"తిరిగి ఇంతవరకూ ఎప్పుడూ అలా అప్పుగా తీసుకున్న డబ్బు తీర్చనేలేదనుకో, వాడు తీర్చలేడని నాకు తెలిసే డబ్బు యిచ్చాను. అందుకనే నీ తండ్రిని నేనెప్పుడూ "నాకు నువ్వింత బాకీ వున్నావు తీర్చరా" అని ఎప్పుడూ అడగలేదు. ప్చే.....ఏం చేస్తాం. చెప్పు. ఇప్పుడు నీ తండ్రే ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయాడని , ఇప్పుడు నీకు ఆర్ధిక సాయం ఎవరు చేస్తారోనని బెంగాపెట్టుకోకు....ఏదయినా అవసరమయితే నన్ను అడుగు, నేను సర్దుబాటు చేస్తాను."
గోవిందయ్య మాటలలో ఎన్నో అర్ధాలు గోచరిస్తున్నాయి అతనికి.
తండ్రి అసహాయతా, బలహీనతలను దెప్పిపోడు స్తున్నాడనుకోవాలో, ఒక మిత్రునిగా ఆడుకుంటున్నాడని ఆనందించాలో.........నీ తండ్రికి అప్పు తిరిగిరాదని తెలిసి ఇచ్చాను కాబట్టి నువ్వయినా ఆ అప్పు తీర్చాలి అని అన్యోపదేశంగా తనను హెచ్చరిస్తున్నాడనుకోవాలో........లేక నిజంగానే మనస్పూర్తిగా తనను ఆదుకుంటున్నాడని భావించాలో ఏమాత్రం అర్ధం చేసుకోలేకపోయాడు.
కానీ తన ముందున్న అవసరం....తండ్రి కర్మకాండ! దహనం అయితే చేశాడు తప్ప మిగిలిన సంస్కారాలకు చేతిలో పైసా లేదు. కాబట్టి తండ్రి ఆశించినట్టు పున్నామ నరకం నుంచి తప్పించడం తన విధి కనుక చేయిచాచి అభ్యర్ధించక తప్పదనే నిశ్చయానికి వచ్చాడు విష్ణుమూర్తి.
'మరి........మ....రి......" అంటూన్నాడే తప్ప అసలు విషయం చెప్పలేకపోయాడు.
"ఓహో......నీ అవసరం అర్ధమయింది. కర్మకాండలకు డబ్బు అవసరం అయి వుంటుంది. అంతేగా......ఆ మాత్రం డానికి ముఖమాటపడతావెందుకు సూటిగా అడగవచ్చు కదా. నేను డబ్బులు సర్దుబాటు చేస్తాను కానీ నా సలహా ఒకటి వింటావా?"
వింటానన్నట్టు తల వూపాడు.
"నీ తండ్రి నీ చదువుకోసం అహర్నిశలు ఎంతో శ్రమించాడు. నీకు పరీక్షలు పదిరోజులేనని తెలిసింది. నీ తండ్రి ఆత్మ శాంతించాలంటే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు రాయాలి. నువ్వు లేకుంటే ఇంతకాలం నువ్వు చదివిన చదువు వ్యర్ధం అయిపోతుంది. ఆ తరువాత ఎలా జరగాలని రాసి పెట్టి వుంటే అలా జరుగుతుంది" అన్నాడు గోవిందయ్య.
అతని మంచి మనసుకు పొంగిపోయాడు విష్ణుమూర్తి.
అంతవరకూ పరీక్షలూ రాయాలా వద్దా అని ఎటూ నిర్ణయం తీసుకోలేని అతని మనసుకు ఒక దారి దొరికినట్టయింది. తప్పనిసరిగా పరీక్షలు రాయాలనే గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఆ క్షణంలోనే.
విష్ణుమూర్తి చేతిలో డబ్బు వుంచాడు గోవిందయ్య.
* * * *
తండ్రి మరణించినప్పుడు శోకంతో వున్నవాడిని తిరిగి చదువు పట్ల ఆకర్షితుదయ్యేలా చేయడంలో ధీరజ ఎంతో శ్రమ పడింది.
ఏం.ఏ పైనల్ ఎగ్జామ్స్ కు ఎంత పకడ్భందీగా ప్రిపేర్ కావాలో ఆమెకు తెలుసు కాబట్టి విష్ణుమూర్తిని మాములు మనిషిగా చెయ్యడంలో ధీరజ క్రుత్యురాలు కాగలిగింది.
ధీరజ సాహచర్యంలో తాత్కాలికంగా తండ్రి పోయిన విషయాలు మరచిపోగలిగాడు విష్ణు మూర్తి .
ఇప్పుడతని దేయం ఒక్కటే....ఎలాగయినా యూనివర్శిటీ రాంక్ తెచ్చుకుని తండ్రి ఆశించినట్లు పెద్ద ఉద్యోగం తెచ్చుకుని అమ్మనూ, అక్కలనూ సంతోషపెట్టాలని.....!
ఆ పట్టుదలే అతన్ని పూర్తిగా మార్చివేసింది.
ఒకప్పుడయితే అలాంటిరోజు కోసమే క్షణం ఒక యుగంలా ఎదురు చూసిన ధీరజ యిప్పుడు పరీక్షలు అయిపోకుండా వుంటే బాగుండేదేమో .......ఇంకొక సంవత్సరం కాలేజీ వుంటే బాగుండేదేమోనని పరిపరివిధాల మదనపడుతున్నది.
కారణం.......పరీక్షలయ్యాక విష్ణు మూర్తితో పెళ్ళి ప్రస్తావన తెవాలనుకున్నది కానీ ఇప్పుడు తండ్రి పోయిన దిగులులో వున్నవాడిని ఏమని అడగగలదు? ఎలా అభ్యర్ధించగలదు?
అందుకే అతణ్ణి విడిచి వెళ్ళలేక .......వారానికి ఒక ఉత్తరామయినా వ్రాసే హామీ తీసుకుంది. రిజల్టు వచ్చాక విష్ణు తన ఊరు తప్పక రావాలనే మాట తీసుకున్న తరువాత కాని ధీరజ యూనివర్సిటీ కాంపస్ వదల లేకపోయింది.
కానీ విధి విచిత్రమయినది.....
అలా విడిపడిన ఆ ప్రేమ జంట మళ్ళీ కలుసుకునే సందర్భమే రానేలేదు...
ఎదురుచూస్తున్న రిజల్టు కాస్త రానే వచ్చాయి. విష్ణుమూర్తి ఫస్ట్ రాంక్ లో పాసయ్యాడు కాని అతని సమాచార మేదీ ధీరజకు తెలిసే అవకాశమే లేకపోయింది.
విష్ణు ఇచ్చిన చిరునామాకు తను ఎన్నో లెటర్స్ రాసింది.
కానీ విష్ణుమూర్తి నుంచి ఎలాంటి ఉత్తరం రాలేదు.
ధీరజ గతం నుంచి బయట పడింది.
అలా ఒక్కసారిగా కనుమరుగయిపోయిన నేస్తం ఈరోజు తిరిగి మహా యోగిలా తనకు సాక్షాత్కరించడం నమ్మలేని నిజం.....అసలేం జరిగింది? అతడెందుకు సన్యాసం స్వికరించాడో అర్ధం కావడం లేదు......
నిజానికి తామిద్దరూ ఒకరినొకరు దూరమైనప్పటికీ తన మనసు ఎప్పుడో చేజారిపోయింది. ఆశించింది అందుకోలేకపోవడంతో వేరే మార్గమే లేక తన మనసుని మరోసారి చేజారనివ్వక విష్ణు వియోగంతో తను పోటీ పరీక్షల మీద మనస్సును లగ్నం చేసి ఐ.ఏ.ఎస్ కాగలిగింది.
కలెక్టర్ విధి నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన క్షణంలోనే ఒకప్పటి తన నేస్తం ఇప్పుడు ఇక్కడ సర్వసంగ పరిత్యాగిలా సన్యాసి జీవితము గడపడం కళ్ళారా చూసి విస్మయం చెందింది.
విష్ణుది ఎంత సున్నితమయిన మనసో తనకు తెలుసు.....
నవనీతం లాంటి గుండె ఎందుకు బండబారిపోయిందో? విషాద యోగానికి అంకితమయిపోయిందో......ఏ హృదయ ఘోష అతన్ని జడునిగా మార్చిందో......ఏ విషమ ఘడియ అతని సున్నిత మానసును వికలము చేసిందో తెలుసుకునే ప్రయత్నంలో తోలి అడుగు కూడా వేయక ముందే కలెక్టర్ ధీరజ అడుగులకు అవరోధంగా ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ అభియోగం!
