"లేదండి" అన్నాను.
"అరవ పాటలు తెలుగులోకి రాయకుండానే నన్ను పాటలు రాయమని అడుగుతున్నావా? నీబుర్ర ఎక్కడుంది? ఆ బుర్రలో ఏముంది?" - అని చెడామడా తిట్టారు.
చివాట్లకి అలవాటుపడుతున్న రోజులవి.
నవ్వాను. దాంతో వారికి మరీ ఒళ్ళు మండిపోయింది.
"వెళ్ళు ఇక్కడ్నుంచి వెళ్ళు సరోజా! ఏం చేస్తావో చేసుకో" - అన్నారు. అనడమే తడువుగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాను. మా అమ్మ హడలిపోయింది.
"ఏమన్నావ్? వారికెందుకంత కోపం వచ్చింది?" అని అడిగింది.
"తప్పు నాదేనమ్మా! అరవ పాటలు తెలుగులోకి రాయలేదు, మరచిపోయాను. పైగా 'పాట రాద్దామండీ' అని వారిని కూర్చోపెట్టాను. సర్లే! ఆయనతో ఈ వరస మనకి కొత్తేమిటి?" - అనేసి, ఒరిజినల్ తమిళ్ స్క్రిప్ట్ తీసుకొని కార్బన్ పెట్టి, మొదట పాటలన్నీ రాయడం ప్ర్రారంభించాను.
మునుపటిలా అట్టే అవస్థపడాల్సిన అవసరం లేకుండా, ఎక్కువ తడుముకోకుండా, ఫాలో అవుతూండడం వల్ల త్వరగానే పాటలు రాసేశాను.
రెండు కాపీలు వేరు వేరుగా పిన్ చేసి వారికిచ్చాను.
"అదేమిటి? రాయలేదన్నావుగా?".
"అవును. ఇప్పుడే రాశాను".
"నీతో సాల్లేం సరోజా!".
"సర్లెండి. పెడితే పెళ్ళి లేకుంటే శ్రాద్ధం" అంటూ నా గదిలోకి వచ్చేసి మాటలు రాయడానికి కూర్చున్నాను.
ఆవిడ నా దగ్గరకు వచ్చారు.
"రండి, కూర్చోండి" అన్నాను.
"మళ్ళీ ఏమిటి రాస్తున్నావు?" - అని అడిగారావిడ.
"మళ్ళీ ఏఁమిటా? భలేవారే! నా పనే రాయడం దీనితోనే తెల్లారిపోతుంది" అన్నాను.
"ఆయన తిట్టారని నీకు కోపం వచ్చిందా?" అనడిగారు.
"తప్పుచేస్తే తిడతారు. కోపం దేనికీ? అయినా వారిచేత చివాట్లు తినడం అలవాటయిపోయింద"న్నాను.
"ఈరోజు కారు రాదా?".
"రావాలి కానీ పనేమీ లేదుగా! ఏం కారు కావాలా?" అనడిగాను.
"నువ్వూ వస్తావా?" అనడిగారు.
"నేను రానండి నాకు చాలా పనివుంది. రాయాలి" అన్నాను.
"ఇంటికి వెళ్ళాక రాస్తే సరిపోదూ?" అని అడిగారావిడ.
"కంపెనీవాళ్ళతో గొప్పగా, 'మాటలు పాటలు రాసి తెస్తామ"ని చెప్పారు. అడిగితే వాళ్ళకి సమాధానం ఏం చెప్తాం" అన్నాను.
ఇంతలో 'ఏయ్, ఏయ్' అన్న పిలుపు వినిపించింది.
"మిమ్మల్నే, వెళ్ళండి" అన్నాను.
ఆవిడ మళ్ళీ రెండు నిముషాల్లో వచ్చి, "సిగరెట్టూ, అగ్గిపెట్టె విస్కీ తెప్పించమంటున్నారు. ఏం చెయ్యను?" అనడిగారు.
"అదేమిటి? నన్నడుగుతారేమిటి? ఏం చెయ్యాలో మీకు తెలీదా?" అన్నాను.
"ఆయన చెప్పిన పని చెయ్యకుంటే చంపేస్తారు" అన్నారావిడ.
"అయితే తెప్పించండి. మద్రాసు వెళితే ఎలాగూ పగటిపూట తాగడానికి కుదరదు. కావాల్సింది తాగి హాయిగా రెస్ట్ తీసుకుంటారు" - అన్నాను.
"ఎవరు వెళతారు?".
నా టైమంతా పాడు చేస్తున్నారని నాకు కోపం వస్తోంది.
చటుక్కున లేచి వారి గదిలోకి వెళ్ళాను.
"ఏవండీ విస్కీ కావాలన్నారుట".
శ్రీశ్రీగారు ఆవిడ ముఖంలోకి ఎర్రగా చూస్తూ - "వెళ్ళి సరోజతో ఎందుకు చెప్పావు?".
"ఇక్కడ నాకు ఎవరూ తెలీదండీ" అన్నారావిడ.
"వచ్చి మూడు రోజులైంది. రూమ్ బాయ్ కూడా తెలీదా" అని అడిగారు. ఆవిడ మాట్లాడలేదు. బాయ్ ని పిలిచి, వారిక్కావాల్సినవి తెమ్మని పంపించారు.
నేను పెంకితనానికి ఉన్నదాన్ని ఊరుకోకుండా, వారితో - "మనం ఇంత దూరం రావడం తాగడానికా?" అని అడిగాను.
"అవును సరోజా! తాగడానికే. నేను కేవలం రెస్ట్ కోసమే ఇక్కడికి వచ్చాను. ముందు నీ పని నువ్వు చెయ్యి. తర్వాత నా పని నేను చేస్తాన"న్నారు.
"రక్షించారు. కానీ మధ్యలో నన్ను డిస్టర్బ్ చేస్తే నేను ఒప్పుకోను" అన్నాను.
"పిలిచినా కూడా రావా?" అనడిగారు.
"రాను ఇప్పుడు కూర్చున్నానంటే మొత్తం పని అయ్యేవరకూ కదలను" అన్నాను.
"నువ్వొక పేడకుప్పవి. నీకూ దానికీ ఏమీ భేదం లేదు" అన్నారు.
"ఏమయినా అనండి. ఈ స్క్రిప్ట్ తెలుగులోకి దింపితే కానీ నేను ఇక్కడి నుండి బయలుదేరన"న్నాను.
"ఎందుకండీ పాపం! ఆ అమ్మాయినలా సతాయిస్తారని?" - అడిగారావిడ.
"నీకు తెలీదే! మొండి, పట్టినదే పట్టు తను స్క్రిప్ట్ లో కూర్చుంటే పాతుకుపోతుంది. తిండి తిప్పలు కూడా అక్కర్లేదు. కొంపలంటుకుపోతాయన్నట్టు కూర్చుండిపోతుంద"న్నారు. ఇంతలో బాయ్ వచ్చి తెచ్చినవి ఇచ్చేశాడు.
"పోనీ ఇక్కడ కూర్చొని రాసుకోరాదూ!".
"పని అయినట్టే".
"అయితే వెళ్ళ"న్నారు.
* * *
పాటకి పల్లవి చాలు
రాత్రింబవళ్ళూ కూర్చొని రెండు రోజుల్లో పని పూర్తిచేశాను.
"పాటలు అక్కడికి వెళ్ళి రాద్దాం. మాటలు ఇక్కడ రాసేద్దామా?" - అని అడిగారు.
"అంతకన్నానా?" అన్నాను.
ఆయనొక కాపీ దగ్గర పెట్టుకున్నారు. వారు చెప్పడం, నేను రాయడం వారికి ఆలోచించే పనేలేదు. అదొక ప్రవాహమే! వారు చెప్పిన స్పీడుకి నేను రాయలేకపోయేదాన్ని డైలాగ్ ఎంత కష్టమైనదైనా ఎంత పెద్ద క్లోజ్ లిప్పయినా రాయడం వారికి మంచినీళ్ళ ప్రాయంగా వుండేది.
ఎంత స్పీడుగా నేను ట్రాన్స్ లేషన్ పూర్తిచేశానో, అంత త్వరగా వారూ డైలాగ్స్ పూర్తిచేశారు. ఆఖర్న ఓచోట ఆగారు.
"ఈ 'పక్క' లేమిటి సరోజా?" అనడిగారు.
"అంటే - ఆ పక్కా, ఈ పక్కా" - అన్నాను.
"నా మొహం! పక్కలేమిటీ? నీ విజయనగరం భాషా, నువ్వూనూ" అన్నారు.
"ఆ పక్కా ఈ పక్కా అని రాయడంగానీ, అనడం గానీ తప్పా అండీ" అనడిగాను.
"తప్పనడంలేదు సరోజా! తెలుగే, కానీ సినిమాకి కొన్ని కొన్ని మాటలు బాగుండవు. తెలుగు భాష అంతా ఒకటే. పోతే స్టయిల్ అంటూ ఒకటుంటుంది.
తూర్పు యాస, పడమటి యాస, గోదావరి తెలుగు, నెల్లూరు తెలుగు, రాయలసీమ, అరవ తెలుగు....ఇంకా ఇంకా చాలా టైపులున్నాయి. అంటే అన్ని తెలుగులు వున్నాయని కాదు అర్ధం.
వాళ్ళు మాట్లాడే మాటల్లో యాస వుంటుంది. కొన్ని కొన్ని పదాలు కొన్ని ఊళ్ళలో వాడతారు. ఇలా చెప్పుకుపోతూ వుంటే అంతం వుండదు. తువ్వాలు అనే పాదాన్ని పడమటివారు, అంటే కృష్ణాజిల్లా వాళ్ళు 'అంగవస్త్రం', 'తుండుగుడ్డ' - అంటారు. ఇలాగే కోకొల్లలు; 'ఎక్కడికి' అని అనే మాటని 'ఏడకి' అని కూడా అంటారు. నీ విజయనగరం భాష సినిమాల్లో వాడితే బాగుండదు. కామన్ వర్డ్స్ వెయ్యాలి. ఇంతకీ ఈ 'పక్క'లు ఏ సందర్భంలో ఏ అరవ మాటకి ట్రాన్స్ లేషన్ చేశావు చెప్పు?" - అన్నారు.
"అంద పక్కమ్, ఇంద పక్కమ్ - అని తమిళంలో వుందండీ. దాని అర్ధం 'ఆ పక్కా ఈ పక్కా' అని రాశాను" అన్నాను.
"చూడు సరోజా! నీ వాడుక భాషలోని మాటలు కొన్ని మార్చాలి. అటు పక్కా, ఇటు పక్కా - లేదా ఆ వైపూ ఈ వైపూ ఇంకా అటువైపు, ఇటువైపు - అనొచ్చు తర్వాత 'ఇవాళ' అంటావు. అనొచ్చు, తప్పని ఎవరూ అణాలేరు. కానీ 'ఈరోజు' అనొచ్చుగా!" - అని కొన్ని వందల మాటలు దిద్దారు.
ఏదో కొంతవరకు తెలుసు. కానీ, వాడుక భాష అయినా - సినిమాల్లో ఉపయిగించే బాణీ పదాలు, దగ్గర దగ్గర పది పిక్చర్లవరకూ, నేర్చుకోడానికి టైం పట్టింది. ఎన్ని చివాట్లు తినేదాన్నో, ఎన్నిసార్లు మార్చేవారో, ఎన్ని మార్చేవరో చెప్పడానికి లేదు. నేను వారితో చాలా అవస్థలుపడి, చివాట్లు తిని, మొత్తానికి నిలదొక్కుకున్నాను. డబ్బింగ్ చిత్రాలు రాసే కెపాసిటీ ఈనాడు సంపాదించానంటే అదంతా వారు పెట్టిన భిక్ష. (ఏ పిక్చర్ కీ ఈనాడు రాయకపోవచ్చు. కారణం - ఇచ్చేవాళ్ళు లేక అది వేరే సంగతి)
