Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 43


    తనని తోడుగా నిలిచి నీడలా మసలుతూ ఉత్సాహపరచడానికి ప్రమీల ఉంది.
    కానీ ఇప్పుడు? ఇప్పుడు తన ప్రమీలే తనకుదూరమైపోయింది, చిన్న వయసేమీకాదు తనకి ఇప్పుడు. ఇంక పుంజుకుని మళ్ళీ ఏదో సాధించాలనే కోరికాలేదు.
    ఇప్పుడే....ఇలాగే..... ఇక్కడే కన్నుమూస్తేనే.....ఎంత బాగుంటుందన్న నిరుత్సాహం మాత్రంమనసు నిండుగా ఉంది కానీ....
    తనుచనిపోతే మనోహర్.....?
    ఏడీ మనోహర్ ఏడీ? ఎక్కడున్నాడు?
    ఆత్రుతగా తలపక్కకి తిప్పి చూసాడు బ్రహ్మజీరావుకి కొంచెం దూరంలో మరో బెడ్ మీద ఉన్నాడు మనోహర్. డీన్ సెడేషన్ లో ఉన్నాడు అతను.
    నిద్రపోతున్నట్లు నిశ్చలంగా పడుకుని ఉన్నాడు.
    "మనోహర్!" అన్నాడు సీతవైపు చూస్తూ ప్రశ్నార్ధకంగా అతని గొంతుసన్నగా కంపిస్తోంది.
    "కాలిఫ్రాక్చర్ అయింది నథింగ్ ఎల్స్!" అంది సీత.
    నీరసంగా కళ్ళు మూసుకున్నాడు బ్రహ్మాజీరావు. ఒక నిముషం తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి" ఎప్పటినుంచి ఉన్నాం హాస్పిటల్లో?" అన్నాడు.
    "రెండురోజులయింది" అంది సీత.
    "రెండురోజులనుంచి మీరు ఇక్కడే ఉన్నారా?"
    అవునన్నట్లు తల ఊపింది.
    "అరెరె!" అన్నాడు బ్రహ్మాజీరావు.
    "మాకోసం మీరు శ్రమపడుతున్నారు. పాపం మీకు వేరే పనులుఏమన్నా ఉంటాయేమో! వీ కెన్ లుక్ ఆఫ్టర్ అవర్ సెల్వ్స్! థాంక్యూ సోమచ్!" అన్నాడు. ఒక్కసారి అతనిమొహంలోకి చూసింది సీత. దీనినేనా అంటారు ఆత్మ నిగ్రహమని? ఇంత విపత్కర పరిస్థితులలో కూడా ఎదుటి మనిషి గురించి ఆలోచన.
    ఇప్పుడుకూడా మర్యాదా, మన్ననా!
    "మీరునన్ను బతికించకపోతే ఇంక ఏపనులూ ఉండేవికావు "అంది సీత. "అయినా నాకు అంతముందుకుపోయే పనులేమీలేవు. మీరు వర్రీకావద్దు. ప్లీజ్ టేక్ కంప్లీట్ రెస్ట్!" పైకి అలా అందిగానీ నిజంగా తనకు ఒక అవసరమైనపని ఉంది. ఒకసారి హైదరాబాద్ వెళ్ళి రావాలని ఉంది. తనకు హైదరాబాద్ వెళ్ళాలనే నిర్ణయానికి రావడానికి ముందు తనకికనీసం పది ఉత్తరాలు వచ్చి ఉంటాయి.
    అవి అన్నీ అహల్య దగ్గరనుంచి!
    అహల్య దగ్గరనుంచి వచ్చిన చివరి ఉత్తరం ఫోటోలా సీత మనోఫలకంమీద జ్రాజెక్టు అయింది. అంతలా గుర్తుండిపోయింది అది. అన్నిసార్లు చదివింది దాన్ని తను. ఆ ఉత్తరానికి ఉన్న ప్రతి చిన్నమడతాదానిమీద పడ్డ ప్రతిచిన్నసిరా మరకా కూడా తనకుస్పష్టంగా గుర్తున్నాయి.
    "నీ ప్రియమైన బేఠీ!"
    నా బేఠీ, నా ప్యారీ, నా చిన్నా, నా కన్నా! ఎందుకని ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబురాయవు నువ్వు! ఎందుకని ఒక్కసారన్నా వచ్చి నన్ను చూడవు?
    నేను చదువురానిదాన్ని వంకరటింకర అక్షరాలతో వచ్చీరాని భాషతో నేను రాసిన ఎన్నో ఉత్తరాలు నీ గుండెని కరిగించలేకపోయాయేమో అన్న బెంగతో ఈ ఉత్తరాన్ని సుబ్రహ్మణ్యం మేష్టారి చేత రాయిస్తున్నాను. బహుశా ఇదేచివరి ఉత్తరం కావచ్చు.
    నేను చావు మంచం మీదఉన్నానమ్మా!
    బేఠీ! నేను బతికినన్నాళ్ళూ అబద్దాలే చెప్పిబతికాను! అబద్దాలు చెప్పాను గనకనే బతకగలిగానేమోకూడా!
    కానీ ఇది మాత్రం నిజమమ్మా! నిజంగా నిజం!
    నేను మరణశయ్య మీదనుంచి ఈ ఉత్తరంరాస్తున్నాను నా బేఠీ! నన్ను నమ్ము!
    బేఠీ! నామీద నీకు ఉన్న కోపాన్ని నేను అర్ధం చేసుకోగలను.
    కానీ నీ మీద ఉన్న ప్రేమని ఆర్ధం చేసుకోవడానికి నువ్వు కొద్దిగా నన్నా ప్రయత్నించరాదా?
    ఈఅహల్య నరరూపరాక్షసి! అవును! ఎంతమంది బతుకులనో బండలు చేసింది! అదీ నిజమే!
    కానీ ఒకప్పుడు నేనూ మోసపోయి ఈ కోపల్లోకి వచ్చిపడిందాన్నీనమ్మా! ఒకసారి ఈ ఊబిలో ఇరుక్కుపోయాక నేనూ మారక తప్పలేదు. మనసు రాయిచేసికొని మనిషిని రాటుదేలానుగనుక మేడమ్ ని కాగలిగాను. లేకపోతేనేనూ ఒక కామాక్షినో ఓరజియానో అయిపోయి ఉండేదాన్ని.
    నేను మారలేదు సృజనా! పరిస్థితులు నన్నుమార్చాయి. మానవత్వం అంటే ఏమిటో మర్చిపోయాననుకున్నాను నేను.
    నిన్నుచూసేదాకా అలాగే అనుకున్నాను. నన్ను చిలకల చిన్నారావుపొడిచి పారిపోతున్నప్పుడు నువ్వు ఊహ తెలిసీతెలియని వయసులో ఉన్న నువ్వు నాకోసం నన్ను రక్షించడానికి తిరిగి రావడం చూసిచలించిపోయాను సృజీ! సృజనమ్మా! మానసికంగా నీకు బానిసైపోయాను. అంతకుముందూ ఆ తర్వాతా కూడా నా కోసం అంతచేసినవాళ్ళు ఎవరూ లేరమ్మా!
    ఆ తర్వాత మళ్ళీ నీ దగ్గర నుంచి ఒక మంచిమాట. ఒక తెల్లటిచిరునవ్వు....నాకు దొరుకుతాయేమోనని ఎదురు చూసాను పద్దెనిమిదేళ్ళపాటు!
    నావంట్లో ఇంకా జవసత్వాలు ఉండగానే రాజు వానప్రస్థాశ్రమం స్వీకరించి రాజ్యాన్ని వారసుడికి ధారాదత్తం చేసినట్లుగా నేను తప్పుకుని నిన్ను ఇంటికి మేడమ్ ని చేసాను.
    కనీసం ఆ రోజన్నా నువ్వు నాతోఅభిమానంగా మాట్లాడతావేమోనని చూసానమ్మా?
    ఆ తర్వాత నువ్వు ఈ మోటుమనుషుల మధ్యనుంచి బయటపడి హైక్లాస్ సొసైటీలోకి వెళ్ళిపోయావు. పెద్ద పెద్ద సిటీల్లో తిరుగుతున్నావు. అక్కడ నీ బిజినెస్ ఉధృతంగా ఉందనీ, నువ్వు చాలా సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నావనీ ఆశిస్తున్నాను.
    బేఠీ! మరొక్కసారి వేడుకుంటున్నాను బేఠీ! చనిపోయేముందు నిన్ను ఒక్కసారి కళ్ళారాచూడాలని ఉంది! నీకు ఆయుక్షీణమవుతుందేమోనని భయపడుతున్నాగానీ, లేకపోతే నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను అని రాయించి ఉండేదాన్ని.
    పెంచినమమకారం ఎంత తీవ్రంగా ఉంటుందో దయచేసి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించమని ప్రార్ధిస్తూ.
    మీ అమ్మ.
    అహల్య.
    ఆలోచనలనుంచి బయటపడి నిట్టూర్చింది సీత.
    పద్దెనిమిదేళ్ళు గడిచినా, ఇంతవరకూ తన మనసేమిటో తనకి అర్ధం కాలేదు.
    తను అహల్యని చూసి అసహ్యించుకుంటోందా? ద్వేషిస్తోందా? జాలిపడ్తోందా? తనని అల్లారుముద్దుగా పెంచిందని అభిమానిస్తోందా?
    ఏమో! తనకే తెలియదు!
    అసలు అహల్య తప్పుచేసిందా? లేక ఆ పరిస్థితిలో ఉన్న ఏ మనిషి అయినా అలాగే ప్రవర్తించి ఉండేదా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS