస్తా!" అంటూ శాస్త్రి పంచాంగం చంకన పెట్టుకొని రామాలయం గడపలు దిగాడు.
    అప్పటికి బాగా చీకటి పడింది. శాస్త్రికి తనమీద వున్న అభిమానానికి సాంబయ్యకు కొంత ఊరట కలిగించింది. సాంబయ్య గోడ కానుకొని నీడల్లో ఇంకా ముడుచుకొని కూర్చున్నాడు.
    "ఏమిటీ? ఈ శాస్త్రులు సాంబయ్యను తెగ పొగిడేస్తున్నాడు?" మిగతా వాళ్ళను చూసి అన్నాడు వీరయ్య.
    "పావలా అర్ధా చేతిలో రాలేదాకా అట్లాగే మాట్లాడుతాడు లేవయ్యా ఆ శాస్త్రులు! తెలియందేముందీ?" అన్నాడు అంజయ్య.
    "కొడుకూ కోడలూ పండక్కుకూడా రాలేదటగా?"
    "అంతావిని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్లుంది నువ్వు అనేది?"
    "సాంబయ్య బతికివుండగా కోడల్ని ఇంట్లో కాలుపెట్ట నిస్తాడంటావా?"
    "ఆఁ కట్టుకుపోతాడు గడ్డితిని సంపాదించాడు. కొడుకుని కూడా తిననివ్వకుండా గాట్లో కుక్కలా కూర్చున్నాడయ్యా!"
    "ఈ వయస్సులో సాంబయ్యకెందుకయ్యా ఆ తాపత్రయం? కొడుక్కు కొడుకులు పుట్టే వయస్సులో కొడుకుమీద కత్తికట్టడం ఏమిటి?"
    "ఎంతకాలం వుంటాడయ్యా? శిలావిగ్రహంగా వుంటాడా ఏం? రేపు తండ్రి చచ్చాక వెంకటపతికి ఆస్తి ఇష్టానుసారమేగా?"
    "అవునంతే! బతికున్నంతకాలం తను సుఖపడకా, వాళ్ళను సుఖపడనీయకా ఏం బావుకుంటాడయ్యా ఆ సాంబయ్య?"
    "కొడుకుచేత గుండెలమీద తన్నించుకొని ఇంకా ఆ సాంబయ్యకనక తిరుగుతున్నాడు. ఇంకొకడయితే పెదకాలవలో పడి చచ్చేవాడనుకో!" అంటూ రాంసుబ్బయ్య నడుం కు చుట్టుకున్న పంచెతీసి భుజాన వేసుకొని లేచాడు. ఆయనతో పాటు అందరూ లేచారు.
    చీకట్లో దూరంగా కూర్చొని వాళ్ళ మాటలు వింటున్న సాంబయ్య ఉడికిపోయాడు. ఎవరన్నా గుర్తుపడ్తారన్న భయంతో ఇంకా ముడుచుకు కూర్చున్నాడు. రామాలయం నుంచి అందరూ వెళ్ళిపోయారు. సాంబయ్య లేచి ఇంటికి బయలుదేరాడు.
    తనను ఎన్నెన్ని మాటలంటున్నారు వీళ్ళు! వీళ్ళందరికీ తనను చూస్తే అసూయ, ద్వేషం తప్ప మరొకటి కాదు. అందులో సగం మంది ఆరిపోతున్నవాళ్ళు. మందిని ముంచి బాగుపడాలని చూసేవాళ్ళు మిగతా సగం మంది. తను ఎవరికేం అపకారం చేశాడు? ఒకళ్ళ సొమ్ము తను ఆశించలేదు. కష్టపడి సంపాదించాడు. కడుపు మాడ్చుకొని ఆదా చేస్తున్నాడు. కూలీలకు గింజలు పిచ్చమానికలతో కొలవలేదుగా? అప్పులు ఎగగొట్టలేదే? మోసాలు చేసి కోర్టులకెక్కి దాయాదుల ఆస్తులు కలుపుకోలేదే? తన కొడుకు తనకు ఎదురు తిరగటమే వీళ్ళకు కావాల్సింది! వాడు తను సంపాదించిన ఆస్తి తగలేస్తుంటే వీళ్ళ కళ్ళు చల్లబడతాయి కాబోలు? మంచీ చెడ్డా వాళ్ళకు అవసరంలేదు. ఇది ఊరా? వీళ్ళు మనుషులా? పైగా పెద్దమనుషులు కూడానా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS