ఇబ్బందిగా కదిలేడతను.
"ఎలా తెలిసిందట!"
"ఎవరో ఐ జీకి ఫోన్ చేశారట. ఇలా ఫలానా వారి అమ్మాయిని ఎత్తు కెళ్ళాటానికి ప్లాను వేస్తున్నారని!"
"ఎవరు చేశారో!"
"అదే అర్ధం కావటం లేదు?"
"ఏం?"
"ఆ విషయం తెలిసింది మనకి మాత్రమే కదా! నేను ఫోన్ చెయ్యను కదా? మోహన్ ఆ బుద్ది తక్కువ పని చేస్తాడా? ఊహూ ఇక పొతే--"
"ఇకపోతే ----ఎవరని మీ వుద్దేశ్యం?"
"పారూ"
"ఊ"
"నువ్వేమయినా----"
అతని మాట పూర్తీ కాకముందే కస్సుమంది పారిజాతం. "బుద్ది లేకపోతే సరి, నాకు అమ్మాయెంతో అబ్బాయంత. ఇంకా నీకయితే మరో ఊహ, మరో ఊహ రావచ్చు. నేనెందుకలా చేస్తాను. అయినా కరణం బుద్ది పోనివ్వలేదు నువ్వు!"
కరణం అంటే నీకేం తెలుసు. తల్లి కడుపులో వుండగా తల్లి మాంసం ఎందుకు పీక్కుని తినడో తెలుసా! తల్లి అని దయ తలచి కాదు. నోటికి పళ్ళు లేక అంతే! అలాటి వాళ్ళం. మేం. తల్లిని, చెల్లిని , పిల్లల్ని నమ్మం తెలుసా? ఆఖరికి నన్ను నేనే నమ్మను!"
"నమ్మకపోతే నీ కర్మ."
"అనుభవిస్తున్నాం కదూ? అంత ఆస్తి పోయింది. అంత అందమైన అమ్మాయి వాడికి చేజారిపోయింది. ఆఖరికి జేయిలు పాలయ్యాడు. ఎన్నేళ్ళు వేస్తారో శిక్ష ? ఏం కాలం వచ్చిందిరా భగవంతుడా?" ఉసురుమన్నాడు.
పారిజాతం మాట్లాడలేదు.
"పారిజాతం!"
"ఏమిటి?"
"ఏదయినా ఉపాయం చెప్పరాదూ?"
"అడముండను నేనేం చెపుతాను? యెవరు ఫోన్ చేశారో అనుమానించలేక పోయారు."
"ఇంతకీ యెవరు చేసి వుంటారంటావు?"
"కిరాయి వెధవలని నమ్ముతారు మీరు. నన్ను నమ్మలేరు."
"వాళ్ళే చేసి వుంటారంటవా?"
"కాక. వెధవలు వాళ్ళకేం విశ్వాసం. పైగా మీరిచ్చిన డబ్బులు చాల్లేదేమో!"
"చాలకేం వెయ్యి యిచ్చాను. పని పూర్తయితే పదివేలు యిస్తానన్నాను!"
"అదో! అక్కడే దెబ్బతింది వ్యవహారం. వాళ్ళని మనం నమ్మాలి కానీ వాళ్ళు మనల్ని నమ్ముతారా? అందుకే మనల్ని యిలా దగా చేసి వుంటారు!"
నిర్ఘాంతపోయాడు వెంకట్రామయ్య. పాచికలు తిప్పే తన శక్తి అలా యెందుకీ కాకుండా పోయినందుకు విచారించసాగాడు. దానికి తోడు పారిజాతం నిష్టూరాలు .ఒకటే బాధ పడసాగాడు అతను.
31
ఇంటికి వచ్చాక ఆలోచనల్లో పడ్డాడు రవి. అతనికి స్వప్నని గురించిన అనుమానాలు చాల వున్నాయి. అయితే అవి నోటితో అనటం అలా వుంచి, వూహించటానికి కూడా వీల్లేనివి.
"స్వప్న తనని ప్రేమిచంచటం ఒట్టి మాట. అభిమానించటం కల్ల. కనీసం యిష్టపడుతోందా? దానికీ ఆధారాలేమిటి?
తను ధనవంతుడు కాదు. కనీసం మంచి ఉద్యోగం కూడా లేదు. ఏదీ గతిలేని స్థితిలో ఈ యింటిని , ఈయింటి యజమానురాలిని ఆశ్రయించాడు.
అయితే- అపర సింహం అనిపించుకున్న కృష్ణవేణమ్మ గారికి తనపై గురి యెందుకో కుదిరింది. దానికి కారణం వుందా?
ఏమో! చెప్పేందుకు ఆవిడ లేదు.
ఏది ఏమయినా తమ యిద్దరి పెళ్ళి జరగటం ఖాయం! అది అమ్మమ్మ అంతిమ కోరిక! ఆఖరి అజ్ఞ! దానికి లాయర్ గారి ఆమోదముద్ర కూడా వుంది.
మనసులు కలవని ఈ దాంపత్య యెలా వుంటుంది?
పెళ్ళయ్యాక అయినా మనుసులు కలుస్తాయా?
భగవాన్! తను ఎలాగయినా ఎడ్జస్ట్ కాగలడు. స్వప్న ఎడ్జస్ట్ కాగలదా? ఆమె మనస్సు నొప్పించకుండా మెలగాలి తను. అందుకోసం తను త్యాగం చేయాలి చేయగలడు.
కానీ ఆ త్యాగానికి గుర్తింపు వుంటుందా?"
"అన్నాయ్!"
స్వాతి పిలుపుకి ఉలిక్కిపడ్డాడు రవి.
"ఏంటన్నాయ్ అలా వున్నావ్?" స్కూలు నుంచి వచ్చి పుస్తకాలు గూట్లో పెట్టేసి వస్తూ ఆలోచనల్లో మునిగి పోయిన అన్నయ్యని చూసి ప్రశ్నించింది స్వాతి.
"ఏం లేదమ్మా?"
"ఊహూ! ఏదో వుంది. నే చూస్తున్నాగా అమ్మమ్మ పోయినప్పటి నుంచీ అలాగే వున్నావ్?"
ముఖం తిప్పుకున్నాడు రవి.
"అమ్మ రాలేదేం అన్నాయ్?"
