Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 42


    సాలోచనగా అన్నాడు సుదర్శనరావు. "నారయణశెట్టి తీసే మొదటి సినిమా అది. కొంతకాలం ఫైనాన్సర్ గానే వున్న ఆ పెద్దమనిషి యిప్పుడు నా శిష్యుడు. శివతో చిత్రం ప్ర్రారంభిస్తున్నాడు. అందులో మీతోబాటు నటించే మరో హీరోయిన్ సుకృతి.....రాజ్యం కూతురు.....ఆ సుకృతి శెట్టి ట్రిప్ చేసి శివకోసం ఈ సినిమా ప్లాన్ చేయించింది అంటే శివమీద సుకృతికేదో యిష్టం వున్నట్టేగా."
    సీరియస్ గా వింటుంది పావని.
    "ఆ సినిమా పూర్తికాకుండా మధ్యలో ఆగాలి. అంటే శివకీ, నారాయణశెట్టికీ మధ్య గొడవలు రావాలి. ఇలా గొడవలు రావాలే అంటే మొదటి మార్గం సుకృతికీ, శివకీ సంబంధం వుందని నువ్వు సెట్ లో వుంటూ తెలివిగా నిరూపించడం. అలా నిరూపిస్తే శివకీ, నారాయణశెట్టికీ గొడవలు ఖాయం ఎందుకంటే సుకృతి అంటే శెట్టి పడి చస్తున్నాడు కాబట్టి. శివతో సుకృతికి సంబంధం వుందని తెలిస్తే తను తట్టుకోలేడు కాబట్టి."
    "అలాగే సర్."
    "అదంతా సులభంకాదు పావనీ! ఎందుకంటే శివ ఏ అమ్మాయినీ ముట్టుకునే అలవాటు లేనివాడు అంటే శివకీ, సుకృతికీ సంబంధం వుందని నిరూపించడం చాలా కష్టం."
    "పోనీ ఓ పని చేస్తే?"
    "చెప్పు"
    "నేనే నారాయణశెట్టిని ట్రేప్ చేస్తే."
    నవ్వాడు సుదర్శనరావు నిర్లిప్తంగా "నీ కన్నా ముందు ఈ సినిమా రంగంలో నారాయణశెట్టి చాలా మంది అమ్మాయిలతో సంబంధం వుంది పావని. కానీ శెట్టి సుకృతి దగ్గర తప్ప ఎక్కడా యింత బలంగా చిక్కుకోలేదు. అంచేత ఇది నీ వల్లనయ్యే పనని నేను భావించడం లేదు."
    పావని చాలా హర్టయిపోయింది తననంత తేలిగ్గా తీసేయటం నచ్చకపోయినా "అలాగే సర్ గట్టిగా ప్రయత్నిస్తాను" అంది సుదర్శనరావుకి హామీ యిస్తున్నట్టుగా. తనకున్న రెండు మార్గాల్లో ఏదో ఒకటి అమలుచేయగలనని బలంగా నమ్మేసింది పావని.
    సుకృతికి వ్యతిరేకంగా ఓ పథకానికిక్కడ అంకురార్పణ జరిగింది.
    రమ్యశ్రీలా ఓ నరేంద్ర మూలంగా శెట్టి సినిమా ఆగిపోతుందనుకోలేదు సుదర్శనరావు.
    తప్పకుండా మొదలవుతుందని తెలిసి మధ్యలో ఆగిపోవటానికి ప్రణాళిక సిద్దం చేశాడు. దర్శకుడిలా ఎన్నో కథల్ని చర్చించిన సుదర్శనరావు సగం సాధించేశాడు యిప్పటికే.
    
    
                                                            *    *    *    *
    
    "ఇదో విచిత్ర ప్రపంచమని నీకు ముందే చెప్పానుగా సుకృతీ" నిర్వేదంగా అంది అలివేలు. "ఇక్కడ ఎదిగిన వాళ్ళని గౌరవించడం ఆనవాయితీ తప్ప ఎదగటాన్ని హర్షించరు."
    అప్పటికి ఓ అరగంట క్రితమే తెలిసింది సుకృతికి. నరేంద్ర సినిమాలో నటించనని శివకి చెప్పేశాడు. అప్పటికే నారాయణశెట్టి పర్సనల్ గా ఫోన్ చేసి నరేంద్రని అడిగాడు కూడా. ఏవో కాల్ షీట్సు అడ్జస్టు చేయలేకపోతున్నానంటూ దాటేశాడు. శెట్టిలాంటి ఓ ప్రముఖుడు అదిగాక కూడా నరేంద్ర అలాంటి జవాబివ్వడం అనూహ్యమైన విషయం. పైగా ముందు అంగీకరించాక.
    ఆ తర్వాత శివకోసం నిర్ణయించబడిన ప్రోజెక్టు సందేహంలో పడిపోయింది. అంతా కొత్తవాళ్ళతో చేయాలీ అంటే కనీసం దర్శకుడైనా అనుభవజ్ఞుడై వుండాలని శెట్టి తన అభిప్రాయాన్ని చెప్పడంతో శివ నీరసించిపోయాడు. ఆ విషయం రాఘవద్వారా తెలుసుకున్న అలివేలు పది నిమిషాలక్రితమే సుకృతికి చెప్పింది జరిగిందంతా.
    సుకృతి నిర్లిప్తంగా వుండిపోయింది. సినీరంగ చరిత్ర కాగితాల మీద కొత్త అధ్యాయాల్ని సృష్టించటానికి తను తారాపథానికెదిగిన నటి కాదు. ఇప్పుడిప్పుడే కోలుకోవాలని ప్రయత్నించే మామూలు ఆడపిల్ల అది కాదు. ఆ క్షణంలో సుకృతిని కలచివేస్తున్న విషయం. ఎదగటానికి మేధస్సు కన్నా పతనం అవసరమని తొలిసారి సుదర్శనరావు ముందు తన యవ్వనాన్ని పరిచేసింది తప్పని పరిస్థితిలో....అమ్మకోసం డబ్బు సంపాదించిందే తప్ప ఏ పాత్రకోసం ఆ డబ్బు స్వీకరించిందో ఆ పాత్ర దక్కలేదు. ఆపాత్ర దానమైన శీలం గురించి కొన్ని రాత్రులపాటు బాధను దిగమింగుకుంటూ గడిపింది.
    మొదటిసారి పతనమైన తను మరోసారికి ఆలోచించే పని లేదన్నట్టు ఆ తర్వాత  నారాయణశెట్టి ముందు యింకోసారి పతనానికి సిద్దపడింది. ఆర్ధికంగా లాభం పొందడం కాదు ఆమె అభిమతం. గంజాయి వనంలాంటి సినీరంగంలో ఓ తులసి మొక్కలా అనిపించినా శివని చూశాక ఆ మొక్క మరిన్ని మొక్కలకి  కారణమై దుర్గంధ భూయిష్టమైన యిండస్ట్రీలో అణువంత సౌరభాన్నయినా వెదజల్లాలన్న ఆలోచన.  సగం సాధించింది శెట్టిని వొప్పించి. ఇప్పుడు సగం ఆదిలోనే సమాధి అయిపోయింది.c


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS